మానసబోధ శతకము - తాడేపల్లి పానకాలరాయడు

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం కవిపరిచయం:

మానసబోధ శతక రచయిత తాడేపల్లి పానకాలరాయడు శ్రీవత్స గోత్ర ఆరువేల నియోగి. తాడేపల్లి రంగమాత్యవంశజుడు. రంగమాత్య కుమారుడు సుబ్బారాయడు. అతని కొడుకు వెంకన్న. వెంకన్న అతని భార్య మహాలక్షమాంబ లకు ముగ్గురు కుమారులు. ఈ ముగ్గురు కుమారులలో కడపటి వాడు ఈ కవి. ఇతని అన్నలు వెంకత్రాయడు మరియు సీతాపతిరాయడు. ఈ కవి హరి భక్తుడు అని తన గురించి తానే చెప్పుకొన్న ఈ క్రింది పద్యం వలన తెలుస్తున్నది.

సీ. శ్రీవత్సగోత్రుఁ డంచిత పటుశాస్త్రసం, ఖ్యావనీదేవకులాగ్రగణ్యుఁ
డగు తాడెపల్లి రంగమాత్యపుత్రుండు, రాజపూజ్యుఁడు సుబ్బరాయఁ డతని
తనయుఁడౌ వేంకన్నకును మహాలక్షంబ, కును తనూజులము ముగ్గురము నందు
చెలఁగి వేంకటారాయ శ్రీ సీతాపతిరాయ, లకు సహోదరుఁడ నేఁ బ్రకటముగను

గీ. పానకాల్రాయఁ డనువాఁడ భవ్యయశుఁడ
నఖిలరాజాధిరాజ సభాంతరాగ్ర
పూజితుఁడ సర్వవిద్యావిరాజితుఁడను
సుజనసేవ్యుఁడ హరిభక్తి సుమహితుఁడను.

విజయవాడ నుండి గుంటూరు వెల్లు దారిలో కృష్ణ వంతెన దాటగానే వచ్చే తాడేపల్లి ఈకవి జన్మస్థానం.

క. పదిరెండు పర్వతంబులు
విదితంబుగ నదులు రెండు విభుఁడు విభుఁడు నృసింహుం
డదనైన దుర్గమొక్కటి
పదపడి ముదమలరు తాడెపల్లి ధరిత్రిన్.

అయితే ఈ కవి కాలనిర్ణయం చేయటానికి తగినన్ని ఆధారాలు ఇతని రచనలలో దొరకటం లేదు. ఈ కవి బహు శతకకర్త. ఈతని పేరున అనేక శతకములు, ఒక వైద్యగ్రంధము దొరుకుతున్నాయి. ఈతని రచనలు 1. మానసబోధశతకము. 2. చిత్తబోధశతకము. 3. పార్థసారధిశతకము. రామశతకము. లక్ష్మీదేవిశతకము. 6. నృసింహస్వామి శతకము. 7. రుక్మిణీపతి శతకము. 8. నేత్రదర్పణము అను వైద్యగ్రంథము. 

శతకపరిచయం:

మానసబోధశతకము భక్తిరస ప్రధానమైన శతకం. బహుళప్రజాదరణపొందిన ఈశతకం "మనసాహరిపదము లాశ్రయింపుమా" అనేమకుటంతో 102 చంపకోత్పలమాలల వృత్తాలలో రచింపబడిన సుమహారం. కవియే ఈశతకాన్ని గూర్చి ఇలాచెప్పికొన్నాడు.

ఉ. పాయక తాడెపల్లికులపావనుఁడై విలసిల్లు పానకాల్
రాయనిచేఁ బ్రణీత మయి రంజిలు మానసరాజయోగ సం
ధాయకవంద్యసంస్తవశతం బనిశంబుఁ పఠించి మోక్ష సం
ధాయతిఁ బొందెదీవు మనసాహరిపదము లాశ్రయింపుమా

"మానసరాజయోగ" సంధాయకము ఈశతకము. కొన్ని రసవత్తరమైన పద్యాలను గమనిదాము.

కర్మ బంధములను పటాపంచలు చేయటానికి హరిపాదములే గతి అని సామాన్యునకి అర్థమయ్యే రీతిలో చెప్పిన ఈ పద్యాలను చూడండి.

ఉ. సారము లేనిసంసరణసాగర మీఁదఁగలేక చాలవే
సారుచుఁ గర్మబంధములఁ జచ్చుచుఁ బుట్టుచు సారెసారెకున్
దారుణ కాలకింకరుల దండన కోరువలేవుగాని వి
స్తార సుఖంబుగల్గు మనసాహరిపదము లాశ్రయింపుమా

చం. పరిపరి కర్మబంధములఁ బాయక పుట్టుచు గిట్టుచున్ మహా
దుర్త కళాంకపంకమునఁ దూఁగుచు సంసరణాను బంధదు
స్తర జలధిన్ మునింగి జడతన్ బరతత్వము గానలేక వా
సరములు పుచ్చకింక మనసాహరిపదము లాశ్రయింపుమా

చం. ఎఱుఁగవు ముక్తిమార్గ మిది యెక్కడికర్మము దాపురించెఁ జే
టెఱుఁగని బోటి తా మగని కింపుగఁ బెండ్లి యొనర్చినట్లు దు
ష్కరమగు కామ్యకర్మములఁ గాలము పుచ్చెదవేల? బాపురే!
సరసముగాదు నీకు మనసాహరిపదము లాశ్రయింపుమా

కొన్ని పద్యములు పోతనామాత్య భాగవతపద్య శైలిని పోలి ఉన్నాయి. 

చం. చక్కనివాడు సర్వగుణసంపదలుం గలవాఁడు భక్తిచేఁ
జిక్కెర్డుచాఁడు లోకముల చిక్కెడలించెడువాడు దీనులన్
మిక్కిలి బ్రోచువాఁడు కననేర్చిన గన్పడువాడు గాన నీ
వక్కరపాటుతోడ మనసా హరిపదము లాశ్రయింపుమా!

రామాయణ భాగవత కథలలోని సంఘటలను ఉదాహరిస్తు చెప్పిన తియ్యని పద్యాలు అనేకం. 

చ. గరళముఁ బ్రామి చన్గుడుపుకామిని కిచ్చెను మోక్ష మాసభాం
తరమున నెగ్గులాడిన పదంపడి వానికి నైక్యమిచ్చె భీ
కరగతిఁ బట్టి మ్రింగుభుజగంబున కిచ్చెను మర్త్యరూప మా
చరితము లెన్నఁగల్గు మనసా హరిపదము లాశ్రయింపుమా!


ఉ. హెచ్చగుగట్టుమోసి యలయింపక ప్రాణులఁ బ్రోచినాడు తా
నిచ్చను గొల్చు పాండవుల కేర్పడ రాజ్య మొసంగినాడు కా
ర్చిచ్చును బట్టి మ్రింగి నిజసేవకులన్ బ్రతికించినాడు నీ
వచ్చపు భక్తి గల్గి మనసా హరిపదము లాశ్రయింపుమా!


ఉ. కోతుల నేలినాడవని కోవిదులెన్నఁగ వింటి నేనయో
కోతిగ నుంటి నన్నటుల గొబ్బున సేవకునిగా నొనర్చి సం
ప్రీతిగ బ్రోవుమంటి నిరుపేదల బ్రోదిగ సాకుటెల్ల బ్ర
ఖ్యాయ్కాదెయంచు మనసా హరిపదము లాశ్రయింపుమా!


చ. ఉడుతకు గల్గె ముక్తిపద మూసరవెల్లికి సఔఖ్య మబ్బె నె
క్కుడుగతి పక్షి కబ్బె ధర గోమలిరూపము జెందెఱాయిమేల్
వడసెను బాయకుండు భవబాధల బాఎ నిషాదు డామహా
జడధిశ యానునాజ్ఞ మనసా హరిపదము లాశ్రయింపుమా!

ఈశతకంలో 80 వ పద్యం నుండి 89 వ పద్యం వరకు దశావతారవర్ణనం అత్యంత అద్భుతంగా చేశాడు.

చ. తొలిచదువుల్వడింగొనుచుఁ దోయధిఁజొచ్చిన సోమకాసురున్
బలిమిగ మీన రూపమునఁ బట్టి వధించి అయమునన్ శ్రుతుల్
నలువ కొసగి లోకముల నర్మిలిఁబ్రోచిన మత్యమూర్తి సొం
పలరఁగ నిన్నుఁ బ్రోచు మనసా హరిపదము లాశ్రయింపుమా


ఉ. సర్వమయుండు విష్ణుఁ డని చాటిన యాపసిబాలుఁ గావగా
శర్వముఖామరుల్ వొగడ స్తంబమునన్ బ్రభవించి నిష్ఠురా
ఖర్వనఖాళిఁ దానవును గర్భముఁ జీరిన శ్రీనృసింహుఁడే
సర్వఫలంబు లిచ్చు మనసా హరిపదము లాశ్రయింపుమా

సామాన్యునకు కూడా చక్కగా అర్థమయ్యే రీతిలో ఈ కవు సందర్భానుసారం నానుడులను జాతీయాలను అనేక చోట్ల ఉపయోగించాడు. ఉపమానములను అధికంగా వాడి తాను చెప్పదలచుకొనది మనసులలో నాటుకునేట్లు చేయటం ఈ కవి ప్రత్యేకత. 

చ. పెంచినవాని నమ్మి వెనువెంటనె దిర్గుపొటేలు వానిచే
తన మృతిఁబొందునట్లునుసుమి తప్పక కాలము నిత్యమంచు నీ
వనిశమునమ్మి యుంటి వకటా యిఁక నేమనుకొందు నింకనీ
వనుపమ వృత్తిగల్గి మనసా హరిపదము లాశ్రయింపుమా

చ. పరుసము సోఁకఁగా నినుము భాసురకాంచన మైనభంగి శ్రీ
హరిపదసేవచే భవభయంబు లడంగి వినిష్కలంక మౌ
పరమపాంబు గల్గునని పాయక కొల్చి తరించిరార్యులా
సరణిని భక్తిగల్గి మనసా హరిపదము లాశ్రయింపుమా

చ. నిరుపమపద్మపత్రమున నీరము లంటకయున్నమాడ్కిఁ గు
మ్మరపురు వొండునంటని క్రమమున బూడిద గచ్చకాయనున్
దొరయనిరీతి నాత్మ విదుదుర్భవబంధము లంటవండ్రు నీ
వరసి నితాంతభక్తి మనసా హరిపదము లాశ్రయింపుమా

ఇటువంటి మరికొన్ని దృష్టాంతరాలు 1. పుడమిన్ నీరుబుగ్గ చెడిపోయెడి నంచు జడుండు లోహపుం గడియము వేయబూను గతిగా ..... 2. తను బెనుబాము పట్టుకొనఁ దద్వదనమునుండి యీఁగలంగని తిన నేగు కప్ప గతి .... 3. నిలయము కాలఁగా జడుఁడు నీటికి నైయిలు ద్రవ్వినట్లు..  4. అద్దమున న్మనుష్యుఁడు నిజాస్యముఁ దాఁగనుఁ గొన్నమాడ్కి ... 5. ఇటు నటు పాలుద్రావి పరిగెత్తుటకంటె నిల్చి నీరుగ్రోలుట కడు మేలు .. 6. గుఱుతుగ నేటియొడ్డు తెగికూలెడు వృక్షము భంగి.. 7. వెన్న కరంబునం గలుగ వెఱ్ఱిగ నేతికి నేఁగినట్లు .... 8. బూరుగుమ్రాను గాంచి భ్రమనొంది నశించు శుకంబుమాడ్కి ... 9. గోవు లనేకవర్ణములు గ్రుమ్మఱ బాలొకటైనభంగి ..... 10. పొలుపుగఁ గోటివిద్యలును బొట్టకుఁ బుట్టెఁడు కూటికే కదా...

ఈలచెప్పుకుంటూ పోతే చాలనే మనకు కనిపిస్తాయి. 
అత్యంత ప్రజాదరణ పొందిన ఈశతకంలో తాడెపల్లి పానకాయరాయడు మనకు పానకం వంటి పద్యాలను అందించారు. ఆ పానకమాధుర్యాన్ని మీరు ఆస్వాదించండి. నలుగురికీ పంచిపెట్టండి

1 comments:

  1. మంచి సమాచారాన్ని ఇచ్చారు ధన్యవాదములు. ఈ పుస్తకం pdf ఉన్నదా?

    ReplyDelete

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top