ఉద్యోగినులు-గృహిణులు - అచ్చంగా తెలుగు

ఉద్యోగినులు-గృహిణులు

                                                            డా. వారణాసి రామబ్రహ్మం


ఉద్యోగాలు చేసే కొందరు ఆడవాళ్ళు, ఇల్లాలిగా కుటుంబాన్ని సాకుతూ, గృహిణిగా అన్ని పనులూ చేస్తూ ఇంటి బాధ్యతలను ప్రేమతో, అభిమానంతో చేస్తూ ఇంటిని స్వర్గసీమ చేసే తోటి ఆడవాళ్ళని ఎందుకో తమతో సమానంగా చూడరు. తాము ఉద్యోగం చేస్తున్నామని, గొప్ప వారిమని అనుకుంటూ తమ తమ కుటుంబాలలో ఉన్న గృహిణులతో సభ్యతారహితంగా ప్రవర్తిస్తారు. ఈ గృహిణులు ఇంటిపని, వంటపని చేసే పనివారు అని గేలి చెయ్యడానికి కూడా వెనుకాడరు.
ఈ తరహా ఉద్యోగినులు తమ తమ ఇళ్ళ నిర్వహణ "డబ్బు పడేసి" పనివారికి అప్పగించి తాము, గృహిణులు మాత్రమే అయిన తమ తోటివారిని అగౌరవంగా చూస్తారు. వాళ్ళ దృష్టిలో గృహిణులు, తమ పనివారు ఒకటే. ఇంతటి అనాగరికత, సంస్కార రాహిత్యమూ ఇలా కొందరు స్త్రీలలో చోటు చేసుకోవడము శోచనీయము. గృహిణులు ఇంటినీ, పిల్లలను, పెద్దవారిని చూసుకుంటూ కుటుంబాలకు, సంఘానికి చేస్తున్న మహోపకారము‌ ఈ అహంకారులకు, గర్వపోతులకు అర్థము కాదు. గృహిణుల ఈ ఉదాత్తత, త్యాగ స్వభావము, సేవానిరతి ఇటువంటి ఉద్యోగినుల చిన్ని బుర్రలకు విశదము కాదు. ఇలా ప్రవర్తించే ఉద్యోగినులు తమ కుర్రతనాన్ని, మూర్ఖత్వాన్ని, అవగాహనా రాహిత్యాన్ని, అహంభావాన్ని, ప్రేమరాహిత్యాన్ని బయటపెట్టుకుంటున్నారంతే. వీరికి వారి స్థాయికి మించిన ఔన్నత్యాలు అర్థము కావు. గృహిణులు భవనములకు పునాది వలె కుటుంబానికి ఆలంబన. చెట్లకు వేళ్ళ వలె కుటుంబానికి గృహిణులు ఆధారం. అంతా. భవంతి అందాన్ని, దాని సౌకర్యాన్ని గురించి మాట్లాడేవారి దృష్టిలో పునాది ఉండదు. అలాగే చెట్ల పచ్చదనాన్ని, ఉపయోగాన్ని, ఉపకారాన్ని గురించి మాట్లాడేవారి దృష్టిలో చెట్ల వేళ్ళు ఉండవు. కంటికి కనిపించని పునాది, వేళ్ళ పాత్ర మూలమైనది. అలాగే గృహిణుల పాత్ర సంఘానికి మూలమైనది. పునాది, వేళ్ళు లేక భవనాలకి, చెట్లకు ఉనికి మనుగడ లేవు. అలాగే గృహిణులు లేక కుటుంబానికి, సంఘానికి ఉనికి, మనుగడ లేవు. గృహిణులు లేక కుటుంబం లేదు. కుటుంబాలు లేక సంఘం లేదు. ఈ ఇంగితం తెలియని ఉద్యోగినులు, కుహనా మేధావులు, ఎన్.జి.వో. లు కోకొల్లలుగా ఉన్న నేడు గృహిణులను తక్కువగా చూసి కుటంబానికి, సంఘానికి వారి ఉపకారాన్ని, అవసరాన్ని గమనించక, గమనించడం తెలియక మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కునే విధంగా ప్రేమతో, స్త్రీ సహజమైన లాలిత్యంతో, అభిమానంతో గృహావసరాలు చూసే, కనిపెట్టే గృహిణుల పాత్రను, ప్రాముఖ్యాన్ని, అవసరాన్ని‌ గ్రహించక గృహినులను లేకుండా చేస్తున్న నేటి నాగరికత, సంస్కృతి మనకు చేసే, చేస్తున్న అపకారాన్ని విజ్ఞులు గుర్తించాలి. ఏది బానిసత్వం? ఏది సర్వోత్తమం? మనం పరశీలించ వలసిన సమయం ఆసన్నమైనది. పరిణామశీలమైన నాగరికతను, సంస్కృతిని మన ఉనికి, మనుగడలకు అనుగుణంగా‌ మలుచు కోవలసిన తరుణం ఇది. దిగుమతి చేసుకున్న భావాల, సిద్ధాంతాల అవసరం, అపకారం, సాంప్రదాయ పద్ధతుల ఉపకారం బేరీజు వేసుకొని మన ఉనికి, మనుగడలు శాంతిసుఖములతో సాగే దారి నిర్మించవలసిన బాధ్యత మనందరిదీ. మేధావులలో కుహనా తత్త్త్వం ప్రబలి మనకు ఎంతో అపకారం జరుగుతోంది అని గ్రహించవలసిన వర్తమానం ఇది. సంఘజీవనం ప్రవాహమే అయినా, పరిణామశీలము, మానవ నిర్మితము కూడ.

No comments:

Post a Comment

Pages