Monday, January 23, 2017

thumbnail

రాస లీల

రాస లీల 

రావి కిరణ్ కుమార్ కార్తీక పున్నమి ... తూరుపు కాంత నుదిటిన అద్దిన కుంకుమ బొట్టులా ,ఆకాశ కాంతకు కాచిన ఎర్రని పండులా అగుపించి క్రమేపి పక్వ దశను దాటి పండిన పండులా పసిమి ఛాయలు సంతరించుకుని, మేఘ మండలము అలంకరించుకున్న పసిడి పాపిట బిళ్ల లా తన వెండి వెలుగులతో భూకాంతను చందురుడు ప్రకాశింప చేయు వేళ ...
 చిరుగాలి తాకిడికి కదులాడుతున్న నల్లని పొడుగాటి కురుల ప్రవాహంలా మృదు మదుర సవ్వడులతో, సాగిపోతున్న యమునా తీరాన చందనపు పొడి రేణువులా అని మరిపించే విధంగా పరుచుకున్న ఇసుక తిన్నెలు,  సమీపాన సువాసనలు వెదజల్లెడి పూలతలతో మనోహరమగు లావణ్యముతో ఒప్పారు రంగు రంగుల పూల మొక్కలతో, మధుర రసాలు స్రవించు ఫలాలతో నిండిన వృక్షాలతో కూడిన బృందావని ...
ఆ వృందావనిలో  నవ యవ్వనంతో తొణికిసలాడే గోపకాంతల సమూహాలు ...... కొందరు గోపికలు తమ చీర సొబగుల సౌందర్యాన్ని ఇతర గోపికలతో పంచుకు మురిసిపోతుంటే మరి కొందరు తమ ఆభరణాల తళుకు బెళుకులు ప్రదర్శిస్తూ ఉన్నారు.
మరి కొందరు తమ చేతి కంకణముల సవ్వడులతోను ఇంకొందరు కాలి  అందియల సవ్వడులతోను మరి కొంత మంది గోపికలు కోలాటపు సవ్వడులతోను ఆ వృందావని లో సందడి చేస్తుండగా మరి కొందరు ముగ్ధలు తమ గాన కౌశలంతో ఆ ప్రాంతాన్ని పునీతం చేస్తున్నారు . కానీ అందరిలో ఎదో తెలియని ఆరాటం ఎవరికోసమో ఎదురుచూస్తున్నా భావన కొట్టొచ్చినట్లు కనబడుతుంది.
వీరందరికి భిన్నంగా ఓ మందార వృక్షపు ఛాయలో ఒంటరిగా  చెట్టు కొమ్మపై తన కుడి చేతిని ఆనించి ఆ చేతి పై తన చిరుగడ్డముంచి చందురుని శీతల కిరణాలను సైతం ఆవిరి చేసేంత గాఢమైన నిట్టూర్పులతో , ఎగసిపడుతున్న ఎదతో ఓ కలకంఠి కూర్చుంది.
ఆ ముఖ చంద్రిక ముందు వేల  చందురులు సైతం దిగదుడుపే అనిపించేలా  చిరుగాలి తాకిడికి సైతం కంది పోవునా అనిపించే నాజూకుతనంతో ఓ అపురూప సౌందర్యరాశి ఉంది. ఎవరికోసం ఈ నిట్టూర్పులు  ?ఎవరీమె ?
ఇంతలో జగత్తునంతా సమ్మోహన పరిచే వేణునాద తరంగాలు ఒక్కసారిగా ఆ వృందావని చేరగనే అప్పటివరకు ఆరాటంతో ఎగసిపడుతున్న హృదయాలు కల గోపికలు తమను తాము మరచి స్వాపనికా జగత్తులో చేరుకోగా ,ఆ కలకంఠి మాత్రం నవ చైతన్యంతో  విచ్చుకుని ఒక్కసారిగా పులకరించిన మేనితో వృందావని ముఖద్వారం చూడగా...
శిఖి పింఛమౌళి , నల్లని దేహఛాయతో పైన చందనపు పూతతో పట్టు పీతాంబరాలు ధరించి వేణువు ఊదుతూ ఆ వృందావని అడుగిడగానే తల్లి గోవును చూచి పరుగులెట్టే లేగ దూడలా ఆ కలకంఠి ఆ కన్నయ్యను చేరుకొని ఆలింగనం చేసుకుంది.
అంటే ఆ ముగ్ధ ఇంకెవరో కాదు రాధా దేవి అంతటి అదృష్టం ఆమెకు కాక ఇంకెవరికి ?
శ్రీరాముడు లోని సౌకుమార్యం లలితా త్రిపుర సుందరి లావణ్యం కలసి కలబోసిన అందాలరాశి ఈ రాధ.
ఈ రాధా కృష్ణుల ప్రణయకేళి విలాసమే రాస లీల . ఇది రెండు మహోన్నత భావాల (మాతృత్వము +పోషకత్వము=వాత్సల్యము  ) కలయిక .
రెండు దేహాల కలయిక కాదు , తొమ్మిది రంధ్రాలతో కూడి తొమ్మిది రకాల  మలపదార్ధాలతో నిండిన దేహాల కలయిక ఎలాంటి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు.
చైతన్యం మాతృత్వం పోషకత్వం లాలిత్యం సౌందర్యం ఈ  భావాల పరస్పర కలయికే రాసలీల అట్టి రాసలీల మానసిక దర్శనం దుఃఖ స్పర్శలేని సుఖానుభూతినిస్తుంది అది నిజమైన రసానుభూతి.
స్వాపనికా జగత్తులోనికి జారుకున్న గోపికలు కూడా  ఆ మురళీ లోలుని వేణుగానానికి పరవశులై తమనుతాము మరచి తమ భావాలకు తగినట్లు గోవిందుని ఎవరికివారు తమ హృదయారవిందంలో నింపుకుని భావప్రాప్తి ని పొంది తమ జీవితాలను ధన్యం  చేసుకున్నారు .

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information