మను చరిత్రము -3 - అచ్చంగా తెలుగు

ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్య ప్రణీత -మను చరిత్రము -3(కళా ఖండానికి ఒక పామరుడి ప్రశంస)

బాలాంత్రపు వేంకట రమణ



కొన్నిదినాలకి ఆ వనదేవత గర్భంధరించి, నవమాసాలు నిండిన పిదప ఒక చక్కని కుమారుణ్ణి కన్నది.  అతనికి "స్వారోచిషుడు" అని నామకరణంచేశారు.  అతడు సకల సద్గుణసంపన్నుడై, సమస్తవిద్యలనీ అభ్యసించి, యుక్తవయసులోనే శ్రీ మహావిష్ణువు గుఱించి ఘోర తపస్సు చేశాడు.  శ్రీ హరి ప్రసన్నుడయ్యడు.  స్వారోచిషుడు అనేక విధాల శ్రీమన్నారాయణుని స్థుతించి, మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు.  అందుకు ఆ భక్తజనావనుడు "నువ్వు కోరినట్ట్లే మోక్షం ఇస్తాను.  కానీ కొంతకాలం ద్వితీయ  మనువువై భూమిని పాలించి, నీతినీ, ధర్మాన్నీ చక్కగా ధరలో నెలకొల్పు" అని ఆనతినిచ్చాడు.
స్వారోచిషుడు దామోదరుని ఆఙ్ఞ ప్రకారం రెండవ మనువై సకల ధరామండలాన్నీ పాలించాడు. ధర్మసంస్థాపన చేశాడు. అతని పాలనలో సమయానికి వానలు కురిశాయి.  పంటలు పుష్కలంగా పండాయి.  ప్రజలు సంతానవంతులై, భోగ భాగ్య సంపదలతో సంపూర్ణాయుస్కులై జీవించారు.  అగ్నివల్లా, చోరులవల్లా భయంలేకుండెను.  వ్యాధులు లేకుండెను.  పళ్ళు, పాలు,  సుగంధద్రవ్యాలూ, పుష్పాలూ సమృద్ధిగా లభించాయి. ప్రజలు ఈతి బాధలు, అకాలమరణాలు లేకుండా తామరతంపరలుగా వృద్ధిచెందారు.
ఫలశ్రుతి.
ఈ స్వారోచిషమనుచరిత్రమును  కోరికతో విన్నా, వ్రాసినా, చదివినా, ధనధాన్య-అరోగ్యాదులు కలిగి సంతానవంతులై, పిదప నిశ్చయంగా దేవత్వాన్ని పొందుదురు.
పూర్వం మార్కండేయుడు ప్రియశిష్యుడైన క్రోష్టి అనే మునికి చెప్పిన ఈ పుణ్యచరిత్రను పక్షులు జైమినికి చెప్పాయి.
ఇదీ "స్వరోచిషమనుసంభవం" యొక్క కథాసంగ్రహము..
*****
పద్యాల సొబగులు
మచ్చుకి కొన్ని పద్యాల సొగసులు పరిశీలిద్దాం.
వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం
బరమై సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయ రుఙ్మండలీ
హరిణంబై యరుణాస్పదంబనగ నార్యావర్త దేశంబునన్
బురమొప్పున్ మహికంఠహార తరళ స్ఫూర్థిన్ విడంబింపుచున్
ద్వీపవతి అంటే నది.  దీవులు కలది అని.  ఆనది ఒడ్డున ఈపట్టణం, అరుణాస్పదపురం.  సంస్కృతికీ సంపదకూ ఆలవాలం.  సౌధాగ్రభాగలతో (వప్ర) ఆకాశాన్ని చుంబిస్తోంది.  అంతేకాదు రాత్రిపూట ఆ సౌధాల తెల్లని కాంతులు (సుధాప్రభలు) చంద్రబింబంలో ఉన్న నల్లని మచ్చని కూడా తెలుపు చేసేస్తున్నాయి.
ప్రాలేయ (మంచు) రుక్ (కిరణం) మంచుకిరణాలు కలవాడు, చంద్రుడు.  చంద్రమండలంలో మచ్చని లేడి, దుప్పి, కుందేలు - ఇలా రకరకాలుగా ఊహించారు.  చంద్రమండలంలో ఉండే హరిణాన్ని ఈ పట్టణం తన సౌధ (మేడల) సుధాప్రభలతో ధవళితం (తెల్లగా) చేస్తోంది.
భూదేవికి ఒక కంఠహారం ఉంటే అందులో నాయికమణిలాగ ఈ అరుణాస్పదపురం ప్రకాశిస్తుంది.  మహికంఠహార తరళస్ఫూర్థిన్ విడంబింపుచున్ (అనుకరిస్తూ) అరుణాస్పదంబనగ పురమొప్పున్ - అని అన్వయం.
ఇది కథాప్రారంభ పద్యం.  ఇందులో భావి కథా సూచన ఉంది.  అది ఎలాగంటే -
వరూధిని కామవాంఛని ప్రవరుడు తిరస్కరించి తన సచ్ఛీలాన్నీ, నిగ్రహాన్నీ చాటుకున్నాడు.  కథలోని ఈ అంశాన్ని సూచిస్తోంది ఈ పద్యం.
వరూథిని అప్సరస.  అప్సరసలు చంద్రాంశసంభూతలు.  వరూధినిలో ఉన్న కామవాంఛ చంద్రునిలో ఉన్న కళంకం.  కామాది దుర్గుణాలను నల్లటి వస్తువులతోనూ, సచ్ఛీలాది సద్గుణాలను తెల్లటి వస్తువులతోనూ పోల్చడం పరిపాటి.  ఇది కవి సమయం.  అందుచేత చంద్రునిలోఉన్న నల్లటిమచ్చ వరూథిని కామవాంఛకు ప్రతీక అవుతుంది.  అరుణాస్పదపౌరుడైన ప్రవరుడి సచ్ఛీలానికి ప్రతీక "సౌధసుధాప్రభలు"; వీటి ప్రభావం ఆనలుపుని తెలుపుచేస్తోంది.  అంటే భౌమ్యమైన సచ్ఛీలం అబౌమ్యమైన కామాన్ని తిరస్కరించి, తన స్వచ్ఛతని ప్రకటించుకుంటోంది - అని వ్యంగ్యం.
నిజానికి ఇది జరగడం లేదు.  "వప్రస్థలీ చుంబితాంబరమై" (ఆకాశాన్నంటుకునే కోట గోడలు) అన్నదీ అంతే.  అతిశయోక్తి.  సంబంధించని వస్తువులు సంబంధించినట్ట్లు చెప్పడం.
పురవర్ణనలో చతుర్వర్ణాలవారినీ ప్రస్తావించడం ఒక సాంప్రదాయం.  వారి వారి వృత్తులలో ఎవరెవరు ఎంతటివారో చెప్పడం.
అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి
     ముది మది దప్పిన మొదటివేల్పు
నచటి రాజులు బంటునంపి భార్గవునైన
     బింకానఁ బిలిపింతు రంకమునకు
నచటి మేటి కిరాటులలకాధిపతినైన
     మునుసంచి మొదలిచ్చి మనుపదక్షు
లచటి నాలవజాతి హలముఖాత్త విభూతి
     నాది భిక్షువు భైక్షమైన మాన్చు  

నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ
గాసెకొంగున వారించి కడపఁగలరు
నాట్యరేఖా కళా ధురంధర నిరూఢి
నచటఁ బుట్టిన చిగురుఁ గొమ్మైన చేవ.

ఆఊళ్ళో బ్రాహ్మణులు అఖిలవిద్యలలోనూ - వేదవేదాంగాలలో  ఉద్దండులు.  వేదపఠన పరీక్షలో కూచుంటే సాక్షాత్తూ వేదస్రష్ట అయిన బ్రహ్మదేవుణ్ణి సైతం ఓడించగలరు.  "వయసుమీరిన కారణంగా నీకు మతి తప్పింది పొ"మ్మని అతన్ని తరస్కరించగలరు.
ఆ ఊళ్ళో క్షత్రియులు మహావీరులు.  పరశురాముణ్ణికూడా బంటుతో కబురు పంపి అంకానికి (యుద్ధానికి) పిలిపించుకోగలిగిన బింకం ఉంది వాళ్ళకి.  భార్గవరాముడంటే ఇరవైయొక్కమార్లు క్షత్రియుల్ని ఊచకోతకోసినవాడు.  అంతటివాణ్ణి కూడా సవాలు చెయ్యగల మహావీరులు వీరు.
ఆ ఊళ్ళో వైశ్యులు ఎంతటి ధనవంతులంటే, కుబేరుడికి కూడా పెట్టుబడి పెట్టగలిగేతంటి స్థోమతగల వారు.
ఇక అక్కడి నాల్గవజాతి.  సకలప్రాణికోటికీ అత్యవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసే అత్యంత ప్రధానమైన వృత్తి వీరిది.  పైమూడు జాతుల వారికీ వీరే అన్నదాతలు.  నాగేటి కర్రు నుంచి (హలముఖాత్త) ఐశ్వర్యాన్ని వీరు సంపాదించి శివుడికి కూడా పెట్టగలరు.  ఆ ఆదిభిక్షువుకి బిచ్చమెత్తుకోవలసిన అవసరం (భైక్షము) లేకుండా చెయ్యగలరు వీరు.  అందరూ అంతగా పంటలు పండించే ఉత్తమ కృషీవలులే ఆ ఊళ్ళో.  శివుడికి సంబంధించి మాట్ట్లాడుతున్నాడు కనుక "విభూతి" అనే మాటను సార్థకంగా ప్రయోగించాడు కవి.  ఇక్కడ విభూతి అంటే ఐశ్వర్యం ఆని అర్థం.
ఇక ఆఊళ్ళొ వేశ్యలుకూడా ఉన్నారు.  వాళ్ళు నాట్యవిద్యావిలాసాల్లో (నాట్యరేఖా కళా ధురంధర నిరూఢిన్) అందె వేసిన చేతులు.  కొంగు బిగిస్తే చాలు (కాసెకొంగు) రంభాది అప్సరసలు పోటీకి వచ్చినా (ఒరయన్) ఓడిపోయి తిరిగి వెళ్ళిపోవలసిందే.  నాట్యందాకా అవసరమే లేదు.  వీళ్ళు కాసెకొంగు బిగిస్తేచాలు - వాళ్ళు ఆగిపోతారు.
ఇవన్నీ ఎందుకు - ఆ ఊళ్ళో పుట్టిన చిగురుకొమ్మ కూడా చేవగలదే.  సారవంతమే.
ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోఙ్ఞ మూర్తి భా
షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ
క్షాపరతంత్రుఁ డంబురుహ గర్భ కులాభరణం బనారతా
ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁడలేఖ్య తనూ విలాసుడై
'అఖ్య" అంటే పేరు.  ప్రవరుడు అనే అఖ్యకలవాడు.  "ఆపురిన్ ఉండు" అని చెప్పి ఊరుకోకుండా "ఆ పురిన్ పాయక ఉండున్" అని చెప్పడంలో ఒక విశేషం ఉంది.  "పాయక" అంటే విడిచిపెట్టకుండా.  విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళాలనీ, బహు దేశాలు చూడాలని లోపల ఎంతకోరికగా ఉన్నా, విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు.  అందుకే  ముక్కూ మొగం తెలియని సిద్ధుడెవరోవచ్చి పాదలేపనం ఇవ్వగానే హిమాలయాలకి ఎగిరిపోయాడు.
మకరాంక శశాంక మనోఙ్ఞ మూర్తి. అంటే మన్మధుడిలా, చంద్రుడిలా మనోహరమైన రూపం  గలవాడు.  వాక్కునందు రెండవ ఆదిశేషుడు.  వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు.  పలు తెఱగులైన యఙ్ఞములయొక్క పుణ్యకర్మముల యొక్క నియమములకు అధీనుడగువాడు.
అంబురుహగర్భ కులాభరణంబు, బ్రాహ్మణ కులమునకు అలంకారము అగువాడు.   ఎల్లప్పుడూ (అనారత) వేదాధ్యయనం చేయించుటయందు (అధ్యాపన) ఆసక్తి కలవాడు (తత్పరుడు).  అంటే వేదపఠనం నిత్యం తాను చేయడమే కాకుండా, శిష్యులకు కూడా నేర్పడంలో మహా శ్రద్ధ కలవాడు. ధర్మాచరణం, కర్మాచరణం తప్పనివాడు అన్నమాట.
లేఖ్యము అంటే లిఖింపతగినది.  చిత్రించి చూపించగలిగిన విలాసం - లేఖ్యవిలాసం.  అలా లిఖించి, చిత్రించి చూపించలేనంతటి, వీలుకానంతటి రూప లావణ్యం  కలవాడు - అలేఖ్య తనూ విలాసుడు. ఆ ప్రవరాఖ్యుడు.
ఇలా ఈ పద్యంలో ప్రతీ విశేషణమూ భావికథలో సార్థకమయ్యేట్టుగా కవి నిబంధించాడు.
యౌవనమందు యజ్వయు ధనాఢ్యుడునై, కమనీయ కౌతుక
శ్రీవిధి గూకటుల్ గొలిచి చేసిన కూరిమి సొమిదమ్మ సౌ
ఖ్యావహయై భజింప, సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్
దేవరవోలె నుండి ఇలు దీర్పగ కాపుర మొప్పు వానికిన్
గృహస్థుగా ప్రవరుడి పరిస్థితిని తెలియజేస్తున్నాడు కవి.
యౌవనంలోనే యజ్ఞాలు చేసి యజ్వ అయ్యాడు.  పుట్టుకతో ధనాఢ్యుడు.  కమనీయమైన  కౌతుక శ్రీ విధితో - వైవాహిక ఉత్సాహ సంపదతో (కౌతుకం = పెండ్లి వేడుక) విద్యుక్తంగా పెద్దలు అతడికి వివాహం చేశారు.   కూకటులు కొలిచి చేశారు.  ఈడూజోడూ కుదిరిందా లేదా అని జుట్టు ముడులు (కూకట్లు) కొలిచేవారుట వెనుకటి కాలంలో. అలా కొలిచి ఈడయిన పిల్లతో వివాహం చేశారు.  ఈయన యౌవనంలోనే యజ్ఞం చేసి సోమయాజి అయ్యాడు కనుక ఆవిడ సోమిదమ్మ అయింది.  కూరిమి సోమిదమ్మ - పరస్పరం కూరిమి ఉంది అని.  ఆవిడ సౌఖ్యాలు అందిస్తూ సేవిస్తోంది (భజింప).
ప్రవరుడి తల్లిదండ్రులు సుఖంగా (సుఖులై) అరోగ్యంగా ఉన్నారు.  పార్వతీ పరమేశ్వరుల్లాగా (దేవియున్ దేవరవోలె) కూడి ఉన్నారు. ఇల్లు తీరుస్తున్నారు.   ఇంటా బయటా బాధ్యతలన్నీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు.    ధర్మాచరణం, కర్మాచరణం, అధ్యయనం, అధ్యాపనం సోమిదమ్మతో ధార్మిక సుఖానుభవం - ఇవి తప్ప ప్రవరుడికి మరొక ప్రమేయం లేదు.  ఇలాగ అతడి కాపురం సాగుతోంది.
దారి తప్పడానికి కావలసినంత స్వేఛ్చ సంపత్తి ఉన్నా ప్రవరుడు నైష్ఠికుడుగానే అంటే నిష్ఠాగరిష్టుడిగానే ఉన్నాడు.  జారకామినులకు భోగబాహ్యుడుగానే ఉన్నాడు.
అతడి ధార్మిక ప్రవృత్తికి వైరాగ్యానికీ కారణం స్వతస్సిద్ధమైన స్వభావమే తప్ప, చిన్న వయస్సులోనే మీద పడిన బరువు బాధ్యతల లాంటివి ఏవీ కావు సుమా అని సూచిస్తున్నాడు కవి.
అది అతడి స్వాభావిక శీలం.  ఆ వైరాగ్యం తెచ్చిపెట్టుకున్నది కాదు.  ఎవరో రుద్దినదీ కాదు.  అందుకే స్థిరంగా నిలబడగలిగింది.  ఎక్కడో మిన్నులు పడ్డచోట, ఎవరూ చూడని ఏకాంతంలో, తిరిగి ఇంటికి వెళ్ళగలననే ఆశ లేశమంతయినా లేని పరిస్థితిలో, వరూధిని వంటి అప్సరస తనంత తా వలచి  వచ్చి మీద పడినా ప్రవరుడు చలించకపోవడానికి ఈ స్వాభావిక శీలమే, ఈ ధృఢ చిత్తమే కారణం.
ఇంక అతని దినచర్య  ఎలావుండేదంటే -
వరణాతరంగిణీదర వికస్వరనూత్న
     కమలకషాయగంధము వహించి
ప్రత్యూష పవనాంకురములు పైకొను వేళ
     వామనస్తుతిపరత్వమున లేచి
సచ్చాత్రుడగుచు నిచ్చలు నేగి యయ్యేట
     నఘమర్షణస్నాన మాచరించి
సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి
     సైకతస్థలి గర్మసాక్షి కెఱగి

ఫల సమిత్కుశ కుసుమాది బహు పదార్థ
తతియు నుదికిన మడుగు దొవతులు గొంచు
బ్రహ్మచారులు వెంటరా బ్రాహ్మణుండు
వచ్చు నింటికి బ్రజ తన్ను మెచ్చి చూడ
ప్రత్యూషం అంటే ప్రాతఃకాలం తూర్పుదిక్కున అరుణారుణరేఖలు రాకముందు తెలతెలవారుతున్న సమయం.  ఆ ప్రశాంతవేళ చల్లని పిల్లతెమ్మెరలు (పవన+అంకురములు) మెల్లమెల్లగా వీస్తూ ఉంటాయి.  అరుణాస్పదంలో పక్కనే వరణానది ప్రవహిస్తొంది.  కనక ఆ తరంగిణి ఒడ్డున అప్పుడే వికసిస్తూ, ఇంకా సగం విచ్చుకునీ (దర వికస్వర) సగం విచ్చుకుంటూ ఉన్న క్రొందమ్ములు (నూత్న కమలములు).  వాటి కషాయ గంధం - రవ్వంత వగరు అనిపించే సుగంధాన్ని ప్రత్యూష పవనాంకురాలు వహించి వీతెంచుతున్నాయి.  అవి అలా పైకొనే వేళ ప్రవరుడు నిద్ర లేస్తాడు.  విష్ణుదేవుడి స్తోత్రాలు పఠిస్తూ (వామనస్తుతి పరత్వమున) నిద్రలేస్తాడు.
శిష్యులతో సహా (సచ్చాత్రుడగుచు) ప్రతి దినమూ వెళ్ళి ఆ నదిలో (అయ్యేటన్ - ఆ యేరునందున్) అఘమర్షణ స్నానం చేస్తాడు.  అఘమును - పాపాన్ని - తొలగించేది. పాప పంకిలాలను తొలగించే మంత్రాలు చదువుకుంటూ చేసే స్నానం అఘమర్షణ స్నానం, దాన్ని ఆచరించి  సంధ్యాసమయంలో సూర్యుడికి చెయ్యవలసిన  అర్ఘ్య తర్పణ ప్రదానాలు నిర్వహించి (సాంధ్య కృత్యమున్ తీర్చి) గాయిత్రీ మంత్రాన్ని (సావిత్రిన్ - సవితృ) జపించి, ఇసుకతిన్నెమీద నిలబడి, కర్మసాక్షి సూర్యభగవానుడికి నమస్కరించి (ఎఱగి) ఆ తరువాత తన శిష్యులతో కలిసి (బ్రహ్మచారులు వెంటరాన్) ఇంటికి వచ్చేవాడు.  సమీపంలో దొరికిన ఫలాలు సమిధలు దర్భలు (కుశ) పువ్వులు (కుసుమాలు) ఇటువంటి పూజాద్రవ్యాలను సేకరించి కొందరు శిష్యులు తెస్తున్నారు. మరి కొందరు ఉతికిన మడుగు దోవతులు పట్టుకొని గురువుగారి వెంట నడుస్తున్నారు.  ఇలా శిష్యపరివారం వెంటరాగా, ఆ బ్రాహ్మణుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకొనేవాడు.
ప్రవరుడు ఇంత నిష్ఠగా ఉండటం, శిష్యులకి విద్యాబోధన చెయ్యడం, క్రమశిక్షణ - ఇవన్నీ గమనించి ప్రజలు సంతోషించి ప్రవరుణ్ణి మెచ్చుకుంటూ చూసే వారట.  వారి చూపులో  ఆ మెప్పుదల కనిపించేది.  అంటే పట్టణ పౌరులు అతడిపట్ల గౌరవంగానూ బాధ్యతాయుతంగానూ మెలిగేవారని.  "ప్రజ తన్ను మెచ్చి చూడ" అని ముగించడంలో వ్యక్తి బాధ్యత - సంఘ బాధ్యతలు వాటి పరస్పర సంబంధం – ఈ  స్ఫురణ ఉంది.
ఇది ఏ ఒకరోజో, అడపా తడపానో జరిగే ప్రక్రియ కాదు.  నిత్యం (నిచ్చలు) క్రమం తప్పకుండా జరిగే దినచర్య.
ప్రజలు మెచ్చుకున్నారంటే భూపాలకుడూ కూడా మెచ్చుకుంటాడు.  ఆ మెప్పు సత్కారాలుగా సమ్మనాలుగా ఆవిష్కృతమవుతుంది.
****

No comments:

Post a Comment

Pages