కావేరి2 - అచ్చంగా తెలుగు

కావేరి(పెద్ద కధ - 2 వ భాగం )

కౌండిన్య 


(కావేరి కొడుకు కాంతారావు, కోడలు సావిత్రి ఎడమొహం, పెడమొహంగా ఉంటూ ఉంటారు. పెద్ద వయసులో ఉండడం వల్ల ఓపిక లేకున్నా  ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో ఇంటెడు చాకిరీ చేస్తూ ఉంటుంది, కావేరి. పిల్లలు లేని ఆ దంపతులను అనాధాశ్రమం నుంచి కస్తూరి అనే పాపను దత్త తీసుకోమంటుంది కావేరి.)
కావేరమ్మకు ఆ సంతోషానికి నిద్ర పట్టడం లేదు. ఆ మహానుభావుడి చలవ,ఆయనే పైనుంచి చూస్తూ వాడి మనసు మారే లాగా చేసారు, అనుకుంటోంది.
పరంధామయ్య గారు కావేరి వాళ్ళ దూరపు చుట్టం, కానీ వాళ్ళకు చాలా దగ్గరైన వారు. మావయ్య వరుస, కావేరిని చిన్నప్పటి నుండి పెంచారు, అదీ కాక కాంతారావుకు తాతయ్య ప్రేమను ఇచ్చారు. ఆయనే కనుక ఈ ఇల్లు రాసివ్వక పోతే ఈ రోజు డాబా మీద అలా పడుకో గలిగే వాడా? ఏ అద్దె కొంపలోనో పడివుండే వాడు. ఆయనకూ పిల్లలూ లేరు, అందుకే తను చిన్నప్పుడే కాంతారావు తండ్రి దేముడిలో కలిసి పోవడం తో, కావేరిని చేరదీసారు. కావేరితో పాటు కాంతారావును ముద్దుల మనవడులా చూసుకున్నారు. కావేరమ్మకు పాతవన్నీ గురుతుకు రావడం మొదలు పెట్టాయు. ఓ రోజు సాయంత్రం కాంతారావు అన్నం తిననని మారం చేస్తుంటే కావేరి డాబా మీదకు తీసుకెళ్ళింది, చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెడుతోంది, ఇంతలో పరంధామయ్య గారు వచ్చారు. “ఏమిట్రా, బడుద్దాయ్, రోజూ మారాం చేయటమేనా? ఒక్కరోజూ సరిగా కింద ఇంటిలో పెడితే సరిగా తినవు, రోజూ మేడ మీదేనా తినేది?”, అన్నాడు. “తాతయ్య, నువ్వు చాక్లెట్ ఇస్తానన్నావుగా, ఏది”, అనిగాడు “నువ్వు, ముందు ఆ అన్నం తినవోయ్, చాక్లెట్లు గీక్లేట్లు” అన్నాడు పరంధామయ్య. “అదిగో, ఆ వాటర్ ట్యాంకు మీదకు మళ్ళీ ఎక్కావా నీకు చాక్లెట్లు ఇంకతీసుకురాను”, అన్నాడు. “ఎక్కను లే తాతయ్య, అయినా అన్నీ అడ్డుపెట్టించావు గా ఎలా ఎక్కుతాను”, అన్నాడు అమాయకంగా. “నీ సంగతి నాకు తెలుసులేరా వెధవ, చూడటానికి అమాయకంగా ఉన్నా అసాధ్యుడివి”, అన్నాడు. ఇదంతా వింటూ కావేరి మురిసి పోతూ ఉండేది. “అప్పడాలు తోనే కడుపు నింపుతున్నావు”, అన్నాడు. “నాకు ఇష్టం తాతయ్యా”, అన్నాడు. పరంధామయ్య గారికి కూడా కావేరి డాబా మీద ఎండబెట్టిన ఒడియాలు అప్పడాలు అంటే ఇష్టం. “త్వరగా అన్నం తిను అలా బయటకు తీసుకెడతా”, పరంధామయ్య గారు, వెంటనే తినేసి రెడి అయ్యారు.
చూడటానికి ముద్దుగా ఉంటారు పరంధామయ్య గారు, బుర్ర మీసం, బొట్టు పెట్టుకొని, నుదురు కు విభూది రాసుకొని, చేతిలో కర్ర, ఖద్దరు పంచ, షర్ట్, పైన కండువా తో, శాస్త్రోక్తంగా ఉంటారు. సాయంత్రం రిక్షాలో అలా తీసుకెళ్ళి చిరుతిళ్ళు కొనడాలు, వీధిలో పీచు మిఠాయి వస్తే కొనడాలు, సగ్గుబియ్యం ఐస్క్రీములు, బొమ్మల బండి ఇంటికి వస్తే బొమ్మలు, బాదం పాలు ఇప్పించడాలు, తనతో అప్పడప్పుడూ సినిమా కి తీసుకెళ్ళడాలు, ఊర్లో ఎగ్స్బిషన్ వస్తే దానికి తీసుకెళ్ళి రంగులరాట్నం ఎక్కించడాలు, ఏన్నో సరదాలు తీర్చారు కాంతారావుకు. అందుకనే, ఆయన ప్రస్తావన వస్తే అన్నీ మరిచిపోతాడు. ఆ మేడ మీద ఎన్ని కథలు వినిపించారో, ఎన్నో తీపి జ్ఞాపకాలు , ఆ మేడ మీద ఆయన తో గడిపిన క్షణాలు. అందుకే రోజూ అక్కడే నిద్ర పోవడం ఇష్టం తనకు. పరంధామయ్య గారు రెండు రోజుల కొక సారైనా రాముల వారి గుడికి తప్పక తీసుకొని వెళ్ళేవారు. రోజూ వెళ్ళడం తో పంతులు గారు బాగా పరిచయమే, ప్రసాదం భక్తుడు వచ్చాడు, అనే వారు పంతులు గారు కాంతారావు ని చూడగానే. కాంతారావు చదువులు దగ్గరుండి చూసుకున్నారు. తనకు తెలిసిన వాళ్ళ అమ్మయి సావిత్రి తో వివాహం చేయడం వరకూ. కావేరమ్మకు మాత్రం కష్టాలు చిన్నప్పడి నుండి, ఇప్పుడల్లా తీరేవి కాదు. ఓనాలగేళ్ళ క్రితం కాంతారావు మేడ మీద ఆ ట్యాంకు ఎక్కడం ఆకతాయిగా కింద పడటం ఆసుపత్రి లో చేయటం దెబ్బలు తగలడం, ఇంకా పిల్లలు పుట్టరని చెప్పడం, అంతా ఇట్టే జరిగి పోయూయి. కావేరమ్మ కు చాలా బాధ కలిగించిన విషయాలు, పరంధామయ్య గారు చిన్నప్పటినుండి చెప్పినా వింటేగా? అందుకే సావిత్రి కి కూడా కోపం కాంతారావు ఆకతాయి తనానికి, ఆ మేడ మీదకు రావాలంటే ససేమీరా ఇష్టం లేదు, మొన్న కస్తూరి సంగతి మాట్లాడడానికి తప్పక చాలా రోజుల తరువాత వచ్చింది. కావేరమ్మ కు కునుకు పట్టింది, తెల్లవారు జామున నిద్ర మెలకువ వచ్చింది రోజూ లాగే, వీళ్ళేమో వారం రోజులు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు శనివారాలు తొందరగా లేవరు. ఆవిడకు మాత్రం వెంటనే వెళ్ళి కస్తూరి ని తీసుకొని రావాలని ఎంతో ఉబలాట పడుతోంది. వారు లేవడాలు, తయారు అవడాలు అయ్యి బయలుదేరారు అనాధ శరణాలయానికి. అక్కడ పనులు పూర్తి చేసుకొన్నారు, రేపు రవివారం వచ్చి తీసుకు వెళ్ళమన్నారు తన సామానులు అన్నీ రెడీ చేసి ఉంచుతామన్నారు.
మరుసటి రోజు వెళ్ళారు, కస్తూరి ను తీసుకొని బయలు దేరారు. కస్తూరి పెట్టె కాంతారావు పట్టుకొన్నాడు, కావేరమ్మ కస్తూరి తో నడుస్తోంది, సావిత్రి కస్తూరి బొమ్మలు పట్టుకుంది. అటు దారిలో వెడుతున్న రిక్షాని పిలిచాడు, కావేరమ్మను, కస్తూరి ని ఎక్కించాడు, ఆ పెట్టె ఎక్కించాడు, రాముల వారి గుడి మీదుగా వెళ్దామని చెప్పాడు, కాంతారావు. రిక్షా చిన్నగా తొక్కమని చెప్పి తను, సావిత్రి నడుస్తున్నారు, దారిలో ఇంకో రిక్షా గనుక ఎదురైతే ఎక్కచ్చులే అని. రామాలయం వచ్చింది. పంతులు గారు చూసారు, చూసి, అటు ఇటూ కాకుండా ప్రసాదం లేని సమయం లో వచ్చావేంటి అన్నాడు, నవ్వుతూ. రిక్షాలోంచి కావేరమ్మ, కస్తూరి దిగారు. ఎవరు ఈ పిల్ల ముద్దుగా ఉంది, పరంధామయ్య గారి ముని మనవరాలా?, అని అడిగారు పంతులు గారు. నవ్వుతూ, అలాగే అనుకొమ్మని, ఇంకో రోజు అన్నీ సంగతి వివరిస్తానని, అర్చన చేయించ మన్నాడు అందరి పేరు మీద. కస్తూరి నక్షత్రం పంతులు గారుఅడిగితే, తెలియదు కదా, సీత అమ్మవారి నక్షత్ర మేనని అన్నాడు, పంతులు గారు అర్చన చేసి ప్రసాదం చేతికి ఇచ్చారు, కస్తూరి ని ముద్దు చేస్తూ ఓ రెండు పళ్ళు చేతిలో పెట్టాడు, గుడికి వస్తూ ఉండమని చెప్పాడు. బయటకు రాగానే రిక్షా ఎదురయ్యింది, కాంతారావు, సావిత్రి ఎక్కారు. కావేరమ్మ, కస్తూరి వచ్చిన రిక్షాలోఎక్కారు. కస్తూరి ఎక్కాగానే పంతులగారు ఇచ్చిన రెండు పళ్ళలోకి ఓకటి తీసి రిక్షా తొక్కే ఆయనకు తీసుకోమని ఇచ్చింది, “నాకొద్దులేమ్మ, నువ్వే తిను”, అన్నాడు రిక్షా తొక్కే అతను. “నువ్వు తినక పోతే, నేను తినను”, అని బెట్టు పెట్టింది కస్తూరి. మానవత్వం పరిమళించడం అంటే ఇదేనేమో, వాళ్ళిద్దరికీ ఓ అర మైలు కలిసి ఉన్న సంబంధం తప్పా, ఏముందీ? పంచుకోవడం అనేది చిన్నప్పటి నుండి నేర్చుకున్నదే కస్తూరి, ఓ తిండి అనే కాదు, పని లోను, సంతోషం, దుఃఖం లోనూ, కలిసి చేసే వన్నింటి లోనూ సమభాగం గా పంచుకోవడం చిన్నప్పటి నుండి అలవడింది. అందరూ ఇంటికి చేరారు.
“ఉండండి, లోపలకు అప్పుడే వెళ్ళొద్దు”, అంది కావేరమ్మ. సావిత్రి ని తాళం తీసుకొని లోపలికి వెళ్ళిమంది. ఓ పళ్ళెం లో కావలసిన అన్ని తెచ్చి దిష్టి తీయమనింది. కుడికాలు లోపలకు పెట్టి ఇంటిలోకి వెళ్ళమని చెప్పింది. లోపలకు రాగానే పరంధామయ్య గారి ఫొటో చూసి, ఈ తాతయ్య గారు ఫొటో మా శరణాలయం లో కూడా ఉంటుంది, అంది కస్తూరి. పరంధామయ్య గారు ఆ ఆశ్రమం కు కొంత మొత్తం ఇచ్చారుట. ఇంటికి రాగానే, కావేరి, కుర్చి చూపించి కావేరమ్మను లాగి కూర్చో పెట్టింది. వంటగదిలో సావిత్రిని చూసింది, దగ్గరకు వెళ్ళి, “బామ్మగారు, పాపం పెద్దవాళ్ళు కదా, అలసట గా ఉన్నారు, కొంచెం మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇస్తారా?”, “లేకపోతే నాకు ఇచ్చినా ఫర్వాలేదు, నేనమనుకోను”, అంది కస్తూరి. తన కలుపుగోలుదనానికి, మాటల చాకచక్యానికి చూసి గ్లాసు లో తీసుకెళ్ళి మంచినీరు ఇచ్చింది సావిత్రి. ఎప్పుడూ పెద్దావిడతో చేయించుకోవటం తప్ప చేసినది ఎన్నడూ లేదు. కావేరమ్మ ఆశ్చర్య పోయింది, ఓ వైపు జరిగింది చూసి తేరుకోలేక పోయింది. పొద్దున్నే లేచి వాళ్ళిద్దరూ లేచే లోగా వంటంతా చేసిందాయే, కావేరమ్మ. కస్తూరి అలా మాటలతో నింపేసి, సావిత్రి చేత భోజనం తినటానికి అన్నీ తయారు చేయించింది. అందరూ కలిసి భోజనం చేయటం మొదలు పెట్టారు, మధ్య మధ్య లో కబుర్లతో అందర్నీ అసలు పాత వన్నీ మరిచి పోయేలా చేసింది. నేను ఓ వారం క్యాంప్ కు వెళ్ళాల్సి వస్తుంది రేపటి నుండి అని చెప్పాడు కాంతారావు. భోజనాలు ముగిసాయి, క్యాంప్ కు కావలసిన వన్నీ సర్దడం మొదలు పెట్టాడు, కస్తూరి పక్కనే ఉంది ఏదోటి మాట్లాడుతూనే ఉంది, కొంత కొత్తగా, ఇబ్బంది గా ఉన్నా అలవాటు అవుతుందిలే అనుకుంటున్నాడు

రోజూ లాగే కావేరమ్మ పొద్దున్నే నాలుగు గంటలకు లేచింది. ఇంటిలో పని మొదలు పెట్టింది. కాంతారావు లేడు అయినా పని తప్పదు కదా. తెల్లవారుతోంది, కావేరమ్మ చేసే శబ్దానికి కస్తూరి కి మెలుకువ వచ్చింది. తను ఒక్కతే పని చేసుకుంటోంది, సావిత్రి ఇంకా లేవనూ లేదు. కస్తూరి కావేరమ్మ దగ్గర ఆ చెంబు లాక్కొని కల్లాబు చల్లడం మొదలు పెట్టింది. “నువ్వెందుకు లేమ్మా”, అంది కావేరమ్మ. “నాకు భలే ఇష్టం నీళ్ళు చల్లడం”, అని కబుర్లు మొదలుపెట్టింది. కావేరమ్మకు రోజూ అలసటగా అనిపిస్తుంది, కానీ కస్తూరి మాటలు తనకు అలసట తెలియనివ్వకుండా చేసాయి. ఇంతలో సావిత్రి లేచింది, కావేరమ్మ కాఫీ దగ్గరనుంచి అందించటం, క్యారేజ్ దగ్గరనుంచి కట్టడం అన్నీ చూసింది కస్తూరి, ఈ వరుస ఏమీ బాలేదు అనుకుంది. తను ఏంతో కొంత పెద్దావుడకు సహాయం చేయాలను కుంది. కావేరమ్మ దగ్గరకు వెళ్ళి, ఇప్పటినుండి మనిద్దరం కలిపి చేసుకుందాం అని చెప్పింది. కావేరమ్మ “నువ్వు ఇంకా చిన్నపిల్లవి”, అని కొట్టి పారేసింది. అలా అనే వదిలేసే రకం కాదు కస్తూరి. కలుపుగోలు గా మాట్లాడడం తో పాటు పనులలో ఓ చెయ్యి వేయటం తనకు ఇష్టము. పొద్దున్న అంతా అలసట లేకుండా గడిచింది కావేరమ్మకు. భోజనాలకు కూర్చున్నారు, తింటూ ఆ అనాధ శరణాలయం లో ఓ సంఘటన చెప్పడం మొదలు పెట్టింది కస్తూరి.
మొన్న ఈ మధ్య ఓ రోజు పొద్దున్న అందరూ నిద్ర లేచే సమయం లో గట్టి గట్టి గా చిన్న చంటి పిల్లవాడి ఏడుపు శబ్ధం వచ్చిందిట. అది విని పిల్లలంతా ఆ చంటి పిల్ల చుట్టూరూ గుముగూడారుట. ఇంతలో మేడమ్ గారు వచ్చి ఆ చంటి పిల్లవాడిని ఎత్తుకొని తన దగ్గర వదిలేసిన ఉత్తరం హడావుడి గా చదివి లోపల పెద్ద మేడమ్ కోసం లోపలికి పరుగెడుతూ, అక్కడ పిల్లల్ల్ని మందలిస్తూ , ఎవరి గదిలోకి వాళ్ళని వెళ్ళమని చెప్పిందిట. కస్తూరి అందరిలా కాకుండా ఆవిడ చూడకుండా పెద్ద మేడమ్ రూమ్ బయట నుంచొని వినడం మొదలు పెట్టిందిట. అన్నీ సరిగా వినపడక పోయినా అలాగే నుంచొని వింటోంది. ఉత్తరం ఐతే రాసారు కాని ఆ పసిపిల్లవాడు వదిలిన వారి పేరు లేదు, అడ్రసు వదల లేదు. మేడమ్ గారు ఏవో అడుగుతోంది, అన్నీ జాగ్రత్త గా ఆ రిజిస్టర్ బుక్ లో రాయమని చెబుతోంది. కొంచెం పొద్దెక్కిన తరువాత ఆ నర్సు ని పిలవమని చెబుతోంది ఆ పసి పిల్లని చూడటానికి. అంతే కాకుండా అసలే ఉన్న డబ్బులు సరిపోకపోతుంటే ఇంకొక ప్రాణి తోడయ్యింది, అని అనుకుంటున్నారు. ఏదో ఈ పరంధామయ్య గారు లాంటి వాళ్ళు ఎంతో కొంత ఇవ్వ బట్టే గదా, అంటోంది పెద్ద మేడమ్. మళ్ళీ అదిగో మొన్న చందా ఇస్తానన్నారు కదా ఆయనను కలవటానికి ఈ రోజు వెళ్ళాలి గుర్తు చేయమని చెబుతోంది. కస్తూరి ని చూసిన వాళ్ళు మళ్ళీ వస్తారంటావా, అని అడుగుతోంది. ఏదో చప్పుడు వినికిడి కి తన గది లోకి పరిగెత్తింది, కస్తూరి.
“ఆ పరంధామయ్య గారు నిన్ను మా కోసం పంపారు లే”, అంటోంది కావేరమ్మ. “సరే బామ్మ, కొంచెం సేపు పడుకో నేను నిద్ర లేపుతా లే”, అంది. కస్తూరి అక్కడ చిన్న రాళ్ళతో నేల మీద అష్టా చమ్మా మొదలు పెట్టింది. కస్తూరి ని తను ఆడే ఆటను చూస్తూ ఓ కునుకు పట్టేసింది, ఏంతకీ నిద్ర తెరపి రావడం లేదు, ఏవో కలలు, కానీ అలసట నిద్ర, ఈ మధ్య అంత నిద్ర పోయి కొన్ని ఏళ్ళు అయింటుంది, ఇంటిలో ఓ తోడున్నారన్న థైర్యం తో నిద్రకూడా మెలుకువ రానే రావట్లా, మళ్ళీ అనాథ శరణాలయం వాళ్ళు వచ్చి కస్తూరి ని తీసుకెడుతున్నట్లు పీడ కలవచ్చి, గట్టిగా అరుస్తూ లేచింది. “ఏమైంది”, బామ్మ, “నేనున్నాగా”, అంది కస్తూరి, “అమ్మయ్యా, ఉన్నావా తల్లీ, నా తోనే ఉండు”, అని గట్టిగా హద్దుకుంది. ఆ పట్టిన నిద్రకు సమయం తెలియనుకూడా తెలియలేదు, తీరా చూస్తే సావిత్రి ఆఫీసు నుండి వచ్చే సమయం. కావేరమ్మ కంగారుపడుతూ లేస్తోంది, మళ్ళీ సావిత్రికి తెలిసింది అంటే చివాట్లు తప్పవు అనుకుంటూ. ఇంతలో ఆటో శబ్థం రానే వచ్చింది, కస్తూరి కి ఓ ఆలోచన వచ్చింది. “నువ్వు లేవకు బామ్మ మంచంలో అలానే ఉండు.” దుప్పటి మళ్ళీ కప్పింది కస్తూరి. సావిత్రి రాగానే చూసింది, విసుగుగా “ఇంకా లేవలేదా, ఓక్క పని చేసి ఉండుండదు అయితే “, అంది సావిత్రి. “పొద్దున్న నుండి కొంచెం అలసట గానే ఉన్నారు”, అంది కస్తూరి. “దేనికి అలసట, ఇంటిలో చిన్నపనులు చేసుకోవటానికి”, అంది సావిత్రి కసురుకొంటూ. రోజూ అయితే ఈ పాటి చేతి లో మంచి నీళ్ళ గ్లాసు ఉండేది. లోపలికి వెళ్ళింది. సామన్లు రూమ్ లో పెట్టి చేతులు కడుకొన్ని మంచినీళ్ళు తాగింది. ఆ మధ్యాహ్నం తిన్న గిన్నెలు చూసి, “పీకల దాకా తిని పడుతుంటే అజీర్తి చేయదు పెద్దావిడకు”, అంది సావిత్రి. కొంచెం సేపు ఏమి మాటలు లేవు. కస్తూరి కలిపించుకొని నేను ఇంటిలో రాళ్ళతో అష్టా చమ్మా ఆడుకున్నానని చెప్పింది. సావిత్రి విసుగులో పెద్దగా పట్టించు కోలేదు. ఈ పాటికి ఓ కాఫీ పడిఉండేది, ఇంత వరకూ చేయనిది మళ్ళీ పొయ్యి వెలిగించాలంటే కష్టం గానే ఉంది, అదీకాకుండా ఇంటిలో పని అంతా కావేరమ్మ మీదే నాయే, కొంచెం తనలో తాను అనుకుంటోంది, పెద్దావిడ తో పాటు తను కూడా ఇంటిలో పనులు సంగతి కొంచెమన్నా చూడాలనుకుంటోంది. లేచి తనకు కాఫీ కలుపుకుంది, పాలు వెచ్చ పెట్టి కస్తూరికి ఇచ్చి, ఇంకొక గ్లాసు కావేరమ్మ పక్కన పెట్టి తను లోపలకు వెళ్ళింది. కస్తూరి, కావేరమ్మ తాగారు. రాత్రికి కూడా సావిత్రి వంట చేసి తను తినేసి వాళ్ళని తినమని చెప్పి మళ్ళీ పొద్దున్నే లేవాలిగదా అని తన రూమ్ లోకి వెళ్ళింది.
మరనాడు సావిత్రి రోజూ కంటే కూడ కొంచెం ముందు లేచింది, కావేరమ్మ కూడా లేచింది అదే సమయానికి. “నాకు బానే ఉంది నే చేస్తా లేమ్మా”, అంది సావిత్రి తో, కానీ సావిత్రి మాత్రం, “మీరు తయారయ్యి, కొంచెం ఆఫీసు కు బాక్స్ రెడి చేయగలరా”, అని అడిగింది. సరేనని వెళ్ళి కాఫీ కలుపుకు వచ్చి ఇచ్చింది, సావిత్రికి. తనకు కూడా మనసు కొంచెం ఆహ్లాదంగా ఉంటోంది, రెండు రోజులనుండి అంత విసుగుగా, అలసటగా ఉండటం లేదు. ఏదో మార్పు అనుకుంటోంది, ఎన్నడూ లేనిది కావేరమ్మతో మాట్లాడడం మొదలు పెట్టింది. “కస్తూరి తో మీకు బాగా తోచుతోంది కాబోలు”, అని అంది కాఫీ తాగుతూ. “అవునమ్మ, మంచి కలుపుగోలు పిల్ల”, అంది.”అవును”, అంది. “మీరు, ఈ రోజు కూరలకు వెళ్ళొద్దు లేండి, నేను సాయత్రం తెచ్చుకుంటాను”, అంది సావిత్రి. కావేరమ్మ ఫర్వాలేదన్నా వినలేదు, సరే అంది. సావిత్రి ఆఫీసు కు వెళ్ళింది. కావేరమ్మ కూడా స్నానం ముగించుకొని వచ్చేసరికే, కస్తూరి అన్నీ పనులు ముగించుకొని అక్కడ ఆడుకుంటోంది. ఇద్దరూ కలిసి పూజ, తరువాత వంట, మధ్యాహ్నం తినడానికి చిరుతిండ్లు చేసి సావిత్రి వచ్చే సరికి, రెడి చేసుకొని ఉన్నారు. సావిత్రి రాగానే కస్తూరి మంచినీళ్ళు అందించింది, చిన్న పిల్ల దగ్గర తీసుకోబుద్ది కాలేదు, నువ్వు ఇలాంటివి చేయద్దు అని చెప్పింది. కావేరమ్మ తో కొంచెం తయారై వస్తానంది. ఆ చిరుతిండ్లు తిని కస్తూరి ని తీసుకొని కూరలకు బయలు దేరింది. కావేరమ్మ వాళ్ళిద్దరూ వెడుతుండటం చూసి మురిసి పోయి ఆ పరంధామయ్య గారిని తలుచుకొని మళ్ళీ ఆ దేవుడి పటం చూసి నమస్కరించింది. అందరిలో మార్పుకు తనలో సంతోషం రెట్టింపు అయ్యింది.
కూరలకు షాపు దగ్గర బట్టల కొట్టు దగ్గరకు వెళ్ళి కస్తూరి ని లోపలికి తీసుకు వెళ్ళింది. మంచి ఓ రెండు ఇంటిలో వేసుకునే గౌనులు, రెండు బయటకు లంగా జాకెట్లు కొనిపెట్టింది. కస్తూరి కి సంతోషంతో మొహం పెద్దది అయ్యింది, ఉండ బట్టలేక “మరీ, బామ్మకి”, అంది ఇంకా చిన్న పిల్ల మనస్తత్వం. “బానే గుర్తు చేసావు”, అని సావిత్రి ఆవిడకు కూడా ఓ చీర తీసుకుంది. అక్కడ నుండి కూరగాయలు తీసుకొని ఇంటికి చేరాను. చేరగానే సంతోషం తో తనకు కొన్న బట్టలు కావేరమ్మకు చూపించింది కస్తూరి. కావేరమ్మ భలే సంతోషించింది అవి చూసి, చాలా సార్లు మంచి పని చేసావని సావిత్రిని పొగిడింది. సావిత్రి చీర తీసి ఇచ్చింది కావేరమ్మకు. అది చూసి కావేరమ్మకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, ఈ రంగు కస్తూరే తీసుకోమందని చెప్పింది సావిత్రి. “చెప్పలేనంత సంతోషంగా ఉందమ్మ”, అని అంది సావిత్రి తో.
మిగతా రోజులు ఇట్లా గడిచిపోయాయి. శుక్రవారం రాత్రి కాంతారావు వచ్చాడు,పొద్దు బోయింది. పొద్దున్న లేచే సరికే ఆశ్చర్య పోయాడు. సావిత్రి చకా చకా అటు పని చేసుకోవడం చూస్తూ అలా నించుండి పోయాడు. “అమ్మ, ఏది”, అని అడిగాడు. “నేనే ఇంకా లేపలేదు”, అంది సావిత్రి. ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలా. ఇంతలో కస్తూరి లేచి వచ్చింది. కస్తూరి ఇంటిలో తిరగడం ఇంకా అలవాటు లేదునునూ మళ్ళీ వెంటనే క్యాంప్ కు వెళ్ళాల్సి వచ్చేనాయె. త్వరగా రెడి అయితే కావేరమ్మ లేవగానే గుడికి వెడదాం అన్నాడు, వచ్చేటప్పుడు హోటల్ కు తీసుకెడతా నన్నాడు. సావిత్రి కాఫీ ఇచ్చింది, ఈ మధ్య తన చేతి కాఫీ తాగనే లేదు. తాగి చాలా బావుందోయ్ అన్నాడు. కావేరమ్మ లేచి బయటకు వచ్చింది, ఇంతలో సావిత్రి కాఫీ కలిపి చేతికిచ్చింది. తను కూడా తాగుతూ కొడుకు తో సంభాషణ మొదలు పెట్టింది. ఇంతలో సావిత్రి వచ్చి ప్రోగ్రామ్ మార్చింది. సాయంత్రం చల్లపడిన తరువాత గుడికి వెళ్ళచ్చు మధాహ్నం తనే వంట చేస్తానంది. కావేరమ్మ కూడా, “నాయనా నువ్వు కాకుండా క్యాంప్ కు కూడా వెళ్ళి వచ్చావు కదా”, అని అంది. ఇంతలో కస్తూరి కూడా వచ్చింది, బోలెడు మాటలతో, తనకొచ్చిన పాటలతో సమయం తెలియకుండా చేసింది. భోజనం చేసి కొంచెం విశ్రాంతి తీసుకొని సాయంత్రం బయలు దేరారు. గుడిలో మళ్ళీ హరతి చేయించుకున్నారు. కస్తూరి పంతులు గారితో కబుర్లు చెప్పింది, అందరూ ఇంటి పట్టాన పడ్డారు, హోటల్ ఇంకొక రోజు చూసుకోవచ్చు అని. ఇంటికి రాగానే సావిత్రి వంట చేసింది, కాంతారావు తన ధోరణి లో మేడ మీదకు వెళ్ళాడు. కొంచెం సేపు కింద ఆడింది కస్తూరి. అన్నాలు తినే టైమయ్యింది. ఎలాగూ తను పైనే ఉన్నాడుగా సరే కస్తూరికి ఈ రోజు కలిపి నేనే పెడతానని తీసుకొని వెళ్ళింది. మళ్ళీ చిన్నతనం గుర్తుకు వచ్చేలా గోరుముద్దలు ఆ సాయం సమయం లో అస్తమించే సూర్యుడుని, ఆ చందమామ ని చూస్త పెట్టడం మొదలు పెట్టింది. కస్తూరి ని చూస్తున్నాడు కాంతారావు. పరంధామయ్య గారు మదిలో మెలగారు, అలా ఆకాశం లోకి చూసాడు. కావేరి అమ్మ అన్నట్లు ఆయనే పైనుంచి చూస్తూ మా కోసం కస్తూరికి పంపారని అనుకుంటున్నాడు. సంతోషం తో అన్నీ మరిచిపోయి నాకు కూడా ఓ రెండు ముద్దలు పెట్టమన్నాడు. ఇంతలో సావిత్రి అప్పడాలు వేయించుకొని తీసుకొచ్చింది. తనూ తీసుకున్నాడు. అవి తింటూ అందరూ మాట్లాడుకుంటూ సరదాగా గడుపేసారు. కావేరమ్మ కూడా పైకి చూసి ఆ మహానుభావుడు ఎక్కడున్నారో కాని అనుకుంటూ, ఆ దేముడిని కూడా తలుచుకుంటుంటే, ఆ ప్రక్క మేడ మీద రేడియో లో “జమిందారు” సినిమా లో పాట వస్తోంది, అది హిట్ పాట అడవంతో కొంచెం సౌండ్ పెంచారు. అది ఇలా
కస్తూరి రంగ రంగా! నాయన్న కావేటి రంగ రంగా!
శ్రీరంగ రంగ రంగా! నినుబాసి నేనెట్లు మరచుందురా! ...
****

No comments:

Post a Comment

Pages