ఋషులు - గోత్రములు - 6 - అచ్చంగా తెలుగు
 చ్యవన మహర్షి 
మంత్రాల పూర్ణచంద్ర రావు

         పూర్వము భృగు మహర్షి బులోమ అను దంపతులు ఉండే వారు. బులోమ తన సపర్యలతో మహర్షి మెప్పు పొందెను, అప్పుడు  భృగు మహర్షి ఆమె సపర్యలకు మెచ్చి ఏమి కావలయునో కోరుకొమ్మనెను. అప్పుడు ఆమె మహాత్మా మీరు ఎరుగనిది ఏమున్నది, ఒక పుత్రుని ఇవ్వమని కోరెను అందుకు మహర్షి అంగీకరించి ఆమె గర్భము నిలిపెను. అప్పుడు ఆమె భర్త అగ్నిహోత్ర సమయములో సహాయము చేయుచుండెను. 
          ఒకనాడు అగ్నిహోత్రము సిద్ధము చేయుమని భార్యకు చెప్పి మహర్షి నదికి పోయెను, అగ్నిహోత్రము ప్రజ్వలముగా వెలుగుచుండగా, పూర్వమునుండి ఆమెను ప్రేమించిన పులోముడు అను రాక్షసుడు ఇదే మంచి సమయము అని తలచి, ఆశ్రమమున ప్రవేశించి బులోమ ఎవరో గుర్తుపట్టలేక అగ్నిహోత్రుని అడిగెను. అగ్నిహోత్రుడు చూపగా రాక్షసుడు ఆమెను పట్టుకొనుటకు ప్రయత్నించెను.
ఆ ప్రయత్నములో ఆమె గర్భమునుండి ఒక బాలుడు క్రిందపడి , ఆ రాక్షసుని తీవ్రముగా చూసినంతనే అతడు భస్మమయ్యెను. గర్భచ్యుతుడు అగుటచే అతనికి " చ్యవనుడు " అను పేరు కలిగెను. బులోమ ఆ బాలుని ఎత్తుకొని ముద్దులాడుచుండగా నదికి వెళ్ళిన భృగు మహర్షి తిరిగివచ్చి విషయము తెలిసికొని తన భార్యను ఆ రాక్షసునకు చూపిన అగ్ని మీద కోపగించి అతి క్రూరుడు,సర్వ భక్షకుడవు కమ్మని శపించెను. అగ్నిహోత్రుడు ఇది విని  కోపమున తన జ్వాలలను ఉపసంహరించగా బ్రహ్మ మొదలయిన వారు  భృగు మహర్షి శాపము అమోఘము అయిననూ సర్వభక్షకుడు అయిననూ శుచులలో అత్యంత శుచి, పూజులలో అత్యంత పూజ్యుడు అయి బ్రాహ్మణులకు యజ్ఞములందు సహాయము చేయుచూ పూజ్యుడువు అగుదువు అని చెప్పగా అగ్ని శాంతించెను. 
              భృగు మహర్షి కుమారునకు ఉపనయనము చేసి బ్రాహ్మణులకు ముఖ్యమయినది,జీవిత పరమావధి కలిగించేది తపస్సు మాత్రమే అని చెప్పి తపోవనమునకు పంపెను.,చ్యవనుడు తల్లిదండ్రులకు నమస్కరించి వారి ఆశీర్వాదము తీసుకుని బయలుదేరి వైదూర్య పర్వత ప్రాంతమునకు వెళ్ళి తపోవృత్తిలో ఉండెను,ఇలా కొన్ని వేల సంవత్సరములు గడిచి వృద్ధుడు అయ్యెను.ఆతని పయి పుట్టలు పెరిగి దాని మీద పూల తీగలు అల్లుకొని ఉండెను. 
           ఇట్లుండగా ఒక రోజు సంయాతి అను రాజు కుటుంబ సమేతముగా ఆ సరస్సునకు జలక్రీడల కొఱకు వచ్చెను.రాజ కుమార్తె అగు సుకన్య ప్రక్రుతి అందాలు చూచుచూ చ్యవనుడు తపస్సు చేయు పుట్ట దగ్గరకు వచ్చి, చుట్టూ లతలతో అల్లుకున్న ఆ పుట్టనుండి చ్యవనుని నేత్రములు సూర్య గోళముల వలే మెరయుచూ కనపడగా ఇది ఏమి అని ఆమె ఆ కన్నులను పొడిచెను. ఇది తెలిసి చ్యవనుడు సంయాతి సైన్యమునకు మూత్ర నాళములు  స్తంభింప చేసెను, రాజు ఇది ఏమి ఇలా జరిగింది అని ఆలోచించు చుండగా కుమార్తె సుకన్య వచ్చి తాను పుట్టలో చూసిన వింత చెప్పి పొడిచినట్టుగా చెప్పినది.సంయాతి అది విని అచ్చటకు వెళ్లి చూడగా అతి వ్రుద్దుడగు చ్యవనుని చూసి క్షమింపుము అని వేడుకొనెను. అందులకు చ్యవనుడు నీ కుమార్తెను ఇచ్చి వివాహము చేసిన క్షమింతును అని చెప్పెను. రాజు ఒప్పుకుని కుమార్తెను అడుగగా ఆమె కూడా ఇంత మంచి తపోధనునకు భార్య అగుటకు సంతోషము గా ఒప్పుకొనెను.అందులకు రాజు సంతోషము చెంది అచ్చటనే వారి ఇరువరుకూ వివాహము చేసి నగరమునకు పోయెను.
        సుకన్య కూడా తనకు బ్రహ్మర్షి అయిన భర్త లభించినందులకు సంతోషము చెంది తుచ్ఛ దేహ వాంఛలను త్యజించి భర్త సేవలోనే పరమార్ధము ఉన్నదని గ్రహించి  భర్తకు సేవలు చేయుచుండెను.
      ఇట్లుండగా ఒకనాడు ఆశ్వనులు ఆమెను చూసి ఆమె అందమునకు ఆచ్చర్య పోయి నీవెవరు అని వివరములు అడిగెను, అందులకు ఆమె సంయాతి కుమార్తెను, మరియు చ్యవన మహర్షి భార్యను అయిన సుకన్య ను అని తెలిపెను. అందులకు వారు త్రిలోక సుందరివి అయిన నీవు ఆ వృద్ధ మహర్షికి భార్యవయి  శరీర సుఖములను ఏమి పొందుతావు, మంచి అందగాడిని చూసుకొమ్మని చెప్పెను, అదివిని మహాత్ములారా మీకు నాపై ఇంత దయ ఎందులకు, పరమ పావనుడగు భర్తకు ఇతోదికముగా పాద సేవ చేసుకొను చున్నాను చాలు అని చెప్పి భర్త వద్దకు వెళ్లి ఈ విషయము చెప్పెను. అందులకు మహర్షి వారు చెప్పినట్లే చేయుము అని చెప్పెను, అందు ఉన్న మర్మము తెలిసి వారి వద్దకు వచ్చి మీరు చెప్పినట్లే చేయుదును అని చెప్పగా వారు బ్రహ్మానందము చెంది ప్రక్కన ఉన్న సరస్సునందు మునిగి నవ యువకులు అయ్యెను, వారితో పాటు చ్యవనుడు కూడా అందు మునిగి నవయువకుడు అయ్యెను.ముగ్గురునూ సుకన్య వద్దకు రాగా ఆమె తన భర్త చ్యవనుని గుర్తించి చెప్పెను. అప్పుడు అశ్వని దేవతలు ఆమె పాతివ్రత్యమునకు మెచ్చి అభినందించెను.చ్యవనుడు కూడా అశ్వని దేవతల వలెనే తనకు కొత్తరూపు వచ్చినదని తలచి అంతవరకూ అశ్వని దేవతలకు లేని సోమ పీఠం ఇప్పించెదనని వాగ్దానము చేసెను.
        చ్యవనునకు  నూతన రూపము వచ్చెనని తెలిసి సంయాతి రాజు చూచుటకు రాగా , దేశ అభివృద్ది కొఱకు వారిచే ఒక యజ్ఞము చేయించెదను అని చెప్పగా రాజు కూడా సంతోషించి అల్లుడుని, కుమార్తెను తన రాజ్యమునకు ఆహ్వానించెను. ఒక శుభ ముహూర్తమున చ్యవనుడు భార్యా సమేతుడయి  రాజ్యమునకు వెళ్లి ఇంద్రాది దేవతలను ఆహ్వానించి యజ్ఞము మొదలు పెట్టెను.చ్యవన మహర్షి తను అశ్వని దేవతలకు ఇచ్చిన మాట ప్రకారము వారికి సోమము ఇవ్వబోగా ఇంద్రుడు వారిని అడ్డగించెను. ఇంద్రుని మాటలు లెక్క చేయక చ్యవనుడు తన పని తను చేయుచుండగా ఇంద్రుడు కోపించి తన వజ్రాయుధము తీసెను, చ్యవనుడు ఇంద్రుని చేయి ఎత్తినది అట్లే ఉండునని పల్కి అగ్నిహోత్రము నుండి మదుడు అను రాక్షసుని ఉద్భవింప చేసెను . ఆ రాక్షసుని చేతులు వేయి యోజనముల పొడవు, నాలుక భయంకరముగా ఉండుట చూచి ఇంద్రుడు క్షమాపణ కోరెను. చ్యవనుడు ఆ రాక్షసుని ఉపసంహరించి, అశ్వని దేవతలకు సోమ పీఠం  ఇచ్చి తన మాట నిలుపుకొనెను.చ్యవనుడు తన తపః ప్రభావము చూపిన ప్రదేశము అగుట వలన  ఆ పర్వతము    " ఆర్చిక పర్వతము " గా ప్రసిద్ధి పొందినది.
         మరి యొక సారి ఇంద్రుడు గర్వముతో చ్యవనుని పై కోపించి ఒక పర్వతమును విసరగా చ్యవనుడు ఆ పర్వతము తిరిగి ఇంద్రుని మీదే పడునట్లు చేసెను. అంత ఇంద్రుడు మూర్చ పోగా చ్యవనుడు ఇంద్రునకు ఏ బాధా లేకుండా చేసి మూర్చనుండి తెరుకునేట్లు చేసెను.ఇంద్రుడు సిగ్గుపడి వెళ్ళిపోయెను. చూచితిరి కదా మన ఋషుల గొప్పతనము.అపకారికి కూడా ఉపకారము చేసి లోకము ఇలా ఉండవలెను అని అర్ధము చెప్పిరి.వారు ఆత్మజ్ఞానులు,అహంకారము మమకారములు లేని వారు, ఎదుటి వారి యందు ఉన్న రజస్తమో గుణములు అణచుటకు శపించుట విరమింప చేయుట వారికే స్వంతము.
          నవయువకుని రూపము వచ్చిన చ్యవనుడు భార్యతో నేను ముసలివాడను అనికూడా ఆలోచించక నన్ను వివాహమాడి నీ ప్రకృతి సిద్ధమయిన కోర్కెలను చంపుకున్నావు, నీవంటి సతీమణులకు ఏమి చేసిననూ తక్కువే కదా , నీకు ముగ్గురు కుమారులను అనుగ్రహించెదను అని చెప్పి సంసార సుఖములు అనుభవించగా కాలక్రమమున వారికి దధీచి, ప్రమతి,ఆప్రవానుడు అను ముగ్గురు కుమారులు కలిగెను.మహా తపస్సంపన్నులగు ఋషులు వాంఛ కొఱకు కాకుండా లోక కళ్యాణము చేయు సంతానము  కొఱకు మాత్రమె సంసార జీవనము చేయుదురు.
            ఒకనాడు చ్యవనుడు నర్మదా నదిలో స్నానము చేయుచుండగా ఒక పెద్ద పాము అతనిని పట్టుకొని పాతాళ లోకమునకు ఈడ్చుకు పోయెను.ముని పరమేశ్వరుని ధ్యానించగా ఆ పాము విషము తనకు ఏమియు చేయలేదు. ఆ పాము అతనిని పాతాళమునకు తీసుకొని పోయి నాగ కన్యల మధ్యన వదిలెను. అప్పుడు పాతాళ రాజు అయిన ప్రహ్లాదుడు ఇంద్రుడే తమ రహస్యములు తెలుసుకొనుటకు ఈయనను పంపెను అని తలచి ఋషిని అడిగెను. అందులకు చ్యవనుడు నాకు ఇంద్రునితో పనిలేదు, నేను చ్యవనుడను, నర్మదా నదిలో స్నానము చేయుచుండగా ఒక పెద్దపాము ఇచ్చటకు తెచ్చెను అని చెప్పెను. అప్పుడు ప్రహ్లాదుడు ఓ మునివర్యా మా తప్పును క్షమించి, మీరు మునివర్యులు కదా మీరు తిరుగని ప్రదేశములు, తీర్ధములు ఉండవు కదా వాటి గురించి మాకు వివరముగా తెలుపుమని వేడుకొనెను. 
             అప్పుడు చ్యవనుడు ప్రహ్లాదా నీవు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రుడవు.నీ ప్రశ్నలకు తప్పక సమాధానము చెప్పెదను. చిత్తశుద్ధి లేకుండా తీర్ధ యాత్రల వలన ప్రయోజనము లేదు.మనస్సు నిర్మలముగా లేకుండా ఏ నదిలో మునిగిననూ ఉపయోగము లేదు.తీర్ధ యాత్రలు చాలా కష్టమయినవి. అక్కడ చేసిన పాపములకు పరిహారము లేదు.తీర్ధ యాత్రలు చేయుటకన్నా ఇతరుల యందు దయచూపించుట, సత్యమునే పలుకుట,దాన ధర్మములు చేయుట ఉత్తమము. అట్లు చేసిన వారికి తీర్ధయాత్రలు చేసిన ఫలములు కలుగును.అయిననూ నైమిశము, చక్రతీర్దము,పుష్కరము ఈ మూడు శ్రేష్టములగు  భూలోక తీర్ధములు అని చెప్పెను.ప్రహ్లాదుడు మహర్షి మాటలు విని సంతోషముగా భక్తితో చ్యవనుని పంపెను.
          ఒక సారి మధుడు అను రాక్షసుడు శివుని గూర్చి తపస్సు చేసి తిరుగులేని శూలమును పొంది తన తరువాత తన కుమారులకు కూడా ఉపయోగ పడునట్లు వరమును  పొందెను . శివుడు శూలమును ఇచ్చి ఇది తన చేత ఉండగా శత్రువులు జయించలేరు అని పలికెను.శూలము లేకుండా యుద్ధము చేసిన నీకు మరణము సంభవించును అని చెప్పెను మధుడు కుంభీనసి అను రావణుని చెల్లిని వివాహ మాడెను.వారికి లవణుడు అను రాక్షసుడు కలిగెను, కొంతకాలమునకు మధుడు చనిపోగా లవణాసురుడు ఆ శూలము ధరించి మునులను నానా బాధలు పెట్టుచుండెను.ఈ లవణాసురుని ఎలా సంహరించాలి అని ఋషులందరూ  కలిసి చ్యవనుని ఉపాయము అడిగెను. చ్యవనుడు ఋషులు అందరితో కలిసి శ్రీరాముని వద్దకు వెళ్లి ఈ వృత్తాంతము తెలుపగా శ్రీ రాముడు తన సోదరుడు అయిన శత్రుఘ్నుని పంపెను. శత్రుఘ్నుడు సేనను వెంటపెట్టుకొని వెళ్ళుచూ త్రోవలో వాల్మీకి ఆశ్రమమున విశ్రమించి అక్కడే సీతా మహాసాధ్వి కుశలవులను ప్రసవించెను అని తెలుసుకొని చ్యవన మహర్షి ఆశ్రమమునకు వచ్చెను. చ్యవనుడు ఆతనిని ఆహ్వానించి లవణాసురుని కధ చెప్పి అతని చేతిలో శూలము లేని సమయము నందు మాత్రమె సంహరించవలెనని చెప్పెను.శత్రుఘ్నుడు చ్యవనునకు నమస్కరించి వెళ్లి లవణాసుర వధకావించెను .  ఋషులు అందరూ సంతోషించి తమ తమ యజ్ఞ యాగాదులు నిర్వహించుకొనెను.
           చ్యవన మహర్షి మహా తపోనిష్ఠాగరిష్టుడు అయి ఆత్మ తపోబలముతో లోక హితార్ది అయి మన మహర్షులలో ఉత్తమునిగా వేలుగొందెను. 
        చ్యవనుడు  " శ్రీవత్సస "  గోత్రమునకు ఒక మూల పురుషునిగా  వెలుగొందెను. 

No comments:

Post a Comment

Pages