Wednesday, March 22, 2017

thumbnail

నాకు నచ్చిన కధ -వరద(అమరావతి కధలు )-సత్యం శంకరమంచి

నాకు నచ్చిన కధ -వరద(అమరావతి కధలు )-సత్యం శంకరమంచి
శారదాప్రసాద్ 

అమరావతి కథలు సత్యం శంకరమంచి రచించిన తెలుగు కథాసంపుటి . అమరావతి గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కథలు మొదట ఆంధ్రజ్యోతి వారపత్రికలో సుమారు రెండు సంవత్సరాలు 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి.ఏ కథా కూడా ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో ముద్రణ కాయితం కరువు ఉండేది. ఆ కారణాన, ఆంధ్రజ్యోతి పత్రిక ప్రస్తుతపు వారపత్రిక సైజులో కాకుండా అందులో సగం సైజులో అంటే చందమామ మాసపత్రిక సైజులో కొన్నాళ్ళు వచ్చింది. కారణమేమయినా, కథలన్నీ కూడా రచయిత చక్కగా కుదించి వ్రాశారు. అంత చిన్నకథలో కూడా ఎంతో కథా శిల్పాన్ని ప్రదర్శించిన రచయిత సత్యం శంకరమంచి అభినందనీయులు. శంకరమంచి సత్యం చక్కని తేట తెలుగులో, సరళమైన భాషలో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించుతూ, ప్రజల వేషభాషలు, ఆచారవ్యవహారాలు, కష్టసుఖాలు, జీవన విధానం గురించి విపులం వ్రాసాడు .ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
 ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగళ్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక అమరావతిలోనే చిత్రీకరించబడటం విశేషం.ఈ కథలు తను ఎలా వ్రాసారో, సత్యం శంకరమంచి, తన కథా సంపుటి మొదటిలో కృతజ్ఞతలులో ఈవిధంగా తెలియ చేసారు- "ఓ సాయంవేళ పురాణం సుబ్రహ్మణ్య శర్మ (అప్పటి ఆంధ్రజ్యోతి వారపత్రిక సంచాలకులు) ఉన్నట్టుండి మీరు అమరావతి కథలు అని ఎందుకు రాయకూడదు? అన్నారు ఓ క్షణం అవాక్కయి పోయాను. ఎప్పటిమాట! పన్నెండేళ్ళ క్రితం జైపూర్ లో పని చేసేటప్పుడు అమరావతి కథల పేరిట కొన్ని కథలు రాద్దామని నోట్సు రాసుకోటమేమి, ఇప్పుడు ఎవరో చెప్పినట్టు ఈయన అడగటమేమి! తేరుకుని వరసగా నాలుగు కథలు ఆశువుగా చెప్పాను." ఆ తరువాత జరిగినది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ముఖ్య సంఘటన అనగా 100 వారాలపాటు అమరావతి కథలు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురించబడి ఎంతగానో ప్రజాదరణ, సాహిత్యవేత్తల గౌరవం పొందటం.అమరావతి కథలలోని పాత్రలు ముప్పాతిక భాగం నిజమయిన వ్యక్తులే. వాస్తవ వ్యక్తులు, వాస్తవ సంఘటనల చుట్టూ కాల్పనికత, సంస్మరణ మాధుర్యంతో అల్లబడిన కధలు. రచయిత సత్యం శంకరమంచి పుట్టి పెరిగింది అమరావతి గ్రామంలో. ఆయన చిన్నతనంలో ఉన్న సామాజిక పరిస్థితులు, జీవన విధానాలతో పాటు, ఆ ప్రాంత చరిత్రలో పరిశోధన చేసి వ్రాసిన కథలు అమరావతి కథలు. అన్ని కథలు అమరావతిలో జరిగినవే. ఊహాజనిత గ్రామమో లేక పట్టణమో తన కథలకు వేదికగా రచయిత సత్యం తీసుకోలేదు. తనకు తెలిసిన అమరావతి గ్రామం తరువాత పట్టణమయినా, తన కథలన్ని అక్కడజరిగిన సంఘటనలుగానే తీర్చి దిద్దారు. అందుకనే, ఈ కథలకు మరే పేరు నప్పదు, అమరావతి కథలే సరయిన పేరు. ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ అన్నట్టు, "అమరావతి కథలు అపురూప శిల్పాలు".ఈ కథలలోని పాత్రలలో  రాజులున్నారు, స్వాములవార్లు ఉన్నారు, దొంగలు, భక్తులు, నాస్తికులు, దాతలు, లోభులు ఒకరేమిటి మనకు సామాన్యంగా ప్రతిరోజు తారసపడే వారందరూ ఈ కథలలో పాత్రలే. కథలన్నీ కూడా చాలా చిన్న చిన్నవి. మరింత ఉంటే బాగుండునేమో అనిపించేవే. ఎంతటి సామాన్య ప్రజలను పాత్రలు చేసి కథలు వ్రాసినా, కథాంశం మనిషిలోని ఔన్నత్యాన్ని మాత్రం వదిలి పెట్టదు.ఇవన్నీ కేవలం కథలే కావు. .. అతి క్లుప్తమైన పరిధిలో చాలా పెద్ద చరిత్ర చెప్పినవి ఉన్నాయి. శబ్దాలలో అద్భుత 
చమత్కారాన్ని చూపిన ఇంద్రజాలాలున్నాయి. వేమన్న పద్యాల నిరాడంబరత, సూటిదనం ఉన్నాయి. వాడితనం, పనివాడితనం కలబోసిన అపురూప శిల్పాలు ఎన్నో ఉన్నాయి.... కృష్ణానదీ జలాలమీద కథల కెరటాలు మలచారు. .. కొన్ని చోట్ల ఒక్కమాటతో, ఒక్క అక్షరంతో ఓ కథకు ప్రాణప్రతిష్ఠ చేశారు .. అమరావతి కథలు తెలుగు సాహిత్య పీఠంలో కలకాలం నిలబడి గౌరవం, ఆదరణ పొందే ఒక మహోజ్వల సృష్టి. ఎన్నటికీ ఆరని అఖండ జ్యోతి. పాఠకులకూ, కళాకారులకూ ఎన్నిసార్లు ఆస్వాదించినా తనివి తీరని అమృత కలశం. అక్షయమైన అక్షరపాత్ర. శిల్ప సౌందర్యానికి పరమావధి. ప్రపంచ సాహితీ వీధిలో తెలుగువారు సగర్వంగా ఎగురవేయగల మహాపతాకం."బంగారానికి చక్కటి సువాసన అబ్బితే" అని సామెత చెప్పుకుని ఆశ పడే వారు, ఈ కథా సంపుటిలోని కథలను, వాటికి ప్రముఖ సినీ దర్శకుడు మరియు చిత్రకారుడయిన బాపు వేసిన బొమ్మలు చూసిన తరువాత ఈ సామెత నిజమవ్వచ్చు అనుకోవటంలో తప్పు లేదు. ప్రతి కథకు మొదట బాపు వేసిని బొమ్మ, కథను దాదాపు చెప్పకనే చెప్తుంది. కథ చదివిన తరువాత చూస్తే ఆ బొమ్మ తప్ప మరే బొమ్మయిన వెయ్యగలమా అని చూస్తే ఎమీ తట్టదు. కథలకు బొమ్మలు అంత బాగా సరిపొయ్యాయు. ముళ్ళపూడి వెంకటరమణ వ్రాసిన బుడుగుకు చక్కటి బొమ్మలు వేసి చిన్నలనే కాక పెద్దలనే ఎక్కువ అలరించిన చిత్రకారులు బాపు, ఈ కథలకు తన ప్రతిభకు పూర్తి తార్కాణంగా, బొమ్మలను వేసి చదువరులను అలరించాడు.కథాసంపుటి ముఖ చిత్రం చూస్తేనె తెలుస్తుంది బాపు చిలిపితనం, నిండుతనం. రచయిత, పార్వతీ పరమేశ్వరుల సరసన కూర్చుని, చాలా సావకాశంగా, వారికి తన కథలను వినిపిస్తున్నట్టు, తన ఆజ్ఞకానిదే చీమనుకూడ కుట్టనివ్వని పరమేశ్వరుడు, పార్వతీ సమేతుడయి చిద్విలాసంగాను, నందీశ్వరుడు మరియు గోపన్నలు పారవశ్యంగానూ, వింటున్నట్టు చిత్రీకరించారు. అమరావతిలోని అదిదేవుడయిన అమరేశ్వరుడే దిగివచ్చి ఈ కథలు వింటున్నాడని స్పురింప చేశారు.(తెలుగు వీకి సౌజన్యంతో).అమరావతి కధలు లోని మొదటి కధ  'వరద' ను గురించి తెలుసుకుందాం!ఇందులోని ముఖ్య పాత్రలు-శాస్త్రిగారు, మాల సంగడు.బాపు బొమ్మ-శాస్త్రిగారు చెయ్యి చాచటం, మాల సంగడు నెయ్యి వేస్తూండటం.కథ: అమరావతిలో వరద వచ్చి అందరూ వీధిన పడిన సమయాన సమష్టి భోజనాలు కులాతీతంగా అందరూ కలసి వండుకుంటారు. వడ్డన సమయంలో, మాల సంగడు శాస్త్రిగారికి నెయ్యి వడ్డించటానికి సందేహిస్తే, శాస్త్రిగారే సంగణ్ణి పిలిచి " ఒరే సంగా! నీకు ఆకలేస్తుంది, నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా....వెయ్యరా" అని సంగడి చేత నెయ్యి వేయించుకుంటాడు. "వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే నాకు నమ్మకం లేదు! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లొ మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతోంది" అన్న రచయిత ముక్తాయింపుతో కథ ముగుస్తుంది.
*********
అదిగో అదే అమరావతి!ఎత్తైన అమరేశ్వరుని ఆలయానికి తూర్పున వైకుంఠపురం కొండ ,దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు ,పడమటి దిక్కున నేడు దిబ్బగా మారిన అలనాటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం ,ఉత్తరాన పైన చెప్పినవాటిన్నన్నింటినీ వడ్డాణంలా వేసుకొని గల గలపారుతున్న కృష్ణా నది.ఒకప్పుడు రత్నాల రాశులతో కళకళలాడిన ఆ వీధులు నేడు వెలవెల బోతున్నాయి!ఆ విశాల వటవృక్షాల క్రింద ఒకప్పుడు శ్రవణానందంగా వేదగానం వినిపిస్తే ,ఇవ్వాళ " నా కొడకా!నా ముక్కకి అడ్డొచ్చావు కదరా!"అంటూ పేకాటరాయుళ్ల ప్రేలాపనలు వినిపిస్తున్నాయి.కృష్ణకు నీటి కోసం వెళుతున్న ఒక పడుచు పిల్ల కాళ్ళ పట్టీలు  ఊడిపోతే ,మళ్ళీ కృష్ణ నుంచి వచ్చేటప్పుడు తీసుకోవచ్చులే అని వెళ్లి పోయి తిరిగివచ్చేటప్పుడు చూసుకుంటే ఆ పట్టీలు అక్కడే భద్రంగా ఉన్నాయట!గతానికి వర్తమానానికి ఆ కృష్ణవేణే సాక్షి!అన్నీ కడుపులోనే దాచుకొని నిండుగా గలగలా పారుతూనే ఉంది.ఇంతలోనే ఊరంతా ఒకటే ఆందోళన,హోరు!ఉన్నట్లుండి కృష్ణ పొంగింది.ఒక్కసారి వరదొచ్చింది.ఊరంతా నడుమెత్తు నీళ్లు వచ్చాయి .మట్టి ఇళ్ళు  నీళ్ల పాలు అవుతున్నాయి. ఇక గుడిసెల సంగతి సరే సరి!పశువులు కృష్ణలో కలసిపోయాయి!రేవులో పడవులు గల్లంతయ్యాయి!ధనిక,పేదా అనే తేడా లేకుండా అందరూ నిరాశ్రయులయ్యారు!వరదలో కొట్టుకొచ్చిన పాములు కొందరిని కాటేశాయి!గొడ్లను మేపటానికి తీసుకెళ్లిన వారు ఏమయ్యారో ?అన్నీ కధలు కధలుగా చెప్పుకుంటున్నారు.కొందరు కృష్ణమ్మను శాంతించమని పసుపు,కుంకుమలు సమర్పించి కొబ్బరి కాయలు కొడుతున్నారు.దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్ష్మమ్మ వారి చెట్టు దగ్గరికి చేరారు.కొద్దిగా వరద తగ్గుముఖం పట్టింది.ఊరి పెద్దలైన వెంకటస్వామి,వీరాస్వామి,అవధాన్లు  అంతా కూడా అక్కడికే చేరారు.ఇప్పుడేమి చేద్దామని తలపట్టుకున్నారు పెద్దలు.జనానికి ముందు తిండీ తిప్పలు చూడండని చాలామంది జవాబుగా చెప్పారు.స్త్రీలందరూ కూరలు తొరగటం మొదలు పెట్టారు.అన్నం వండారు .నడివీధిలో బారులుగా విస్తళ్ళను వేశారు.శాస్త్రి గారు సంధ్యావందనం ముగించుకొని తనూ ఒక విస్తరి ముందు కూచున్నాడు.  చుట్టుపక్కల చూస్తే నానా కులాల వాళ్ళున్నారు.ఎవరి పక్కన ఎవరు కూచున్నారో ఎవరికీ పట్టలేదు.భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. శాస్త్రి గారు ఔపోసన పట్టి నెయ్యికోసం చేయి చాస్తే వడ్డించటానికి వచ్చిన నేతి జాడి  చెంగున వెనక్కు వెళ్ళింది.వడ్డిస్తున్న మాల సంగడు శాస్త్రి గారికి వడ్డించటానికి ఇష్టం లేక పారిపోతున్నాడు.శాస్త్రి గారు,"ఒరే సంగా !నీకూ ఆకలేస్తుంది,నాకూ ఆకలేస్తుంది.ఇంకొక్కళ్ళు వేస్తే నెయ్యి,నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా!"అన్నాడు చెయ్యి ముందుకు చాపి.సంగడు ఆనందంగా నెయ్యి వడ్డించాడు. "నమ:పార్వతీపతయే "అనే కేకలు దేవాలయపు శిఖరాలను అంటాయి.వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా?అబ్బే!నాకు నమ్మకం లేదు.స్నానం చేసిన ఒంటికి తెల్లారేటప్పటికీ మళ్ళీ మట్టి పట్టినట్లు మళ్ళీ మనస్సులో మలినం పేరుకుంటోంది.ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేకపోతున్నాయి!

***

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

4 Comments

avatar

మిత్రమా మీ విశ్లేషణ చాల బాగుంది. కథనం లో చివర వ్రాసిన వాక్యాలు ఆణిముత్యాలు. స్నానంచేసిన ఒంటికి తెల్లారేటప్పటికి మళ్లీ మట్టి పట్టినట్లు మళ్లీ మనసులో మలినం పేరుకుంటుంది ఎన్ని వరదలు వచ్చినా మనిషి మనసు కడగ లేక పోతున్నాయి. ఆత్మ న్యూనత పోయిన నాడు కుల వ్యవస్థ లో మార్పు వస్తుంది. సంగా నెయ్యి వడ్డించటానికి అతని కులం అనే ఆత్మ న్యూనత అడ్డు వచ్చింది. శాస్త్రి గారికి ఆత్మ న్యూనత ఉన్నా ఆ సమయంలో ఆకలి దానిని ప్రక్కన పెట్టి నెయ్యి కి చేయి చాచేలా చేసింది. నిజానికి సంగడు లాంటి వారంతా హిందువుల కింద పరిగణింపబడేవారు. ఎవరికి వారు తామే గొప్ప అనే కుసంస్కారం వలన మనుషుల మధ్య లో ఈ అడ్డు గోడలు ఏర్పడి ఉంటాయి శ్రీ శాస్త్రీ టివియస్ గారు ఎన్నుకున్న కథానిక చాల బాగుంది. శ్రీ శాస్త్రీ టివియస్ గారికి అభినందనలు

Reply Delete
avatar

శ్రీ శాస్త్రి గారికి నమస్కారములు , శ్రీ శంకరమంచి ఆరి కథలు చాల క్లుప్తంగా లోగడ మీరు కొన్ని మాకు చక్కగా అందించారు చాల ఆనందించము. మల్లి ఇప్పుడు ఇంకొద్ది వివరంగా వ్రాస్తున్నారు , ముఖ్యంగా మీరు ఈ శీర్షికలో చాల అద్భుతంగా వ్రాసారు . శ్రీయుతులు (కీ:శే ఐనా వారు మనందరికీ సజివులే కదా ) బాపు-రమణల ద్వయం, శ్రీ శంకరమంచి గారి గురించిప్రస్తావించటం శ్రీ శంకరమంచి వారికీ "ఆస్కార్ అవార్డు" తో సమానమే . మీ ఈ ప్రస్తావనలో అసలు శ్రీ శంకరమంచి వారి కథలన్నిటికి ఒక " సమీక్ష" ల చాల బాగా వ్రాసారు. చాల బాబుంది ధన్యవాదాలండి .
బాల సుబ్రహ్మణ్యం

Reply Delete
avatar

Thank you friend for your excellent response.

Reply Delete
avatar

Thank you for your excellent response.

Reply Delete


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information