కవిత్వమే ఊపిరిగా ! ( కధ ) - అచ్చంగా తెలుగు

కవిత్వమే ఊపిరిగా ! ( కధ )

Share This
 కవిత్వమే ఊపిరిగా !  ( కధ )
 అంగులూరి అంజనీదేవి.

వాతావరణం ప్రశాంతంగా ఉంది.
కర్లాన్ బెడ్ ఫై పడుకుని అసహనంగా కదులుతున్నాడు శ్రీరాం. 
గంట క్రితం నుంచి అతి కష్టంగా రాస్తున్న మినీ కవితకు ఇంకా స్పష్టత రాక తికమకగా అక్షరాల వైపు చూస్తూ కణతలు నొక్కుకుంటూవుంది సుధారాణి.
“సుధా ! ఇంకెంతసేపు?”అడిగాడు శ్రీరాం.
“మీరు మధ్యలో డిస్టర్బ్ చేసి నా మూడ్ పోగొట్టకండి. నాకు తెలిసిన ఓ సమాఖ్య వాళ్ళు మినీ కవితల పోటి పెట్టారు. నాకీ బహుమతి తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉంది. అందుకే పోరాడుతున్నాను’’అంది.
“మన పెళ్ళయి నెల రోజులే అయింది. ఇంత కాలం సరసమైన కధలు చదువుకుంటూ, ఆఫీస్ ఫైల్స్ మధ్య తల దూర్చి మరో ధ్యాస లేకుండా బ్రతికాను. అలాంటి నాకు మహాప్రసాదంగా నువ్వు దొరికి, నా కలలు నిజమైనాయని మురిసిపోతున్నాను. ప్లీజ్ ! త్వరగా వచ్చేయ్!” అని గొణిగాడు శ్రీరామ్.
సుధారాణికి భర్త మాటలు వినిపించటం లేదు.తను రాస్తున్న కవితలో ఏదో లోపం ఉన్నట్లు, ఇంకా లైన్స్ చాలనట్లు, రాసిన లైన్స్ ఎక్కువైనట్లు, రాయాలనుకున్న విషయం తన బుర్రలో ఉన్నపళంగా ఉరి వేసుకున్నట్లు అంతా అయోమయంగా ఉంది.
శ్రీరామ్ ఎంత పిలిచినా సుధారాణి వెళ్ళలేదు. పిలిచిపిలిచి, ఒక నిట్టూర్పు విడిచి నిద్రపోయాడు శ్రీరామ్.
కొన్ని రోజులు గడిచాక...
నిద్ర మధ్యలో మేల్కొని, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఫీలవుతూ “అయిందా సుధా రాయడం ?”అన్నాడు  శ్రీరామ్.
కుర్చీలో కూర్చుని కవిత రాస్తున్న సుధారాణికి బెడ్ పై పడుకుని తననే చూస్తున్న శ్రీరాం స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతనలా ఎందుకు చూస్తున్నాడో ఆమెకు తెలుసు.
‘’ఇంకా వుందoడి రాసేది. అప్పుడే అవదు’’అంది నిర్మొహమాటంగా..
‘’అప్పుడే అవదా?టైం చూడు. ఎంతైందో!’’అన్నాడు.
‘’ఎంతైతే ఏం?నేనుకదా రాసేది. మీరు పడుకోండి’’అంది.
‘’అదికాదు సుధా!’’అన్నాడు. 
భర్త వైపు సీరియస్ గా చూసింది ‘మధ్యలో ఇదో గోల! అసలే రాస్తున్న కవితకు స్పష్టత, క్లుప్తత రాక, చెప్పదలచుకున్న భావాన్ని సూటిగా, శక్తివంతంగా చెప్పలేక నేను కొట్టుకు చస్తుంటే, పక్కన నేనున్నానంటూ గుర్తు చేసి, నా ఆలోచనలను, గజిబిజి చేస్తున్నాడు.ఇప్పుడు నేను వెళ్లి పడుకోవటం అంత అవసరమా! రోజు రోజు కి ఈయన గారి నస బాగా ఎక్కువైపోతోంది’ అని మనసులో అనుకుంటూ అంతవరకు రాసిన కవిత నచ్చక  విసుగ్గా చూసింది. పేపర్ల వైపు కాదు. భర్త వైపు....
“నిద్ర తగ్గితే ఆరోగ్యం చెడుతుంది. నేను చెప్పేది నీకోసమే. నా కోసం సెకండరీ...” అన్నాడు శ్రీరాం.
‘’నాకా విషయం తెలుసు. నేను ఇప్పుడప్పుడే రాను. నాకు రాసేది ఇంకా వుంది. ఈ రోజు ఇది పూర్తి చేయందే పడుకోను’’ అంది. 
‘’ఇప్పుడది పూర్తిగా రాయకుంటే కొంపలేమీ మునగవు. నిద్రకన్నా ఆ రాతలంత ముఖ్యమా?’’అన్నాడు.
‘’ఏది ముఖ్యమో ఏది కాదో నాకు తెలుసు. నన్ను డిష్టర్బ్ చెయ్యకండి. ప్లీజ్...’’అంది.
అతనికి చాలా కోపం వచ్చింది. అయినా రాసుకుంటున్నఆమె దగ్గరకువెళ్లి కొట్టలేడు, తిట్టలేడు. లాక్కెళ్ళి పడుకోబెట్టలేడు. అలా అని క్షమించలేడు, భరించలేడు. ఆమెనే చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు శ్రీరాం.
ఆమె దృష్టి మళ్ళి తెల్ల కాగితాల పైకి మళ్ళింది.
అసలు మినీ కవితకు కావలసింది నాలుగు లైన్లే ... చివర్లో కనిపించే స్పార్కే ఆ కవితకు ప్రాణం. మర్రి విత్తనమంత మినీ కవితలో మహా వృక్షమంత అనుభవాన్ని చెప్పటమంటే అదే. అంతేకాదు. ‘’అతి చిన్న హోమియో మాత్రలో మిలియన్ల డిగ్రీల శక్తి కుదించుకుపోయినట్లు వుంటుంది మినీకవిత’’ అంటూ మినీ కవిత ఎంత శక్తివంతమైనదో చెప్పారు అద్దేపల్లి గారు. మరి అలాంటి కవితల్ని తనెందుకు రాయలేక పోతోంది? 
చాలామంది కవులు కొత్త విషయాలను తెలిసేటట్టు చెబుతున్నారు. తెలిసిన విషయాలనే కొత్తగా చెబుతున్నారు. అలాంటివి చదువుతున్నంత సేపు  ‘ఓహ్ ! ఇదింతేనా? ఇలాంటివి తనెంతో సులభంగా రాయగలదు’ అని అనుకున్న తనే అలాంటివి కాదు కదా, ఇంకా తక్కువ స్థాయిలో కూడా రాయలేకపోతోంది. ఈ లోపం ఎక్కడుంది?
సాహితీమిత్రులను కలిసినప్పుడు అదే విషయం అడిగింది.
“కవిత్వం పై మంచి పట్టురానిదే నువ్వు అనుకున్న స్థాయిలో కవితలు రాయలేవు. ఇప్పుడు నీలో ఉన్న ఈ తపన,సామర్ధ్యం తోపాటు బుక్స్ బాగా చదవాలి. “అన్నారు.
వెంటనే - శ్రీశ్రీ, తిలక్, బైరాగి ,కుందుర్తి, శేషేంద్ర, రేవతీదేవి, సినారే, కృష్ణశాస్త్రి గారు రాసినవే కాక ఇంకా కొంతమంది కవులు రాసిన కవితా సంపుటాలను కొని వదలకుండా చదివింది.
‘కాళ్ళు తడవకుండానే సముద్రాన్ని దాటగల మేధావి అయినా, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు.’ ఎవరిదో కానీ, ఈ మినీ కవిత ఎంత బావుంది. ఇలాంటివి తను రాయగలదా? 
రాయగలిగితే...? యువ కలాలకు తన కలం కూడా తోడవుతుంది. చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని సానుభూతితో అర్ధం చేసుకునేందుకు తోడ్పడుతుంది.
సుధారాణిలో ఆవేశం, ఉద్వేగం పోటి పడ్డాయి. బాగా చదవాలి, బాగా రాయాలి అన్న పట్టుదల పెరిగింది.
‘మినీ కవిత పొట్టిదైనా చాల గట్టిదని, స్పష్టత, సమగ్రత, స్పందన, సమాజ చిత్రణ, సందేశం, సజీవ శిల్పం ఆ కవితకున్న జీవ లక్షణాలని’  ఆ మధ్యన ఒక మహాకవి అన్న మాటలు గుర్తొచ్చి ఆమెలో ఉన్నఉత్సాహం మరింత పెరిగింది. పట్టుదలకు ఇంకా పట్టు వచ్చినట్లైంది. ఇంకో అర్ధగంటలో ఉషోదయం అవుతుందనగా ఎలాగైతేనేం రాస్తున్న కవితను పూర్తి చేసి నిద్రపోయింది.  
శ్రీరాo నిద్ర లేచాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యను చూడగానే అతని ఆశలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి. అతని అవసరాలన్నీ నోరెత్తకుండా అతనే తీర్చుకున్నాడు. తనను దుర్మార్గుడిగా భావిస్తుందని భయపడి ఆఫీస్ కెళ్ళే ముందు ఆమెను నిద్ర లేపి కాఫీ అందించి చక్కా వెళ్ళిపోయాడు.
ఏ రాత్రి కా రాత్రి ఆమె కలం అసంపూర్ణ కవితలను వెలువరిస్తుంటే అతని కనురెప్పలు మాత్రం అందమైన కలలను కంటున్నాయి.
ఆ రోజెందుకో సుధారాణి ముఖంలో ఆనందం, ఉత్సాహం ఎక్కువై కొన్ని వందల విధ్యుద్దీపాల కాంతిని పుంజుకున్నట్లు స్పష్టమవుతోంది. కాగితాల ముందు కూర్చొని చాలా సేపు రాసుకుంది. భర్త ఆఫీస్ నుంచి రాగానే “ఏవండీ!” అంటూ అతడిని పిలిచింది.
ఆ పిలుపు అతని చెవులకు తేనె విందులా అనిపించింది. విషయం తెలియకపోయిన ఒక్క ఉదుటున ఆమె దగ్గరకు వెళ్ళాడు. కుర్చీ లాక్కుని ఆమెకు దగ్గరగా కూర్చున్నాడు. అతనికి చాలా తొందరగా ఉంది...
ఆమె చెప్పే కబుర్లు వినాలని, ఆమె పెదవులు కురిపించే నవ్వుల్ని చూడాలని, ఆమె ముందు అలాగే  కూర్చుని ప్రశాంతంగా గడపాలని, ఇంకా ఏదేదో చేయాలని... ఇలా చాలా రోజుల నుంచి అతను చాలా, చాలా చంపుకుని బతుకుతున్నాడు. కనుక అతనిలో కలిగే ఈ భావాలు చాలా సహజమైనవని అతని నమ్మకం.
“ ఏమండీ! ఒక సమాఖ్య వాళ్ళ పోటికి పంపిన నా మినీ కవిత సాధారణ ప్రచురణకు ఎన్నికై ఈ బుక్ లో ప్రింట్ అయింది. ఈ బుక్ తీసుకెళ్ళి రేపు మీ ఆఫీసులో చూపించండి. ప్రస్తుతం నాకు మంచి పబ్లిసిటీ అవసరం” అంది సుధారాణి.
అది వినగానే అతని మనసంతా అదోలా అయింది. అతను అనుకున్న వాతావరణం ఏమీ లేదక్కడ.
‘ఇదా ఈవిడ చెప్పాలనుకున్నది? ఇంకా నయం! ఆ బుక్ పట్టుకొని సిటీ అంత తిరగ మనలేదు. ఇదేం భార్య రా బాబూ! సరసంలో ఒట్టి జడపదార్ధంలా ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో, ఈ జన్మలో ఈ కవితల పిచ్చి పెళ్ళాం దొరికింది’ అని మనసులో అనుకుoటూ పిచ్చ్చి చూపులు చూసాడు.
“ఏమండీ! నా భవిష్యత్తుఫై నాకు చాలా ఆశలున్నాయి. గొప్ప కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకోవాలని, వేదికపై నిలబడి కాశ్మీర్ శాలువాలతో సత్కారాలు పొందాలని ఉంది. ఈ కోరికలన్నీ తీరాలంటే నాలో ఉన్న ఈ కృషికి, పట్టుదలకు మీ సహకారం కూడా తోడు కావాలి” అంది.
‘అవునా’ అన్నట్లు వ్యంగంగా చూసాడు.
‘’వింటున్నారా?”
‘’ ఆ ఆ ‘’ అన్నాడు.
‘ఎవరో ఒకరు త్వరగా వేదిక మీదకు పిలిపించి, ఊపిరాడకుండా నాలుగు దుప్పట్లు కప్పేస్తే పీడా బోతుంది. కాశ్మీరు శాలువ కావాలట! మొగుడిని మురిపెంగా చూసుకోవటం రాదు కాని, వేదిక లెక్కి ప్రపంచాన్ని నడిపిస్తుందట’ అని పైకి అంటే ఎలా ఉండేదో కానీ అలా అనలేదు. కసిగా పెదవులు ముడిచాడు.
అతని కసి ఈ ఒక్క రోజుది కాదు. చాలా రోజులుగా ఆమె తనకు సేవలు చేయటంలేదని, శ్రద్దగా చూడటం లేదని, తను తప్ప, ఈ ప్రపంచంలో పెళ్ళైన మగవాళ్ళంత తెగ సుఖపడిపోతున్నారని.. అదీ గాక అతను పుట్టి బుద్దెరిగాక క్లాస్ బుక్స్ తప్ప మరొకటి చదివిన పాపాన పోలేదు. రచనలన్నా, రచనలు  చేసేవాళ్ళన్నా అతనికి తెలియదు. రచనల విలువ, వాటి ఉపయోగం అంతకన్నా తెలియదు. అటువంటప్పుడు తన ఇంట్లోనే  ఒక కవయిత్రి వెలసి తనను ఊపిరాడకుండా చేస్తుంటే మహా ఇబ్బందిగా ఉంది.
“మీకింకా అనుభవంలోకి రాక అలా నిర్లిప్తంగా ఉన్నారు కానీ, ఒక కవయిత్రి భర్తగా మీక్కూడా గౌరవ మర్యాదలు లభిస్తాయి. చూస్తూ ఉండండి ఇంకొద్దిరోజులు పోతే మీ ముందే మీలో ఉన్న గొప్పతనాన్ని ఆకాశానికెత్తేస్తారు” అంది.
లోలోన ఉడికిపోతున్న శ్రీరాం ఇక వినలేక “చూడు, సుధా! నా ద్వార నాకు లభించే ఈ గౌరవ మర్యాదలే నాకు చాలు’’ అని విసుగ్గా కుర్చీ లోంచి లేచి విసురుగా వెళ్ళిపోయాడు.
భర్త ఎలా ఫీలవుతున్నాడన్నది అప్పుడామెకు ‘ముఖ్యంగా’ అనిపించలేదు.
శ్రీరాం ఏమనుకున్నాడో ఏమో మళ్ళి వచ్చి  “సుధా! ఐమాక్స్ లో మంచి సినిమా ఆడుతోంది. వెళ్దామా! ఈ రోజే ఆఖరట.” అన్నాడు.
“లేదండీ! నేను రాలేను’’ అంది.
‘’ఎందుకు రాలేవు?’’అన్నాడు అసహనంగా. అతనికి ఆ సినిమా చూడాలని వుంది. పెళ్లి అయ్యాక భార్య తో తప్ప ఒంటరిగా సినిమాకు వెళ్ళడం అతనికి ఇష్టం లేదు.
‘’నేనొక రచయిత ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. సినిమాలదేముంది? ఎప్పుడూ చూస్తుండేవేగా! అంతగా చూడాలని ఉంటే మీరొక్కరే వెళ్లి రండి” అంది సుధారాణి.
గవ్వలోంచి సరదాగా బయటకు చూస్తూ అలికిడి రాగనే ముడుచుకుపోయే నత్తలా ముఖం పెట్టాడు శ్రీరాం. ఒకటా, రెండా – ఎన్ని కోర్కెలు బలైపోతున్నాయి. ఆమెతో మాట్లాడాలన్నా, ఆమెతో బయట తిరగాలన్నా, ఆమెను వెంట పెట్టుకొని ఫ్రెండ్స్ ఇళ్ళకు వెళ్ళాలన్నా వీలు కావటం లేదు. దీనికి కారణం తను కాదు ఆమె. ఎంత కాలం ఇలా? ఆమె సాహచర్యంలో సర్వ సుఖాలను కోల్పోతున్నవాడిలా బాధ పడ్డాడు. అప్పటి కప్పుడు జీవితంఫై విరక్తిని పెంచుకోవాలని ఎంత ప్రయత్నించినా అతనిలో బలీయంగా ఉన్న సజీవశక్తులన్నీ అతని ప్రయత్నాన్ని సాగనివ్వలేదు. భార్య రాకుండా ఒంటరిగా సినిమాకు వెళ్ళలేకపోయాడు.
సుధారాణి ఏదో ఒక సమయలో రచయతల ఇళ్ళకు, విమర్శకుల ఇళ్ళకు వెళ్తూనే ఉంది. గంటలు గంటలు సాగే వాళ్ళ సాహిత్య చర్చలో శ్రోతలా పాల్గొంటూనే ఉంది.
ఒక రోజు రోడ్డు పక్కన ఎంగిలాకులతో మొహాన్ని ఏకం చేసుకుంటున్న పసివాడిని చూడగానే సుధారాణి హృదయం కంపించింది. ఆమెలో నిద్రపోతున్న భావాలన్నీ లావాలా ఉప్పొంగి బయటకు ఉరకాలని ఉద్రేక పడ్డాయి. కానీ దిక్కుతోచని దానిలా తెల్ల కాగితాల వైపు చూస్తూ కూర్చోవటం తప్ప పదునైన భాషను ప్రయోగించలేకపోయిoది. అంతలో ఒక విమర్శకురాలి మాటలు గుర్తొచ్చాయి.
“చూడమ్మా! సుధారాణి! ఒక శిశువు జన్మిచాక ఆ శిశువు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎదగాలంటే ఫ్రీగా దొరికే గాలి, నీరు, వెల్తురుతో బాటు ఖరీదయిన ఫీడింగ్ ఎంత ముఖ్యమో, కళాకారునికి కూడా తనలోని కళకు పరిణితి రావాలంటే నిరంతర కృషితోపాటు భాషపై అధికారం రావాలి. అక్షరాలను మింగి జీర్ణిoచుకుని అక్షరాయుధాలను సంధించాలి అంటే ఇప్పుడు నువ్వు చదివిన పుస్తకాలే కాక ఇంకా ఇంకా గొప్ప సాహిత్యం చదవాలి’’ అంది. 
ఆ విమర్శకురాలి మాటల్లో నిజం ఉందని గ్రహించింది. తనకంటూ ఒక చిన్న పుస్తక ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంది.
అది చూసి శ్రీరామ్ భరించలేకపోయాడు. ఏదో పనిలో ఉన్నసుధారాణిని పిలిచి ‘’ అసలే ఈ ఇల్లు ఇరుకు. దానికి తోడుగా ఎక్కడ  చూసినా నీ పుస్తకాలు. ఇన్ని పుస్తకాలు కొనాలంటే ఎంత డబ్బు కావాలి?నా కొచ్చే జీతంలో ఎక్కువ భాగం నీ పుస్తకాలు కొనటానికే వాడుతున్నావ్! ఇక నువ్వు ఇంతేనా? మారవా? నీకీ పిచ్చి తగ్గదా? ఏం మనిషివో ఏమో చెప్పేకొద్దీ ఇంకా ఎక్కువ చేస్తున్నావ్. రోజురోజుకీ ఇంట్లో వుండాలంటేనే నరకంగా వుంది” అన్నాడు.
ఆమె అతని మాటల్ని విన్నా విననట్లేవుంది. 
“ ఏం మాట్లాడవు? నాలుగు కవితలు రాసినంత మాత్రాన భర్త మాట్లాడేది వినిపించదా? సమాధానం చెప్పాలని అనిపించదా? మేధావినన్న గర్వమా?”అన్నాడు కోపంగా.
అతని కోపాన్ని ఆమె పట్టించుకోలేదు.
‘’అసలు నేను ఎలా కనిపిస్తున్నాను? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇలా వాగి వాగి నోరుమూసుకొని ఉంటాననుకుంటున్నావా?నేనలా ఉండేవాడిని కాదు’’అన్నాడు.
‘’ఉండక ఏంచేస్తారు?’’అంది. 
‘’ఒక పుస్తకం చదివాక మరో కొత్త పుస్తకం కోసం పుస్తకాల షాపు వెంట తిరగటమేనా నీపని? అసలు నువ్విలా తిరుగుతుంటే నాకేమనిపిస్తుందో తెలుసా?’’అన్నాడు.
‘’ఏమనిపిస్తుంది?’’ అడిగింది.
‘’నిషా కోసం పరుగెత్తే తాగుబోతులా, డ్రగ్స్ కోసం తాపత్రయపడే పీదితుడిలా అనిపిస్తున్నావ్!’’ అన్నాడు  శ్రీరాం.
“ మీరు ఇలా మాట్లాడితే నేను హర్ట్ అవుతానని తెలిసే మాట్లాడుతున్నారు కదా!” అంది.
“నేను నిన్ను హర్ట్ చేయడమేంటి? ఉన్న విషయం మాట్లాడుతున్నాను. కడుపుమండి మాట్లాడుతున్నాను” అన్నాడు రోషంగా.
“కడుపుమండి కాదు. కళ్ళు మండి మాట్లాడుతున్నారు. నా ప్రతిభను చూసి ఓర్వలేక పోతున్నారు. బయట నన్నంత పొగుడుతున్నారు కదా! “అంది.
“అలాంటి పొగడ్తలు నాకు అవసరంలేదని నీకు చాలాసార్లు చెప్పాను. పదేపదే అదే మాట్లాడి నన్ను రెచ్చగొట్టకు. నీవల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది”అన్నాడు.
“నావల్లనా!! నేనేం చేశాను? మీరే నన్ను ప్రశాంతంగా రాసుకోనివ్వడంలేదు. ఎప్పుడు పెన్ను పట్టుకున్నాగొడవ పెట్టుకుంటున్నారు. విసుక్కుoటున్నారు. నన్నూ, నా పుస్తకాలను చూసి చిరాకు పడుతున్నారు. నేనేదో అంటరానిపని చేస్తున్నట్టు నోటికొచ్చినట్లు దులిపేస్తున్నారు. ఘోరంగా సాధిస్తున్నారు. అవమానిస్తున్నారు. ఏ భార్య పడుతుందండి ఇన్నిమాటలు? అసలు మనశ్శాంతి లేనిది మీకా నాకా?” అంటూ కోపంగా లేచి నిలబడింది.
“నీతో వచ్చిన తలనొప్పే ఇది. అసలు నీలాంటి భార్యలు ఉన్నచోట కాపురాలు వుండవు. ఇదిగో ఇలాంటి మాటలే వుంటాయి . ఇదంతా నా ఖర్మ...” అన్నాడు.
“ఇది మీ ఖర్మ కాదు. నా ఖర్మ. అసలు మీ లాంటి భర్తలే వుంటే ఇంతమంది రచయిత్రులు, కవయిత్రులు, పత్రికాఎడిటర్లు ఉండేవాళ్ళే కాదు. ఇప్పుడు ఆన్లైన్ లో వెబ్ సైట్ లు నడుపుతున్న ఆడవాళ్ళు కూడా ఆయా రంగాల్లో నిలబడే వాళ్ళే కాదు. ఏ అభిరుచీ లేకుండా, ఏ లక్ష్యం లేకుండా టీవీ చూసుకుంటూనో, ఇంట్లో ఉన్న నేలనో, గోడలనో చూసుకుంటూనో నేనుండలేను. ” అంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది సుధారాణి.
శ్రీరామ్ కి అంతవరకు చల్లగా వున్నఆ వాతావరణంలో నిప్పులు కురిసినట్టుగా అనిపించిoది. 
***
 రెండు సంవత్సరాలు గడిచిపోయాయి...
“సుధా! రాసేది కాస్త ఆపి, నా మాటలు వింటావా?”అన్నాడు శ్రీరాం సీరియస్ గా. 
‘’వింటాను చెప్పండి’’ అంటూ రాసేది ఆపి తలెత్తి భర్త ముఖంలోకి చూసింది.
“ఈ రోజు డాక్టరు దగ్గరకు వెళ్లి వచ్చాను”అన్నాడు.
“ఎందుకూ? ఏo జరిగింది?” ఆందోళనగా అడిగింది.
“ఇంకా ఏo జరగలేదు.”
“ఏమిటో, రోజు రోజుకీ మీ ధోరణి విపరీతంగా ఉంటోంది” అంటూ పెదవి విరచింది.
ఆమె పెదవి విరుపుతో తనను ఎగతాళి చేస్తున్నట్లనిపించింది శ్రీరాం కు.
దిగ్గున కుర్చీలోంచి లేచి కిటికీ దగ్గర కెళ్లి నిలబడ్డాడు.
“మన పెళ్లయి రెండేళ్ళు దాటుతుంది. మన తోటి పెళ్లయిన వాళ్ళందరికీ పిల్లలు పుట్టారు. మన పరిస్థితి ఏమిటో అర్థం కాక, ముందుగా నా వైపు నుంచి అలోచించి డాక్టర్ దగ్గర కెళ్ళాను. నాలో ఏ లోపం లేదన్నారు.”
“మరి నాలో ఏదైనా లోపం ఉందని అనుకుంటున్నారా? అప్పుడే ఏo వయసు మించి పోయింది? ఇలా తొందర పడుతున్నారు?”
“నాకు తొందరగానే ఉంది.”
“మీకు తొందరగా ఉంటే ఇప్పటి కిప్పుడు నన్నేం చేయమంటారు? అదేమైన కవిత రాయటమంత తెలికనుకున్నారా, నిక్కి నీలిగి ఓ గంటలో రాయటానికి.”
“పనికిమాలిన నిర్వచనాలు చెప్పి టైం వేస్టే చేయాలని చూస్తున్నావా?” విసుగ్గా అన్నాడు శ్రీరాం.
సుధారాణికి ఏదోగా ఉంది. అసలే తన రచనా వ్యాసంగంలో ఎదుగూ, బొదుగూ లేక ఉన్న చోటనే ఉన్న చందంగా తయారై ఏం చేయాలో తోచని స్థితిలో కూర్చొని ఉంటే-ఇప్పటి కిప్పుడు పిల్లలు లేరన్న లోటును బయట పెట్టి, దానికి కారణం కూడా తనేనని నింద వేసి వేదిస్తుంటే చిరాగ్గా అనిపించింది. ఏదో అనాలని పెదవి విప్పబోయింది.
ఆమె మాట్లాడే లోపలే “చూడు సుధా! నువ్వెలా ఫీలైనా బాధపడను. భయపడను. ఇన్నాళ్లూ నేను నీతో సుఖాన్ని సంతోషాన్ని పరిమితంగా అనుభవించాను. ఎన్నోరాత్రులు నరకాన్ని  చూశాను. అందుకు నిన్నేమి అనదలచుకోలేదు. కానీ, పిల్లల విషయంలో కూడా నన్ను అన్యాయం చెయ్యాలని చూస్తున్నావు. అందుకు నిన్ను నేను...”
“ఏం చేస్తారు?” వెంటనే అడిగింది.
అతనేం మాట్లాడలేకపోయాడు. ఆమె ముఖంలోకి చూసాడు.
“చూడండి!  పిల్లల కోసం పడే బాధలు, తపన, కాల యాపన నాకొద్దు.  పిల్లలు కావాలని నేను కోరుకోవటం లేదు. అసలంత తీరిక, ఓపిక నాకు లేవు. పిల్లల కోసం వెచ్చించే కాలాన్ని, శ్రమని రచనలు చేయటానికి నేను వాడుకుంటే ఈ జన్మలోనే ఉన్నత శిఖరాలను చేరుకోగలను. అనుక్షణం నా మనసు కోరుకునే దానికోసం నేను పాటుపడినప్పుడే నాకు పరిపూర్ణత లభిస్తుంది. ఒకరికోసం నా ధ్యేయాన్ని మార్చుకోలేను” అంది ఖచ్చితంగా.
‘’ఇలాంటి ధ్యేయాలు ఎవరైనా వింటే ముఖమ్మిదే చీవాట్లు పెడతారు.’’
‘’ఆఫ్ కోర్స్ ! మీరు కూడా నేను రాసుకుంటూ కూర్చుంటే చీవాట్లు పెడుతున్నారు. కొంచెం కూడా కో ఆపరేషన్ లేదు. అందుకే మనం చేసే పనులు అందరికీనచ్చాలని లేదు. నచ్చలేదని వదిలేయ్యాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలా వదిలేసుకుంటూ వెళ్తే ఒక్క పని కూడా చెయ్యలేం. అనుక్షణం అందరి మెప్పు పొందుతూ బ్రతకటం అసాధ్యం...’’ అంది.
మతి పోయింది శ్రీరాం కి ...
“ సరే సుధా! నీ తుది నిర్ణయం అదే అయినప్పుడు నా నిర్ణయం కూడా విను. నువ్వంటే నాకు అసహ్యం లేదు. అందుకే నా జీవితంలో నిన్నెప్పుడూ కాదనను. కానీ పిల్లల కోసం మళ్ళి పెళ్లి చేసుకుంటాను” అన్నాడు దృడoగా.
ఆమె చలించలేదు. 
శ్రీరాం తీవ్రంగా ఆలోచించాడు.
పిల్లలు లేని జన్మ జన్మే కాదు. బ్రతుకు చివర్లో సొంత మనుషులనేవాళ్ళు ఎంతో అవసరం. కాగితాలపై రాయటం తప్ప  సుధకి ఇలాంటివి తెలిసినట్లు లేదు. అదేం అంటే గొడవ పెట్టుకుంటుంది. ఆమె దేన్నో కోల్పోతుందన్న బాధతో పక్కింట్లోఉన్న వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారితో అన్ని విషయాలు మాట్లాడి, సుధకి నచ్చచెప్పమని చెప్పి ఆఫీసుకి వెళ్ళాడు శ్రీరాం.
శ్రీనివాస్ గారు సుధారాణిని పక్కకు పిలిచి కూర్చోబెట్టి  “సుధా! పెద్దవాణ్ణి. నా మాట విని మీవారు చెప్పినట్లు నువ్వు నడుచుకుంటే ఉత్తమంగా ఉంటుందని నా అభిప్రాయo” అన్నారు. 
“మీ అభిప్రాయం తప్పు అని నేను అనను సర్ ! అయన దృష్టంతా పిల్లల మీద ఉంది. నన్ను కేవలం పిల్లల్ని కనే యంత్రంలా భావిస్తున్నారు. పిల్లలు లేనిదే జీవితమే లేదంటున్నారు. పిల్లల కోసం చాలా తొందర పడుతున్నారు. పిల్లలంటే నాకు ఆసక్తి లేదు. అందుకే అయన మళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పినా నేను కాదనలేదు” అంది.
ఒక పసిపాప అడుగులు తడబడి అగాధంలోకి దూకబోతుంటే మానవత్వం ఉన్న ఏ మనిషికైనా ఆదుకోవాలనిపిస్తుంది. శ్రీనివాస్ గారికి సుధారాణి మొండితనంలో – పసితనం, మూర్ఖత్వం అగుపించింది.
“చూడమ్మా!సుధా! ప్రస్తుతం శ్రీరాం నీ ఒక్క దానికే సొంతమై, పరిపూర్ణoగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ అధికారంలో కట్టుబడి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నీ చేతులార మరో వ్యక్తికి పట్టిoచాలని చూడటం అవివేకం. తొందరపాటు. హైందవ ధర్మాన్ని నీకు గుర్తు చెయ్యను కానీ మనిషి ధర్మాన్ని మాత్రం మరిచిపోవద్దు” అన్నాడు ఒక అత్మీయుడిలా శ్రీనివాస్ గారు.
“అది కాదు సర్ !” అంది సుధారాణి.
“ సుధా! నువ్వు నా మాట  వింటావా లేదా?” అన్నాడు.
“ వింటాను సర్! కానీ  మావారి పెళ్ళితో నేనేదో పోగొట్టుకుంటున్నానన్న జాలితో వున్నారు మీరు. అందుకే  నాకు నచ్చచెప్పాలని చూస్తున్నారు. అందరు ఆడవాళ్ళ లాగే నన్ను కూడా వంట ఇంటికి పరిమితం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ప్లీజ్ సర్! నన్ను అర్థం చేసుకోండి! మావారిలో కానీ, వారి బంధు వర్గంలో కాని కడుపు నిండా తిండి తిని, కంటి నిండా నిద్రపోవటం తప్ప ఎలాంటి కళాత్మకమైన అభిరుచులు లేవు. అలాంటి వాతావరణంలో నా ఆశలు నెరవేరవు. నా ఆశ మీకు తెలుసు’’అంది.
‘’తెలుసు. కానీ నీ ఆశలో అర్ధం లేదని కదా శ్రీరాం అంటున్నాడు’’
‘’అర్ధం వుంది సర్! కానీ ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదు’’
‘’ఆయనకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదని అంటున్నాడమ్మా శ్రీరాం’’
‘’అదే సర్ మా ఇద్దరి మధ్యన జరుగుతున్న గొడవ. ఆ గొడవ వల్లనే విభేదాలు వచ్చాయి. ఇద్దరం ఒకే ఇంట్లో వున్నామనే కానీ మానసికంగా కలిసిలేము. ఇది మీకు వినడానికి మామూలుగా అనిపించవచ్చు. కానీ అనుభవించడం కష్టం. నా ద్వార అయన ఎలాగూ సుఖపడలేరు. కనీసం ఆ వచ్చే వ్యక్తితోనైనా తనకి నచ్చిన రీతిలో ఉంటారు. దీని ద్వారా నాకు  అయన బాధ్యత సగం తగ్గి నాకంటూ ఇంకాస్త టైం మిగులుతుంది. ఆ టైంలో కూడా రాసుకుంటాను” అంది సుధారాణి. 
అవాక్కయారు శ్రీనివాస్ గారు. ఆమె వైపు వింతగా చూస్తూ విస్తుబోయారు. 
ఏ భార్యాభర్తల మధ్యనైనా విభేదాలు రావడానికి కారణాలు వుంటాయి. కానీ ఇవే ఉండాలి అని మాత్రం  ఎవరూ చెప్పలేరు. కారణాలు ఏమైనా కావొచ్చు ఒకసారి కలహాలు మొదలయ్యాక ఆ ఇద్దరి ప్రయాణం కత్తి మొనపై సాగినట్లే... అలాoటి స్థితి వచ్చిందీ అంటే ఇక ఆ ఇద్దరి మధ్యన శత్రుసైన్యంతో పని లేని మానసిక యుద్ధమే అవుతుంది.
ఇప్పుడు సుధారాణి, శ్రీరాంల మధ్యన అలాoటి యుద్దమే నడుస్తోంది. 
ఇక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళారు శ్రీనివాస్ గారు.
నెల తిరక్కముందే వాసంతిని పెళ్లి చేసుకున్నాడు శ్రీరాం. సుధారానికి భిన్నంగా ఉండే వాసంతితో అతని జీవితo రసరమ్య గీతంలా మారిపోయింది.
ఒక బాబు, ఒక పాప పుట్టారు. జన్మధన్యమైనట్లు పొంగిపోయాడు శ్రీరాం. ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా శ్రీరాం, వాసంతిల నవ్వుల హోరు. పిల్లల పోరు ఎక్కువై సుధారాణి మనసును చెండుకు తింటున్నాయి. ఆ వాతావరణంలో ఉండలేక భర్తతో చెప్పి అదే సిటి లో ఒక అపార్ట్ మెంట్ పెంట్ హౌస్ లో కి షిఫ్టు అయింది.
ఇప్పుడు ఆమె రచన వ్యాసంగం చక్కగా సాగుతోంది. ఆమె కవితలు అద్బుతంగా ఉంటున్నట్లు సాహితీ వేత్తలంతా మెచ్చుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సాహితీ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతున్నాయి. కొన్ని కార్యక్రమాల్లో వక్తగా, కొన్ని కార్యక్రమాల్లో శ్రోతగా పాల్గుంటూనే ఉంది.
కానీ తనింత కష్టపడి రాస్తున్నా కవితకి పట్టుమని పది రూపాయలు పంపని కొన్ని పత్రికలు గుర్తొచ్చి మనసు మండినా, తన పేరు ప్రతిష్టలు పర్వతంలా పెరిగిపోతున్నాయన్న తృప్తితో ఆమె కలం సాగిపోతూనే ఉంది.
ఆ రోజు ఎప్పటిలాగే రాసుకుంటూ కూర్చుని ఉన్న సుధారాణి కడుపులో ఆకలి మంట ప్రారంభమైoది. వాసంతి పంపే లంచ్ బాక్స్ కోసం ఎదురు చూడసాగింది. గంట గడిచినా ఇంకా రాలేదు. ప్రతి రోజు టైం కాకముందే, ఆకలి బాధ తెలియకముందే లంచ్ బాక్స్ తో వచ్చే పనిపిల్ల ఈ రోజేమిటి ఇంకా రాలేదు? ఆకలి బాధ ఎక్కువై మంచినీళ్ళు త్రాగి మౌనంగా కూర్చుంది.
అంతలో...లంచ్ బాక్స్ ఉన్న క్యారీబ్యాగ్ పట్టుకొని భర్త రావటం గమనించి ఆశ్చర్యపోయింది సుధారాణి. వెంటనే లేచి భర్త చేతిలోని క్యారీబ్యాగ్  అందుకొని- “ పని పిల్ల ఏమైంది?ఈ రోజు మీరొచ్చారు?” అంది.
“నీతో తీరిగ్గా ముచ్చట్లడదామని” అని అనాలనుకొని, పైకి అంటే వ్యంగంగా ఉంటుందని భయపడి, ఓపిక లేనివాడిలా కుర్చీలో కూర్చున్నాడు.
భర్త జవాబు కోసం చూడకుండానే గబగబా లంచ్ బాక్స్ లోని అన్నం, కూరలు ప్లేట్ లోకి వడ్డించుకుంది.
అది చూసి “నీ పని హాయి సుధా! ఏదో మూడ్ దొరికితే రాసుకుంటావు. లేదంటే నీ ఇష్టం వచ్చిన రీతిలో చాలా రిలీఫ్ గా కాలాన్ని గడిపేస్తుంటావు. నాకూ, వాసంతికీ అలాoటి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లేవు. ఆఫీసులో నాకు వెట్టిచాకిరి. ఇంట్లో తనకి గొడ్డు చాకిరీ” అన్నాడు.
అతని మాటల్లోని ఏదో సూక్ష్మమైన అర్థం ఆమె గుండెల్లో దిగబడిoది. కలుపుకున్న అన్నం ముద్ద నోటిదాకా వెళ్లకుండా మొండికేసింది.
“ఈ రోజు పనిపిల్ల రాలేదు. పిల్లల్ని వెళ్లి పెద్దమ్మకు లంచ్ బాక్స్ ఇచ్చి రమ్మంటే కస్సు మంటున్నారు పరీక్షలని. నాకు ఆఫీసులో పార్టీ ఉండి లేటైంది.”
“పర్వాలేదు లెండి!”
“సుధా! నువ్విక్కడ, మేమక్కడ ఉండటం ఇబ్బoదిగా ఉంది. ముఖ్యంగా రెండు చోట్ల ఇంటి బాడుగ అనవసరం. అందరo ఒక చోట ఉంటే ఆర్ధికపరమైన ఇబ్బందులు కూడా అడ్జెస్ట్ అవుతాయి. పనిపిల్ల ఇక రాదు. ఇంట్లో వాసంతికి పని ఎక్కువైంది. నువ్వొస్తే ఇద్దరు కలిసి పని చేసుకోవచ్చు. తేలిగ్గా ఉంటుంది. చదువులతో బిజీగా ఉండే పిల్లలకి పని చెప్పటం భావ్యం కాదు. ఆలోచించు” అన్నాడు.
తలెత్తి చూసింది సుధారాణి. అతనికీ, వాసంతికి, పిల్లలకి తనొక పనిమనిషిగా మారిపోయి, తన శేష జీవితాన్ని గడిపెయ్యాలన్న అర్థం స్పురించిoది. ఆకలి నశించిoది.అన్నం తినకుండానే  లేచి చేయి కడుక్కొని అతనికి ఎదురుగా కూర్చుంది.
“నా లక్ష్యం మీకు తెలుసు. దానికోసమే అన్నీ వదులుకున్నానని కూడా తెలుసు. అన్నీ తెలిసి కూడా మధ్యలో మీ బుద్ధిని ఇలా మార్చుకున్నారేమిటి? మిమ్మల్ని నగలు, చీరలు కోరలేదు. విడాకులు అడగలేదు. నాకు కొంత డబ్బు ఇస్తేనే మీరు చేసుకోబోయే రెండో పెళ్లి కి ఒప్పుకుంటానని పంచాయితీ పెట్టలేదు. ఇలాంటి విషయాల్లో కొందరమ్మాయిలు ఎలా వున్నారో మీకు తెలుసు. అలా అని నేను అమాయకురాలిని అని కాదు. మీ మనిషిలా వుండాలన్నదే నా ఉద్దేశం. అదికూడా కష్టంగా వుందా? అయినా  ఇంటి బాడుగ, క్యారియర్ తో భోజనమేగా? అది కూడా బరువయిందా? భర్తగా ఆమాత్రం బాధ్యత మీకు లేదా?” అడిగింది సుధారాణి.
నెమ్మదిగా నవ్వాడు శ్రీరాం
“బాధ్యతలు, బంధాలు ప్రసక్తి ఇప్పుడు దేనికిలే సుధా!” అన్నాడు ఎలాంటి ఆసక్తి లేనివాడిలా నిర్లక్ష్యంగా .
ఆమె మనసును కలుక్కుమంది. రోషంగా, పౌరుషంగా అతని వైపు చూసింది.
“వాసంతి కోసం ఎల్ఈడి టీవీ, ఎల్జీ ఫ్రిడ్జ్ కొన్నారు. నా విషయంలో మాత్రం అతి తక్కువ ఖర్చును కూడా భరించలేకపోతున్నారు. ఇది న్యాయంగా ఉందా మీకు” అంది.
“చూడు సుధా! వాసంతి నా కోసం తన సర్వస్వాన్ని అర్పించింది. తన ఆలోచనల్ని, ఒంట్లో శక్తిని నాకోసం ధారపోసింది. మనిషి ఎంత సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించగలడో అంతకన్నా ఎక్కువ సుఖ, సౌకర్యాలను ఆమె ద్వారా అందుకున్నాను. జీవితానికి ఓ అర్థం నేర్పింది. ఇప్పుడు జీవితం అంటే నాకు భయం లేదు. అసంతృప్తి లేదు. మనిషికి ఇంతకన్నా ఏo కావాలి చెప్పు? ఏo కావాలన్నా వాసంతి తన అమృత హస్తంతో నన్ను చైతన్యవంతుడిని చెయ్యగలదు. అటువంటి వాసంతికోసం నేను ఏం చేసినా  ఋణ విముక్తుణ్ణి కాలేను. ఇప్పుడు చెప్పు సుధా! ఏది బంధం? ఏది భాద్యత?” అన్నాడు శ్రీరాం.
మధ్యలో అతన్ని ఆపకుండా అంతా విన్నది సుధారాణి. అతనూ, వాసంతి, పిల్లలు. అది ఒక కుటుంబం. ఆ కుటుంబం నుండి తను విడిపోయి ఏకాకిలా కనిపిస్తోంది. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఏం చెయ్యాలన్నా తోచటం లేదు. కవితలైతే అల్లగలదు కానీ, ఆర్థికంగా తను అశక్తురాలు. తను పడే శ్రమకి పొగడ్తలు తప్ప డబ్బులు  రావు. ఇంత కాలం డబ్బుతో అవసరం రాకుండానే బ్రతకగలిగింది. ఇప్పుడు వాసంతి దగ్గరకెళ్లి కేవలం పని కోసమే బ్రతకాలంటే మనసెందుకో అంగీకరించటo లేదు.
“ఏమిటో ఆలోచిస్తున్నావు. ముందు అన్నం తిను.”అన్నాడు.
“వద్దండి! ఇంతకాలం మీరు చూపిన అభిమానమే నేను మోయలేనంతగా బరువు పెరిగిపోయింది. ఇక మీరు తెచ్చిపెడుతున్న ఈ అన్నం తిన్నా అరగదు” అంది.
“పరిస్థితి చెప్పాను. నువ్వంటే నాకు అసహ్యం లేదు కాబట్టి, జీవితంలో నిన్నెప్పుడూ  కాదనను. కానీ... నువ్వు మాలో ఒకదానిగా సర్దుకుపోవాలి ” అన్నాడు.
“పదే పదే మీరలా అనకండి. మీరన్నట్లుగా సర్దుకుపోవడానికి నేనoత వ్యక్తిత్వం లేని మనిషిని కాను” అంది.
అతను మాట్లాడలేదు. లేచి ఇంటి కెళ్ళాడు.
ఆలోచిస్తూ ఆ రాత్రంతా అలాగే కూర్చుంది.
శ్రీరాంతో చట్టపరమైన హక్కులకోసం ఆమె పోరాడదలచుకోలేదు. అలా పోరాడి అతని కష్టం ఉచితంగా తినదలచుకోలేదు. అదామెకు నచ్చని పని. రోజూ వచ్చేలంచ్ బాక్సని వద్దని చెప్పింది. ఇంటి బాడుగు కూడా తనే కట్టుకుంటానని తెగేసి చెప్పిoది. ఇప్పుడు శ్రీరాం ఆదరణ పూర్తిగా ఆగిపోయింది.
అలా అని ఆమె భయపడలేదు. హాస్టల్ వసతి దొరకని ఇద్దరమ్మాయిల్ని తన రూంలోనే ఉండమంది. వాళ్ళిద్దరికే కాక, మరో ఎనిమిది మంది అమ్మాయిలకి చదువు చెబుతుంది. ఆర్థికంగా కాస్త సర్దుకొని తనని తను పోషించుకోగలుగుతుంది.
కాలేజీలకి సెలవు లిచ్చారు. అమ్మాయిలంతా ఎవరి ఊళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. సుధారాణి ఒంటరిగా ఉంటోంది.
నాలుగు రోజుల నుండి సుధారాణికి ఒంట్లో బావుండలేదు. విషయం తెలిసిన శ్రీనివాస్ గారు వచ్చారు.
ఆయన్ని చూడగానే ఆమె కనులు చెమర్చాయి. నీరసంగా కదిలి, నెమ్మదిగా లేచి దిండును ఆసరాగా చేసుకొని కూర్చుంది సుధారాణి.
“అప్పటికీ – ఇప్పటికీ నువ్వు చాలా మారిపోయావు సుధా! నువ్వింత అనారోగ్యంతో బాధ పడుతుంటే నీ దగ్గరికి రాకుండా ఆ శ్రీరాం ఎలా ఉండగలిగాడు? మీ ఇద్దరి మధ్య ఇంతటి భేదాభిప్రాయాలు ఎప్పుడొచ్చాయి?” అడిగారు.
మాట్లాడలేదు సుధారాణి. ఆమెనలా చూస్తుంటే ఆయన మనసంతా ఎవరో పిండినట్లైoది. మనిషిని, మనిషిని కట్టి పడేసే మమకార సూత్రం వ్యాపార దృక్పధానికి గురై ఆమెను ఒంటరిదాన్ని చెయ్యటం ఆయన గ్రహించారు. ఆమెలోని అభిమానానికి ముగ్ధుడయ్యాడు. శ్రీరాం గురించి ఆమెను ప్రశ్నిoచదలచుకోలేదు.
“ఏంటి సర్ అలోచిస్తున్నారు?”. అడిగింది సుధారాణి.
ఆయన వెంటనే ‘’ ఏం లేదమ్మా! నీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ ఏమయ్యాయి?’’అంటూ చుట్టూ చూసాడు.
‘’అవన్నీ నేను చదివేసాను సర్! ఇంకా ఎందుకు నా దగ్గర? లైబ్రరీకి డొనేట్ చేస్తే అందరూ చదువు కుంటారని లైబ్రరీకి ఇచ్చేసాను. నాకేమైనా చదవాలనిపించినప్పుడు ఇదిగో ఈ లాప్ టాప్ కొన్నాను. ఇంటికి వై ఫై వుంది. నెట్ లో సర్చ్ చేస్తే ఏ పుస్తకమైనా దొరుకుతుంది. చదువుకుంటాను’’ అంది.
‘’నీ మాటలు వింటుంటే చాలా తృప్తిగా వున్నట్లు అనిపిస్తున్నావు సుధా!’’అన్నారు శ్రీనివాస్ గారు. 
“ కావచ్చు సర్! కానీ ఒకరకంగా ఆలోచిస్తే ఇప్పుడు నేనున్న యీస్థితి నాకు కూడా కరెక్ట్ కాదనే అనిపిస్తుంది. కాని ఏం చేయను  ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఏ పని చేస్తున్నా నాకు కవిత్వమే కనిపిస్తుంది. ఏది చూసినా, ఏది విన్నా దాన్ని నా కవితల ద్వారా వ్యక్తం చేయాలనిపిస్తుంది. ఈ క్రమంలోనే  నేను నా కుటుంబానికి ఏమి చేయాలో, ఏమి చేయకూడదో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాను. దీన్ని ధ్యేయం అంటారో, లక్ష్యం అంటారో, అసలు ఏదీకాదంటారో నాకు తెలియదు.
కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే..! నేనేమి వ్రాయాలనుకుంటానో అది వ్రాయాలి. అది రాసేంత వరకు నాకు ఏది అడ్డు కాకూడదనుకుంటాను. అలా అనుకోవటం వల్లనే కావొచ్చు నేను శ్రీరాంకు దూరమయ్యాను. 
దూరమయ్యాక నా స్థానంలోకి వాసంతి వచ్చింది. ఇప్పుడు వాసంతి ఎంత భద్రత, ఎంత సౌకర్యం అనుభవిస్తుందో నాకు తెలుసు – అది నేను కావాలనుకునివుంటే ....!!’’
‘’సాహిత్య పరంగా నువ్వింత గొప్ప స్థానంలో వుండేదానివి కాదు. నిన్ను నీవు ఇంతగా గౌరవించుకునే దానివి కాదు. ఎందుకంటే కొన్ని లక్ష్యాలు, ధ్యేయాలు చూడటానికి చిన్నవిగా అనిపించినా వాటికి అంకితమైపోయిన నీలాంటి వారికి అనంతంగా, అద్బుతంగా అనిపిస్తాయి, ఇప్పుడు నీవున్న స్థితి అదే. బహుశా నాలాంటి వాళ్ళు నీ చుట్టూ ఉండొచ్చు , ఉండక పోవచ్చు నిన్ను నీవు ప్రేమించుకుంటూ, అభిమానించుకుంటూ ఉన్నంత సేపు నీకు ఎవరి ఆదరణ అండ దండలు అవసరం లేదు” అన్నారు.
ఆమె ఆలోచనగా ఎటో చూడసాగింది.
అది ఆయన గమనించలేదు. ఆయన దోరణిలో ఆయన మాట్లాడసాగారు. “చూడమ్మా సుధా! మొన్ననే ఎఫ్ ఎం రేడియోలో నీ స్వీయ కవితను విన్నాను. టివి లో కూడా నువ్వు నీ కవితలు చదువుతూ కనిపించావు. నాకు చాలా సంతోషమనిపించింది.ముఖ్యంగా నీకో విషయం చెప్పాలని వచ్చాను’’ 
‘’ ఏమిటి సర్?’’
‘’ ఆచార్య ఎస్వీసత్యనారాయణ గారు నీకు తెలుసు కదా?’’
‘’ తెలుసు సర్! నా మొట్టమొదటి కవితాసంపుటికి ముందు మాట రాశారు’’ 
‘’ ఆయన మా కాలేజిలో కలిసినప్పుడు నీ కవితల గురించి ఏమన్నారో తెలుసా?’’
‘’ ఏమన్నారు సర్?’’ 
‘’నీ కవితలకో లక్ష్యం వుందట. గమ్యం వుందట. ఆ గమ్యం వైపు ప్రజల్ని నడిపించాలన్న తపన వుందట. భాషలోను, భావనా పటిమలోను,సామాజిక సమస్యల చిత్రణలోను నీకంటూ ఒక ప్రత్యేకత వున్నదట..ఇంతకన్నా ఏం కావాలి? ఒక కవయిత్రిగా నువ్వు అనుకున్నది సాధించావు. ఇక పై నీ అభిమానులు, సాహితీ ప్రియులు, సాహితీవేత్తలు, సాహితీ సమాఖ్యలే నీకు బంధువులనుకో. నీ కోసం నీ చుట్టూ నువ్వు నిర్మించుకున్న ఈ సాహితీ ప్రపంచం నిన్నెప్పుడు ఒంటరిదాన్ని చెయ్యదు” అన్నారు శ్రీనివాస్ గారు.
నవ్వింది సుధారాణి. జీవం లేని ఆ నవ్వు శ్రీనివాస్ గారిని కలవర పెట్టింది.
“ఏమిటమ్మా! సుధా! అలా నవ్వావు? నీ నవ్వు చూస్తుంటే అనారోగ్యం కన్నా మనో వేదనే నీలో ఎక్కువగా ఉన్నట్లుంది. అసలేం జరిగింది?” అన్నారు. ఆమెనే పరిసీలనగాచూసారు.
“సర్! నాకు తెలిసిన ఈ సాహితీ ప్రపంచం నన్ను చూడటం మానేసిoది. నా గతాన్ని నా ముందు నిలిపి భవిష్యత్తoటే నాకు భయం కలిగేలా చేస్తోంది. నా గతం నాకు తెలిసిందే అయినా ఎందుకో నా మనసును నిర్దాక్షిన్యాయంగా పిండుతోంది’’ అంది.
‘’అదేంటమ్మా అలా అంటున్నావ్?’’ అన్నారు. 
‘’ఆ మధ్యన ఒక కధా రచయిత్రి దగ్గరికి వెళ్ళాను సర్! ఎప్పటిలాగే చాలా ఆప్యాయతాభిమానాలు చూపింది. చివర్లో ఏమన్నదో తెలుసా సర్! తను రాయబోయే కధకి నా కధను ఇతివృత్తంగా తీసుకుంటానని చెప్పింది. తను స్పందించి రాయటానికి నా కధే దొరికిందా? నా బ్రతుకు ఒక కధలా కనిపించిందా? చెప్పండి సర్ !” అంది బాధగా.
బాధగా చూసారు శ్రీనివాస్ గారు.
‘కవిత్వమే ఊపిరిగా భావించిన మహామహులున్నారు. కానీ, కవిత్వమే జీవితంగా భావించటమే నువ్వు చేసిన తప్పమ్మా!’ అని అనాలనుకున్నాడు. కానీ పైకి అంటే తనని కూడా ఆమె శత్రు వర్గం క్రింద లెక్క కడుతుందని భయపడ్డాడు.
“సర్! ఇన్ని రోజులు నేను సంసారపక్షంగా లేనని, గొడ్రాలినని పక్కింటి ఇల్లాళ్ళoతా నన్ను శల్య పరీక్షలు చేసి కుళ్ళ పొడిచినా నేను బాధ పడలేదు. నాకూ, మా వారికీ మధ్య వచ్చిన వాసంతి గురించి ఒక పత్రిక విలేఖరి ఎంత విసిగించినా నేను దిగులు పడలేదు. కానీ నా సాహితీ మిత్రులే నన్నిలా నిందిస్తుంటే, కించపరుస్తుంటే తల బాదుకొని చావాలనిపిస్తోంది. నా అన్వేషణలో చివరకు నాకు మిగిలింది ఇదా? అని నా మనసు ఘోష పెడుతుంటే నేను నేనుగా నిలబడలేకపోతున్నాను. 
ఏకాకిలా ఎవరికీ చెందని వ్యక్తిలా జీవించటం దుర్బరంగా ఉంది. మృగాలు పెట్టేబాధ ఎలా వుంటుందో తెలియదు కానీ అంతకన్నా ఎక్కువగా వుంది సర్ మనుషులు పెట్టే బాధ...” అంది సుధారాణి. ఆమె  పైకి గంభీరంగా ఉన్నా లోలోన మానసిక సంఘర్షణ బాగానే అనుభవిస్తున్నట్లు అనిపించింది శ్రీనివాస్ గారికి.
“ కొంతమంది అలాగే వుంటారు సుధా! ఎప్పుడైనా మనుషులు కొన్ని బంధాలకి కట్టుబడి ఉన్నప్పుడు ఆ బంధాల చుట్టూ తప్పనిసరిగా ప్రేమ కవచాన్ని కప్పుకొని ఒక పరిధిలో ఇమిడిపోయి బ్రతుకుతుంటారు. అంతమాత్రాన వాళ్ళంతా నిజమైనా ప్రేమాభిమానాలను పొందుతూ జీవిస్తున్నారని అనుకుంటున్నావా? నేను అనుభవజ్ఞున్ని తల్లీ! నువ్వేం బాధ పడకు. నేను చూసిన కొన్ని కుటుంబాల్లో తొంబై శాతం కల్తి ప్రేమల్ని నంజుకు తినే యాంత్రిక కుటుంబాలే. అలాంటప్పుడు అసలు తోడంటే అర్థం ఏమిటి? నిజానికి ఎవరు ఎవరికి తోడు?” అంటున్న శ్రీనివాస్ గారి వైపు శ్రద్దగాచూసింది.
“ఈ సమాజం మనం పరిగేత్తితే వెంటబడి తరిమే వీధి కుక్క. కుక్కలకి ప్రాధాన్యత ఇస్తారటమ్మా ఎవరైనా? అలా ఇచ్చి ఉంటే ఈ రోజు నేనిలా సజీవంగా నీ ముందుండే వాడినే కాదు” అన్నాడు.
“ఏమిటి సర్! మీరంటున్నది?” ఆశ్చర్యపోతూ అడిగింది.
“అవునమ్మా! సుధా! ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు. అంతమాత్రాన నేను పిచ్చివాడి నయ్యానా? నేను కట్టుకున్న భార్య ఏడాది తిరక్కుండానే మరణించింది. అంత మాత్రాన గుండె బాదుకొని ఏడ్చానా? బ్రతుకుపై ఆశతో మళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఆమె కూడా ఒక్క నెల మాత్రమే నా దగ్గరుండి ఆ తర్వాత ..... లేదు. అర్ధం చేసుకో. ఎవరి జీవితంలో ఏ సుడిగుండాలు వున్నాయో ఎవరకి తెలుసు. చావు తప్పనిసరైనప్పుడు నవ్వుతూ చావాలని ఒక కవి అన్నట్లు మనిషి ఎప్పుడు కూడా నిరాశతో జీవితాన్ని నిస్సారం చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు, ఎక్కడి కక్కడ తనని తను గుర్తించుకుంటూ, తన కోసం తను సాగిపోతుండాలి. ఇది నేను పాటించే ప్రధమ సూత్రం. అనుసరించే సిద్ధాంతం” అన్నాడు దృఢoగా.
ఒక శక్తివంతమైన హస్తం ఆమె తలను నిమిరి, జారిపోతున్న గుండెలోకి ధైర్యాన్ని కుమ్మరించినట్లు అనుభూతి చెందింది సుధారాణి.
‘’మనం బాగుండాలి. మన భావాలు బాగుండాలి అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళకి మనం దగ్గరగా వుండాలి. ఇష్ట పడని వాళ్ళని దూరంగా పెట్టాలి. ఆత్మద్రోహం మంచి కాదు’’ అన్నారు.
ఆయన మాటలు నిజమే అనిపించాయి.
‘’కళ్ళు తుడుచుకో తల్లీ!’’అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు.
ఆయన వెళ్ళిపోయాక చాలా సేపు ఆలోచిస్తూ కూర్చుంది సుధారాణి.
ఇప్పుడామె కళ్ళు తడితో ముకుళించుకుపోలేదు. ధైర్యంతో, చైతన్యంతో మెరుస్తున్నాయి.
******* 

1 comment:

  1. kadha poorti cheyyagane gundelonchi okapedda nitoorpu .ee samasyaippatidikadu ,abhiruchi, asayama, leka samsaria jivitama anna prasna stree jivitamlo o saval rendoo o chota imadavu denikosam edi vodulukunna chivaridasalo vedana tappadu edi vodalali

    ReplyDelete

Pages