Monday, January 23, 2017

thumbnail

శ్రీలక్ష్మీ శతకము - పరవాస్తు మునినాథకవి

శ్రీలక్ష్మీ శతకము - పరవాస్తు మునినాథకవి

పరిచయం : దేవరకొండ సుబ్రహ్మణ్యం కవి పరిచయం:
లక్ష్మీ శతక రచయిత పరవాస్తు మునినాథ కవి సాతాని వైష్ణవుడు. నిజాము రాష్త్రనివాసి. క్రీ.శ. 1890 ప్రాంతములవాడని చరిత్రకారుల నిర్ణయం. శతకములలోని పద్యములలోని ప్రశంశలవలన ఈ కవి శేషమఠ పీఠాధీశుండగు జియ్యరు మహేంద్రుని కృపాకటాక్షమున అష్టావధాన ప్రజ్ఞయు, కవితానైపుణ్యము పొందినట్లు చెప్పుకొన్నాడు.
క. భువి శ్రీమచ్ఛేషమఠ ప
రవాస్తు జియ్యరు శిరోగ్రరత్నకృపాపాం
గవిభావితాష్టఘంటా
కవితాద్రవిణాఢ్యుఁడను తగంగా లక్ష్మీ
క. అనుపమకవితారచనా
ఘనప్రవీణుండ మదకుకవిమూర్ధ్నవిలుం
ఠనకుశలహస్తవల్లవుఁ
డను మునినాథాభిధానుఁడను శ్రీలక్ష్మీ
అయితే ఈకవి ఏ గ్రామ వాస్తవ్యుడో, ఏకాలమునాటివాడో నిరూపించటానికి కావలసిన ఆధారాలు ఈ శతకంలో కనిపించవు. శతకవైఖరిని బట్టి ఈ కవి ప్రబంధరచనా సమర్థుడని, ఆధునిక కవి కావచ్చునని పండితుల అభిప్రాయం.
ఈకవి ఏమైనా ఇతర గ్రంథములు రచించినాడో లేదో తెలియుటలేదు కాని "లలితాశతకము" అను మర్క శతకము రచించినట్లు తెలుస్తున్నది. ఇతని తలితండ్రుల గురించిన విషయాలు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు.
శతక పరిచయం:
లక్ష్మీశతకము భక్తిరసపూరితమగు ప్రౌఢశతకము. ఇది "లక్ష్మీ" అను సంభోదనాత్మక మకుటముతో 102 కందపద్యాలలో రచింపబడినది. కవి శతకాంతమున దనను మత్తేభవృత్తమున ప్రశంసించుకొన్నాడు.
మ. అనఘ శ్రీపరవాస్తుశేషపీఠపీధీశజియ్యర్మహేం
ద్రనిరాఘాటకృపాకటాక్షరససంప్రాప్తాష్టఘంటాకవి
త్వనిధి శ్రీశతపత్రసన్మఠమునిస్వామిప్రణీతంబు ధా
త్రిని లక్షీశతకంబు భానుశశిభూభృత్తారమై శోభిలున్
ఈశతకమునందలి కవిత్వము అతుకాఠిన్యము. సంస్కృతపదభూఇస్టము. పద్యములందు శబ్దాలంకారములగు వృత్యానుప్రాసము, అంత్యప్రాసము వంటివి ఉండుటచే చదువుటకు వినుటకు సొంపుగా ఉన్నవి.
ఈశతకాన్ని ప్రపథమంగా సంస్కరించి వావిళ్ళ వారు తమ "భక్తిరస శతకసంపుటము" మూడవభాగమునందు ప్రచురించారు.
కొన్ని శతకపద్యాలను చూద్దాము.
క. కమలాక్ష దివ్యమహిషీ
కమలా పద్మా రమా జగజ్జననీ మా
కమలవనీ నిలయామృత
కమలనిధిప్రియకుమారికా శ్రీలక్ష్మీ
ఈ క్రిందిపద్యం లో కందపద్య ప్రస్తుతి చూడండి (త్రిప్రాస కందము)
క. కందంబులు కవి మధురస
కుందంబులు సకలదీనకోకిలచయమా
కందంబులు భక్తజనా
నందంబులు శతకముగ నొనర్తును లక్ష్మీ
ప్రతిపద్యమునందు భక్తిపారవశ్యం పొంగిపొర్లుతుంది
క. అమృతసఖీ హిమకరబిం
బముఖీ శరణాగతాతిభరనోరుగుణా
భిముఖీ గంధర్వసుధాం
శుముఖీ మృదుమధురగానసుముఖీ లక్ష్మీ
సుదీర్ఘ సంస్కృతసమాసాలు ఈకవి పద్యాలలో అనేకం. కొన్ని మచ్చుకి
క. భూరమణ మౌటతటశో
భారత్నమరీచిజాలబాలాతపసు
స్మేరపదాంబుజ భువనా
ధారమణీ శంఖచక్రధారిణి లక్ష్మీ
క. లలితానిజపీఠపార్శ్వ
స్థలసంస్థితవాగ్గిరీంద్రజారతిహస్తో
జ్జ్వలవీటికాకరండక
కళాచికారత్నపాదుకాయుగ లక్ష్మీ
సుదీర్ఘ సంస్కృత సమాసాల్లోనే కాక తెలుగులోని పద్యాలుకూడా మనోహరంగానే కనిపిస్తాయి.
క. నలువ నెలతాల్పు మెదలుం
గల వేలుపుతలిరుబోండ్లగములు ననుంగుం
జెలికత్తెలై కొలువం
జెలువారు త్రిలోకజనని శ్రీకరి లక్ష్మీ
క. నీనెనరు గొనం బింతని
జానుగ గొనియాడఁ దరమె చతురానన పం
చానన షడానన సహ
స్త్రాననులకు బహుఘృణాకరి లక్ష్మీ
క. నీవు గలచోటు సరసము
నీవును లేనట్టిచోటు నీరసము జగ
త్పావని పరిలసదనుకం
పావని రదవసనజితజపావని లక్ష్మీ
క. కలుములపై దలి బలు లే
ములసిలుగులు బాపుతల్లి ముజ్జగములఁ బెం
పలరన్ బ్రోచు యువతి త
మ్ముల నిమ్ముల నాడు ముద్దు ముద్దియ లక్ష్మీ
కొన్ని పద్యాలు పూర్వకవులకు అనుకరణలుగా కనిపిస్తాయి. ఈ క్రిందిపద్యం చదవగానే పోతనామాత్య గజేద్రమోక్షంలోని పద్యం జ్ఞప్తికిరాక మానదు.
క. నీవని నమ్మితి ద్రిజగ
త్పావని విను నీవినా యితఃపర మెఱుఁగన్
రావే లోకైకేశ్వరి
కావవే భద్రాత్మికా సుఖప్రద లక్ష్మీ
మరికొన్ని
క. ఇమ్మా మదభీష్టంబులు
కొమ్మా మా మ్రొక్కులన్ ముకుందుననుంగుం
కొమ్మా వినవమ్మా మా
యమ్మా వలరాజు గన్నయమ్మా లక్ష్మీ
కవి అయినా ఇతను కొంతకాలం దారిద్ర్యావస్త అనుభవించినట్లు క్రింది పద్యాలలో తెలుస్తుంది.
క. పరిభవపరిచితి మిక్కిలి
దురవస్థం బెట్టి తార్తి దొరయించితి వ
చ్చెరు వే నేయపరాధం
బురక యొనర్చితి వచింపు మున్నతి లక్ష్మీ
క. చేసితి చేయంగలపనిఁ
బోసితి పరిభవపుధారఁ బొలియించితి వా
యాసంబుల నిఁకనైన మ
హాసంపద లిచ్చి కావుమా వెస లక్ష్మీ
శతకాంతమున తనకు సిరులులభించినట్లు కవి చెప్పుకొన్నాడు.
క. అలరుం గైతలనేరుపు
గలుగంగా నిన్నుఁ బొగడఁ గాంచితిఁ దలపన్
దొలిబాముల నోఁచిన నో
ములపంట ఫలించె సిరులఁ బొదలితి లక్ష్మీ
భక్తిరస ప్రధానమైన ఈ శతకము అత్యంత ప్రొఢశతకాల కోవలోనికి వస్తుంది. అందరు చదివి తరించాల్సిన అద్భుతమైన శతకము. మీరు చదవండి. ఇతరులచేత చదివించండి.

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information