మానసిక శుభ్రం – వ్యాయామం - అచ్చంగా తెలుగు

మానసిక శుభ్రం – వ్యాయామం

Share This
మానసిక శుభ్రం – వ్యాయామం
బి.వి.సత్యనాగేష్ (ప్రముఖ మానసిక వైద్య నిపుణులు )


ప్రతి దుకాణంలో అమ్మకానికి పెట్టిన సామాగ్రి ఎంతో శుభ్రంగా, కొత్తగా, ఆకర్షణీయంగా వుంటాయి. దానికి కారణం---- వాటిని రోజూ పనికట్టుకుని ఒక డ్యూటీలా శుభ్రం చేస్తారు. మనిషి విషయానికొస్తే... మనం కూడా రోజూ దంతాలను శుభ్రం చేసుకుంటాం. మల మూత్రాలను విసర్జిస్తాం. స్నానం చేసి శరీరం పైన ఉన్న మురికిని కడిగేస్తాం. కాని... మనసు గురించి మాత్రం పట్టించుకోం. మనసును శుభ్రం చెయ్యడానికి కొంత సమయాన్ని కేటాయించి, మానసిక ఎక్సర్ సైజ్ చేస్తే మనసు ప్రశాంతంగా అవుతుంది. శారీరక, మాససిక ఆరోగ్యం మెరుగవుతుంది కూడా!
మనసు అనేది ఆలోచనా ప్రక్రియలో వున్న మానసిక ముద్రల పుట్ట అన్న విషయం తెలుసుకున్నదే. మనసులో అనేకరకాల సానుకూల,ప్రతికూల మానసిక ముద్రలుంటాయి. పదే పదే తరచుగా ఆలోచించడం వలన, చెయ్యడం వలన అవి అలవాట్లుగా మారతాయి. మంచి అలవాట్లంటే పరవాలేదు. చెడ్డ అలవాట్లయితే “ఇల్లు గుల్లయింది” అన్నట్లు జీవితమే అర్ధం కాకుండా పోతుంది. అందువల్ల ప్రతీ మనషి ప్రతిరోజు “మానసిక వ్యాయామం” చేసి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి.మరి మానసిక వ్యాయామం గురించి వివరాల్లోకి!వెళ్దామా!
          ఈ మానసిక వ్యాయామాన్ని కుర్చీలో కూర్చొని కూడా చెయ్యొచ్చు. మీరు కూర్చునే స్థానం కు ఎదురుగా సుమారు ఆరు అడుగుల దూరంలో వున్న గోడపై ఒక చుక్కను పెట్టుకోవాలి. నేల మీద నుంచి సుమారుగా మూడు అడుగుల ఎత్తులో ఎదురుగా కనిపించాలి. అంటే.. మీరు కుర్చీలో కూర్చుంటే మీ కళ్ళకు కరక్టుగా ఎదురుగా చుక్క కనిపించాలి. ఈ చుక్క చుట్టూ ఒక చతురస్రాన్ని గీయాలి అంటే... చతురస్రం మధ్యలో చుక్క ఉంటుంది. 

కుర్చీలో కూర్చొన్న తరువాత వీపును వెనుకకు వాల్చి, నిటారుగా వుంచి రిలాక్స్గా కూర్చోవాలి. పాదాలు నేలను తాకేటట్లు వుండాలి. చేతులను తొడపై “పేస్ అఫ్ పొజిషన్ “ లో ఉంచాలి అంటే...అరచేతులు గదిలోని రూఫ్ (roof వైపు వుండాలి. ఈ విధంగా రిలాక్స్డ్ గా కూర్చొన్న తర్వాత ఎదురుగా వున్న చుక్కపై దృష్టిని కేంద్రీకరించాలి. ఆలోచనాప్రక్రియ (Thinking process) జరుగుతూ వుంటుంది. చుక్కను చూస్తూ... కనురెప్పలు బరువెక్కినపుడు కళ్ళు మూసుకోవాలి.శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసను గమనిస్తూ వుండాలి. కొంత సమయం తర్వాత ఒక చిన్న కాతివంతమైన సాధనం (కాంతి/బల్బ్). ఈ విశ్వం (యూనివర్స్) నుంచి వచ్చి మీ తల నుంచి మూడు అడుగుల పైకి లేదా కొంత ఎత్తులో ఉన్నట్లు ఊహించుకోవాలి. ఈ కాంతివంతమైన వస్తువు నుంచి కాంతిప్రసారం వెలువడుతున్నట్లు ఊహించాలి. ఈ కాంతి మీ తల ద్వారా ప్రవేశించి,మెడ ప్రాతంలోకి, అటునుంచి భుజాలకు ప్రసరించినట్లు, భుజాలనుండి చేతులకు,ఛాతి భాగానికి ప్రసరిస్తున్నట్లు, అటునుండి ఉదార భాగానికి, అక్కడనుండి కాలివేళ్ల వరకు ప్రవహించి..తిరిగి ఆ కాంతి తల వరకు వస్తున్నట్లు ఊహించాలి. అదే విధంగా చేతి వేళ్ళనుంచి ఆ కాంతి పుంజం భుజాలను చేరుతున్నట్లు ఊహించాలి. ఈ కాంతి శరీరం అంతా వ్యాపించి,శరీరాన్ని పరిశుభ్రం చేస్తున్నట్లు భావించాలి. ఈ విధంగా కాంతి శరీరమంతా ప్రవహిస్తూ శరీరాన్నిశుభ్రం చేస్తున్న సమయంలో శారీరిక, మానసిక ఆరోగ్యం కొరకు సానుకూల దృక్పథంతో మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోవాలి. తప్పులను సరిదిద్దుకునే విధంగాను, వేరే వారి తప్పులను క్షమించే విధంగానూ ఊహించుకోవాలి. జీవితం విజయవంతంగా,సంతోషదాయకంగా గడవాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. క్రమశిక్షణ తో ఉండడానికి కావలసిన విధంగా ఊహించాలి. ఈ విధమైన విషయంలో సానుకూలంగా కొంత సమయం ఆలోచించిన తరువాత కాంతి పుంజం యొక్క  తిరుగు ప్రయాణం గురించి ఊహించాలి. కాంతి నెమ్మదిగా కాలివేళ్ల నుండి, చేతివేళ్ల నుండి తలవైపుకు తిరుగు ప్రయాణం చేసి, అటునుంచి తల పై భాగంలో ఎత్తులో వున్న కాంతిని ప్రసారం చేసిన సాధనం లోకి కాంతి  చేరుతున్నట్లు ఊహించాలి. ఆ తరువాత కాంతి ప్రసారసాధానం మీరున్న స్థానం నుంచి పైకి పోయి విశ్వం లో కలసే ప్రయత్నంలో కళ్ళకు కనబడనంత ఎత్తులో పోయినట్లు ఊహించి ఆ తరువాత రెండు అరచేతులను రబ్ చేసి కళ్ళమీద కాసేపు వుంచి, మృదువుగా కనురెప్పలను రుద్దిన తరువాత కళ్ళను తెరవాలి. చాలా రిలాక్స్ గా, ప్రశాంతంగా, ఆరోగ్యంగా వున్న భావన కలుగుతుంది. ఈ ఎక్సర్సైజు చేసిన తరువాత తీసుకునే నిర్ణయాలు, అదే వ్యక్తులు మామూలుగా వున్నప్పుడు తీసుకున్న నిర్ణయంలో చాలా తేడా ఉందని శాస్త్రీయంగా రూడీ పరిచేరు పరిశోధకులు. ఈ ఎక్సర్సైజులో అంతా ఊహ మాత్రమే. మానసిక వ్యాయామంలో ఊహకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భంలో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఆర్ బర్ట్ ఐన్ స్టీన్ అన్న మాటలను గుర్తుచేసుకుందాం.
“Imagination is everything, it is the preview of life’s coming attractions”.
ఊహించడమనేది ఒక గొప్ప ప్రక్రియ. మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సాహసం, పట్టుదల అనే సానుకూల భావాలు, భయం,అనుమానం, ఆందోళన,ఒత్తిడి, కలవరం అనేభావాలు ప్రతిసానుకూల భావాలు కేవలం ఊహించడం వల్లనే కలుగుతాయనడంలో సందహంలేదు. క్రీడాకారులచే స్పోర్ట్స్ సైకాలజిస్టులు సానుకూల భావాలను ఊహించేటట్లు చేస్తారు. కనుక ఈ మానసిక వ్యాయామంతో శరీరానికి, మనసుకు ఆరోగ్యంతో బాటు సానుకూలభావాలను పెంపొందించుకోవచ్చు. మరీ ఆలశ్యమెందుకు?మొదలుపెట్టండి మరి?


No comments:

Post a Comment

Pages