సుబ్బుమామయ్య కబుర్లు! - 3

సినిమాలు


పిల్లలూ మీకు సినిమాలంటే ఇష్టమే కదూ! అవునులే సినిమాలంటే ఎవరికిష్టం ఉండదు.
నా చిన్నప్పుడు ‘పాపం పసివాడు’ అనే సినిమా వచ్చిందర్రా. అందులో ఓ బుజ్జి బాబు ఉంటాడు. ఆ అబ్బాయి విమానంలో ప్రయాణిస్తుంటే అది ఎడారిలో కూలిపోతుంది. ఆ పిల్లాడు ఒక్కడు తప్ప ఎవరూ బతకరు. ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించుకోండి. భయం వేస్తోంది కదూ! పాపం అమ్మానాన్నల ప్రేమను తల్చుకుంటూ ’అమ్మా చూడాలి..నిన్నూ నాన్నను చూడాలి..నాన్నకు ముద్దు ఇవ్వాలి..నీ ఒడిలో నిద్దరపోవాలి..’అంటూ ఏడుస్తూ ఒంటరిగా తిరుగుతుంటాడర్రా! అది చూసి చిన్నప్పుడు నేను ఏడ్చేశాను.
మరో సినిమా ’పాపకోసం’. అందులో భయంకరమైన దొంగలు పాప మీద ప్రేమతో పోలీసులకు లొంగిపోతారు. చూసి తీరాల్సిన సినిమా.
సినిమాలు చూసి తెగ అల్లరి చేసేవాళ్లం మేము. ‘అల్లూరి సీతారామరాజు’ అనే సినిమాలో సీతారామరాజు విల్లూ, బాణం పట్టుకుని తిరుగుతూ, బ్రిటీషువాళ్ల మీద బాణాలు వేస్తుంటాడు. మేము అది చూసి కర్రని తీసుకుని దానికి గట్టి దారం కట్టి విల్లు తయారు చేసుకుని చీపురు పుల్లల బాణాలు ఎవరో ఒకరిమీద గురి చూసి వేసేవాళ్లం. దాంతో వాళ్లు మా ఇంటిమీదకి గొడవకొచ్చి, మా అమ్మానాన్నలకు నేను వాళ్ల మీద బాణాలు వేసిన విషయం చెప్పేవారు. దాంతో అమ్మానాన్నలు నన్ను తిట్టీ, కొట్టేవాళ్లు. ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది..అప్పట్లో అలా ఎలా అల్లరి చేసానా? అని. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకూడదు కదా!
శక్తిమాన్, సూపర్ మ్యాన్ లాంటి సినిమాలు విడుదలైనప్పుడు పిల్లలు అనుకరించి గోడలమీద నుంచి, చెట్లపై నుంచి దూకి పాపం కాళ్లూ చేతులు విరగ్గొట్టుకోవడం మీకు తెలుసా? అలాంటి పనులు మాత్రం మీరు చేయకూడదర్రా. అమ్మో..కాళ్లూ చేతులు లేకుండా జీవితాంతం ఎలా ఉండగలం? అందుచేత సినిమాలు, టీ వీ ల్లో కార్యక్రమాలు చూసి వాటిని అనుకరించకూడదు సరేనా?
అన్నట్టు కేవలం పిల్లలు పాత్రలుగా పిల్లల కోసం సినిమాలు వచ్చాయని మీకు తెలుసా? బాలభారతం, రామాయణం, భక్తధృవమార్కండేయ సినిమాలు ఎంత బావుంటాయో.
పై సినిమాలే కాకుండా పిల్లలు ముఖ్య పాత్రలుగా కూడా సినిమాలు వచ్చాయి వాటిలో లేత మనసులు, భక్తప్రహ్లాద, బాలరాజుకథ, యశోదకృష్ణ, బాలమిత్రులకథ ముఖ్యమైనవి. పిల్లలూ ఈసారి ఆదివారం ఆ సినిమాలు చూడండి. పిల్లలు ఎంత బాగా నటించారో..చూడ్డానికి రెండు కళ్లు చాలవు. సినిమాల్లో బాలనటులు పెద్దలతో సమంగా నటించి పెద్దయ్యాక కూడా పేరు తెచ్చుకున్నారు. శ్రీదేవి, కమల్ హసన్ అలా వచ్చినవాళ్లే. షాలిని అయితే బాలతారగా బోలెడంత సంపాదించి ఇన్ కం ట్యాక్స్ కూడా భారీగా కట్టింది.
మొగ్గగా ఉన్నప్పుడే పరిమళించడమంటే ఇదే. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకు ఎంత పేరు వచ్చిందో కదా! వచ్చేమాసం చదువు గురించి ముచ్చటించుకుందాం సరేనా? ఉంటాను మరి!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top