భరోసా - అచ్చంగా తెలుగు

భరోసా

 డా. వారణాసి రామబ్రహ్మం



 పనికి రాని ఆలోచనలలో ములిగి నేను ఆ హోటల్లో కాఫీ తాగుతున్నాను. ఇంతలో ఎదురుగా ఎవరో గొడవ పడడం వినిపించింది. కౌంటర్లో హోటల్ యజమాని వెటకారంగా నవ్వుతూ గట్టిగా, వీలుకాదు, కుదరదు వెళ్ళు, వెళ్ళు అంటున్నట్టు చేతులు ఊపుతూ మాట్లాడుతున్నాడు. అతని ఎదురుగా ఒక స్త్రీ నుంచొని ఉంది. ఆమె చేతిలో ఒక సత్తు గ్లాసు ఉంది. డబాయింపుగా ఏదో అంటోంది.
 అక్కడ ఏం జరుగుతోందో అర్థం కావడానికి నాకు కొంతసేపు పట్టింది. అక్కడ నుంచున్నావిడకు కాఫీ కావాలి. కాని. ప్రస్తుతం డబ్బుల్లేవు. సాయంకాలం తెచ్చి ఇస్తానంటోంది. చామనచాయలో ఉంది. నుదురు ముడుతలు పడి ఉంది. ఆమె ముఖం, దుస్తులు ఆమె పేదరికాన్ని ప్రకటిస్తున్నాయి. నలభై ఏళ్ళుండవచ్చు. కాఫీ ఇమ్మని జబర్దస్తీగా అడుగుతోంది. అందులో వేడికోలూ మిళితమై ఉంది.
                          “ఓ కప్పు కాఫీ పొయ్యడానికి ఇంత యెనకా, ముందూ సూస్తన్నారేంటయ్యా!? సాయంతరం తెచ్చి డబ్బులు ఇచ్చేత్తానంటున్నాను గందా. నేను ఎగ్గొట్టే రకం కాదు. సత్తె పెమానికంగా సాయంతరానికి ఇచ్చేత్తాను. నా పిల్లకి నిన్నట్ట్నుంచి జొరంగా ఉంది. డాట్టరుగారు మందు బిళ్ళని కాఫీతో ఏసుకోమన్నారు. చచ్చి మీ కడుపున పుడతాను, ఓ కప్పు కాఫీ పొయ్యండయ్యా!”
 హోటల్ యజమానికి చిఱ్ఱెత్తుకొచ్చింది. గట్టిగా కఠిన స్వరంతో అన్నాడు.
 “నువ్వెవరో నాకు తెలియదు. డబ్బులియ్యకుండా కాఫీ ఎలా పోస్తాను? ఇది హోటల్; ధర్మసత్రం కాదు. డబ్బలియ్యి కాఫీ పోయిస్తాను. ఇలా అడిగినాళ్ళందరికీ ధర్మాలు చేస్తోంటే, వ్యాపారం చేసినట్టే”
 ఇంత అదిలిస్తున్నా ఆవిడ కదలలేదు. ప్రాథేయపడడం ఎక్కువయింది. బిల్ కట్టడానికి వస్తున్న వాళ్ళందరితోటి;
 “మీరైనా చెప్పండి బాబయ్యా! సందాల పట్టుకొచ్చిచ్చేత్తాను డబ్బులు”
 కొందరు మౌనంగా విన్నారు. కొందరు వినలేదు. కొందరు పట్టించుకోలేదు. కొందరు బిల్లు కట్టేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.
 ఇలా కొన్ని నిమిషాలు గడిచాయి. నాకు, అక్కడున్న మిగతా కష్టమర్లకి ఆమె సంగతి అర్థమైంది. ఆమె దగ్గర డబ్బుల్లేవు. జ్వరంగా ఉన్నఆమె పిల్లకి మందు వేసుకోవడానికి కాఫీ కావాలి. ఆమె తన పేదరికాన్ని, లేమిని, నిస్సహాయతను, అభిమానాన్ని, డబాయింపు, జబర్దస్తీల వెనక దాచడానికి ప్రయత్నిస్తోంది. ఆమె దీనస్థితికి నా హృదయం ద్రవించిపోయింది. ఆ కాఫీ డబ్బులు నేనే ఇచ్చి ఆమెకు కాఫీ పోయించాలనే ఆలోచన వచ్చింది. నా ఆలోచన కార్యరూపం దాల్చడానికి కొన్ని సెకన్లు పట్టింది.
 ఇంతలో ఇదంతా చూస్తున్న ఓ పాతికేళ్ళ కుఱ్ఱాడు  హోటల్ ఓనరుకి కాఫీ డబ్బులిచ్చి, ఆ బీదావిడకి కాఫీ ఇయ్యమని చెప్పి, తన బిల్లు కట్టేసి వెళ్ళిపోయాడు. ఆ పేదరాలి కంట్లో తడి, ఆమె చూపులలో ఆ యువకుని పట్ల కృతజ్ఞతా భావం కనిపించాయి నాకు. హోటల్ ఓనరు నెమ్మదిగా మాట్లాడుతూ ఆ పేదరాలికి కాఫీ పోయించే ఏర్పాటు చేస్తున్నాడు.
 నాలో ఆలోచనలు ముసురుకున్నాయి.
 ఇలా అడిగిన అందరికీ ధర్మాలు చేసుకుంటూ పోతుంటే యజమాని హోటల్ వ్యాపారం కుంటుపడుతుంది. ఆ పేదరాలి వేడికోలునీ తప్పుపట్టలేము మనము. తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ప్రాథేయపడిందామె. వారి వారి అవసరాలని బట్టి, శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకొని వారిద్దరూ వ్యవహరించారు. నాలాంటి వాళ్ళం సాయం చేయగలిగీ చేయని బద్ధకస్తులం. తోటివారి
అవసరాలు తెలిసీ, సాయపడగలిగీ పట్టించుకోలేము. పట్టించుకోము.
 ఆ కుఱ్ఱాడు నాకెంతో నచ్చాడు. అంతలా, తనంత తాను అంత వెంటనే, వేగంగా, బదులు ఏమీ ఆశించకుండా, ఆ పేదరాలికి సాయపడిన తీరు ఎంతో బాగుంది. ఆ కుఱ్ఱాడి సాయపడే తత్త్వానికి సంస్కారానికి అద్దం పట్టింది. అతని వితరణ గుణం నాకెంతో ముచ్చటగొలిపింది. నా హృదయాన్ని తాకింది. అతని పట్ల గౌరవభావంతో నా మనసు నిండిపోయింది.
       రాజకీయ నాయకులు ఏం చేసినా, చేయకపోయినా, ఏం చేయగలిగినా, చేయలేకపోయినా, మనం దిగులు చెందనవసరం లేదు. మనం చేసే అంతరిక్షయానాలు; రోదసి పరశోధనలు; శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధి; నన్ను ఈ యువకుని పరోపకార బుద్ధి ఉత్సాహపరిచినంతగా ఎప్పుడూ ఉత్సాహ పరచలేదు. ఈ యువకునికి కల అనుకంపన, సాయపడే గుణం నన్ను ఆకట్టుకున్నట్టుగా మనం రోజూ ఎంతో ఇష్టంగా ఉపయోగించే, గడిపే ఆధునిక ఉపకరణాలు, మాయాజాల అంతర్జాలాలు ఆకట్టుకోలేదు.
 మనం ఒకరి పట్ల ఒకరం అనుకంపన కలిగి, ఒకరి అవసరాలకు ఒకరం సాయపడడం లోని అందం. ప్రయోజనం, నాగరికత ఈ యువకుడు నాకు తన ప్రవర్తనతో చూపించాడు. అతని అనుకంపన నాకు మనలోని ఒక దివ్య నిధిని కనిపింపచేసింది. మన యాంత్రిక జీవితాలు ఉత్సాహభరితంగా మారే ఆశ చిగురించింది. మన జీవితాలకి భరోసా కనిపించింది. మన సుఖ శాంత జీవనానికి హామీ లభించింది.
 నాకూ నా ఎడతెగని ఆలోచనల నుంచి విముక్తి లభించి, నా మనసుకు ఊరట కలిగించింది. మనశ్శాంతీ కలిగింది.
 నా బిల్లు కట్టేసి, ఆ యువకుడు కలిగించిన ఉత్సాహం హృదయమంతా నిండి ఉండగా ఇంటి దారి పట్టాను..
  -0-

No comments:

Post a Comment

Pages