నివాస వృక్షస్సాధూనాం - అచ్చంగా తెలుగు

నివాస వృక్షస్సాధూనాం

Share This
నివాస వృక్షస్సాధూనాం
అయ్యగారి నాగేంద్ర కుమార్

శాస్త్రికి రాముడితో ఎంతో అనుబంధం చిన్నప్పట్నుంచీ, ఏ కష్టమొచ్చినా సుఖమొచ్చినా రాముడితో చెప్పుకోవడం, రాముడితో గడపడం అలవాటు.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఏమీ తొణకకుండా గంభీరంగా నిల్చున్నరాముడి నీడలో, తన వీపుని రామునికి ఆనించి కూర్చున్న శాస్త్రి అంతే గంభీరంగా ప్రసన్నంగా కూర్చుని ఉన్నాడు. రాముడు మాత్రం శాస్త్రితో ఏదో మాట్లాడాలని కాబోలు గల గలా ఏదో అంటున్నాడు, శాస్త్రి మాట పెదవులుదాటట్లేదు, మౌనం కన్నా గొప్ప భాష ఏముంది గనక.
****
అది 1970వ దశకం, పట్నం అవతల కొండమీద ఓ చిన్న ఊరు, కొండచివర్నుంచి చూస్తే దూరంగా పట్నం కనిపిస్తూంటుంది. పేరుకు ఊరేగానీ, సగం మందికి పైగా జనం ఆ పట్నంలో పనికెళ్ళేవాళ్ళే. ఆ ఊరికి ఎక్కడినుంచో ఓభార్య- భర్త వాళ్ళ కొడుకు ఉన్న చిన్న కుటుంబం వలస వచ్చింది. ఆయన పేరు మూర్తి గారని మృధు స్వభావి, ఆయనకి తగ్గ భార్య. గోదారొడ్డున ఏదో అగ్రహారంలో పెద్ద పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఏదో రాజకీయ సంస్కరణలపుణ్యమాని, అప్పటికి ఉద్యోగం సంపాదించి పెట్టే ఓ మోస్తరు మధ్యతరగతి పెద్ద చదువు మెట్రిక్ పీయూసీలు చదివినా సర్కారు నౌకరీ దొరకలేదు. మూర్తి గారి నాన్నగారు సర్కారు నౌకరీయే చేసినా, పెద్ద కుటుంబం వలన ఏంమిగలలేదు, మధ్యతరగతి ఆత్మాభిమానం అడ్డొచ్చి కొడుక్కి సర్కారు నౌకరీ వేయించే అవకాశమున్నా ఇంకొకరిని అడిగాలని వేయించలేదు. మూడు తరాలకు పైగా వైదికం వదిలేసి రాజోద్యోగంలోనే ఉన్నారు. మూర్తి గారు తిరిగివెనక్కి వెళ్ళే పరిస్థితీ లేదు. ఉద్యోగం రాలేదు కానీ, పెళ్ళివయసొచ్చింది పెళ్ళీ జరిగింది. దగ్గర ఊర్లలో చిన్నా చితకా ఉద్యోగాలు చేసేవారు మూర్తి గారు. ఎక్కడికెళ్ళినా ఏటి పంతులుగారూ, ఈ టాకీసులో మీరు చేయగలరా అనో,కూలీల్తో మీరెక్కడ పడగలరండీ అనో ఉద్యోగం కోసం మొహం చాటేసేవారే. సాధారణంగా కొద్దో గొప్పో చదువుకున్నవారు సంపాదించే బడిపంతులు నౌకరీకీ రికమెండేషన్ అవసరాలొచ్చాయి, మరి కొత్త రాజకీయ సంస్కరణలు బాగాచదివినంత మాత్రాన ఉద్యోగం సంపాదించలేని స్థితిని తీసుకొచ్చాయి, చిన్నా చితకా వ్యాపర సంస్థలలో ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులయ్యాయి.
చిన్నతరహా పారిశ్రామిక పెట్టుబడులు ఊపందుకోవడం మొదలయ్యిన కొత్తలవి, ఆ పట్నం శివారుల్లో కొత్తగా పెట్టిన పరిశ్రమలో ఉద్యోగం. మొదట్లో వారానికి జీతం రూ.15/-, కొన్ని నెలలయ్యాక నెలజీతం ఇవ్వడం మొదలైంది.పట్ణంలో ఇల్లు అద్దె ఎక్కువ కాబట్టి, దగ్గర్లో ఉన్న ఈ ఊళ్లో ఉంటే తెల్లవారుతూనే ఉద్యోగానికెళ్ళి సంద్యవేళకొచ్చేసేవారు మూర్తిగారు. భర్త చాటు భార్య లక్ష్మిగారు. అదిగో వాళ్ళబ్బాయే శాస్త్రి . దబ్బపండులా ఉంటాడు. చుట్టూఅందరిపిల్లలోకీ కాస్త ఆరోగ్యంగా, దిట్టంగా కనపడేవాడు. ఒక్కడే కొడుకవ్వడం మూలాన తోడు ఎవరూ లేని కారణాన లక్ష్మిగారు శాస్త్రిని ఓ పట్టాన బయటికి పంపేది కాదు. స్కూల్ కెళ్లడం ఇంటికి రావడం ఇంటి గుమ్మం దగ్గరే సావిట్లోపక్కింటి పిల్లల్తో ఆడుకోవడం. ఇల్లు అద్దెకిచ్చినవారూ తగ్గట్టుగానే మంచి వారు దొరికారు. చేదోడు వాదోడుగా ఉండేవారు. వాళ్ళ పిల్లలూ ఊళ్ళో పిలల్లూ కలిసి ఓ పాతిక మంది ఉండేవారు. అందరిలోనూ చదువులో శాస్త్రి ఫస్ట్వచ్చేవాడు. కానీ ఆటలు అవీ ఆడి గెలిచేవాడు కాదు లడ్డూలా ఉండేవాడు కదా. చుట్టుపక్క పిల్లలూ, ఇల్లద్దెకిచ్చినవారి పిల్లలూ గేలి చేసినా, లక్ష్మమ్మగారు వాళ్ళనేమీ అనేవారు కాదు. ఆవిడకి తెలుసు వాళ్ళకి కోపమొచ్చినా నష్టంతమకే అని. ఇల్లు ఖాళీ చేయమంటే చాలీ చాలని జీతాలతో ఊరుకాని ఊర్లో బ్రతకడం పిల్లాణ్ణి చదివించి యోగ్యుణ్ణి చేయడం తరం కాదని. ఒక్కోసారి ఉక్రోశమొచ్చి శాస్త్రికే శాస్తి చేసేది బయట పిల్లలనేమీ అనలేక. తన తప్పేమిటోతెలీక, బయటవాళ్లతో ఆడుకోవాలున్నా వాళ్ళు చేసే గేలికి వాళ్ళతో కలవలేక దూరంగా వెళ్ళి దూరంగా కొండమీంచి పట్నం కనపడే స్థలానికి వెళ్ళి బండరాయిమీద కూర్చుని నాన్నగారెప్పుడొస్తారా అని ఎదురు చూస్తూండేవాడు.
అక్కడే శాస్త్రికి రాముడు పరిచయమయ్యాడు. రాముడక్కడే ఉంటాడు ఎప్పుడూ. శాస్త్రికన్నా చాలా పెద్దవాడు. ఎత్తుగా బలంగా ఉంటాడు. నవ్వుతూ గల గలా పలకరించేవాడు, అలా పలకరిస్తూనే తన పని తను చేసుకునేవాడు.శాస్త్రికీ, రాముడికీ స్నేహం పొసగింది. అప్పట్నుంచీ శాస్త్రి స్కూల్ హోం వర్కైనా ఏ అమ్మ చేసిన జంతికలు తినడమైనా, మైసూర్ పాక్, రవ్వలడ్లు తినడమైనా ఇలా ఏదైనా అక్కడికే వచ్చి రాముడి దగ్గర కూర్చునే చేసేవాడు.పుట్టినరోజుకో, పండక్కో కొత్త బట్టలు కట్టుకుంటే దానిక్కూడా ఇతర పిల్లలు గేలి చేస్తారేమో అని భయపడి తిన్నగా రాముడి దగ్గరకే వచ్చి అక్కడే గడిపేవాడు. తన కష్టం, సుఖం, బాధ, ఆనందం, ఏడుపు, సంతోషం ఏదైనా సరే అన్నీరాముడితో చెప్పుకోవడమే.
ఈలోగా మూర్తిగారి ఫ్యాక్టరీ పనిలేదని తాత్కాలికంగా మూత బడింది, ఏం చేయాలో పాలుపోలేదు మూర్తి గారికి, దాదాపు ఆరునెలలు జీతాల్లేవు. గవర్నమెంటు స్కూలు కాబట్టి పిల్లాడి చదువుకిబ్బందిలేదు. కానీ ఇంటి అద్దె,తినడానికి తిండికి ఏం చేయాలి పిల్లాడికేం పెట్టాలి పాలు పోలేదు. అదృష్ట వశాత్తు ఇంటిగలవాళ్ళు "ఇబ్బంది లేదు మీకు మళ్ళీ ఉద్యోగం వచ్చాకే అద్దె బాకీ చెల్లించండి" అని భరోసా ఇచ్చారు. కిరాణా కొట్టు శెట్టిగారు కూడా"పరవాలేదు మూర్తిగారూ అవసరమైన బియ్యం, పప్పూ, ఉప్పూ, తీసుకెళ్ళండి జీతం రాగానే ఇవ్వండి" అని చెప్పడంతో హమ్మయ్య అనుక్కున్నారు ఇద్దరూ. కానీ ఎంత అరువు తెచ్చినా డబ్బు పెట్టి కొనుక్కున్నంత స్వతంత్ర్యంగాఉండదు కదా! లక్ష్మిగారు, ఆయన్ని పిలిచి "మీ ఉద్యోగం తిరిగి కుదిరి జీతాలొచ్చేయాలని వేంకటేశ్వరుడికి శనివారం ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను" అని చెప్పింది. ఆయనకూడా "ఐతే నేనూ ఉపవాసం" అన్నాడు. "ఆదివారం కొడుకులున్నవాళ్ళు ఒక్కపూట నియమం ఉండాల్ట నేను ఆదివారం ఒక్కపూటే భోజనం" అంది లక్ష్మిగారు. మూర్తిగారు విన్నా వద్దనలేదు సరే అనలేదు. ఏవండోయ్ ఏకాశి ఉపవాసం మంచిది, పుణ్యం వస్తుంది"అన్నది, మూర్తి గారు లోపల లెక్కపెట్టుకుంటున్నారు ఎన్ని పూటల భోజనం తగ్గిందో నెలకి .. "శనివారాలు ఇద్దరి ఉపవాసం కలిపి నాలుగు పూటలు, ఆదివారం నీదొకపూట మొత్తం ఐదు, అంటే నెలకి ఇరవై పూటలు తోడురెండేకాదశి ఉపవాసాలు మొత్తం 4 పూటల భోజనం వెరసి నెలకి 24 పూటల భోజనం ఆదా దాంట్లో నాలుగు పూటలెత్తు జావ ఉపవాస ఫలహారం అనుక్కుంటే. పిల్లాడికి రెండు పూటలా భోజనానికిబ్బంది ఉండదు కదా.." అని లెక్కకట్టుకుంటూ..
"మంగళవారం హనుమకి ప్రీతి ఏ శనిదోషాలో ఉంటే పోతాయి మంగళవారం కూడా నేను ఒకపూటే" అన్నారు మూర్తి గారు. వాళ్ళిద్దరి లెక్కలూ తెలీని వెర్రి నాగన్న కూడా "నేనూ ఉంటా ఉపవాసం, నేనూ ఉంటా"అని ఎగిరాడు. లక్ష్మిగారు పిలిచి "లేదు నాన్నా పెద్దయ్యాకే ఉపవాసాలు చెయ్యాలి చిన్నపిల్లలు చేయకూడదు" అని చెప్పి లాలించింది. మన శాస్త్రి బుంగ మూతి పెట్టుకుని "ఎప్పుడూ అంతే నువ్వు, పిల్లలతో ఆడతా అంటేఎక్కిరిస్తున్నారని ఆడనివ్వవు, బయటికెళ్ళనివ్వవు, ఇప్పుడు ఉపవాసం చెయ్యనివ్వవు" అని మళ్ళీ రాముడిదగ్గరికి తుర్రుమని వెళ్ళిపోయాడు. మూర్తిగారు, లక్ష్మిగారూ ఉపవాసంతో నీరసించిన కళ్ళతో ఒకరినొకరు చూసుకునినిస్తేజంగా నవ్వుకున్నారు.
ఈ వ్యవహారం ఇలా ఉండగా కిరాణా కొట్టుకి మూర్తిగారు శాస్త్రిని కూడా తీసుకెళ్ళారోసారి. కావలసిన సరుకులు తీసుకుని వచ్చేస్తుంటే శాస్త్రి అడిగాడు నాన్నారూ డబ్బులివ్వలేదేమని. మూర్తిగారు డబ్బులక్కరలేదు అని మనకొట్టేఅన్నారు. ఇదే సమయంలో ఊరికి రోడ్లేస్తామని వచ్చి రాముడుండే చోట కొంత స్థలం లాగేస్కున్నారు రోడ్లేసేవాళ్ళు. అసలు రాముణ్ణుండనిస్తారా అన్న అనుమానమూ వచ్చింది ఊళ్ళోవాళ్ళకి. నలుగురు పెద్దవాళ్ల మాటలూ వినిబెంగ పెట్టేసుకున్నాడు శాస్త్రి. ఎక్కువసేపు రాముడి దగ్గరే గడిపేవాడు. ఓ సారి బడినుండి ఇంటికి తిరిగొస్తూ ఈ సారి పిల్లలందరినీ మ్యాజిక్ చేసి తనవైపు తిప్పుకుని వాళ్ళతో ఇక రోజూ ఆడుకునేలా వాళ్ళు తనని ఏమీ అనకుండాఉండేలా ఏదో చేయాలని ఆలోచించాడు. దారిలో ఆ కిరాణా కొట్టుమీదుగా ఇంటికెళుతూ ఈ కొట్టు మాదే మీ అందరూ నన్ను చేర్చుకుని జాగ్రత్తగా రోజూ ఆడిస్తే మీక్కావలసినన్ని పిప్పరమెంటు బిళ్లలూ, నారింజ బిళ్ళలూ, చాక్లేట్లూఇస్తానన్నాడు. అందరూ ఔనా సరే అని పిల్లలందరూ కొట్లో మూగారు. శాస్త్రి అక్కడున్న గాజు సీసాల్లోంచి ఎవరికేం కావాలో అవి ఇచ్చేస్తున్నాడు. కిరాణా కొట్టతను అయ్యో పంతులుగారబ్బాయి ఇలాచేస్తున్నాడేంటి, పోన్లే పిల్లాడుకదా తరవాత పంతులు గారికి చెప్దాం అని ఖాతాలో వ్రాసేసుకున్నాడు. ఈ తిన్న పిల్లలందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇవ్వాళ శాస్త్రి మా అందరికీ చాక్లేట్లు కొనిచ్చాడని డాబుగా చెప్పారు. ఈ నోటా ఆ నోటా ఆ మాట లక్ష్మిగారికీ,సాయంత్రం వస్తుంటే మూర్తి గారికీ చేరింది. ఏమండోయ్ జీతాలొచ్చేసాయా మీవాడు అందరికీ చాక్లేట్లు కొనిస్తున్నాడు, బాకీలు తీర్చేస్తారా అని ఎవరో దార్లో అడిగేసారు. మూర్తిగారు ఇంటికొచ్చి జరిగింది తెలుసుకుని అసలేఉపవాసపు ఆకలి, దారిలో డబ్బులొచ్చినా చెప్పకుండా పిల్లాడితో చాక్లేట్లూ అవీ కొనిపిస్తున్నాడన్న రీతిలో బైటవాళ్ళు మాట్లాడిన మాటలకి రోషమొచ్చి శాస్త్రిని చెడామడా ఉతికారేశారు. ఇంతకీ శాస్త్రికి తను చేసిన తప్పేంటోతెలీలేదు, షరా... మళ్ళీ రాముడు దగ్గరకే పరుగు. రాముడు కబుర్లు చెప్పి, నాలుగు చింతకాయలిచ్చి తినమని చెప్పి ఏదో గల గలా కబుర్లు చెప్తూంటే కొంత అక్కడే పడుక్కుండిపోయాడు.
ఈలోగా లక్ష్మిగారికి ఆందోళన చీకటైపోయింది పిల్లాడెక్కడికెళ్లాడో అని. మూర్తిగారేమో ఛీ అనవసరంగా కొట్టాను రూపాయి పిప్పరమెంట్లకి పిల్లాడెక్కడికెళ్ళాడో అని, ఇంటిపక్క పిల్లలని, చుట్టుపక్కవాళ్లనీ అడిగితే మీవాడా ఊరిచివరకివెళ్ళి ఆడుకుంటూంటాడు కదా అని చెప్తే గుర్తొచ్చి పరుగు పరుగున వచ్చారు ఇద్దరూ అక్కడకి. రాముడి దగ్గర నిద్రపోతున్న శాస్త్రిని లేపి ముద్దులు పెట్టుకుని,"చచ్చిపోయాన్రా నాన్నా నువ్వు కనపడకపోతే" అని హత్తుకునిఇంటికి తీస్కెళ్లారు. నాన్నగారి భుజం మీదనుంచి రాముణ్ణి చూస్తూ మగత నిద్రలోనే టాటా చెప్తూ.. అమ్మానాన్నా ఎందుకు కంగారు పడుతున్నారో, ఎందుకేడుస్తున్నారో అర్థం కాక, మళ్లీ నాన్న భుజంమీదే నిద్రలోకి జారుకున్నాడుశాస్త్రి. ఇది జరిగిన కొన్ని రోజులకి మూర్తిగారి ఫ్యాక్టరీ మళ్ళీ తెరిచారు అంతా కులాసాగా సాగింది.
కాలం గిర్రున తిరిగింది శాస్త్రి కాలేజీ చదువులకొచ్చాడు, ఐనా అదే బెరుకు, ఊళ్ళో మోతుబరి బిడ్డలు దగ్గరికి రానివ్వరు, కొందరి దగ్గరకి ఎందుకొచ్చిన సావాసాలని అమ్మ వెళ్ళనివ్వదు. రాముడికీ, శాస్త్రికీ బంధం గట్టిదైంది.పట్నంలోకి చుట్టాలూ వచ్చారు. మూర్తిగారిది చిన్న ఉద్యోగం కాబట్టి కొద్దిగా తక్కువగానే చూసేవారు, ఏవైనా ఫంక్షన్స్ ఐతే తప్పకుండా పిలిచేవారు, లక్ష్మిగారు వంటలకీ, ఇంటి పనులకీ సాయం ఉంటుందని. అది తెలియని వారుకాదు మూర్తిగారూ, లక్ష్మిగారూ. కానీ కాలేజీ కొచ్చిన శాస్త్రికి అర్థమయ్యీ అవ్వనట్లుండేది. ఒక్కోసారి ఫంక్షన్లలో తోటి పిల్లలతో మాట్లాడనిచ్చేవారు కారు. ఆటో తీసుకురా అనో, సిగరెట్ పాకెట్లు తీసుకురా అనో అంపేవారు.అర్థమయ్యేది కాదు శాస్త్రికి. ఏదైనా విషయం మాట్లాడుతుంటే ఏదైనా చెప్పబోతుంటే తెలుసులేవో కాలేజీకొచ్చావనీ ముందా పని చూడు వెళ్ళి వంటలయ్యాయేమో కుర్చీలూ అవీ వేయాలి అని పంపేసేవారు. ఒకటి రెండు సార్లు గట్టిగాచెప్పబోతే ఏంట్రోయ్ గొంతు పెద్దదౌతోంది పెద్దంతరం చిన్నంతరం లేదూ అనేవారు. వెంటనే లక్ష్మిగారొచ్చి, బుద్ధి లేదురానీకు పెద్దవాళ్ళా జోలికెళతావ్ అని తిట్టేవారు. తను చేసిన తప్పేంటో శాస్త్రికి తెలిసేదికాదు. ఇంటికెళ్ళడం,రాముడి దగ్గరకెళ్ళి గోడు వెళ్ళబోసుకోవడం.... షరా మామూలే.
మెల్లగా అన్నీ అవగతమయ్యాయి శాస్త్రికి పట్టా వచ్చింది పట్నంలో కొచ్చిన ఒక పెద్ద కంపనీలో ఒకే రౌండులో మంచి ఉద్యోగం దొరికింది. నాన్న నెలజీతం కన్నా మూడింతలు ఎక్కువ తన మొదటి జీతం. అమ్మానాన్నకి బట్టలుకొన్నాడు. మూర్తిగారు అప్రయత్నంగా మీసం మీద వేలేసారు. మూర్తిగారు, లక్ష్మిగారూ ఉపవాసంతో నీరసించిన కళ్ళతో ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు, ఈ సారి కళ్ళలో ఏదో సాధించామన్న సంతోషం మెరిసింది. శాస్త్రిచిన్నపిల్లాడు కాదు కదా.. చిన్నప్పుడు ఇలాంటి నీరసమైన కళ్ళతోటే నిస్తేజంగా వాళ్ళు నవ్వుకున్న నవ్వు గుర్తొచ్చింది. అప్పటి వాళ్లమాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు ముగ్గురి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. మూర్తిగారు,లక్ష్మిగార్ల కళ్ళలోనీళ్ళు ఆనందాతిశయంతో ఐతే, శాస్త్రి కళ్ళలో నాకన్నం పెట్టి చదివించడానికి ఉపవాసాలుండి ఇంతవాణ్ణి చేసారా అన్న భావనతో, ఆ భావన కృతజ్ఞతా కాదు, వాళ్ళు అనుభవించిన బాధని తలచుకునా... కాదు...ఏదో పూజనీయ భావన. కళ్ళలోనీళ్ళు పెదవులపై నవ్వు... త్యాగే నైకే అమృతత్వ మానశుః... అందరి తల్లి దండ్రులూ ఇంతే కదా పిల్లలకోసం ఎంత కష్టపడతారు సాధించిన చిన్న విజయాన్ని చూసి ఎంత గర్విస్తారు అనుక్కుని.అందరూ కలిసి భోజనం చేసి అమ్మ చేసిన స్వీట్లు పట్టుకుని రయ్య్ మని రాముడి దగ్గరకెళ్ళాడు శాస్త్రి.
శాస్త్రికి రాముడితో ఎంతో అనుబంధం ఏర్పడింది కదా చిన్నప్పట్నుంచీ, ఏ కష్టమొచ్చినా సుఖమొచ్చినా రాముడితో చెప్పుకోవడం, రాముడితో గడపడం అలవాటైపోయింది కదా. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఏమీ తొణకకుండాగంభీరంగా నిల్చున్న రాముడి నీడలో, తన వీపుని రామునికి ఆనించి కూర్చున్న ఎన్ని అవమానాలు పొందినా సాధించిన దాంతో తల ఎత్తుకున్న శాస్త్రి అంతే గంభీరంగా ప్రసన్నంగా కూర్చుని ఉన్నాడు. రాముడు మాత్రం శాస్త్రితోఏదో మాట్లాడాలని కాబోలు గల గలా ఏదో అంటున్నాడు, శాస్త్రి మాట పెదవులు దాటట్లేదు, మౌనం కన్నా గొప్ప భాష ఏముంది గనక. ఈసారి రాముడి దగ్గరకి శాస్త్రి అమ్మానాన్నలూ వచ్చి కూర్చున్నారు. ముగ్గురూ రాముడిపంచన కూర్చుని ఇంట్లోంచి జంతికలూ, లక్ష్మిగారి మార్క్ మైసూరుపాక్ తెచ్చుకుని తిని, శాస్త్రికిరువైపులా రాముణ్ణానుకుని మూర్తిగారూ, లక్ష్మిగారూ ప్రశాంతంగా కూర్చుని ఆ సంధ్యా సమయాన్ని, మౌనాన్నీ ఆస్వాదించారు.
అన్నట్లు మరిచాను, శాస్త్రి ఫ్రెండ్ రాముడూ చెట్టే. చింత చెట్టు. ఎన్ని చింతలున్నా శాస్త్రిని చిన్నప్పటినుండీ చింతలు దూరం చేసి తోడు నిలబడింది. చిన్నప్పుడు అమ్మ రామాయణం చదువుతుంటే నివాస వృక్షస్సాధూనాం అనికదా శ్రీ రాముడికి పేరు, అది విన్నాడు శాస్త్రి, అప్పట్నుంచీ ఆ చివర ఉన్న చింత చెట్టుని రాముడు అని పిలవడం మొదలెట్టాడు. రాముడు కూడా శాస్త్రిని అంతే ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. నమ్మితే ప్రకృతిలో ఉన్నఅన్నీ మన స్నేహితులే. స్నేహితులంటే కేవలం మనుషులేకాదు. కదూ!

****

3 comments:

  1. కథ మొదట్లోనే రాముడు మనిషి కాదు అన్నది నాకైతే అర్థమయింది. కథ చక్కగా నడిపారు. కథలోని పాత్రలన్నిటినీ సజీవంగా మలిచారు. కథ బాగుంది. రోజులన్నీ ఒక్క తీరున వుండవుగా. చివర శాస్త్రికి ఉద్యోగం ఇచ్చి రచయితగారు పాఠకులను అమ్మయ్య అనుకునేలా చేసారు

    ReplyDelete

Pages