యుద్ధం - అచ్చంగా తెలుగు

యుద్ధం

పోడూరి శ్రీనివాసరావు 


యుద్దమంటే... గెలుపూ ఓటములే కాదు.
మంచిని స్వీకరించడం... చెడుని విడనాడడం
ఆ విన్యాసాల్లో భాగంగా... మధ్యలోచేసే
సంధి ప్రయత్నాలూ... యుద్ధంలో భాగమే!
పరిస్థితిని ఆకళింపు చేసుకొని
అవకాశాన్ని అర్ధం చేసుకొని
సమయానుకూలంగా వేసే
వెనకడుగు ‘ఓటమి’ కాదు.
అదును చూసుకుని...ద్విగుణీకృతోత్సాహంతో
శత్రువుపై విరుచుకు పడడం
విజయావకాశాలను మెరుగుపరుస్తుంది.
వ్యూహాత్మకంగా వ్యవహరించడం ముఖ్యం.
          ‘అంభి’ లాంటి దేశద్రోహులుంటారు
అప్రమత్తులై మెలగండి.
ఆవేశం ఉండాలి...కానీ ఎల్లపుడూ కాదు
ఆలోచనతో పోరాడేవాడే
అసలైన విజేత!
యుద్ధమంటే రాజ్యాలనాక్రమించడమే కాదు
ఉన్న రాజ్యంలో అంతర్గత అవసరాలకై
చిత్తశుద్ధితో పోరాడడం..సాధించుకోవడమూ
యుద్ధమే!!
          అవినీతిపై పోరాటం...
          ఆశయ సాధనకై పోరాటం ...
          రాజ్యకాంక్షతో పోరాటం...
          మంచిని సాధించుటకై పోరాటం...
          ప్రతిజీవికీ ...అనునిత్యం పోరాటమే!
తమ ఉనికిని కాపాడుకోవడానికి,
జీవనసమరం సాగించడానికి
పశుపక్ష్యాదులు నిత్యం
పోరాటం సాగిస్తూనే ఉంటాయి.
మనిషి స్వార్ధపరుడూ
దురాశాపరుడూ కాబట్టి
పోరాటపు ఆలోచనలూ,
విధానాలూ వేరుగా ఉంటాయి.
మనుషుల్లో ఉన్న యుద్ధకాంక్ష
పశుపక్ష్యాదుల కుండవు
అవి తమ అవసరం మేరకే పోరాడతాయి.
కానీ! మనిషి వేరుగా....
తనకు అవసరం – అవసరం లేదు...
అస్థిత్వం కావాలి...తనబలం నలుగురికీ చాటాలి.
వెనుకటి యుద్ధాలూ,కౌషలాలూ పోయాయి
ఇపుడంతా సాంకేతికమే!
అణ్వాస్త్రప్రయోగాలూ,క్షిపణి ప్రయోగాలూ
కేవలం ఒక్కమీటతో, ఎన్నో
కిలోమీటర్ల దూరాననున్న
శత్రుబలగాలపై ఆకస్మిక దాడులు.
ఉగ్రవాదభూతం ఉరిమిరిమి చూస్తోంది.
గెరిల్లాయుద్ధం పాతబడిపోయింది.
ఒకదేశానికి తెలియకుండా మరోదేశం
తన అమ్ములపొదిలో అధునాతన
అణ్వాస్త్రాలను సమకూర్చుకొంటోంది.
          తనదేశ బడ్జెట్ లో
          స్వదేశ రక్షణకై గాక
          పరదేశాల మీద
          దురాక్రమణకై
          సన్నాహాలు చేస్తోంది.
పురాణాల కాలం నుంచి
యుద్ధోన్మాదం ఉరకలు పెడుతూనే ఉంది.
మహాభారతం ల్యాండ్ మాఫియా కోసం
ప్రసిద్ధ రామాయణం సీతాదేవి కిడ్నాప్
కోసం జరిగిన యుద్ధాల కథలే కదా!!
          కొన్నిదేశాలు జన్మతః ఉగ్రవాద దేశాలు
          మరికొన్ని దేశాలు వారికి వత్తాసు పలికే దేశాలు
          కొన్ని తటస్థ దేశాలు – గోడమీద పిల్లుల్లా
          మరికొన్ని శాంతి కాముక దేశాలు .
జన నష్టం – ఆస్థి నష్టం  - ప్రాణ నష్టం.....
ఇది మానవులు మాత్రమే చేసే యుద్ధ ఫలితాలు కావు!
ప్రకృతి పగబట్టి మానవులపై చేసే యుద్ధాలు
కూడా పై ఫలితాలే వెలువరిస్తాయి.
          అగ్నిపర్వత విస్ఫోటాలు ....
          కరువు కాటకాలూ ....
భయంకర తుఫానులు .....
గట్లుతెగి ప్రవహించే
ఘోరనదీ ప్రవాహాలు....
ప్రకృతి చేసే విలయతాండవంలో
జీవులంతా సమిధలు కావలసిందే!!
సృష్టికి ఎదురొడ్డి ...ప్రకృతిపై యుద్ధం ప్రకటించి
మన జాతి...మానవజాతి నిర్వీర్యం కారాదు.
          శాంతి కపోతాల్ని ఎగురవేద్దాం
          విశ్వశాంతికై పాటుపడదాం.
          కానీ యుద్ధ జ్వాలలు శాంతి కపోతాల 
          రెక్కల్ని సైతం కాల్చి బూడిద చేసేస్తున్నాయి.
అయినా...మన సమాధానం...
ఓం శాంతి!శాంతి!!శాంతి!!
శాంతి మంత్రంతోనే మన
ఆశయాన్ని సాధిద్దాం!!!
***********

No comments:

Post a Comment

Pages