Tuesday, May 23, 2017

thumbnail

అవాల్మీక కదంబమాల

అవాల్మీక కదంబమాల
సేకరణ- మాడపాటి సీతాదేవి.

మాశ్రీవారు వెళ్ళిపోయినాక చాలాకాలం అశాంతి నుంచి బయటపడలేకపోయాను.పదిమంది లో ఉంటే మనశ్సాంతిగా ఉంటుందని కొన్నాళ్ళు కొండాపూర్ లో ఉన్న,చండ్రరాజేశ్వరరావుగారి ఓల్డేజ్ హోం లో ఉన్నాను.అక్కడ చాలా పెద్ద గ్రంధాలయం ఉన్నది.
నాకు చిన్నప్పటి నుంచీ రాముడన్నా,రామాయణం లో ని సన్నివేశాలన్నా,రామాయణంలో శబరి అన్నా చాలా ఇష్టం.మా చిన్నప్పుడు మానాయనగారు రోజూ సుందరకాండ పారాయణ చేసుకునేవారు.రోజూ వాకిట్లో, వరండాలో రామాయణం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు.ఆ కారణమే కావచ్చును నా మనసులో రామాయణమంటే ప్రీతి ఎక్కువగా నిలిచిపోయింది.ఎన్ని రామాయణాలు చదివినా కథ వక్కటే కావచ్చును.ఏ కవిగారు ఎట్లా రాసారో చదివి తెలుసు కుందామని కుతూహలం తో చాలా రామాయణాలు చదివాను.వారి వారి భక్తి కొద్దీ కొన్ని మూలం లో లేని విషయాలు రాసారు.అన్ని భాషల్లోనూ రామాయణం ఉన్నది.ఆఖరికి ఉర్దూ లో కూడా రామాయణం రాసారు.
శ్రీరాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించటానికి అనేక మంది అనేక కారణాలు రాసారు.శ్రీరామచంద్రుడు శరణాగతవత్సలుడు కాబట్టి,వాలి ఎదురుపడి అన్యధా శరణం నాస్తి అంటే రాముడు రక్షించాల్సి వస్తుంది.అప్పుడు రాక్షససంహారం జరగదు.కథ మొదటికి వస్తుందని రాముడు చాటునుండి కొట్టాడని శ్రీవావిలాలకొలను సుబ్బారావుగారి ఆంధ్రవాల్మీకం లో ఉన్నది.అదే సమంజసమనిపించింది.ఇటువంటి అనేకానేక విషయాలు చాలా రామాయణాలల్లో ఉన్నాయి.మళ్ళీ మళ్ళీ చదువుకుందామనే ఉద్ధేశం తో  వాల్మీకం లో లేని విషయాలన్నీ నేను వక పుస్తకం లో రాసుకున్నాను.ఈ మధ్య మా అమ్మాయి ఈ విషయాలన్నీ అందరికీ తెలుస్తే బాగుంటుంది అని ఈ పని మొదలుపెట్టింది.ఇందులో నా స్వంత కవిత్వం ఎంతమాత్రం లేదు.నేను అన్నీ చూసి రాసుకున్న విషయాలే.నాకు చదవటమే వచ్చు.రాయటం రాదు ( అంటే కవిత్వం).నేను శ్రోతనే కాని వక్తను ఎంతమాత్రమూ కాదు.పెద్దలెవరికైనా ఇందులో తప్పులు కనబడితే మనసా శిరసా తల వంచి క్షమించమని వేడుకుంటున్నాను.ఏ రామాయణమైనా కానివ్వండి భవభూతి ఉత్తరరామచరితం,దిగ్నాగుడి కందమాల,పుల్లెల శ్రీరామచంద్రుడిగారి బాలానందిని,ఏదైనా కానివ్వండి అపారపారావారం.అనిర్వచనీయమైన ఆనందం లో ముణిగిపోతాము.
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమ: శాశ్వతీస్సమా.
యత్ క్రౌంచ మిధునా దేక మవధీ: కామ మోహితం
 ఓ నిషాదుడా క్రౌంచ పక్షుల జంట నుండి కామమోహితమైన మగ పక్షిని నీవు చంపితివి కావున నీవు పెక్కుసంవత్సరములు ప్రతిష్ఠను పొందకుందువు.అనగా అపకీర్తిపాలవుదు గాక అని ఆ వచనములకు అర్ధము.
 ఓ విష్ణూ నీవు మండోదరి రావణుడు అను దంపతుల నుండి కామమోహితుడైన రావణుని చంపితివి కావున ప్రతిష్ఠను పొందగలవు అని వక అర్ధము.
( వాల్మీకీ రామాయణ రచనకు నాందీ ఈ శ్లోకము . కావున రామాయణ పఠనమునకు ముందుగా ఈ శ్లోకమును గుర్తు చేసుకోవటము సముచితమని భావిస్తున్నాను.)
రంగనాథ రామాయణము నుండి;
1.సుగ్రీవుడు తనకు వాలితో నేర్పడిన వైరమునకు గల కారణమును శ్రీరామునకు తెలుపుసంధర్భమున రంగనాథరామాయణమున సముద్ర మధనము వర్ణించబడినది.ప్రసిద్దమగు సముద్రమధన కథ తో నిది కొంత భేదించుచున్నది.సముద్రమును మధించునపుడు వాలి సుగ్రీవులు దేవతలకు సహాయపడుట,అందితర వస్తువులతో పాటు తార జన్మించుట,దేవతలా తారను వాలి సుగ్రీవులకోసగుట మున్నగు కొత్త యంశములు చోటు చేసుకున్నవి.
2.సుగ్రీవుడు రామునకు సప్తతాళములను చూపి వాని నొక్క కొలతో కూల్చివేసినచో నాతనిని వాలితో సమానునిగ నెంచెదనని పలుకును.శ్రీరాముడట్లే గావించి తన పరాక్రమమును ప్రకటించుకొనును.అంత ఆకాశవీధిలో నొక విమానము - కరుణావతి యను కన్య ప్రత్యక్షమై తాను నిరతము దుర్వాసుని నిందించుట కారణమున నతని శాపఫలముగా తనకు సప్తతాళరూపము కలిగినట్లుగాను, శ్రీరాముని మూలమున తను శాప విమోచనము పొందినట్లుగను తెలిపి అమరపురికి వెడలిపోయెను.
3.కపివీరులు సేతు బంధనమునకై కొండలు, చెట్లు మున్నగునవి తెచ్చి సముద్రమున పడవేయగానవి తేలక మునిగిపోవుచుండెను.అందుకు శ్రీరాముడు విచారించుచుండగా సముద్రుడు ప్రత్యక్షమై విశ్వకర్మ తనయుడగు నలునకు తప్ప ఆ సేతుభంధనమితరులకు సాధ్యము కాదనియు అతడు సముద్రమున వేసిన తరులుగిరులు మునగక తేలుననియు తేలుపును. అట్లు తేలుటకు నలునకు గల పశుకణ్వుడను ముని వరమును కూడా పేర్కొనును.
ఆ వృత్తాంతమిట్లు గలదు.
వింధ్యాద్రి సమీపమున నొక యడవి లో పశుకణ్వుడను ముని తపము చేసుకొనుచుండగా నటకు నలుడు పోయి బాల్య చాపల్యముచే నాతని పూజా వస్తువులను సముద్రమున పడవేయును.మహర్షి బాలుడగు నాతనిని దండింప నిష్టపడక యాతడు సముద్రమున పడవేసిన వస్తువులన్నియు మునగక తేలుచుండునని యాతనికి వరమును ప్రసాదించును.అంత నాతడు సముద్రమున పడవేసిన ముని వస్తువులన్నియు జలముపై తేలును.
4.రావణ సంహారము చే తనకు గలిగిన బ్రహ్మ హత్యా దోషమున కై కాశి నుండి హనుమంతుడు శివలింగము తెచ్చుటలో ఆలశ్యమగుటచే రాముడు స్వయముగా నొక శికతాలింగమును సిద్దము చేసి రామేశ్వరమున ప్రతిష్ఠ గావించినట్లుగా రంగనాథ రామాయణమున వర్ణించబడినది.
5.శ్రీరాముడు పట్టాభిషేకానంతరము సకల భృత్యా మాత్య సహితుడై కొలువుండగా , నిద్రాదేవి యావహించుటచే లక్ష్మణుడు నిండు సభలో కలకల నవ్వును.సభలోని వారందరు తమతమ కళంకములను తలచుకొని తలవంచుకొందురు.నిండు సభలో అమర్యాదగ నవ్వినందుకు శ్రీరాముడు లక్ష్మణుని మందలించును.అంత లక్ష్మణుడు నిద్రాదేవి తో తాను పూర్వము చేసుకొన్న నియమమును తెలిపి తన నిర్ధోషిత్వమును ప్రకటించుకొనును.
6.తన మాట ప్రకారము రాముడు తిరిగి రానందున దుఃఖితులగు గుహ భరతులు అగ్ని ప్రవేశము చేయుటకు సిద్దముగ నుండగ హనుమంతుడు వారికి శ్రీరాముని వార్త చెప్పి వారి ప్రయత్నమును మాంపించును.గుహభరతుల యతివేలమగు రామ భక్తిని ప్రదర్శించు నీ ఘట్టము రంగనాథ రామాయణమున వర్ణితమైనది.
7.హనుమంతుడు ద్రోణాదిని గైకొని నందిగ్రామము పైగా లంకకు తిరిగి వచ్చు సందర్భమున భరతునకొక స్వప్నము వచ్చును.అందు రామలక్ష్మణులు తైల నిషిక్త శిరస్సులై పంక మధ్యమున చిక్కి కృశాంగులై ఏడ్చుచున్నట్లు భరతునకు కనిపింతురు. అంత భరతుడు మేల్కొని అనేక దిర్నిమిత్తములు కని తచ్చాంతి కై భూసురోత్తములకు వివిధ దానంబులొసంగి రామాదులకేమి కీడు వాటిల్లినదో నని దుఃఖించుచుండును.వల్కల జటా కల్పుడగు భరతుని హనుమంతుడు ఆకాశము నుండి చూచి యాతనిని శ్రీరాముడని తలంచును.లక్ష్మణుడు మరణించగా నా దుఃఖ భారముతో శ్రీరాముడు సీతను కూడా ఉపేక్షించి యిటకు వచ్చేనాయని భ్రమించును.భరతుడాకశమున పోవుచున్న హనుమంతుని భూతమని తలచి యాతని పడగొట్టుటకై బాణము ప్రయోగించబోగా , అశరీరవాణి యాతనితో ఆప్తబంధువగు నీతనికి హాని తలంపకుమని పలుకును.భరతుడు ధనువు నుపహరించుకొనును.హనుమంతుడు లంకకు వెడలిపోవును.ఇంతలో రావణ ప్రేరితుడైన మాల్యవంతుడాతనిని నడ్డగించి యుద్ధమునకు తలపడును.హనుమంతుడు మాల్యవంతుని జంపి ద్రోణాద్రిని తీసుకొని పోయి లక్ష్మణుని రక్షించును.
8.రాముడు రావణుని శిరములెన్ని మారులు ఖండినను అవి తిరిగిమొలుచుచునేయుండును. అందులకు రాముడు విషణ్ణుడై యండగా విభీషణుడు ,రావణుడి నాభి యందు అమృతము కుండలాకారముగ నున్నదనియు పాతకాస్త్రము చే దానినికింప జేయుమనియు రామునకు తెలుపును.రాముడట్లే కావించి రావణుని హతమార్చును.అవాల్మీకమగు నీ యమృత ప్రస్తావనము భాస్కర,రంగనాథ రామాయణముల రెండింటనూ కలదు.వాల్మీకమున శ్రీరామునకు రావణ వధోపాయము మెరింగించినవాడు విభీషణుడు కాడు.మాతలియే.అతడు రామునకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రావణుని వధింపుమని సలహా చెప్పును.ఇందమృత ప్రస్తావనము మాత్రము లేదు.
9.శ్రీరాముడు రాజ్యమును పరిత్యజించి సీతాలక్ష్మణ సమేతుడై శృంగి బేరి పురమును చేరుకొనును.అచట గుహుని ఆతిధ్యము గ్రహించి సీతారాములు తృణ శయ్యపై నిద్రించగా లక్స్మణుడు,వనవాసము ముగియు వరకు నిద్ర పోకుండా ఉండి వారిని కంటి కి రెప్పవలె కాపాడుచుండును.అప్పుడు నిద్రాదేవివచ్చి, రాత్రి సమయమున నిద్రించువలయుననెడి సమయమునే ధిక్కరించితివి కనుక నిన్ను విడుచు మార్గము తెలుపుమని అడుగగా, లక్ష్మణుడు వనవాసము ముగియు వరకు తన భార్య యగు ఊర్మిళాదేవి నాశ్రయించుమనియు,ఆ తరువాత తిరిగి స్వీకరింతుననియు తెలుపును.ఇది లక్ష్మణుని భాతృభక్తి ని తెలుపుచున్నది.
జాంబవంతుడు కపివీరులతో తనకు యౌవనమున ప్రతిమ మగు బలముండెనని తెలిపెను.భాస్కర,రంగనాథ రామాయణములు రెండింటను జాంబవంతుని బలమునకమృత సేవనము కారణమని చెప్పబడినది.
(మరి కొన్ని రామాయణాల విశేషాలను వచ్చే నెల చూద్దాము.)


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information