Friday, February 24, 2017

thumbnail

వద్దు సుమ్మీ చెప్పితిని వలలఁ బడఁగ వద్దు

వద్దు సుమ్మీ చెప్పితిని వలలఁ బడఁగ వద్దు

డా. తాడేపల్లి పతంజలిఅవతారిక

తాళ్లపాక చినతిరుమలాచార్యుల వారు ఈ కీర్తనలో భక్తునికి జన్మపు వలలలో పడవద్దని హెచ్చరిస్తున్నారు.
వద్దు సుమ్మీ చెప్పితిని వలలఁ బడఁగ వద్దు
పెద్దరికాన దేవునిఁ బేరుకొన రాదా  ॥పల్లవి॥
పల్లదపు సంసారానఁ బాయలేక తిరిగేవు
చెల్లఁబో జీవుఁడ యింకా సిగ్గు గాదుగా
వెల్లవిరి నింతయాల వెనకముందరిపాటు
దళ్లాలితనము మాని తలఁచుకో రాదా      ॥వద్దు॥
వెయ్యైనా మీఁద మీద వేసరక కోరేవు
అయ్యో యింకా నిందు కాసపడేవా
వొయ్యనె వెనకజన్మ మొక్కటొక్క టెంచి చూచి
తియ్యని విష్ణుభక్తి తెలుసుకో రాదా ॥వద్దు॥
యేపు మీరి యేమైనా నింపులు సేసుకొనేవు
పో పో యింకా రోఁత వుట్టదాయఁగా
చేపట్టి కాచేయట్టి శ్రీవెంకటనాథుఁడె
దాపై వున్నాఁ డిదె దరిసించ రాదా  ॥వద్దు॥
(అధ్యాత్మ సంకీర్తన=రేకు: 6-1సంపుటము: 10-31తాళ్లపాక చినతిరుమలాచార్య)

అర్థ తాత్పర్యాలు

వద్దు సుమ్మీ చెప్పితిని వలలఁ బడఁగ వద్దు
పెద్దరికాన దేవునిఁ బేరుకొన రాదా  ॥పల్లవి॥
ఓ భక్తుడా ! వద్దు సుమీ ! జన్మలనే వలలలో పడవద్దు.
గౌరవముతో దేవుని పేరు పెట్టి పిలువరాదా!(స్వామి నామాన్ని జపించమని సందేశం)
01వ చరణము
1.1.పల్లదపు సంసారానఁ బాయలేక తిరిగేవు
1.2.చెల్లఁబో జీవుఁడ యింకా సిగ్గు గాదుగా
1.3.వెల్లవిరి నింతయాల వెనకముందరిపాటు
1.4.దళ్లాలితనము మాని తలఁచుకో రాదా ॥వద్దు॥
1.1.వ్యర్థ భాషణాలు కలిగిన, గర్వప్రవృత్తితో నిండిన ఈ సంసారాన్ని విడువకుండా తిరుగుతున్నావు.
1.2.అంతా  అయిపోతోంది.(Alas! It is all over!) కాలం గడిచిపోతోంది. ఓ జీవుడా ! ఇంకా సిగ్గు కాదు కదా !( సిగ్గు తెచ్చుకొని  దైవ స్మరణ చేయుమని సందేశం)
1.3.కోరికల గొడవలు  పెట్టుకొంటూ, తికమకల ఆపదలలో జీవితాన్ని వ్యాపింపచేసే
1.4.మోసగాని లక్షణం మాని  స్వామిని  తలచుకోరాదా? (స్వామిని తలచుకొమ్మని సందేశం)
02వ చరణము
2.1.వెయ్యైనా మీఁద మీద వేసరక కోరేవు
2.2.అయ్యో యింకా నిందు కాసపడేవా
2.3.వొయ్యనె వెనకజన్మ మొక్కటొక్క టెంచి చూచి
2.4.తియ్యని విష్ణుభక్తి తెలుసుకో రాదా    ॥వద్దు॥
2.1.అనేక జన్మలైనప్పటీకీ , పై పై జన్మలను శ్రమపడక కోరుచున్నావు.
2.2.అయ్యో! ఇంకా ఈ లోకంలోని ఈ జన్మలకు ఆశపడుతున్నావా?!
2.3.నెమ్మదిగా, వరుసగా వెనుక జన్మలను ఒక్కటొక్కటిగా లెక్కించి
2.4.తియ్యగా ఉండే రుచిగా ఉండే విష్ణు భక్తిని తెలుసుకోరాదా!
03వ చరణము
3.1.యేపు మీరి యేమైనా నింపులు సేసుకొనేవు
3.2.పో పో యింకా రోఁత వుట్టదాయఁగా
3.3.చేపట్టి కాచేయట్టి శ్రీవెంకటనాథుఁడె
3.4.దాపై వున్నాఁ డిదె దరిసించ రాదా     ॥వద్దు॥
3.1.బాగా ఎదిగి, వృద్ధి అవటానికి ఎత్తులు వేసి ఏమైనా ఎత్తులు వేసి ఈ జన్మలో ఆనంద కార్యక్రమాలు చేసుకొంటున్నావు.
3.2.పో పోరా ! ఇంకా రోత నీకు పుట్టలేదు కదరా !
3.3.అనుగ్రహించి, కాపాడే శ్రీ వేంకటేశ్వరుడే
3.4.సమీపంలో ఉన్నాడు. ఇదుగో  ఒకసారి దర్శించుకోరాదా!
ప్రయోగ విశేషాలు
001.కాదుగా( =కాదు కదా!)
ఈ ప్రయోగము రామదాసులవారి కీర్తనలో కూడా కనిపిస్తుంది.
రామా నీచేతేమి కాదుగా సీతాభామకైన చెప్పరాదుగా శ్రీ రా..
అను పల్లవి:
సామాన్యులు నన్ను సకలబాధలుపెట్ట
నామొరాలకించి మోమైన జూపవేమిరా రా.
-------------------------------------------------------------------------------------------------
002.వెల్లవిరి(= వ్యాపించు)
"వెల్లవిరాయను మాయవెనకాముందు." [తాళ్ల-5-256]
--------------------------------------------------------------------------
  1. దల్లాళితనము(=మోసగాని లక్షణం)
చల్లఁగా నేమిది చూచి సంతోసించుకొంటేను, దల్లాళితనము తోడ తానేల నవ్వీని." [తాళ్ల-13-385]
  1. వల
వల శబ్దాన్ని  నైషధంలో  కామము అనే అర్థంలో ప్రయోగించినట్లు శబ్దరత్నాకరం చెప్పింది. (కాదంబరిఁ ద్రావింతును, జూదంబాడింతు వలలఁజొక్కులఁ బెట్టం బైదలుల నియోగింతును, వైదర్భతనూజమీఁది వలపుడిగింతున్‌." నై.) కనుక వలలఁ బడఁగ వద్దు  అంటే    కోరికలలో పడవద్దు  అనికూడా ఇంకొక అర్థంగా  చెప్పుకోవచ్చు.
----------------------------------------------------------------------------
  1. వెయ్యైనా(= అనేకమైనా)
సహస్ర శబ్దానికి దైవ స్తుతిలో అనేకమని అర్థం ఎలా చెప్పుకొంటామో, ఇక్కడ వేయి శబ్దానికి  కూడా అనంతమని అర్థం.
“రావణకుంభకర్ణ ద్విపేంద్రములకు సింగంపువేయి మా రంగశాయి." పాంచాలీ పరిణయము కాకుమాను మూర్తికవి)
--------------------------------------------------------------------------------------------
  1. ఒక్కొక్కటెంచి(=ఒక్కటొక్కటిగా లెక్కించి)
పూర్వ జన్మలను మనం ఎలా లెక్కిస్తాము?
బహునిమేవ్యతీతాని జన్మాని/తవచార్జున - జీవునికి రకరకాల జన్మలున్నాయి అంటాడు శ్రీకృష్ణుడు గీతలో.
సిద్దులైన పరమగురువులు శతాబ్దాల తరబడి చేయ వలసిన లోక శ్రేయస్సు, ప్రణాళికలకు అలవాటు పడతారు గనుక వారి పూర్వాపర జన్మల జ్ఞానం చత్వారం లేకుండా ఉంటుంది. నిద్రపోయి లేచినవాడు నిన్నటి పని ఎలా పూర్తి చేసుకుంటాడో ఈ గురువులు పూర్వజన్మ ప్రణాళికను అలా పూర్తి చేస్తూ ఉంటారు.( మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య ఇ.కె.)శ్రీ వేంకటేశుని దయను పొందినవారు ఇకె చెప్పినట్లుగా సిద్దులైన పరమగురువులవుతారని వారు పూర్వాపర జన్మల జ్ఞానం కలిగి ఉంటారని , వాటిని లెక్కించగలరని కవి ఉద్దేశ్యము కావచ్చు.
స్వస్తి.
****

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information