సేవామృతం - అచ్చంగా తెలుగు

సేవామృతం 

శశిరేఖా లక్ష్మణన్


అమృత సంఘసేవకురాలు. సేవ అనే సంస్థ స్థాపించి ఎందరినో పేదరికమనే దిగువ రేఖ నుండి పైకి తెచ్చింది. ఎందరినో నిస్వార్థ సేవకులను తన సేవ సంస్థ ద్వారా సత్కరించింది. ప్రతి సంవత్సరం సమాజంలో నిస్వార్థంగా సేవ చేసే యువజనులకు అవార్డులందించి ప్రొత్సహించింది.
అమృత ఆగర్భ శ్రీమంతురాలు. దాదాపు డెబ్భై ఏళ్ళ వనిత. తన పిల్లలందరూ పెద్దవారై స్థిరపడ్డాక భర్త రాఘవరావుతో కలిసి పదేళ్ళ ముందు ఈ "సేవ" అనే సంస్థను ప్రారంభించింది.
మొదట పేదపిల్లలకు ఫీజులు కట్టడం, బడుగు వర్గాలకు భోజన వసతులు కలిగించడం లాంటివి తన స్వీయ ఆస్తిని అమ్మి నిర్వహించసాగింది. మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.కానీ కాలక్రమేణా "సేవ" ఇంతింతై వటుడింతై అన్నట్లు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆదర్శమయ్యింది.
చాలామంది తామెలాగూ "సేవ" చేయలేమని డొనేషన్లను ఇవ్వసాగారు. అమృత వారందరికీ తమ ఆశ్రమం లో జరిగే కార్యక్రమాలకు హాజరయితేనే డొనేషన్ స్వీకరిస్తామని ప్రకటించింది. ఆ విధంగా "సేవ" ఆశ్రమంకు మరింత విస్త్రత ప్రచారం ప్రజలే అందించారు.
ఆశ్రమంలో వృద్ధులకు వసతి సౌకర్యాలు, పేద మరియు అనాథ పిల్లలకు చదువు చెప్పడం, వ్యాధిగ్రస్థులకు ఉచితవైద్యం చేయడం ఇలా చాలా కార్యక్రమాలు వంకలు పెట్టేందుకు వీలు లేకుండా పకడ్భందీగా అమృత నిర్వహించేది.
అయితే తనకు వయసైపోతుండడంతో ఈ బాధ్యతలు ఎవరైనా నమ్మకస్థులకు అప్పగించి తను పర్యవేక్షిస్తే చాలు అని భావించింది. కారణం రాఘవరావుకు డెబ్భై ఏడేళ్ళు. షుగరు మరియు బిపి ఉంది. ఆయన ఆరోగ్య బాధ్యతలు అమృత పైన పడడంతో "సేవ" ను ఎవరికైనా అప్పగించాలని భావించింది. అయితే తగినవారి కోసం అన్వేషిస్తోంది.
ఆమె క్రింద ఇప్పుడు దాదాపు రెండొందల మంది పని చేస్తున్నారు. అందరూ చక్కగా విధి నిర్వహణలో ఉన్నారు. అనాథ పిల్లలకు చదువు చెప్పే టీచర్లకు జీతభత్యాలివ్వడం, వృద్ధులకు సేవ చేసే నర్సులకు,
ఆశ్రమం శుభ్రం చేసే ఆయాలకు జీతాలివ్వడంతో పాటు ఆశ్రమంలోనే వారికి వసతి సౌకర్యాలు అందింపజేసింది.
అమృత ఒకరోజు ఆసక్తికరమైన వార్త పేపర్లో చదివింది.
ఒక నవ వధువు పెళ్ళైయినాక... గ్రామం నుండి సిటీలోని అపార్ట్మెంట్ కు భర్తతో కొత్తకాపురానికి వచ్చింది. అయితే వచ్చినరోజే అపార్ట్ మెంట్ లో సరకులు కొనే అంగడికి వెళ్ళి వెచ్చాలు తేవాలని వెళ్ళినప్పుడు దారి తప్పి దాదాపు గంట సేపు పచార్లు చేసి కొందరు అల్లరిమూక బారిన పడింది.
వారి నుండి తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేసింది. అప్పుడు ఆ అపార్ట్ మెంట్ కు చెందిన ఒక యువకుడు ఆమెను రక్షించి ఆమె భర్తకు అప్పగిస్తే చిరిగిన చీర, రవికలతో ఉన్న ఆమెను ఆమె భర్త సందేహించి... శీలపరీక్ష చేసి నిరూపించుకుంటేనే కాపురం చేస్తానని ఆమెను ఆమె ఇంటి పెద్దలను పిలిపించి పుట్టింటికి పంపించాడు.
అయితే వారి వివరాలు గోప్యంగా ఆ వార్తాపత్రికలో ఉంచినా అపార్ట్ మెంట్ పేరు మర్మంగా ప్రస్తావించారు.
సిటీలో అయిదు వందల ఫ్లాట్ లు గల ప్రముఖ అపార్ట్మెంట్ అని.
అటువంటి అపార్ట్మెంట్ల గురించి, ఆ సంఘటన గురించి తన సన్నిహిత సెక్రటరీ వాణితో సంప్రదించింది అమృత.
"అయ్యో రామా...!!! ఆ కథ మీ వరకూ వచ్చిందా...!!!అది "నీరజ్ అపార్ట్ మెంట్స్ అనే మా 500ఫ్లాట్స్ గల అపార్ట్ మెంట్ లోనే జరిగింది. ఆ అమ్మాయి చిన్న గ్రామం లాంటి పట్టణంలో చదివిన తులసి. తను పెళ్ళై భర్తతో కాపురానికి వచ్చిన రోజే ఇంటికి కావలసిన వస్తువులు కొంటానని తగుదునమ్మా, అని సంచి తీసుకుని బయల్దేరింది. మా అపార్ట్మెంట్ లోనే గోకులకృష్ణ ఇంటికి సమీపంలో దారి తప్పిన ఈమెని ఇల్లు చేరుస్తామని కొందరు అల్లరి యువకులు వారి అపార్ట్మంట్ కు లాక్కెళ్ళారు. ఈ పిల్ల కీచుకీచుమని అరిచి గోల చేస్తే గోకుల్ తనను కాపాడి ఇల్లు చేరిస్తే ఆమె భర్త ఫణికుమార్ అతి నీచంగా ఆమెను తిట్టి శీలపరీక్ష కోరి నానా హంగామా చేసాడు. ఒకటే గోలగోలగా గొడవ గొడవగా ఉంటే అందరితో పాటు నేనూ చోద్యం చూడసాగాను.
ఆ అమ్మాయి చాలా ధైర్యంగా,
" ఒక మూడు గంటలు దారి తప్పిన నన్నూ, నా శీలాన్ని నమ్మనివాడివి జీవితాంతం నీతో నేను ఎలా ఉండగలను...???"అని ఎదురు ప్రశ్నించి తనవాళ్ళను ఆ రోజే రప్పించి పుట్టింటి కెళ్ళింది.
ఆఖరుకి గోకులకృష్ణ,” ఆమెను కాపాడే యత్నంలో ఆ దుండగుల చేత దెబ్బలు తిని గాయపడ్డా ఆ విషయం కూడా పట్టించుకోక ఆమెను భద్రంగానే ఒప్పగించాను. భార్యను అనుమానించడం సరికాదు అని నచ్చ చెప్పితే....
"నీకు దీని మీద అంత మోజుంటే నీవే ఏలుకో ..!!"అని నలుగురిలో అవమానకరంగా మాట్లాడాడు ఫణికుమార్ .పాపం ఆ పిల్ల పది రోజులుగా ఇప్పుడు పుట్టింట్లోనే ఉందంట..!!
పాపం ఆ పిల్ల ఇంకా కన్నెపిల్లేనంట..! భర్తతో శోభనం కూడా జరగకుండానే పెళ్ళైనరోజే నెలసరి అవ్వడంతో హైదరాబాద్ కు పెళ్ళైన మూడోరోజే వచ్చింది మంచిరోజు లేదని. పైగా ఫణికుమార్ కు ఆఫీసులో లీవ్ దొరకలేదని..! పాపం ఆ అమ్మాయి మా ఆడవాళ్ళతో ఏడుస్తూ, “నేనలాంటిదాన్నికాదు,  అబద్ధాలు చెప్పను, అలా ఏమైనా జరిగుంటే నిజం చెప్పి ఇష్టమైతే ఏలుకోండి. లేదా నన్ను వదిలేయండి, అని అంటానే తప్ప ఇలా మోసం చేయను” అని పదే పదే చెప్పి వాపోయింది." సుధీర్ఘంగా వివరంగా చెప్పింది వాణి.
అమృతకు ఆ అమ్మాయిని చూడాలని అనిపించింది.
"ఆమె గ్రామం పేరు చెప్పు. నేను వెళ్ళి మాట్లాడి తనకు ఏమైనా సాయం చేయగలనేమో ప్రయత్నిస్తాను. ఇలాంటి అమ్మాయిలు చాలా సున్నిత మనస్కులు. ఆమె పెద్దలు తిడితే కోపంలో ఏమైనా అఘాయిత్యానికి తలపడవచ్చు."ఆదుర్దాగా అంది అమృత.
వాణి ఆ గ్రామం పేరు చెప్పింది. అమృత ఆశ్రమ బాధ్యతలు వాణికి అప్పగించి వెంటనే భర్త రాఘవరావుతో ,కార్ డ్రైవర్ సుందర్ తోబయల్దేరింది.
ఆ క్షణంలో ఆమెకు తెలీదు.తన జీవితంలో ఒక అద్భుతమైన స్త్రీమూర్తిని కలవబోతున్నానని. ఆమె తులసి...!!!
*******
"తులసి ఇల్లు ఎక్కడా?"కుతూహలంగా గ్రామంలో అడుగుపెట్టగానే ఒక పదేళ్ళ పాపను అడిగింది అమృత. ఆ పాప తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటోంది. అది మధ్యాహ్న సమయం. ఒక మర్రిచెట్టు అరుగుపై పిల్లలు అచ్చన్నకాయలు ఆడుకుంటున్నారు.
“ఈ కాలంలో కూడా  ఈ ఆటలు ఉన్నాయా?" అని బుగ్గలు నొక్కుకుంది అమృత.
"మా ఇంటి ప్రక్కనే తన ఇల్లు. నేను తీసుకెళతాను."అని ఉత్సాహంగా అని స్నేహితురాళ్ళకు "టాటా" చెప్పి అమృత తో పాటు కారెక్కింది.
కొద్ది నిముషాలకి తులసి ఇల్లు చేరారు అమృత దంపతులు. వారిని సంశయాత్మకంగా చూసింది తులసి తల్లి కాంతమ్మ.
"మీరెవరూ? పత్రికల వారా? టీవీ వారా? మా అమ్మాయికి ఎవ్వరితో మాట్లాడ్డం ఇష్టం లేదు.నాక్కూడా ఇష్టం లేదు.*ఎద్దుపుండుకాకికి తిండి* అని....అందరూ మా ఇంటి విషయం ప్రపంచానికి చెప్పేవారే తయారైయ్యారు!" కసిగా అంది కాంతమ్మ.
"అమ్మా, మేం అలాంటి వారం కాదు."సేవ" అనే సంస్థ పేరు మీరు వినే ఉంటారు. ఆ సంస్థ తరపున మీ అమ్మాయికి సాయం చేయాలని వచ్చాం. మీ వివరాలు బయటకి చెప్పం. గోప్యంగా ఉంచుతాం. ఇందులో మాకు ఏం లాభం లేదు. నా సాటి స్త్రీకి సాయం చేయాలనే తపన తప్ప. అర్థం చేసుకోండి."అనునయంగా అంది అమృత.
దాంతో తులసి తల్లి దూకుడు తగ్గించి తులసిని పిలిచింది.
లోపల నుండి బంగారు బొమ్మ లాంటి మెరుపుతీగ లాంటి అందాల భరిణె లాంటి తులసి వచ్చింది. ఏడు మల్లెల ఎత్తున్నట్లున్న తన నాజూకుదనం, అయిదడుగులా నాలుగంగుళాల ఎత్తున్న ఆ అమ్మాయి రూపం అమృతను అమితంగా ఆకర్షించింది.
"తులసీ, చెప్పమ్మా !నీకు నీ భర్తతో కలిసి కాపురం చేయాలని ఉందా ?"అలా ఉంటే చెప్పు నేనతడితో మాట్లాడతాను."మృదువుగా మెల్లగా మాటలు కలుపుతూ అంది అమృత.
"అవసరం లేదు ఆంటీ !మా అమ్మ తో ఈ ఊర్లో ఉండలేను. నేను అతడి ముందు గౌరవంగా జీవించి చూపాలి. దయ చేసి ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. సాధ్యమైనంత త్వరలో విడాకులు ఇప్పించండి చాలు. మా అమ్మను చూసుకోవాలని ఉంది అంతే !"స్థిరంగా అంది తులసి.
"అంటే మీరు ఇద్దరేనా ఇంట్లో?"అర్థోక్తిగా ఆగి అంది అమృత.
"అవును. నా కాపురం కుప్పకూలిపోవడంతో మా నాన్న గ్రామప్రజల మాటలు పడలేక ఉరి వేసుకుని చనిపోయారు. గత పది రోజులుగా జీవచ్ఛవాలుగా ఉన్నాం. పదకొండో రోజు పెద్దకర్మ తరువాత నేను విడాకులకు అప్లై చేస్తాను. అతని మీద నాన్న మరణం తరువాత ఇంకా ద్వేషం పెరిగింది, ఈ జన్మలో నేను అతడిని క్షమించను. ఆఖరికి ఆ అల్లరిమూకకు శిక్ష పడినా నా భర్తతో నేను చేరను."కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ ఉద్వేగంగా అంది తులసి.
ఆమె బాధ అర్థమయ్యింది అమృతకు. మరుసటి రోజు పెద్దకర్మ కు దగ్గరుండి సాయం చేసింది.
తరువాత తులసి వాళ్ళమ్మకు గతంలో"సేవ" సంస్థ చేసిన సేవా కార్యక్రమాలు గల ఫోటోలు చూపించింది.
దాంతో కాంతమ్మకు నమ్మకం కుదిరి వారితో పయనమయ్యేందుకు అంగీకరించింది.
రోజులు ఎలా త్వరగా గడుస్తాయో తెలీనంతగా దొర్లిపోసాగింది. ఫణికుమార్ కు తులసికి విడాకులు లభించి వారి వివాహం రద్దైయ్యింది.
అమృత తులసికి తన స్కూల్ లోనే "తెలుగు టీచర్ "గా ఉద్యోగం ఇప్పించింది.
తులసి తన తల్లితో పాటు "సేవ" ఆశ్రమంలో జీవించసాగింది.
అనుకోకుండా ఒకరోజు తమ కార్యక్రమంలో భాగంగా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో తమ స్కూల్ పిల్లలను ఎక్స్ కర్షన్ నిమిత్తం ఆ కంపెనీ పనితీరు చూపించడానికి తులసిని మరియు మరి కొందరు టీచర్లనూ సేవ సంస్థలో పంపించారు. అక్కడ ఆమెకు టీంలీడరుగా అందరినీ అజమాయిషీ చేస్తున్న ఒక యువకుడిని ఎక్కడో చూసినట్లు అనిపించింది.
ఆ యువకుడు తులసి దగ్గరకు రావడంతో ఒక్క క్షణం తత్తరపడింది.
"మీరు తులసి కదూ...!!!"
"ఆ...! అవును"
"నేను గోకులకృష్ణను. సంవత్సరం ముందు అపార్ట్మెంట్ లో మిమ్మల్ని ఒక అల్లరిమూక నుండి రక్షించాను."చెప్పకూడదనుకుంటూనే ఆమె గుర్తు పట్టక పోవడంతో చెప్పాడు.
ఒక్క క్షణం తులసి ముఖం మ్లానమయిపోయింది.
“ఇప్పుడెందుకు ఇదంతా వీడు గుర్తు చేసి ప్రేతానందం పొందుతున్నాడు.నేను నీకు సాయం చేసానని డప్పు కొట్టుకోవడం ఎందుకు ?ఛీ...! ఈ మగవాళ్ళందరూ ఇంతే ! పేరు...ఊరు...రూపమే వేరు వేరు కానీ అందరు మగవాళ్ళూ  అహంకారులే !”బాధగా అనుకుంది. లేకుంటే బాధితురాలైన తనే గుండెధైర్యంతో ఉంటే ప్రజల మాటలకి వెరచి తన తండ్రి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? ఆలోచనల మధ్య తులసి ఈ లోకంలోకి వచ్చింది అతను మరోసారి మార్దవంగా “తులసీ" అని పిలవడంతో !
"చెప్పండి. నాకు పని ఉంది. ఇంట్లో మా అమ్మ ఉంది. ఈ పిల్లలందరినీ స్కూల్ లో వదిలి ఇంటికి వెళ్ళాలి."మాటల్లో చిరాకు ప్రదర్శించింది.
"ఆ దుండగులకు సంవత్సరం జైలు శిక్ష పడింది. ఆ ముగ్గురినీ అపార్ట్ మెంట్ నుండి పంపేశారు కూడా. వారి ఫ్యామిలీలు ఇప్పుడెక్కడున్నాయో కూడా తెలీదు. ఫణికుమార్ మరో పెళ్ళి చేసుకుని తన భార్య ఊరు వెళ్ళిపోయాడు. నీ వివరాలు తెలీక చాలా రోజులు నీకై వెతికాను. ఇవ్వన్నీ నీకు చెప్పాలని..."గబగబా ఒప్పగించేసాడు.
"సరే, సంతోషం. నేను వెళతాను"హడావుడిగా మాటలు త్రుంచేస్తూ అంది తులసి.
"తులసీ... నీ సెల్ నెంబర్ ఇస్తావా... ?"
"ఎందుకూ....?"
"ఊరికే..."నసిగాడు గోకులకృష్ణ.
"సారీ... నేను ఊరికే ఎవ్వరికీ నా నెంబర్ ఇవ్వను."విసవిసా వెళ్ళిపోయింది తులసి.
తులసిని చూస్తూ అప్రతిభుడై నిలబడ్డాడు గోకులకృష్ణ.
*********
"ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మన స్కూల్లో ఇంటర్  చదివే పిల్లలకు సాయంత్రం రోజూ ట్యూషన్ ఆరుగంటలకు  చెప్పేందుకు ఒప్పుకున్నాడు."ఉపోద్ఘాతంగా అంది అమృత.
"ఇప్పుడు ఎందుకు మన పిల్లలకు ట్యూషన్ ? అందరూ బాగా చదువుతున్నారు. నా క్లాసులోని పిల్లలు కూడా చక్కగా తెలుగులో మంచి మార్కులు తెచ్చుకున్నారు. వారిని ప్రొత్సహించాలని ప్రతివారం పద్యం ,తాత్పర్యం చక్కగా చెప్పిన పిల్లలకు బహుమతులు ఇచ్చి వెన్నుదన్నుగా నిలుస్తున్నాను. పైగా ఇతనికెందుకు జీతం దండగ...!"ఆఖరి మాటలు కావాలనే అన్నది తులసి.
ఎప్పుడూ అంత కటువుగా మాట్లాడని తులసి నోటివెంట ఆ పరుషమైన మాటలకి అమృత బిత్తరపోయింది.
ఆమె కావాలనే అలా అన్నదని తెలుసు కనుక గోకులకృష్ణ మౌనం వహించాడు.
"లేదు తులసీ... తను బాగా చదువుకున్నాడు. నేను ఇస్తానన్న జీతానికి ఒప్పుకున్నాడు. రేపటి నుండి పిల్లలకు స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు. అవసరమైతే తెలుగులో కూడా కోచింగ్ ఇప్పిస్తాం. టోటల్ ఎక్కువ మార్కులు వస్తే స్టేట్ ర్యాంకు రావచ్చు మన పిల్లలకి..."సాలోచనగా అంది అమృత.
"సరే" అన్యమనస్కంగా అని గోకుల్ ను కొరకొర చూస్తూ అక్కడ నుండి తులసి నిష్కృమించింది. అతను కావాలనే తమ "సేవ" సంస్థలో చేరాడు. తన వెంట అనవసరంగా పడుతున్నాడు. ఆరంభంలోనే హెచ్చరించాలి. మనసులోనే అనుకుంది.
ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళింది. అమ్మతో మాట్లాడుతున్న గోకుల్ ను చూసి అరికాలి మంట నెత్తి కెక్కింది. తులసిని చూడగానే కాంతమ్మ "తులసీ...ఇతనూ..."అని ఆరంభించింది.
"తెలుసమ్మా... నిన్ను బుట్టలో వేసుకుని నాకు గాలం వేస్తున్నాడు. అది నీకు అర్థం కాదులే...చూడు మిస్టర్ ! నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. మా అమ్మ మరియు"సేవ" సంస్థ వీళ్ళిద్దరూ నా రెండు కళ్ళు. నా మానాన నన్ను బ్రతకనీయి. నీ మెహర్బానీ నాకు అక్కర్లేదు. పైగా మీరిలా పదే పదే నా చుట్టూ తిరగడం వల్ల ప్రయోజనం లేదు. దీని వల్ల మీకు ఏ లబ్ధీ చేకూరదు. నా జీవితం ప్రశాంతంగా గడుస్తోంది. మీ సాయానికి నా మానప్రాణాలు రక్షించినందుకు జీవితాంతం ఋణపడి ఉంటాను.అలా అని మీరు నా నుండి ఏదో ఆశిస్తే  క్షమించండి...నేను అలాంటిదాన్ని కాను. నన్ను మీ అతి చేష్టలతో అతి పనులతో సతాయించకండి. మీకు పుణ్యముంటుంది...!!!"కోపంగా దణ్ణం పెడుతూ చెప్పాల్సింది చెప్పి "ఇక వెళ్ళండి"అంది వెంటనే.
"తులసీ... నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ అమ్మ మన పెళ్ళికి అంగీకరించారు. మీ ఇష్టాయిష్టాలు కనుక్కుని చెప్తానన్నారు. మీ కోసం ఎన్నాళ్ళైనా వేచి ఉంటాను. అసలు ఆ గొడవ లో మిమ్మల్ని మొదటిసారి చూడగానే ప్రేమించాను. కానీ మీరు పెళ్ళైన స్త్రీ కావడంతో హుందాగా మిమ్మల్ని మీ భర్తకు అప్పగించి వెళ్ళిపోయాను. మీ కాపురం నిలవాలనే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ మీరు విడాకులు తీసుకున్నాక మీకై వెతికాను. నాకు మీ వివరాలు తెలీకపోవడంతో మిమ్మల్ని కలవలేకపోయాను. మీకు అభ్యంతరం లేకుంటే మీకు జీవితభాగస్వామిని అవ్వాలని ఆశిస్తున్నాను."నెమ్మదైన స్వరంతో అన్నాడు.
"సారీ...! ఒక్కసారి నా పెళ్ళి ఛిద్రం అయ్యాక మరో పెళ్ళికి ఆస్కారం లేదు. నా మానాన నన్ను వదిలేయండి. మీరు వేరే ఎవరినైనా పెళ్ళి చేసుకుని హాయిగా ఉండండి. నాకు మగవాళ్ళపై సదభిప్రాయం లేదు. ఈ ప్రస్తావన ఇక పై తేకండి. మీ సమయం వృధా చేసుకోకండి. మీ జీవితం మీది. నా జీవితం నాది. అనవసరంగా నన్ను సతాయించకండి."అని పుల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్లు ఖరాఖండిగా మాట్లాడి లోనికెళ్ళిపోయింది.
"వెళ్ళొస్తానమ్మా..."అని శోకంగా తన వంక చూస్తున్న కాంతమ్మతో పలికి వెళ్ళిపోయాడు.
********
సంవత్సరం గడిచింది. సేవ సంస్థలో తులసి అంతర్భాగమయిపోయింది. అమృతకు ముదివయసులో మునుపటి చేవ తగ్గడంతో అన్ని వ్యవహారాలు సెక్రటరీ వాణి, తులసి చూడసాగారు. డొనేషన్లు ఇచ్చిన దాతలకు వారి డబ్బుకు రశీదు ఇవ్వడంతో పాటు వారి ధనం ఎలా వినియోగిస్తున్నారో వివరాలు కూడా ప్రింట్ చేసి తులసి అందించ సాగింది. తులసి ఇల్లు ఆశ్రమంలోనే. ఆశ్రమ స్కూల్ ప్రక్కనే కావడంతో సాయంత్రం తులసి చెట్టు ఆరుగంటలకు దీపం వెలిగించే సమయంలో గోకుల కృష్ణను రోజూ యాధృచ్ఛికంగా చూడాల్సొచ్చేది.
ఆ రోజు తెలుగు పాఠాలలో కొన్ని సందేహాలు చంధస్సు భోధిస్తున్నప్పుడు వచ్చింది. తులసికి ఇంటర్ నెట్ వంటి ఆధునిక విషయ పరిజ్ఞానం లేదు. కొన్ని నోట్స్ వెబ్ సైట్ నుండి కావలసి వచ్చింది. ఆ సాయంత్రం గోకుల్ ను స్కూల్ కు వెళుతుండగా తటపటాయిస్తునే "నాకు చంధస్సు పాఠాలు డౌన్ లోడ్ చేసివ్వగలరా?"అడిగింది.
"రేపటి లోగా ఆ వివరాలు మీకు ఈ మెయిల్ చేస్తాను. మీ ఈ మెయిల్ ఇవ్వండి."అని నమ్రతగా అన్నాడు గోకులకృష్ణ.
తులసి ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చింది. అతనూ మరుసటి రోజే చంధస్సు పాఠాలు గల నోట్స్ మెయిల్ చేసాడు.
తులసి మరునాడు "కృతజ్ఞతలు"అని ముక్తసరిగా అని వెళ్ళిపోయింది.
రోజులు గడిచే కొద్ది తులసికి అతను తన వల్లే పెళ్ళి చేసుకోలేదని బాధపడేది.అతను పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంది.
**********
తన స్నేహితురాలు రాధికతో ఇదంతా చెప్పుకుంది. రాధిక చిననాటి మిత్రురాలు. తనకు పెళ్ళైయ్యింది. తులసిని ఎప్పుడైనా బంధువుల ఇంటికి హైదరాబాద్ వస్తే చూస్తుంది. ఆ రోజు అలానే వచ్చింది. తులసి వాళ్ళ అమ్మ రాధికకు తులసి మంకుపట్టు గురించి చెప్పి ఇలా ఒంటరిగా ఉన్న ఒక్కగానొక్క కూతురిని చూసే కొద్దే తనకు మానసిక వ్యథ అధికమవుతోందని చెప్పుకుంది.
"అమ్మా...నీవైనా చెప్పమ్మా...ఎన్నాళ్ళని తను ఇలా ఒంటరిగా ఉంటుంది చెప్పు? నా తరువాత తనను ఎవరు చూసుకుంటారు చెప్పు?ఆ అబ్బాయి దీని కోసమని పెళ్ళైనా చేసుకోకుండా సంవత్సరంగా ఉన్నాడు. అక్కడేమో మా మాజీ అల్లుడు రెండో పెళ్ళి చేసుకుని హాయిగా ఉన్నాడు. రెండేళ్ళయ్యింది విడాకులయ్యి ఇంకా ఒంటరిగానే ఉంది. ఇరవై రెండేళ్ళ కూతురు ఇలా ఉంటే ఏ కన్నతల్లికైనా కడుపు తరుక్కుపోదా...!!!ఆ నీచుల వల్ల నా బిడ్డ బ్రతుకు ఇలా బుగ్గిపాలైయ్యింది. ఇంతా చేసి ఇది పెళ్ళైన కన్నెపిల్ల. కానీ లోకం నమ్ముతుందా చెప్పు?"ఆవేదనగా అంది కాంతమ్మ.
"నేను చెప్తానులే ఆంటీ. మీరు బాధ పడకండి."అనునయంగా అంది రాధిక.
చాలాసేపు తర్జనభర్జన తరువాత తులసి గోకులకృష్ణతో పెళ్ళికి అంగీకరించింది.
రాధిక ,వాణి ,అమృత రాఘవరావుల సమక్షంలో తులసి గోకులకృష్ణ పెళ్ళి నిరాడంబరంగా జరిగింది.
తులసి,గోకులకృష్ణలు ఇద్దరూ "సేవ" సంస్థకు తమ చేతనైన సాయం అందిస్తూ ఆదర్శ దంపతులుగా నిలిచారు.
****

No comments:

Post a Comment

Pages