శ్రీ దత్తాత్రేయ వైభవం - 10 - అచ్చంగా తెలుగు

శ్రీ దత్తాత్రేయ వైభవం - 10

Share This
శ్రీ దత్తాత్రేయ వైభవం - 10
శ్రీరామభట్ల ఆదిత్య

22. ఇరవై రెండవ గురువు - లోహపు పనివాడు :
తన పని చేస్తున్నప్పుడు లోహపు పనివాడు ఎంత శ్రద్ధతో చేస్తాడో అంత బాగా తయారవుతాయి పనిముట్లు. ఒక పనిముట్టును అద్భుతంగా తీర్చిదిద్దాలంటే ఆ పని మీద పట్టు, చేయాలనే ఆసక్తి ఉండాలి. లేకుంటే ఆ పని ఎంత చేసినా లాభం ఉండదు. అలాగే మనిషి కూడా ఏ పని చేసినా శ్రద్ధతో, అమితాసక్తితో చేయాలి. పూజ కూడా ఏదో తంతుగా, తూతూ మంత్రంగా చేస్తారు చాలా మంది. కానీ అలా చేస్తే ఫలితం ఉంటుందా అనేది మనం ఆలోచించాలి.
పూజను ఒక ప్రక్రియగా భావిస్తారే తప్ప దాని మీద ప్రేమతో చేయరు. పూజ చేసేటప్పుడు కూడా శ్రద్ధాలోపం చాలా చూస్తూంటాం. ఎలాగంటే వారు పూజలో చదివేదొకటి చేసేదొకటి. ఉదాహరణకు శ్రద్ధలేని ఓ వ్యక్తి పూజలో ఉన్నప్పుడు పుష్పం సమర్పయామి అని అంటూనే ఒక పండును ప్రసాదంగా పెట్టాడట. ఒక్క పూజ అనే కాదు ఎన్నో పనుల్లో చాలా మంది ఇలాగే చేస్తారు.
మనసు ఒకటి ఆలోచిస్తుంది చేతలు ( చేసే పని ) మాత్రం వేరేగా ఉంటాయి. అలా చేస్తున్నప్పుడు ఒక్కోసారి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. అందుకే ఏ పనిచేసినా శ్రద్ధ, ఆసక్తి, శ్రమ అనేది ముఖ్యమంటాడు దత్తాత్రేయుడు.
23. ఇరవై మూడవ గురువు - సాలెపురుగు:
సాలెపురుగు తన సాలీడు ఎంతో అందంగా మరియు ఎంతో నైపుణ్యంతో నిర్మిస్తుంది. దాన్ని కట్టడానికి ఎంతగానో శ్రమిస్తుంది. అలా నిర్మించాక ఆ సాలీడులో చాలా కాలం నివసించి తరువాత అవే సాలెపురుగులు తమ సాలీడును తామే తినేస్తాయి.
భగవంతుడు కూడా అంతే, ఈ మాయా సృష్టిని తానే నిర్మించి, ఆ సృష్టితో ఆటలాడి కొంత కాలం తరువాత మళ్ళీ తనలోనే లయం చేసుకుంటాడు. కానీ మనం మాత్రం ఈ సృష్టే నిజమనుకుని భ్రమిస్తూంటాం. కాని ఇదంతా అసత్యమే కేవలం సచ్చిదానంద బ్రహ్మము మాత్రమే సత్యమంటాడు దత్తాత్రేయుడు.....
24. ఇరవైనాలుగవ గురువు - గొంగళి పురుగు:
గొంగళి పురుగు చిన్నగా ఉన్నప్పుడు దానిని పట్టుకున్న కందిరీగ దానిని తన గూటిలో దాచుకుని దానిని బంధించి దాన్ని కుడుతుంది. ఆ తరువాత దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు తిరుగుంతుందో అర్థం కాక భయపడిన గొంగళి పురుగు కాసెపటికి తనను తాను కందిరీగగా భావించుకుంటుంది. ఆ గొంగళి పురుగు కూడా తరువాత క్రమంగా అలా అలా తను కూడా కందిరీగగా మారిపోతుంది.
ఎవరైనా పదే పదే ఒకరి గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు వారి గుర్తులే మనసులో ఉంచుకొని పదే పదే వారిని స్మరిస్తుంటారో అలాంటి వారు కొన్నాళ్ళకి వారు ఎవరినైతే ఊహించుకుంటారో, తాము వారు ఒకటేనని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు మనం చూసేవుంటాం. అలాగే సాధకుడు కూడా ఎప్పుడూ పరమాత్మను గురించి ఆలోచిస్తే తన పరమాత్మలో లీనమౌతాడు. అందుకే మనిషనే వాడు మోక్ష ప్రాప్తికై ప్రయత్నించాలంటాడు దత్తాత్రేయుడు. ఇంకా ఈ ఇరవైనాలుగు గురువులనే కాకుండా తాను తన శరీరం నుండి కూడా చాలా విషయాలు నేర్చుకున్నానంటాడు. "శరీరము అనుభవించే జనన మరణ చక్రాల నుండి ఙ్ఞానము, వైరగ్యాలను నేర్చుకున్నాను. అందుకే ఈ శరీరంపై పెంచుకుంటే తరువాత బాధలు, దుఃఖాలు తప్పవంటాడు. ఈ శరీరంతో ఎన్నో పవిత్ర కార్యాలు చేయవచ్చు. కానీ నేను ఈ శరీరంపైన మక్కువ పెంచుకోను".
" ఈ శరీరాన్ని సుఖపెట్టటం ధనం సంపాదించాలి. ధనం కోసం కర్మలు చేయాల్సి ఉంటుంది. ఈ కర్మల వలన పాప, పుణ్యాల చక్రంలో చిక్కపోవడం ఖాయం. భగవంతుడు 84 లక్షల యోనులను పుట్టించినా సంతృప్తి పడక మానవ యోనిని సృష్టించాడు. ఈ యోనికి మోక్షమే నిజమైన లక్ష్యం.......
" మోక్షము కేవలం ఈ మానవ యోని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అంతే తప్ప మిగిలిన ఏ యోనితోనూ మోక్షప్రాప్తి సాధ్యపడదు. అందుకే ఈ దుర్లభ మానవ జన్మను వృథా చేసుకోకూడదు. అందుకే నేను వైరాగ్యాన్ని స్వీకరించాను. నాకు దేని పైనా మోహము లేదు. దేనిపైనా అహం భావము కూడా లేదు " అని అంటాడు దత్తాత్రేయుడు.
ఈ ఇరవైనాలుగు గురువుల తత్త్వాలను శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి బోధించినట్టుగా శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని ఏడవ ఘట్టంలో కనిపిస్తుంది. అలాగే తెలుగులోని మన పోతన భాగవతంలో ఏకాదశలో స్కంధంలోని పన్నెండవ ఘట్టంలో ఈ విషయం మనకు కనిపిస్తుంది. అందులో మనం చూసిన ప్రతీ ఒక్క కథతో పాటు, శ్రీ కృష్ణుడు ఉద్ధవుడికి బోధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి.
జగద్గురువైన దత్తాత్రేయుడు ఈ ఇరవైనాలుగు తత్త్వాలను మనకు ఙ్ఞాన బోధ చేయటానికే స్వీకరించాడు. ఏందుకంటే ఆయనే జగద్గురువు కాబట్టి. మనం కూడా ఙ్ఞానప్రదాలైన ఈ తత్త్వలను గ్రహించి ఆచరించే ప్రయత్నం చేద్దాం.
ఇన్ని రోజులూ అఙ్ఞానినైన నాతో తన వైభవాన్ని రాయించుకున్నాడు దత్తాత్రేయుడు. రాసింది నేనైనా రాయించింది ఆయనే.
ఈ పోస్టులను ఆదిరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరిపైనా దత్తాత్రేయుడు తన కృపాకటాక్షాలు కలుగుజేయాలని కోరుతన్నా...
....జై శ్రీ రామ....

No comments:

Post a Comment

Pages