శ్రీమద్భగవద్గీత-4 - అచ్చంగా తెలుగు

శ్రీమద్భగవద్గీత-4

రెండవ అధ్యాయము

రెడ్లం రాజగోపాలరావు, పలమనేరు.

Ph: 09482013801


తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః
వశేహియస్యేన్ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా            61 వ శ్లోకం
ప్రకృతి వైపు ఆకర్షించబడిన , బలవత్తరమైన ఇంద్రియములనన్నింటినీ వశపరచుకున్న సాధకుడు , స్థిరమైన మనసుతో ఆత్మయందే రమించుచున్నయాతని జ్ఞానము దేదీప్యమానముగా వెలుగుచుండును. దైవాన్ని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలవారికి చక్కని సందేశము ఈ శ్లోకము ద్వారా తెలియబడుచున్నది .
ఎన్నో జన్మలనుండీ అంటియున్న వాసనలను నిర్మూలజేయుట అంత సులభము గాదు. ఇంద్రియములు కలుగజేయు ఆకర్షణ బలీయమైనది.నిరంతర సాధన , తైలధారవంటి భక్తి , కఠినమైన క్రమశిక్షణ , తీవ్రవైరాగ్యము సాధకుని జితేంద్రుని జేయును.దేహము శిధిలము కాకమునుపే దేహిని తెలుసుకోవాలి. సాధనా సంస్కారాలకనుకూలంగా ఈ శరీరాన్ని యుక్తమైన మితాహారంతో, ఉత్సాహవంతమైన ఆరోగ్యంతో నిలుపుకుని మానవజన్మకు పరమార్దం తెలుసుకోవాలి.
ధ్యాయతో విషయాన్ పుంసః
సంగస్తేషూ పజాయతే
సంగాత్సంజాయతే కామః
కామాత్ర్కోధో భిజాయతే                          62వ శ్లోకం
క్రోధాద్భవతి సమ్మోహః
సమ్మోహా త్స్మృతి విభ్రమః
స్మ్రతి భ్రంశో ద్భుద్ధి నాశో
బుద్ధి నాశ త్ప్రణశ్యతి                              63 వ శ్లోకం
విషయ చింతన ఎంతటి అనర్ధములకు దారితీయునో పై రెండు శ్లోకములందు వివరించబడినది.కామము(కోరిక) మనసున ప్రవేశించిన వెంటనే క్రోధము తన వునికిని తెలియజేయును. వీరిరువురు పరమ మిత్రులు ఒకరిని విడిచియుండజాలనంత సన్నిహితత్వము ఇరివురకూ గలదు. క్రోధము విజృంభించినంతనే సమ్మోహము కలుగును. సమ్మోహము వలను జ్ఞాపకశక్తి నశించి, యుక్తా యుక్త విచక్షణ మరచిపోవును. అందువల్ల బుద్ధి చెడిపోవును. బుద్ధి చెడిన మనుజుడు మహా పతనమొందును. విజ్ఞులగువారు ఇంద్రియములను విషయములపైకి పోనీయక నిరంతర అభ్యాశముతో నిగ్రహము కలిగియుండి , వైరాగ్య భావనతో మనసును భగవంతుని వైపు ప్రయత్నము ధృఢముగా చేయవలెను.
ధ్యాయతో విషయాన్అనగా విషయధ్యానము, ధ్యానమనునది , క్రొత్త విషయము కాదు మనసును విషయములపై ఏకాగ్రమొనర్చుటయే విషయధ్యానము. మనసును నిర్మలమొనర్చి భగవంతునిపై మరలించుటయే దైవధ్యానము. తద్వారా మోక్ష సామ్రాజ్యములో ప్రవేశము కలిగి ప్రశాంతి లభించును.
 ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ
నైనాం ప్రాప్య విముహ్యతి
స్థిత్వా స్యా మన్త కాలేపి
బ్రహ్మ నిర్వాణ మృచ్చతి                72 వ శ్లోకం
ఇదియంతయూ బ్రహ్మ సంబంధమైన స్థితి ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందిన మనుజుడు మరల ఎన్నటికినీ విమోహము చెందడు. అంత్యకాలమందు ఈ స్థితియందున్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును బడయుచున్నాడు. ఇంద్రియ నిగ్రహము విషయ త్యాగము , అహంకార మమకార రాహిత్యము చేయుచురాగా బ్రహ్మైక్యము సిధ్ధించును.
బ్రహ్మానందం పరమసుఖదం దుర్లభమైన మానవజన్మను పొందిన జీవుడు పుట్టినది మొదలు ఆనందం కోసమై అన్వేషణ చేస్తున్నాడు. ప్రాపంచిక విషయాల ద్వారా పొందే ఆనందం క్షణికమైనది. వెలుగులా వచ్చిపోతూ వుంటుంది. కరుణామయుడైన పరమాత్మ తనకు ప్రతిరూపమైన మానవునికి తన దివ్యలక్షణాలన్నీ ఇచ్చాడు ఒక్క ఆనందం తప్ప. త్రిగుణాతీతమైన శుద్ధ సత్వ స్థితిలో భగవంతుని దర్శనం పొందిన జీవుడు బ్రహ్మానంద భరితుడై అధమ స్థాయిలోవున్న భౌతికానందాల జోలికి పోవడానికిష్టపడడు. తనలోనే కోటి సూర్యుల కాంతితో వెలుగొందే పరమాత్మను దర్శనం చేసుకున్నవారు ధన్యులు. ఎల్లప్పుడూ భగవచ్ఛింతనతో సాధన చేసిన సత్పురుషులకే ఈ బ్రహ్మనిర్వాణ స్థితి ప్రాప్తిస్తుందని గీతాచార్యుని వాక్కు. మోహమును వీడుటయే మోక్షం.
క్రియా యోగ శాస్త్రానికి మూలపురుషులు శ్రీ మహావతార్ బాబాజీ. వారి ప్రియ శిష్యుడు , క్రియా యోగ శాస్త్రానికి ప్రపంచ ఖ్యాతిని సాధించిన యోగివర్యులు శ్రీ శ్యామాచరణ్ లాహిరీ వారు. వారి బ్రాహ్మీ స్థితిని ఇక్కడ ముచ్చటించాలి. ఒకసారి వారి శిష్యుడు గురువు గారిని వినయంగా భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. వారు అంగీకరించి వెళ్ళారు. శాంభవీ ముద్రా స్థితులైన యోగిరాజులు భోజనానికి కూర్చున్నారు. బెంగాలీలు ఇష్టంగా తినేవి చేపలు. ఆ శిష్యుడు గురువు గారికి చేపల కూర వడ్డించాడు. బ్రాహ్మీ స్థితిలో వున్న శ్రీ శ్యామాచరణులు బాహ్య స్మృతి లేకుండా భుజిస్తున్నారు. మట్టికి మాణిక్యానికి తేడా తెలియని స్థితి. వడ్డించిన ఆహారాన్ని తృప్తిగా భుజించారు. కొన్నాళ్ళ తరువాత మరొక శిష్యుడు యోగిరాజులను భోజనానికై ఆహ్వానించాడు. గురువు గారికి ఇష్టమని తెలుసుకున్న శిష్యుడు విస్తరిలో చేపల పులుసు కూడా వడ్డించాడు. జన్మతః బ్రాహ్మణులైన శ్యామాచరణులు వెంటనే లేచి నేను శాఖాహారినని తెలియలేదా ?? అని కోపంతో భోజనం తినకుండానే వెళ్ళిపోయారు.
Image result for lahiri mahasaya
శాంభవి ముద్రలో ఉన్మత్తులైన వారికి భాహ్య భావన లేశమాత్రమైనా లేదు. ఆ యోగారూఢుని ద్వారా జరిగే కర్మలన్నియు దైవలీలలే.
  ****

No comments:

Post a Comment

Pages