Friday, December 23, 2016

thumbnail

జామకాయలు – చిట్టి చిలకలు

జామకాయలు – చిట్టి చిలకలు

  పి.యస్.యమ్. లక్ష్మి


బాలలూ, మీకు జామ కాయలంటే ఇష్టమేనా?   మంచి రుచిగా వుండే జామకాయలంటే చాలామందికి ఇష్టం కదా.  మరి ఈ జామకాయల గురించి ఒక కధ చెప్పనా?
చిలకాపురం అనే ఊళ్ళో జామ తోటలు చాలా ఎక్కువగా వుండేవి.  ఆ తోటల్లో కాసిన జామ కాయలు పెద్దగా, మంచి రంగుతో, వుండటమేకాక చాలా రుచిగా కూడా వుండేవి.  చాలామంది చిలకాపురం జామకాయలు అంటే ఇష్టంగా కొనుక్కుని తినేవారు.  జామతోటలు పెంచే రైతులు కూడా ఆ పళ్ళమ్మితే చాలా డబ్బులు రావటంతో, వాటితో వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కునేవాళ్ళు, మంచి భోజనం చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలని బాగా చదివించే వాళ్ళు.  దాంతో వాళ్ళందరూ సంతోషంగా వుండేవాళ్ళు.
అలా హాయిగా రోజులు గడిచిపోతున్నాయి.  ఒకసారి ఒక చిలకల గుంపు ఎక్కడినుంచో ఆ జామ తోటల్లోకొచ్చి వాలింది.  ఆ తోటల్లో జామ కాయలు చాలా రుచిగా వుండటంతో అవి ఆ కాయలను కడుపునిండా తిన్నాయి.  ఆ గుంపులో పెద్ద చిలకలు వాటికి ఆకలేసినంతమటుకే ఆ కాయలు తినేవి.  కానీ కొన్ని చిన్న చిలకలు వున్నాయి.  అవి చాలా అల్లరివి.  తోటనిండా జామ కాయలు వుండటంతో ఆహారం కోసం వెతుక్కునే అవసరం కూడా లేకుండా పోయింది.  దానితో వున్న సమయమంతా ఆటలు, ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి దూకటం, కాయలు కొరికి పారేయటం ఇలా నానా గోలా చేసేవి.  పెద్ద చిలకలు వాటికి నచ్చ చెప్పాయి.  కాయలు కావాలంటే తినండి, లేకపోతే లేదు, కానీ అలా కొరికి పారేయద్దు.  ఈ తోటలు కనబడటంవల్ల మనం కొంతకాలం ఆహారం కోసం వెతుక్కోకుండా సరిపోతోంది.  ఈ కాయలన్నీ కొరికి పారేస్తే రేపు మనకి మళ్ళీ ఆహారానికి కరువొస్తుంది.  మళ్ళీ మనం ఆహారం కోసం వెతుక్కుంటూ ఎంత దూరం వెళ్ళాలో .. అందుకని జాగ్రత్తగా వుండండి అన్నా పిల్ల చిలకలు వినిపించుకోలేదు.
వీటి ఆగడాలు భరించలేని రైతులు ఆ చిలకలని అక్కడనుంచి తోలటానికి చాలా అవస్తలు పడ్డారు.  వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడే తిష్ట వేసేవి.  రైతులు చాలా బాధ పడ్డారు.  చిన్న చిలకలు కాయలన్నీ కొట్టేయటంతో కాయలు కోసి అమ్మటానికి ఏమీ వుండేవి కాదు.  దానితో వాళ్ళకి డబ్బులు రాక పాపం అన్నింటికీ ఇబ్బంది పడసాగారు.  పిల్ల చిలకలు కాయలు కాసీ కాయకుండానే తెంపి పడేయటంతో మిగతా చిలకలకి కూడా తినటానికి కాయలూ, పళ్ళూ లేకుండా అయిపోయినాయి.
పెద్ద చిలకలు పిల్ల చిలకలని బాగా మందలించాయి.  మీరిలా అల్లరిగా ఆహారాన్ని తెంపి పడెయ్యటంతో మనకి చాలా కాలం వస్తుంది అనుకున్న ఆహారం తొందరగా అయిపోయింది.  మీ మూలంగా మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ తిరగాల్సి వచ్చింది.  మీ ఆకతాయితనం వల్ల ఆ రైతులు, వాళ్ళ కుటుంబాలూ కూడా అవస్తలు పడుతున్నారు అని, వాళ్ళ ఆటలవల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వివరించి చెప్పారు.  పిల్ల చిలకలు తమ తప్పు తెలుసుకుని ఇంకెప్పుడూ ఇలా చెయ్యమని చెప్పాయి.  అన్ని చిలకలూ కలిసి ఆహారాన్ని వెతుక్కుంటూ వేరే చోటికి ఎగిరి పోయాయి.
బాలలూ, ఈ కధవల్ల మీకేం తెలిసింది?  అవి పక్షులు కనుక ఆహారాన్ని వెతుక్కుంటూ అలా ఎగిరి పోయాయి.  కానీ మనుష్యులు ఇల్లూ, స్కూలు అన్నీ వదిలేసి అలా వెళ్ళలేరు కదా.  అందుకే మనమెప్పుడూ ఆహారాన్నే కాదు,  ఏ పదార్ధాన్నీ వృధా చెయ్యకూడదు.  తెలిసిందా?
సరే.  కధ విన్నారుకదా...ఇప్పుడు జామకాయల్లో వుండే పోషక పదార్ధాలని గురించి తెలుసుకుందాము.
జామకాయలు దాదాపు అన్ని దేశాలలో లభిస్తాయి.  ఈ కాయలు తినటంవల్ల మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.  వీటిలో ఎ, బి, సి, విటమిన్లు, పీచు పదార్ధం ఎక్కువగా వుంటాయి.  చర్మాన్ని ఆరోగ్యంగా వుంచే కొల్లాజన్ లభిస్తుంది.  ఇంకా దీనిలో వుండే పెక్టిన్ అనే పదార్ధంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.  అందుకనే షుగర్ వ్యాధి వున్నవారు కూడా ఈ పండ్లు తినవచ్చు. ఇంకో విషయం తెలుసా?  మీకెప్పుడన్నా పంటి నొప్పి వస్తే ఈ ఆకులు శుభ్రంగా కడిగి నమలండి.  నొప్పి తగ్గిపోతుంది.  ఆకలి కూడా పెరుగుతుంది.
చూశారా!?  చెట్ల వల్ల ఎంత లాభమో  మనకి ఆహారాన్నిస్తాయి, ఆరోగ్యాన్నిస్తాయి, ఇంకా మందులు కూడా., అన్నింటికన్నా ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షిస్తాయి..కనుక చెట్ల ఆకులనీ, కొమ్మలనీ, కాయలనీ వూరికే తుంచి పడేయద్దు.  మొక్కలు పెంచండి.
****

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information