ప్రేమతో నీ ఋషి – 25 - అచ్చంగా తెలుగు
 ప్రేమతో నీ ఋషి – 25
-      యనమండ్ర శ్రీనివాస్

( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ కంపెనీ వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తుండగా,  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. హోటల్ లో అసలు విశ్వామిత్ర పెయింటింగ్ చూసిన  స్నిగ్ధ షాక్ కు గురయ్యి, ఋషితో కలిసి మహేంద్రతో ఆ విషయం చెప్తుంది. మూడో కంటికి తెలియకుండా ఈ విషయంలో దోషులు ఎవరో కనుక్కోమంటాడు మహేంద్ర. స్నిగ్ధ ఋషితో ఫోనులో చెప్పిన అడ్రస్ ప్రకారం, ఇటలీ లోని మిలాన్ కు వెళ్లి, ఆ పెయింటింగ్ అమ్మిన వ్యక్తిని కలుస్తాడు ఋషి.  ఇక చదవండి...)

“రాయల్ కార్రిబెన్ ఓడ తిరిగి యు.ఎస్ కు వచ్చేనెల ఒకటో తీరీఖున బయలుదేరుతుంది. ఈ ప్రయాణంలో మేము ఆసియా దేశాలకు చెందిన పెయింటింగ్స్ ను పెద్ద ఎత్తున వేలం వెయ్యనున్నాము.” ఆఫీస్ అటెండెంట్ ఋషికి చెప్పాడు.
ఋషి స్పార్క్ ఈస్ట్ గేలరీ ఆఫీస్ లో ఉన్నాడు. వీరు మిలాన్ నగరంలోని అతి పెద్ద ఆర్ట్ ఆక్షన్ డీలర్స్ లో ఓనరు. స్పార్క్ ఈస్ట్ గేలరీ కి, రాయల్ కార్రిబెన్ వారి నౌకలో ఆర్ట్ ఎక్సిబిషన్ లు నిర్వహించుకునే విధంగా వారితో సంబంధాలు ఉన్నాయి. వారి ఆఫీస్ కు చేరే ముందే ఋషి ఆ నౌకల్లో ఎటువంటి వేలాలు నిర్వహిస్తారు అనే దాని గురించి సమాచారం సేకరించుకుని వచ్చాడు. మామూలుగా అంతా ,ఒక విలాసవంతమైన నౌకలో పైకప్పు మీద ఎండలో విశ్రాంతి తీసుకుంటూ, తర్వాత ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ చేసేందుకు చాలా ఉంటాయి, కాసినోలు, స్విమ్మింగ్ పూల్ లో స్నానం, షాపింగ్, జిం, పెడిక్యూర్ , బింగో, ఆర్ట్ వేలాలలో పాల్గొనడం వంటి కార్యక్రమాల్లో దేన్ని ఎంచుకోవాలా అని వారు ఆలోచిస్తూ ఉంటారు.
కాని నౌకల్లో జరిగే ఆర్ట్ వేలాలు, మామూలు వాటికి విభిన్నంగా ఉంటాయి. వారు అనేక రకాల కాగితాలపై తీసిన ప్రింట్ అవుట్ లమీద దృష్టి పెడతారు. దాదాపు ఒక దశాబ్దం పైనుంచి క్రుయిస్ నౌకల్లో ఈ ఆర్ట్ వేలాలు అనేవి గొప్ప కాలక్షేపంగా పేరొందాయి. వీటిలో పికాసో, డాలి వంటి ప్రముఖ ఆర్టిస్ట్ ల పెయింటింగ్స్ నుంచి,, ఇప్పుడిప్పుడే పైకొస్తున్న చిన్న ఆర్టిస్ట్ ల పెయింటింగ్స్ వరకు అన్నింటినీ వేలం వేస్తారు. ఒక పండుగ వాతావరణం తో సందడిగా ఉండే ఆ వేలాలు చాలా ఉత్సాహభరితంగా ఉంటాయి.
ఈ ఆర్ట్ వేలాలన్నీ క్రూయిస్ పరిసరాల్లో నిర్వహించేందుకు, క్రూయిస్ తో కాంట్రాక్టు తీసుకునే ఆర్ట్ డీలర్ల నేతృత్వంలో కాని, ఆర్ట్ సేకరణలు చేసేవారి నేతృత్వంలో కాని నడుస్తాయి. అలా రాయల్ కారిబన్ కు స్పార్క్ ఈస్ట్ గాలరీ తో కాంట్రాక్టు ఉంది. స్పార్క్ ఈస్ట్ గాలరీ అనేది 1979 లో స్థాపించిన ఇటాలియన్ కంపెనీ. వీరు యూరోప్ లోనే అతి పెద్ద ఆర్ట్ డీలర్లు. సముద్రంపై కార్యకలాపాలు మాత్రమే కాక, స్పార్క్ ఈస్ట్ యూరోప్ లోని పెద్ద హోటల్స్ లో వేలాలు నిర్వహిస్తూ, దీనికోసం ఎప్పటికప్పుడు తాజా కేటలాగ్ ను, ఇంటర్నెట్ లో అమ్మకాల వ్యాపారాల్ని కూడా నిర్వహిస్తూ ఉంటుంది.
స్పార్క్ ఈస్ట్ గాలరీ క్రూయిస్ లో నిర్వహించే వేలాలకు గాను, వారికి కొంత ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. ఈ కాంట్రాక్టు సంగతి పక్కన పెడితే, క్రూయిస్ లో జరిగే ఆర్ట్ వేలాలకు సంబంధించిన ప్రామాణ్యత విషయంలో క్రూయిస్ ఎటువంటి బాధ్యతా వహించదు.
“మీరిచ్చిన సమాచారానికి కృతఙ్ఞతలు. కాని, ఈ వేలాలకు సంబంధించిన వ్యక్తిని నేను కలవాలని అనుకుంటున్నాను. నేనొక కంప్లైంట్ ఇవ్వాలి!” ఋషి అక్కడి అటెండెంట్ తో హెచ్చు స్వరంలో చెప్పాడు.
అతను ఋషి వంక చూసి, “అక్కడ ఉన్న కౌంటర్లో కూర్చున్న ఇంచార్జిని సంప్రదించండి. ఆమె అటువంటి కార్యకలాపాలను చూస్తుంది.” అని చెప్పాడు.
ఆ మూల కూర్చుని, బిజీగా నోట్స్ తయారుచేస్తున్న ఒకామెను ఋషి చూసాడు. ఆమె స్టైల్ గా, అందంగా, పొడుగ్గా ఉంది, మగవారు తన ముందు నోరు తెరుచుకు నిలబడిపోయి, చొంగ కార్చుకునేలా డ్రెస్ చేసుకుంది.
తనకు ఇటాలియన్ స్త్రీల గురించి చెప్పిన డ్రైవర్ ఋషికి గుర్తొచ్చాడు. సహజంగానే, ఇటాలియన్ స్త్రీలు చాలా అందమైనవారు, మామూలు స్త్రీలకంటే కాస్త పైస్థాయిలో చేర్చదగినవారు.అతను ఆమె వద్దకు వెళ్తూ, టాక్సీ డ్రైవర్ ఉదయం చెప్పిన సలహాలన్నీ గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా ఎవరైనా పురుషుడు చక్కగా కనిపిస్తూ, మర్యాదగా వ్యవహరిస్తే, అందంగా ఉండే ఇటాలియన్ యువతులు వారిపట్ల ఆకర్షితులౌతారన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. వారికి బెరుగ్గా, అణకువగా మాట్లాడే వారు నచ్చరని, ఒకవేళ ఒక పురుషుడు దర్పంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతూ అదే సమయంలో స్త్రీలపట్ల గౌరవంగా వ్యవహరిస్తే, చాలా మంది ఇటాలియన్ యువతుల మనసు దోచుకోగాలడని, డ్రైవర్ చెప్పిన విషయాలు గుర్తుచేసుకున్నాడు.
“హలో, మిస్ ఐడా, బాగున్నారా? మీతో ఒక నిముషం మాట్లాడచ్చా?”అక్కడున్న నేమ్ ప్లేట్ లో చూసిన ఆమె పేరుతో పలకరిస్తూ అన్నాడు ఋషి.
“తప్పకుండా, కూర్చోండి,” ఐడా నవ్వుతూ బదులిచ్చి, ఋషిని కూర్చోమని సైగ చేసింది. వేలానికి సంబంధించిన కొటేషన్స్, డెలివరీ షీట్స్ తో నిండిపోయి ఉంది ఆమె డెస్క్.
“చూడండి, మిస్ ఐడా, నాకొక సమాచారం కావాలి. రెండు నెలల క్రితం యు.ఎస్ కు వెళ్ళిన క్రూయిస్ లో జరిగిన అమ్మకానికి సంబంధించి, నేనొక కంప్లైంట్ ఇవ్వాలి. దయుంచి మీరు నాకు సాయం చెయ్యగలరా?” ఆమె దృష్టిని ఆకర్షించేందుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని నటిస్తూ అన్నాడు ఋషి. వారికి సంబంధించిన ఆంతరంగిక సమాచారాన్ని తాను తెలుసుకోవాలని చూస్తున్నానని వారికి తెలిస్తే, వారు తనను బయటికి తోసేస్తారని ఋషికి బాగా తెలుసు.
ఐడా ఋషినే చూడసాగింది. ఋషి ఇండియన్ కనుక చూసేందుకు కాస్త వేరే స్టైల్ లో కనిపించాడు ఆమెకు. ఒక ఇటాలియన్ యువతితో మాట్లాడేటప్పుడు, వారు తన డ్రెస్ ను బాగా గమనించి అంచనా వేస్తారని అతనికి బాగా తెలుసు. అందుకే ఇటాలియన్ యువకులు తాజా ఫాషన్ లను గమనిస్తూ హుందాగా తయారై తిరుగుతారు. వాళ్ళతో పోటీ పడాలంటే ఎవరైనా ఇదే పాటించాలి. వేసుకునే బట్టలకు సంబంధించినంతవరకు, “ఏదో మామూలుగా తయారవడం” అనేది ఇటలీ లో పనికిరాదు.
“ఓహ్, తప్పకుండా, నాకా వివరాలు అందించగలరా?” ఋషి వైపు కవ్విస్తూ వంగి, అంది ఐడా.
టాక్సీ గురువు మాటలు ఋషి మనసులో మళ్ళీ మెదులుతున్నాయి – తాము చాలా అందంగా ఉంటామని, ఇటాలియన్ యువతులకు తెలుసు. కొన్ని యుగాల నుంచి వారిని అందరూ పొగుడుతూ ఉండడంతో,  వారికి తాము ఇతర దేశాల స్త్రీలకంటే చాలా అందంగా ఉంటామని, ఎవరైనా తమను నోరు తెరుచుకు చూస్తూ ఉండిపోవాల్సిందేనని, వారికి తెలుసు. మీ చుట్టూ ఉన్నవారంతా మీ అందాన్ని పొగుడుతూ ఉన్నప్పుడు, కాస్త ఆహంకరించడం సహజం. అందుకే ఇటాలియన్ యువతులను ఇంప్రెస్స్ చెయ్యడం కష్టం.
“ఆ ఓడలో ప్రయాణించిన ప్రయాణికుడి పేరు మిష్టర్ బెనెడిట్టో, అతను గతసారి యు.ఎస్. కు వెళ్ళిన ఓడలో ప్రయాణించాడు. ఆయన కొన్న పెయింటింగ్ ప్రద్యుమ్న అనే చిత్రకారుడు వేసిన విశ్వామిత్ర పెయింటింగ్. నేను అతని రిలేషన్షిప్ మేనేజర్ ని. కంప్లైంట్ ఇచ్చేందుకు మరేం వివరాలు కావాలో చెప్తారా?” తన విశ్వాసం స్థాయి తగ్గకుండా చూసుకుంటూ అన్నాడు ఋషి.
ఐడా మిష్టర్ బెనెడిట్టో విసిటింగ్ కార్డు వంక చూసి, తన కంప్యూటర్ లో వివరాలు వెతకసాగింది. కొద్ది క్షణాల తర్వాత, ఆమె కావలసినవి దొరికిన సూచనగా తలూపుతూ, ఋషి వంక చూసి ఇలా అంది, “ మిష్టర్ ఋషి, మిష్టర్ బెనెడిట్టో కు అమ్మిన పెయింటింగ్ కు ఎటువంటి షరతులూ వర్తించవు. వేలంలో ఆయనకు పోటీగా దానికోసం పాడిన వారు కూడా లేరు. సముద్రంపై జరిగే వేలాలకు ఎటువంటి చట్టాలూ వర్తించవని కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి, నన్ను క్షమించండి, నేను మీ కంప్లైంట్ ను తీసుకోలేను,” అందామె ధృడంగా, మర్యాదగా.
ఋషి ఈ స్పందనను ముందే ఊహించాడు. ఇందుకే క్రూయిస్ లో జరిగిన అమ్మకాలపై చాలా వెబ్సైటు లలో కంప్లైంట్స్ ఉన్నాయి. ప్రయాణీకులు అనుకోకుండా ఈ ఆర్ట్ వేలాల వలలో పడిపోతారు. తాము కొన్నదే అసలైన పెయింటింగ్ అన్న భ్రమలో తాత్కాలిక ఆనందాన్ని పొందుతారు. తర్వాత ఆ నకిలీ పెయింటింగ్ ను ఇంటర్నెట్ లో దొరికే ధర కంటే తాము ఐదారు రెట్లు అధిక రుసుము చెల్లించి మరీ కొన్నామని తెలుసుకుని, దిగులుపడిపోతారు. కాని, వారు ఈ సంగతి తెలుసుకునే లోపల వారు పెయింటింగ్ కొనుక్కున్న చోటు నుంచి చాలా దూరం వెళ్ళిపోతారు. జరిగిన నష్టమే కాక మరింత డబ్బును, సమయాన్ని వెచ్చించే ఓపిక వారికిక ఉండదు.
“మిష్టర్ ఋషి, మిష్టర్ బెనెడిట్టో నిజానికి చాలా అదృష్టవంతులు. ఇది చాలా అరుదైన పెయింటింగ్ యొక్క ‘గిల్సీ’ పీస్. అంత గొప్ప చిత్రకారుడు ప్రద్యుమ్న నకిలీ పెయింటింగ్ ను పొందాకా ఇంకా దిగులెందుకు?”
“ ‘గిల్సీ’ ? “ అన్నాడు ఋషి అప్రయత్నంగా ! అతనికి ఆ పదం అర్ధం కాలేదు.
“అవును, ఇదొక జీ-క్లే పోర్ట్రైట్, దాన్నే ఆయన కొనుక్కున్నారు,” ఆ పదాన్ని ఎలా పలకాలో ఋషికి తెలిసేలా ఒత్తి పలుకుతూ అంది ఐడా.
“ ‘గిల్సీ’ పెయింటింగ్ ను అంతా నకిలీ పెయింటింగ్ గా భావిస్తారు. నిజానికి అలా కాదు. ఇది ప్రింట్ మేకింగ్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో తెలియజేస్తుంది. హై రిసల్యూషన్ డిజిటల్ స్కానింగ్ ద్వారా పెయింటింగ్ లో వాడిన రంగుల లాంటి ఇంకులను ఎంపిక చేసి, అద్భుతమైన క్వాలిటీ తో అసలు పెయింటింగ్ లాంటి బొమ్మలను సృష్టిస్తారు. వీటినే కాన్వాస్ పై ముద్రిస్తారు. వేరే రకంగా సృష్టించే నకిలీ పెయింటింగ్ ల కంటే, గిల్సీ పెయింటింగ్ ల రంగుల మేళవింపు అద్భుతంగా ఉంటుంది.” ఐడా ఓపిగ్గా గిల్సీ పెయింటింగ్స్ కు సంబంధించిన వివరాలను ఋషికి తెలియ చేసింది.
(సశేషం...)
  



  

No comments:

Post a Comment

Pages