విలక్షణ నటుడు - పద్మశ్రీ ఓంపురి - అచ్చంగా తెలుగు

విలక్షణ నటుడు - పద్మశ్రీ ఓంపురి

Share This

విలక్షణ నటుడు - పద్మశ్రీ ఓంపురి

పోడూరి శ్రీనివాసరావు ఓం ప్రకాష్ పూరి ‘అంటే ప్రజలకు తెలియకపోవచ్చు… కానీ ‘ఓంపురి ‘ అన్నపేరు వినగానే ఒక విలక్షణమైన, అంతర్జాతీయ నటుడు, బహుభాషా చిత్రాల్లో నటించిన నటుడు, ఆర్ట్ సినిమాల్లో నటించిన నటుడు గుర్తుకొస్తాడు. మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఫ్రెంచ్, పాకిస్థానీ సినిమాల్లోనే గాక ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లోనూ, దూరదర్శన్ టీవీ సీరియల్స్ లోనూ బ్రిటిష్ సీరియల్స్ లోనూ గూడ ఓంపురి నటించారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ‘హానరరీ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ‘గౌరవాన్ని 2004 లో పొందారు. అటువంటి గొప్ప కళాకారుడి గురించి, విలక్షణ నటుడి గురించి ఈనెల ‘అచ్చంగా తెలుగు ‘పాఠకులతో విషయాలు పంచుకుందాము. ఓంపురి గుండెపోటుతో 06. 01. 2017 న  తన తుది శ్వాస విడిచారు.
*****
18.10.1950 వ తేదీన ప్రస్తుత హర్యానా (అప్పటి పంజాబ్) ‘అంబాలా ‘ లో ఒక ధృవతార ఉదయించింది. ఆ ధ్రువతారే తర్వాత చలనచిత్రసీమ నేలిన ఓంపురి. ఓంపురి  తండ్రి రైల్వేశాఖలో, భారత రక్షణ దళంలో పనిచేశారు. వారిది చాలా బీదకుటుంబం. ఓంపురి వయసు సుమారు ఆరు సంవత్సరాలున్నపుడు,  ఓంపురి తండ్రిని ( ఆ సమయంలో ఆయన రైల్వేశాఖలో పనిచేస్తూ ఉండేవారు) సిమెంట్ దొంగిలించారనే ఆరోపణ పై జైలులో బంధించారు. అసలే బీదరికంలో దీనావస్థలో ఉన్న  ఓంపురి, అతని అన్న వేద్ పురి చిన్నా చితక పనులెన్నో చేశారు. కుటుంబం గడవడానికి వేద్ పురి రైల్వే పోర్టార్ అవతారంమెత్తాడు.  ఓంపురి స్థానిక టీ షాపులో పనికి కుదిరాడు. కుటుంబ పోషణకై  ఓంపురి సమీపాన గల డాబాలోనూ, టీ షాపులోనూ పనిచేశాడు. అంతేగాక రైలుపట్టాల వెంబడి ఎంతోదూరం ప్రయాణించి, పట్టాల ప్రక్కన పడి ఉన్న బొగ్గులను ఏరుకుని వచ్చేవాడు. చిన్నతనం లోనే మాతృప్రేమకు దూరమైన  ఓంపురిని, అతని అన్నను చుట్టుప్రక్కల ఇళ్ల వాళ్ళు ఆదరణతో చూసేవారు.
ప్రాథమిక విధ్యపూర్తి చేసిన ఓంపురి, పూణేలో గల ‘నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ‘లో చేరారు. చిన్నతనం నుంచీ, నటన అంటే ప్రాణం ఓంపురికి. 1973 తర్వాత నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా లో ప్రముఖమైన  పాత్రలు, నాటకాలలో పాలుపంచుకోవడంతో పాటు, వాటి నిర్వహణలో ప్రముఖంగా పని చేశారు శ్రీ ఓంపురి. ఆ సమయంలోనే అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు లభించేవి. తోటి నటుడు నాజీరుద్దీన్ షా ప్రోత్సాహంతో ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్సిటూట్ అఫ్ ఇండియా (FTII ) లో చేరారు. సహవిద్యార్థిగా నసీరుద్దీన్ షా, ఓంపురికి ఎన్నో రకాలుగా సహాయకారిగా ఉండేవాడు. ఒకసారి ఓంపురి - టైమ్స్ అఫ్ ఇండియా పేపరుకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో , తను FTII  లో చేరినపుడు ధరించడానికి సరియైన షర్ట్ కూడా ఉండేది కాదని తెలిపారు. తోటివిద్యార్థి నసీరుద్దీన్ షా తన కెన్నో విధాలా సహాయపడుతూ ఉండేవాడని, ఓంపురి ఆ ఇంటర్వ్యూ లో తెలియజేశారు. ఆ పరిచయం, స్నేహం, తరువాత సినీజగత్తులో వారిరువురి మధ్య గాఢమైన స్నేహంగా, బలమైన బంధంగా మారింది. వారిరువురు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. నసీరుద్దీన్ షా ప్రోత్సాహంతో FTII లో చేరినా కూడా, ఓంపురికి ఆ బోధనా విధానం, పద్ధతులు అంతగా నచ్చేవి కావు. కొన్ని సార్లు వారికి ట్యూషన్ ఫీజు కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు.
వృత్తిపరంగా చూస్తే ఓంపురి మొదటిసినిమా -  చోర్ చోర్ చుప్ జా - అనే పిల్లల సినిమా.  ఆ సమయంలోనే గుల్షన్ గ్రోవర్, అనిల్ కపూర్ ప్రభృతులు అతని (ఓంపురి) విద్యార్థులుగా నటించారు. సినీ జగత్తులో కాలిడినా తరువాత వెనక్కు తిరిగి చూడలేదు. కానీ అతని అభినయం ఎంతగా ఆకట్టుకునేదంటే - అతనెక్కువగా ఆర్ట్ ఫిల్మ్ లలో నటించడంతో - విశ్లేషకుల అభిమానాన్ని విపరీతంగా చూరగొన్నాడు. ఆక్రోష్, ఆరోహణ్, అర్ధ సత్య మొదలైన సినిమాలన్నీ ఆ కోవకు చెందినవే! తరువాత ఓంపురి ఎన్నో భారతీయ చిత్రాల్లోనూ, అమెరికా, బ్రిటిష్ సంస్థలు నిర్మించిన చిత్రాల్లోనూ తన నటనా విశ్వరూపం ప్రదర్శించారు
1976 లో ఒక మరాఠీ నాటకం ఆధారంగా నిర్మించిన ‘ఘాషీరామ్ కొత్వాల్ ‘అనే మరాఠీ చిత్రం తో ఓంపురి మరాఠీ చిత్రప్రవేశం చేశారు. ఈ సినిమా విజయ్ టెండూల్కర్ చే నిర్మింపబడి, కె.హరినాథ్ , మణికౌల్ దర్శకత్వంతో విడుదలయ్యింది. FTII లో పట్టభద్రులైన 16 మంది సహకారంతో ఈ సినిమా నిర్మితమై విడుదలయింది. ముఖ్యపాత్ర ఘాషీరామ్ కొత్వాల్ గా ఓంపురి నటన ఎంతగానో ప్రముఖుల ప్రశంసలందుకుంది.
తర్వాత సహజనటుడు అమ్రీష్ పురి, నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ, స్మితాపాటిల్ మొదలైన వారితో కలిసి 1980లో భావినీ భావై, 1981లో సద్గతి, 1982లో అర్థసత్య , 1986లో మిర్చిమసాలా, 1992లో ధరవి - మొదలైన ఆర్ట్ ఫిలిమ్స్ లలో నటించారు.
సహజమైన నటనతో పాత్రలకు న్యాయం చేకూర్చే ఓంపురి నటనకు సినీ విమర్శకులు బ్రహ్మరథం పట్టేవారు. 1980లో విడుదలైన ‘అక్రోష్ ‘ చిత్రంలో బాధితుడైన ట్రైబల్ జాతి మనిషిగా, 1982లో విడుదలైన ‘డిస్కో డాన్సర్ ‘ చిత్రంలో జిమ్మీ మేనేజరుగా, 1982లో విడుదలైన అర్ధాసత్య లో పోలీసు అధికారిగా , 1985లో విడుదలైన ‘జమానా ‘చిత్రంలో వినోద్ అంకుల్ గా , 1996 లో విడుదలైన ‘మాచిస్ ‘ చిత్రంలో సిఖ్ మిలిటెంట్ల నాయకుడిగా, 1997 లో విడుదలైన ‘గుప్త్ ‘చిత్రంలో కఠినమైన పోలీసు అధికారిగా, 2003 లో ‘ధూప్ ‘ చిత్రంలో మరణించిన సైనికుని తండ్రి పాత్రలో ఏంటో ధైర్యస్థునిగా - ఇలా ఏ పాత్ర చేసినా చిరస్మరణీయమే …. ఆ పాత్రలో ఒదిగిపోయేవారు ఓంపురి. ఆ పాత్ర తనకోసమే పుట్టిందా అన్నట్లు ఆ పాత్రలో జీవించేవారు. ఇందులో 1982లో విడుదలైన ‘అర్థసత్య ‘సినిమాలో ఓంపురి నటనకు గాను, ఆయనకు జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి పురస్కారం లభించింది.
1999 లో ఓంపురి కన్నడచిత్రసీమలో అడుగుపెట్టారు. AK -47 అన్న చిత్రం ద్వారా కన్నడ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఉగ్రవాదుల నుండి, అండర్ వరల్డ్ డాన్ ల నుంచి నగరాన్ని భద్రంగా చూసే స్ట్రిక్ట్ పోలీసు అధికారిగా ఆయన నటన ఎందరో విమర్శకుల, ప్రేక్షకుల మన్ననలను అందుకోవడమే కాకుండా, కమర్షియల్ హిట్ ని సాధించింది. ఆ సినిమాలో తన డైలకులను తానే స్వయంగా చెప్పుకున్నాడు ఓంపురి. అదే సంవత్సరంలో బ్రిటిష్ హాస్య చిత్రం ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’అనే చిత్రంలో కూడా నటించారు. అందులో పశ్చిమ ఇంగ్లాండ్ కు వలస వచ్చిన పాకిస్థానీయుడి పాత్ర ధరించారు . ఈ చిత్రం కమర్షియల్ గా గొప్ప విజయాన్ని సాధించింది. 1982లో రిఛర్ట్ అటెన్ బరో దర్శకత్వం వహించిన ‘గాంధీ ‘ చిత్రం లో నటించారు. గాంధీ చిత్రం ఎంత గొప్పగా విజయం సాధించిందో తెలియంది కాదు.
1990 దశకం మధ్య నుంచి ఓంపురి దృక్పథం మారింది. ఆర్ట్ ఫిలిమ్స్ తో పాటు, హిందీ సినిమాలలో ముఖ్యపాత్రలు, క్యారెక్టర్ యాక్టర్ పాత్రలవైపు తన దృష్టి సారించారు. ఈ మార్పువల్ల తనదైన ముద్ర వేసుకున్న విమర్శకుల, విశ్లేషణ నుంచి, సాధారణ ప్రజానీకం - మాస్ దృష్టి తనవైపు మళ్ళేటట్లు చేసుకున్నారు. సాధారణ ప్రేక్షకులకి తన నటన ద్వారా చేరువకావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు ఓంపురి.
 అంతేగాక 1997 లో ‘మైనస్ ది ఫేనటిక్ , 1999 లో ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్ ‘, 2001 లో ‘ది పెరోల్ ఆఫీసర్ ‘ చిత్రాల ద్వారా బ్రిటిష్ చిత్రాలతో నటించి, అంతర్జాతీయ సినిమా మార్కెట్ లోకి అడుగుపెట్టారు. ఇంకా - patrick swayzeకి జోడీగా 1992 లో ‘సిటీ అఫ్ జాయ్ అన్న హాలీవుడ్ చిత్రంలోనూ, jack nicholson తో 1994 లో ‘ఉల్ఫ్ ‘ అన్న హాలీవుడ్ చిత్రంలోనూ, val kilmerతో 1996లో ‘ది ఘోస్ట్ అండ్ ది డర్క్నెస్స్ ‘ అన్న హాలీవుడ్ చిత్రంలోనూ నటించారు. అంతేగాక 2007లో నిర్మితమైన చార్లీ విల్సన్స్ వార్ ‘అన్న హాలివుడ్ చిత్రంలో జియా-ఉల్ -హాక్ పాత్ర పోషించి, మేటినటులైన టామ్ హేండ్స్, జూలియా రాబర్ట్స్ తో నటించారు.
1998లో ప్రసారంకాబడ్డ ‘కాకాజీ కహే ‘అన్న హిందీ టీవీ సీరియల్ లో కాకాజీగా కిళ్లీ నములుతూ,రాజకీయవేత్తల పై ఓంపురి చేసిన పేరడీ నటన, వీక్షకులను అమితానందం భరితులను చేసింది. 1989 లో ప్రసారం కాబడ్డ యోగీ  సీరియల్ లో ముఖ్యపాత్రల పనులకు అడ్డం తగులుతూ , సూత్రధారిగా వ్యవహరించిన  ఓంపురిపాత్ర చిత్రీకరణ, నటన అమోఘం. ఈ రెండు సీరియల్స్  ఓంపురి యొక్క హాస్య నటనా ప్రాభవాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పాయి. 1988లోనే హిందీ నావెల్ ఆధారంగా నిర్మించబడ్డ గోవిందనిహ్లానీ యొక్క ‘తమస్ ‘అన్న హిందీ టివి ఫిల్మ్  ఓంపురి నటనకు దర్పణం పట్టింది. విమర్శకులు  ఓంపురి నటనను ఆకాశానికెత్తేశారు.
‘జానీబీదోయారో,  ‘చాచి 420’(1997), ‘హీరాఫేరీ ‘(2000 లో నిర్మితం), 2002 లో నిర్మితమైన ‘ ‘చోర్ మచాయే శోర్’, దీవాన్ హువె పాగల్, చుప్ చుప్ కే, కిస్మత్ కనెక్షన్, మాలామాల్ వీక్లీ , ఓ మై గాడ్ చిత్రాల్లో హాస్యపాత్రలు ధరించి, తానటువంటి పాత్రలను కూడా మనోరంజకంగా చేయగలనని నిరూపించుకున్నారు.
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న శ్రీ కమల్ హాసన్ , శ్రీ ప్రియదర్శన్ సినిమాల్లో తప్పనిసరిగా ఓంపురి ఉండేవారు.
కమర్షియల్ బాలీవుడ్ సినిమాల్లో ఓంపురికి పేరు తెచ్చిన కొన్ని సినిమాలు - ద్రోహ్ కాల్ , ఇన్ కష్టడి,నర్సింహ ,ఘాయల్,మృత్యుదండ్ ,ఆస్థ ,హేరామ్, ప్యార్ తో హోనా హి థా , ఫర్జ్ ,గదర్ ,లక్ష్య , దేవ్,రంగ్ దే బసంతి,యువ,సింగ్ ఈజ్ కింగ్, మేరె బాప్ పహలె ఆప్,బిల్లు,క్యూకి,దబంగ్ , భాజీ ఇన్ ప్రాబ్లమ్, ఖాప్, బజ్ రంగ్ భాయి జాన్, ఘాయల్ ఒన్స్ ఎగైన్, మొదలైనవి. 2009 లో విడుదలైన ‘రోడ్ టు సంగమ్ ‘చిత్రంలో మొహమ్మద్ ఆలీ కసూరీ గాను, 2010లో నిర్మితమైన ‘ది హేంగ్ మెన్ ‘సినిమాలోనూ, 2011 లో విడుదలైన ఏక్షన్ సినిమా ‘డాన్ -2 ‘లోనూ ఓంపురి నటించారు.
సోనీఛానల్  2004-2005లో ప్రసారం చేసిన ‘ఆహాట్ ‘ (రెండో సీజన్ ) లో కొన్ని ఎపిసోడ్ లలో ఓంపురి నటించడం జరిగింది. ఇంకా ఓంపురి నటించి ప్రేక్షకులను అలరించిన కొన్ని టివి కార్యక్రమాలు - భారత్ ఏక్ ఖోజ్ , యాత్ర, మిస్టర్ యోగి, కాకాజీ కహే , సీహాక్స్ , అంతరాల్ , సావధానం ఇండియా (సెకండ్ సీజన్).
2014 హెలెన్ మిర్రర్ కి జోడిగా ది హండ్రెడ్ ఫుట్ జర్నీ అనే హాస్యనాటికలో నటించారు. జనవరి 2017 శ్రీ ఓంపురి మరణించే సమయానికి ‘15 ఆగష్టు భాగిలే 26 జనవరి ‘అనే మరాఠీ చిత్రంలోనూ మరికొన్ని హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
 ఇక ఓంపురి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే - అదేమంత సంతృప్తికరంగా లేదు. నటుడు అనూకపూర్ సోదరి సీమాకపూర్ ను 1991 లో వివాహం చేసుకున్నారు. కాని ఆ వివాహం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. ఎనిమిది నెలల కాపురం తర్వాత 1991 లోనే వారిరువురూ విడిపోయారు.
1993లో జర్నలిస్ట్ వృత్తిగా గల నందితాపూరిని వివాహం చేసుకున్నారు. వీరికి ‘ఇషాన్ ‘పేరు గల ఒక కుమారుడు కలిగాడు. 2009 లో నందితాపూరి, తన భర్త ఓంపురి పై ‘అన్  లైక్ లీ హీరో: ది స్టోరీ ఆఫ్ ఓంపురి ‘ అనే జీవిత చరిత్ర గ్రంధాన్ని వ్రాసింది. ఆ పుస్తకంలో కొన్ని తన వ్యక్తిగత, గత జీవిత విశేషాలను ప్రస్తావించినందుకు ఓంపురి నందితపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. 2013 లో ఓంపురిపై నందిత గృహహింస కేస్ ఫైల్ చేయగా, వారిరువురి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
 నందిత మాటల్లో ఓంపురి ఆచారవ్యవహారాలు అంతగా పట్టించుకునే వాడు కాదనీ, కాని ఇతరుల వ్యవహారాల్లో, వారావిధంగా ఉండడాన్ని తప్పు పెట్టేవాడు కాదనీ, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడంలో మానసిక ప్రశాంతత పొందేవాడని, ముఖ్యముగా ఏక్ నాథ్ ఈశ్వరన్ బోధనలు,పుస్తకాలు ఆయనను ప్రభావితం చేసేవని , ఆ అనుభవాలు, విషయాలు, స్నేహితులతో పంచుకునేవాడని తెలిపారు. రాజకీయాలను సీరియస్ గా తీసుకునేవాడని, తోటపని (gardening ) వంట (cooking ) అంటే ఓంపురికి చాలా ఇష్టమని ఆమె తెలిపారు.
ఓంపురి మరాఠీ, కన్నడ,పంజాబీ,మలయాళం,హిందీ,ఇంగ్లీష్,తెలుగు,ఫ్రెంచ్,పాకిస్థాన్, సినిమాల్లోనే గాక - ఇంగ్లీష్ టివి సీరియల్స్ లో, దూరదర్శన్ టివి సీరియల్స్ లో, బ్రిటిష్ సీరియల్స్ లో నటించారు.
2016లో రఫాకత్ మీర్జా పాత్రలో ‘ఏక్టర్ ఇన్ లా ‘అనే పాకిస్థానీ చిత్రంలో కూడా నటించారు.
అవార్డుల విషయానికి వస్తే -
1981 - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు -  ఆక్రోశ్  చిత్రం
1981 - జాతీయ ఉత్తమ్ నటుడు - ఆరోహాన్ చిత్రం
1983 - జాతీయ ఉత్తమ నటుడు - అర్ధ సత్య చిత్రం
1984 - KARLOVY INTERNATIONAL FILM FESTIVAL - BEST ACTOR - అర్ధ సత్య చిత్రం
1990 - భారతప్రభుత్వంచే ‘పద్మశ్రీ ‘పురస్కారం.
1998 - BRUSSELS INTERNATIONAL FILM FESTIVAL - BEST ACTOR -మై సన్ ది ఫేనటిక్
1998 - GRAND PRIX SPECIAL DES AMERIQUES MONTREAL WORLD FILM FESTIVAL FOR    EXCEPTIONAL CONTRIBUTION TO CINEMATOGRAPHIC ART
2004 - HONORARY OFFICER OF THE ORDER OF THE BRITISH EMPIRE FOR THE SERVICES TO THE BRITISH FILM INDUSTRY.
2009 - ఫిల్మ్ ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం. (LIFE TIME ACHIEVEMENT AWARD)
2015 - జీవిత సాఫల్య పురస్కారం - ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ప్రయాగ్
ఇవిగాక NOMINATIONS విషయానికి వస్తే
1990 - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - ఘాయల్
1997 - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - మాచిస్
1998 - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - గుప్త్
1999 - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - ప్యార్ తో హోనా హీ థా
1999 - BAFTA AWARD FOR BEST ACTOR IN A DEADING ROLE - EAST IS EAST
ప్రసిద్ధి చెందిన బాలీవుడ్ నటులు అమ్రీష్ పురి: మదన్ పురి ; శ్రీ ఓంపురి కి వరుసకు సోదరులవుతారు.
ఘనత చెందిన ఇంత  గొప్ప నటుడు , బహుభాషా చిత్రాల్లో నటించి, అనేక అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలను పొందిన సహజనటుడు, విలక్షణ నటుడు - పద్మశ్రీ ఓంపురి 66 ఏళ్ల వయసులో 06.01.2017 వ తేదీన హార్ట్ ఎటాక్ తో , అంథేరీ (ముంబాయ్ ) లో తన స్వగృహంలో హఠాత్మరణం చెందారు.
****

No comments:

Post a Comment

Pages