హస్త కళల విదుషీమణి – రచయిత్రి లక్ష్మి రాఘవ - అచ్చంగా తెలుగు

హస్త కళల విదుషీమణి – రచయిత్రి లక్ష్మి రాఘవ

Share This
హస్త కళల విదుషీమణి – రచయిత్రి లక్ష్మి రాఘవ
భావరాజు పద్మిని

ఆవిడ పేరు కే.వి. లక్ష్మి, కలం పేరు లక్ష్మి రాఘవ. వీరు రాసిన చక్కటి కధల్ని మనం మునుపు అచ్చంగా తెలుగు పత్రికలో, ఇతర పత్రికల్లో చదివి ఉన్నాము. అయితే, వీరికి చిత్రకళలో, హస్త కళల్లో కూడా విశేషమైన ప్రతిభ ఉంది. లక్ష్మి గారితో ప్రత్యేక ముఖాముఖి ఈ నెల మీకోసం...



మీ బాల్యం కుటుంబ నేపద్యం గురించి క్లుప్తంగా చెప్పండి.
నేను పుట్టింది గట్టుఅన్న చిన్నగ్రామం. మదనపల్లికి దగ్గరగా చిత్తూరు జిల్లా, ఆంద్రప్రదేశ్ లో వుంది.
కుటుంబ నేపద్యం భూస్వాములు మరియు రాజకీయాలలో రాణించిన వారు.
మా కుటుంబం లో తొమ్మిది మంది పిల్లలం. నా నెంబరు మూడు. స్కూలు ఐదవతరగతి దాకా గట్టు లోనూ, హైస్కూలు చదువు మదనపల్లి లోనూ, మలి చదువు PhD దాకా హైదరాబాదు జరిగింది. వ్యక్తిగా ఎదిగిందీ వృత్తిలో స్థిరపడిందీ హైదరాబాదు లోనే. హైదరాబాదు ఎక్జిబిషన్ గ్రౌండ్స్ లోని వనితామహావిధ్యాలయ లో లెక్చరర్ గా చేరి , రీడర్ గా ఎదిగి పిల్లలందరూ సెటిల్ అయ్యాక ఉద్యోగాన్ని వాలంటరీ గా వదలుకుని సొంతవూరు కురబలకోట చేరడం జరిగింది.
చిన్నప్పటినుండీ బొమ్మలు వేసే వారా? చిత్రకళ పట్ల మీకు మక్కువ ఎలా కలిగింది?

చిన్నప్పటి నుండీ కళలపై మక్కువ. ఎలిమెంటరీ స్కూ ల్లో వున్నప్పడే పెన్సిల్ తో బొమ్మలు వేయటం వేసేదాన్ని.
ఏడవతరగతిలో నాకు డ్రాయింగ్ లో మొదటి బహుమతి వచ్చింది.
మీ ఇంట్లో ఆర్టిస్టు లు ఎవరైనా వున్నారా?
 మా మేనమామ మంచి ఆర్టిస్టు. ఆయన వేసిన పెయింటింగ్స్ చాలా ఇష్టం. బహుశా అదే నాకు ప్రేరణ అయి వుండవచ్చు.
మీ గురువులు, మీరు అభిమానించే చిత్రకారులు ఎవరు?
గురువులు అంటూ ఎవరూ లేరు. ఆకాలం లో నేర్పించాలన్న వూహే వుండేదికాదు. నేను ఎక్కువగా అభిమానించింది బాపూ బొమ్మలని. ఇంకా వడ్డాది పాపయ్య యువమీద వేసే బొమ్మలని వెయ్యాలని ప్రయత్నం చేసే దాన్ని.
మీ చిత్రకళా ప్రస్థానం ఎలా మొదలైంది ?
నాలగవ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారిగా న్యూస్ పేపర్ లో వచ్చిన లక్స్ సోప్ కోసం వచ్చే ఆడపిల్ల ముఖం చాలా నచ్చి పెన్సిల్ తో వేసిన గుర్తు. ఆ తరువాత కూడా ఎక్కువగా పెన్సిల్ తో బొమ్మలు వేసేదాన్ని.
మీ రచనా ప్రస్థానం గురించి చెప్పండి.

కొన్ని సంఘటనల కు స్పందన కలిగినప్పుడు రచనలు చేయాలన్నకోరిక బలీయమై కథలు రాయటం మొదలై 1966 లో ఆంద్ర సచిత్ర వార పత్రికలో నా మొదటి కథ సరోజప్రచురింపబడింది. తరువాత కుటుంబ బాధ్యతలతో రచనలు అప్పుడప్పుడూ మాత్రమె చేయగలిగేదాన్ని.
రిటైర్మెంట్ తరువాత మా స్వంత వూరు కురబలకోటఅనే చిన్న పల్లె చేరాక కావలసినంత తీరిక దొరికి మళ్ళీ రచనలు చెయ్యడం ఒక ఎత్తు అయితే అమెరికా లో పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు సరదాకు నేర్చుకున్న కంప్యూటర్ పరిజ్ఞానం ఏంతో ఉపయోగపడుతూ వుంది. ఉన్నది పల్లె అయిన ఇంటర్నెట్ , ప్రింటర్ అందుబాటులో వుండటం మరో ఎత్తు! అంతర్జాల దర్సనం నన్ను ప్రపంచం లోని విశేషాలకు దగ్గర చేసింది. ఒక వైపు రచనలు
మరో వైపు ఆర్టు వర్క్ తో నాకు రోజుకు 24 గంటలు చాలవని అనిపిస్తుంది.
నా కథ ల్లో కల్పితాలకంటే వాస్తవాలు ఎక్కువ కనబడతాయి. వర్ణనలూ, వూహలూ తక్కువకాబట్టి చదివినవారికి తమ జీవితాల్లో ఎక్కడో ఇలా జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది.
ఇప్పటి దాకా రెండు కథా సంపుటాలు వేసుకున్నాను. మొదటిది నావాళ్ళు” 27 కథలతో వెలువడింది. 2014 లో ఉత్తమ కథా సంపుటిగా చిత్తూరు కుప్పం రెడ్డెమ్మ అవార్డు వచ్చింది.
రెండవ కథా సంపుటి అనుబంధాల టెక్నాలజీ” 2016 లో వెలువడింది. రాసిన కథలు ప్రచురిస్తున్న కొన్ని పత్రికలు కథతో బాటు ఫోన్ నెంబరు ఇవ్వటం తో చదివినవారి స్పందన వెంటనే తెలియటం చాలా ఆనందంగా వుంది.
మీరు పొందిన అవార్డులు, మర్చిపోలేని ప్రసంసల గురించి చెప్పండి.
నేను పుట్టిన కాలం లో [1948 ] ముఖ్యంగా రాజకీయనేపద్యం కలిగిన కుటుంబ౦లొ నేను వేసిన బొమ్మలను చూసి మెచ్చుకున్న దాఖలాలు లేవు. కళలను ప్రోత్చాహించాలన్న వూహ కూడా వుండేది కాదు.

పెళ్లి అయిన తరువాతి కాలం లో స్వతహాగా నాలో వున్న ఆర్టిస్టు హృదయం తో బొమ్మలను వేస్తూ ఎదిగాను .అంతే. చూసిన వారు బాగుందని మెచ్చు కుంటూ వుంటే సంతోషించేదాన్ని. అలాగే నాకు నచ్చిన కళ లని వృద్ది చేసుకోసాగాను.
పెయింటింగ్స్ వేయటం ఇష్టం. వాటర్ కలర్, ఆయిల్ పెయింటింగ్స్ వేయటం చాలా ఇష్ట పడతాను. పోట్రెయిట్ పెన్సిల్ స్కెచెస్ వేసాను. ఇప్పటికీ చేస్తున్నాను.
ఏది కొత్తగా చూసినా చేసేసేయ్యాలనే తపన అందుకే కలకత్తా లో కాపురం వున్నప్పుడు చాలా నేర్చుకున్నాను.Rajasthan Jharokas. Murals. Earthan pots with 3 dimensional figures, 3D name plates. Tanjore paintings, Decoupage, Lamosa ఇలా ఎన్నో నేర్చుకున్నాను. చేసిన ప్రతిసారి ఎంతో చాలా సంతృప్తి చెందుతాను.
రిటైర్మెంట్ తరువాత మా స్వంత వూరు కురబలకోట అనే చిన్న పల్లె చేరాక కావలసినంత తీరిక దొరికిన మళ్ళీ [మొదటికథ ప్రింట్ అయ్యింది 1966 లో ] రచనలు చెయ్యడం తో నాకు రోజుకు 24 గంటలు చాలవని అనిపిస్తుంది . బతికున్న ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలన్న తపన వుంది.
నాబ్లాగ్ పేరు బామ్మగారి మాటదానిని 20007 లో స్టార్ట్ చేసినా ఈమధ్య ఎక్కువ రాయటం లేదు. పేస్ బుక్. వాట్స్ అప్ అలవాటు అయ్యాక బ్లాగు లో రాయటం తగ్గించాను. కానీ ఇప్పటికీ నా మనో భావాలు రాసుకోవడానికి బ్లాగే సరి అయినదని అబిప్రాయం!
కలకత్తా లో వున్నప్పుడు బట్టలపై వేసే బ్లాక్[block ] ప్రింటింగ్ నేర్చుకున్నాను. రిటైర్మెంట్ తరువాత మా పల్లెలో ఒక కుటీర పరిశ్రమగా పెట్టాలని ప్రయత్నం చేసినా ప్రజలు స్పందించక చేయలేకపోయాను.
అయినా శారీస్ మీద బ్లాక్ ప్రింటింగ్ చేస్తాను. క్రియేటివ్ డిజైన్ చేస్తే ఏంతో సంతృప్తి గా వుండేది. ఫాబ్రిక్ పెయింటింగ్ ఎన్నోప్రక్రియలు ట్రై చేసాను.
వేస్టు వస్తువులతో ఎన్నో వస్తువులు చేసాను. కలకత్తా లో వున్నప్పుడు ఎక్జిబిషన్ పెట్టాను కూడా.
మా వూరు చేరాక వీటిని చూసిన కొంతమంది ప్రోద్బలం తో స్కూల్స్ లో కూడా ఎక్జిబిషన్ పెట్టాను.
తరువాత పిల్లలు కూడా చాలా క్రియేటివిటీ చూపడం ఆనందం కలుగ చేసింది.
మీ అభిరుచులకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా వుంటుంది?
చిన్నప్పడు నా లోని ఆసక్తిని గుర్తించలేదు ఎవరూ..పెద్దకుటు౦బ౦ అయినందువల్ల లేదా అప్పటి కాలం లో అంత శ్రద్ద చూపే ఇంట్రెస్ట్ ఎవరికీ లేకపోవడం వల్ల అయివుండవచ్చు.
కానీ పెళ్లి అయినాక నన్ను ప్రోత్సహించినది నా భర్త డా. కామకోటి రాఘవరావు గారు. నన్ను మెచ్చు కోవడమేకాడు తప్పులను నిర్మొహమాటంగా చూపేవారు దానితో నేను ఏది చేసినా పర్ఫెక్ట్ గా వుండాలని ట్రై చేసేదాన్ని.
భావి చిత్రకారులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

అ. మీలో ఆసక్తి వుంటే మీకు నచ్చిన ఏ కళ నైనా వదిలి పెట్టకుండా చేయండి. ఇప్పటి తల్లితండ్రుల ప్రోత్సాహం కూడా చాలా వుంటోంది. నేను నాపిల్లలను చాలా ప్రోత్సహించాను.
ఇలాటి హాబీస్ జీవితం లో ఏంతో సంతోషాన్ని, తృప్తిని ఇస్తాయి. ఉద్యోగం లో రిటైర్మెంటు వుంటుంది. కళ కు రిటైర్మెంట్ వుండదు. జీవితంలో నిజమైన సంతోషం మనం కళలలో జీవించినప్పుడే!!
లక్ష్మి రాఘవ గారు మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షిస్తోంది - అచ్చంగా తెలుగు . 

బొమ్మల కొలువు ..






No comments:

Post a Comment

Pages