నీకు నేనున్నా - 4 - అచ్చంగా తెలుగు

నీకు నేనున్నా - 4 

అంగులూరి అంజనీదేవి

anjanidevi.novelist@gmail.com

angulurianjanidevi.com



(జరిగిన కధ: చదువుకునేందుకు హైదరాబాద్ ప్రయాణం అవుతుంటాడు  మనోహర్. అతని అక్క  కూతురు పద్మ మావయ్యను ఏడిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని, పెద్దల యోచన. పట్నంలో తాను చూసిన ఇంటి ఓనర్ కూతురు మధురిమ మనోహర్ మనసులో ఏదో తియ్యని అలజడిని రేపుతుంది. మధురిమ అక్క చనిపోవడంతో, ఆమె చంటిబిడ్డను పెంచుతూ ఉంటుంది మధురిమ తల్లి. ఒక రోజు బాబును ఆడిస్తున్న మనోహర్ గదికి, బాబును తీసుకోవడానికి వెళ్ళిన మధురిమను చూసి, ఆమె తనకు దక్కలేదన్న అక్కసుతో వారిద్దరికీ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తాడు హరి. దాంతో పెళ్లి కాన్సిల్ అయిన మధురిమ అనేక అవమానాల పాలు అవుతుంది. గది ఖాళీ చేస్తానన్న మనోహర్ ను వారిస్తుంది మధురిమ తల్లి. మనోహర్, మధురిమ ఇరువురికీ ఒకరిపై ఒకరికి ప్రేమ భావన ఎక్కువౌతూ ఉంటుంది. ఇక చదవండి.)
రోజులు  క్షణాల్లా దొర్లిపోతున్నాయి.
మనోహర్ ని చూడక యుగాలు అయినట్లు ఉంది మధురిమకి.
మధురిమలోని ఊహలకి ఊపిరి పోసిన మనోహర్ క్షణం క్షణం మధురిమ గుండెల్లో గుచ్చుకుంటున్నాడు.మాటల్లో చెప్పలేని భావాలన్నీ మధురిమ మనసులో ఓ కుప్పలాగా కూర్చొని మౌనంగా రోదిస్తున్నాయి. ఎలాగైనా తన భావాలను కాగితంపై పెట్టాలని పెన్నుపట్టుకొని కూర్చుంది మధురిమ. లోపలెక్కడో దాగివున్న తలపులన్నీ ఒక్కసారిగా అక్షరాల రూపంలో బయటకొచ్చి మధురిమ రాస్తున్న కాగితంపై కాసేపు ఆడుకున్నాయి.
“నా మనసుని దోచుకున్న నీకోసం
క్షణం క్షణం నిరీక్షిస్తున్నా
ప్రతి నిముషం నిన్ను చూడాలని, ఏదో చెప్పాలని
క్షణం ఒక యుగంలా తపించిపోతున్నా
నీ కొరకే ఆలోచిస్తూ శ్వాసించడాన్నే మరచిపోతున్నా
నా కళ్లలో నిన్ను బంధించి నిద్రించడాన్నే మరచిపోతున్నా
ఇంకా చెప్పాలంటే!
నా మనోహరుడివైన నిన్ను
నా మనసులో ముద్రించుకొని, నన్ను నేనే మరచిపోతున్నా
అందుకే నువ్వెప్పడొస్తే అప్పడు
నా తీయని ఊహలతో నా ప్రేమకు అర్థం చెబుతా,
నా ఆశల రంగులతో నా ప్రేమను అందంగా చిత్రిస్తా.
ఒక్కమాటలో చెప్పాలంటే
ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న నా మనసు తెగ తొందరపడ్తోంది.
నువ్వంటే నాకెంత యిష్టమో నీతో చెప్పాలని
అందుకే ఒక్కసారి
నీ హృదయపు తలుపులు తెరుచుకుంటే
అందులో నేనుండి పోతా"
అంటూ మననంతా మనోహర్ని నింపుకొని రాస్తూ కూర్చుంది మధురిమ,
ఈసారెందుకో ఇంటిదగ్గర వుండబుద్ధి కాలేదు మనోహర్కి. చదివేది చాలావుందని, ఇంట్లో అబద్ధం చెప్పి హైదరాబాదు వచ్చాడు.
రాగానే దాహంగా అన్పించి వసంతమ్మను మంచినీళ్లు అడగాలని డోర్ తట్టాడు. గుమ్మంలో నిలబడివున్న మనోహర్ని చూసి షాకయింది మధురిమ, రాస్తున్న కాగితాలపై పెన్ను అలాగే పెట్టి లేచి నిలబడింది.
ఇన్నిరోజులు,క్షణమో యుగమైనట్లు, మనోహర్ కోసం ఎదురుచూస్తున్న మధురిమకు అనుకోకుండా మనోహర్ ప్రత్యక్షం కావటం ఆనందంగా వుంది. సెలవులు పూర్తికాకుండానే వచ్చిన మనోహర్ని చూసి ఆశ్చర్యపోతూ అలాగే నిలబడింది మధురిమ.
తనని చూడగానే మధురిమ కళ్ళు కాంతిపుంజాలు కావటం మనోహర్ గమనించాడు.
"రండి! ఎప్పడొచ్చారు?" అంటూ లోపలకి ఆహ్వానించింది మధురిమ.
"ఇప్పడే వచ్చాను. దాహంగా వుంది. మంచినీళ్ళు కావాలి” అంటూ లోపలకొచ్చాడు మనోహర్.మధురిమను చూడగానే మనోహర్ మనసు కుదుటపడింది.
"ఉండండి! ఇప్పడే తెస్తాను" అంటూ లోపలకెళ్లింది మధురిమ.
అక్కడే నిలబడ్డాడు మనోహర్, అలాగే నిలబడి కాగితంపై మధురిమ రాసిన కవితను చదువుతున్నాడు. గ్లాసుతో మంచినీళ్లు తెచ్చింది మధురిమ, కవిత చదువుతున్న మనోహర్ని చూస్తూ అలాగే నిలబడింది. కవిత చదవటం పూర్తి అయ్యాక మధురిమవైపు తిరిగి మంచినీళ్ల గ్లాసు అందుకున్నాడు మనోహర్.
"మీ పర్మిషన్ తీసుకోకుండా మీ భావకవితను చదివినందుకు మన్నించండి! కవిత మాత్రం చాలా బావుంది. హార్ట్ కి టచ్ అయ్యేలాగా వుంది" అంటూ మధురిమను మెచ్చుకున్నాడు.
"హార్ట్ కి టచ్ అవ్వాలనే రాశాను" అంది మంచినీళ్లు తాగుతున్న మనోహర్ నే చూస్తూ.
"అనుకున్నాను లెండి! కానీ ఎవరి హార్ట్ కి  టచ్ అవ్వాలని రాశారో తెలుసుకోవచ్చా?" అంటూ తనవైపే చూస్తున్న మధురిమ వైపు చూశాడు.
"అదికూడా ఇప్పడే చెప్పాలా?దానికి కాస్త టైముంది లెండి! ముందు మీరిలా కూర్చోండి! నేనిప్పడే వస్తాను" అంటూ మనోహర్కి దగ్గరగా ఓ కుర్చీనిలాగి కూర్చోమంది మధురిమ.
మధురిమ తనపట్ల చూపిస్తున్న చొరవకి సంతోషంగా వుంది మనోహర్కి.
మధురిమ చెప్పినట్లే టక్కున కుర్చీలో కూర్చున్నాడు మనోహర్.
మధురిమ ఎలాచెబితే అలా చెయ్యాలని వుంది మనోహర్కి. కూజానిండా మంచినీళ్లు తీసుకెళ్లి మనోహర్ వుండే రూంలో పెట్టింది మధురిమ, వెంటనే పవిట కొంగును నడుంకి బిగించి చకచక రూమంతా క్లీన్ చేసింది. పక్కబట్టలు మార్చి వేరే బెడ్షీట్ వేసింది. అక్కడక్కడ పడివున్న బుక్సన్నీ తీసి ఓ చోట పెట్టింది. మనోహర్కి యింకేం పనిలేకుండా ఇల్లంతా చక్కగా సర్టింది. చేతులు కడుక్కొని లోపల కెళ్లి కాఫీ కలిపి మనోహర్ కి ఇచ్చింది.
"మీరు కూడా కాఫీ తీసుకోండి!" అంటూ మధురిమ ఇచ్చిన కాఫీ కప్ అందుకున్నాడు మనోహర్.
"అలాగే" అంటూ తనుకూడా ఓ కప్ప కాఫీ తెచ్చుకొని మనోహర్కి ఎదురుగా త్రాగుతూ కూర్చుంది మధురిమ.
మనోహర్కి అంత దగ్గరగా కూర్చుని కాఫీ త్రాగటం త్రిల్లింగ్ గా వుంది మధురిమకి.
"మా ఇల్లు రోజూ ఇలాగేక్లీన్ చేసి పెడతారా?" అంటూ సరదాగా మధురిమవైపు చూస్తూ అన్నాడు మనోహర్.
"ఇలాంటి అవకాశం ఎప్పడైనా దొరికితే అలాగే చేస్తాను లెండి! మీ కోరికను నేను మాత్రం ఎందుకు కాదనాలి" అంది నవ్వుతూ మధురిమ.
అప్పుడు గమనించాడు మనోహర్ వసంతమ్మ ఇంట్లో లేదని.
“మీ అమ్మగారు లేరా? ఎక్కడికెళ్లారు?"
"ఇప్పడు గుర్తొచ్చారు మీకు మా అమ్మగారు?ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు ధ్యాంక్స్!" అంది అలాగే నవ్వుతూ.
"అలా అని ఎందుకనుకుంటారు! నాకెప్పుడూ మీ అమ్మగారు గుర్తొస్తూనే వుంటారు. మీ అమ్మగారు చెప్పే మాటలు కూడా గుర్తొస్తూనే వుంటాయి. ముఖ్యంగా మీకు తెలుసో లేదో కాని మీకు ఎలాంటి అబ్బాయిని భర్తగా సెలెక్ట్ చేస్తున్నారో మీకన్నా నాకే ఎక్కువగా చెప్తంటారు. ఆ అబ్బాయి కూడా నా మైండ్ సెట్ లోఅలాగే వుండిపోయారు" అన్నాడు మనోహర్.
“అవునా! మీ మైండ్ సెట్ లో వుండే ఆ అబ్బాయి ఎలా వుంటారో ఒక్కసారి చెప్పండి! వినాలని వుంది" అంది ఆసక్తిగా.
“అవన్నీ తర్వాత చెప్పకుందాం. ముందు మీ అమ్మగారు ఎక్కడికెళ్లారోచెప్పండి?"
“మన పక్కింటి యశోదమ్మగారికి ఒంట్లో బావుండలేదని హాస్పిటల్కితీసికెళ్లారు"
"అలాగా! మరి ఇంతసేపు నాతో చెప్పరేం? ఇప్పడెలా వుందో ఏమో, మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం" అంటూ కుర్చీలో నుండి లేవబోయాడు.
"అవసరం లేదు. అవి మామూలుగా ఎప్పడూ వస్తున్న మోకాళ్ళ నొప్పులు, జాయింటు అరిగితే అలాంటి నొప్పలు వస్తాయట. అందుకే ఇప్పుడు మనం కంగారు పడాల్సిందేమీ లేదు. వాళ్లిద్దరు ఓపిగ్గా ఓపిలో కూర్చొని డాక్టర్ గారికి చూపించుకొని మెల్లగావస్తారు" అంది మధురిమ. మధురిమ మాటలు విన్నాక రిలాక్స్ గా కుర్చీలో కూర్చున్నాడు మనోహర్.
"ఇప్పుడు చెప్పండి! మీ హార్డులో వున్న ఆ మనిషెవరో?" అన్నాడు మనోహర్.
"నా హార్ట్ లో ఓ మనిషి వున్నారని, అంత గ్యారంటీగా మీకెలా తెలుసు?అంది మధురిమ.
"నాకు తెలుసులెండి! నేను కూడా అలాంటి కవితలే రాత్రి నా కలలో చాలా రాశాను. నా మనసులో కూడా ఓ మనిషి వున్నారు" అన్నాడు మనోహర్.
"కలలో రాశారా?కాగితాలపైపెట్టలేదా?” అంది మధురిమ.
మనోహర్కి వెంటనే పద్మ గుర్తిచ్చింది.
"నేను గాని కాగితాలపై రాస్తే! ఆ కాగితాలను చింపినట్లే నా మనసులో వుండే ఆ మనిషిని కూడా చింపేస్తారు మా ఇంట్లోవాళ్లు ఎంతయినా ఈ విషయంలో మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి!" అన్నాడు మనోహర్.
"మీరు ఫస్ట్ నన్ను"మీరు అనడం మానెయ్యండి! ఆ తర్వాత "మధూ అని పిలవండి. మీరలా పిలిస్తేనే నేను పలుకుతాను"
"లేకుంటే! తమరింక పలికేది వుండదా?" అంటూ మధురిమ ముఖంలోకి నవ్వుతూ చూశాడు మనోహర్.
మనోహర్ నవ్వుతుంటే మధురిమ నవ్వలేదు, మూతి ముడుచుకుంది ఆ ముడుచుకున్న తీరుముచ్చటగా, ముద్దొచ్చేలా వుంది.ముద్దుగా చూశాడు మనోహర్.
మధురిమ మనసేమిటో అర్థమైంది మనోహర్కి. ఆ మనసులో వుండేది కూడా తనేనని స్పష్టంగా తెలిసిపోయింది.
“సరే మధూ! నేనిక నా రూంలోకివెళ్తాను,చదివేది చాలావుంది. నువ్వు కూడా చదువుకో.ఏ సబ్జెక్ట్ అయినా టఫ్ గా అన్పిస్తే నన్ను అడుగు, చెబుతాను" అంటూ లేచాడు మనోహర్.
“సరే!" అంటూ తనుకూడా లేచి గుమ్మం దగ్గర నిలబడింది మధురిమ, అప్పడే తను వెళ్లటం మధురిమకి యిష్టం లేదని మనోహర్కి తెలుసు. అయినా తప్పదు.
*****
నెలరోజులు గడిచాయి. కాలేజీలో ఏదో ప్రోగ్రాం వుందని రెడీ అవుతున్నాడు మనోహర్.
"బాబూ! మనోహర్ నీ ఫ్రెండ్స్ ఎవరైనా వుంటే కాస్తస్వీట్స్ తెచ్చిపెట్టమని చెప్పు నాయనా! ఈరోజు మధురిమను చూసుకోవటానికి పెళ్లివారొస్తున్నారు" అంటూ స్వీట్స్ కోసం డబ్బులివ్వబోయింది వసంతమ్మ. మనోహర్ ఆ డబ్బుల్ని తీసికోలేదు.
మధురిమ మనసులో తను వున్నానని తెలిసినప్పటి నుండి వసంతమ్మ ఇలా మధురిమకి పెళ్లిసంబంధాలు చూడటం మనోహర్కి నచ్చటం లేదు.
"ఎంతమందికి చూపిస్తారండి మీ అమ్మాయిని?" అన్నాడు మనోహర్.
వసంతమ్మంటే ఎప్పడూ రానంత కోపం వస్తోంది మనోహర్కి.
"తప్పదుగా బాబు!పెళ్లి అయ్యేంతవరకు" అంది వసంతమ్మ ఎప్పటిలా ప్రశాంతంగానే మాట్లాడింది వసంతమ్మ.
మీ సొంత విషయాల్లో జోక్యం కల్గించుకుంటున్నానని అనుకోకపోతే "నాదోమాట వసంతమ్మగారు!”
"చెప్ప బాబు! నిన్నెప్పడూ మా సొంత మనిషిలాగే అనుకుంటాం" అంది వసంతమ్మ.
"మీరీ మధ్యన మధురిమను ప్రాణం లేని బొమ్మను చూసినట్టు చూస్తున్నారు. చూడటమే కాదు. ఓ బొమ్మతో ఆడుకున్నట్టే ఆడుకుంటున్నారు"
"అదేంటి బాబు! అలా అంటున్నావ్?"
"అనటమే కాదండీ! వన్న వాస్తవం కూడా అదే
"వనంతమ్మ మాట్లాడలేదు. మనోహరెవ్పడూ యింత గట్టిగా మాట్లాడలేదు. ఇప్పడెందుకిలా మాట్లాడుతున్నాడో అర్థం కావటంలేదు. మనోహర్ఏది మాట్లాడినా తన మంచికే మాట్లాడతాడని వసంతమ్మకి తెలుసు.
"ఆరోజు మీరు నాతో ఏం చెప్పారు! మధురిమ చదువు పూర్తి అయ్యి, జాబ్ వచ్చాకనే పెళ్లి చేస్తామన్నారు. అది బాగుంది. అలాగే చెయ్యండి! మళ్లీ ఈ ప్రయత్నాలు దేనికి?"
"ఈ మధ్యన నా ఆరోగ్యం బాగుండటం లేదు బాబు!
"మీకేం కాదు. మీరేం భయపడకండి!" అంటూ ధైర్యం చెప్పాడు మనోహర్.
వసంతమ్మ ఏం మాట్లాడలేదు. ఆలోచిస్తోంది."ఇది నామాటగానే కాకుండా మీరు కూడా ఆలోచించండి వసంతమ్మ గారు! మధురిమకు ఉద్యోగం వుంటే కట్నం కూడా తక్కువే అడుగుతారు. అప్పడు ఇంకా మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా వుంది" అంటూ వసంతమ్మకి నచ్చచెప్పాడు మనోహర్. మనోహర్ మాటలు వసంతమ్మకి నచ్చాయి.
"సరే! బాబు! చిన్నవాడివైనా బాగా ఆలోచించి మాట్లాడుతున్నావు. మధురిమ పెళ్లివిషయంలో నువ్వ చెప్పినట్లే కొంతకాలం ఆగుతాను. తర్వాత ఎలా జరగాలని రాసిపెట్టి వుంటే అలా జరుగుతుంది. ఏదీ మన చేతుల్లో లేదు" అంటూ స్వీట్స్ తెప్పించేపని ఆపుకొని తన ఇంట్లోకి వెళ్లింది వసంతమ్మ.
 మనోహర్ గుండెల మీద బరువు దిగినటైంది.
*****
సాయంత్రం వేళ.....
గుడికి వెళ్లిన మధురిమను అనుసరించాడు మనోహర్.
తలస్నానం చేసి అప్పడే జడ అల్లకొంది కాబోలు మధురిమ " చాలా నునుపుగా, పట్టుకుచ్చులా మెరుస్తోంది. గాలి తాకిడికి ఆ జట్టు అప్పుడప్పుడు లేస్తూ ఆ ముఖానికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది.
దైవదర్శనం అయ్యాక, ఆ గుల్లోనే ఓ పక్కగా కూర్చున్నారు మధురిమ, మనోహర్. వాళ్లిద్దరు మాట్లాడుకోవాలనుకున్నప్పడు అలా గుడికి వస్తుంటారు.
ఏదో ఆలోచిస్తున్న దానిలా తలవంచుకొని కూర్చుని వున్న మధురిమ వైపు పరిశీలనగా చూశాడు మనోహర్.
మధురిమలో చూస్తున్నకొద్ది యింకా చూడాలనిపించే అందం వుంది. ఆ అందాన్ని మించిన వ్యక్తిత్వం వుంది. ఆ వ్యక్తిత్వంలో కూడా ఏదో ప్రత్యేకత, పరిపూర్ణత వున్నాయి. అవి పద్మలో లేవు. పద్మలో లేని ప్రత్యేకతలు మధురిమలో కన్పిస్తూ మనోహర్ హృదయాన్ని బలంగా తాకుతున్నాయి.
తల ఎత్తి తనవైపే చూస్తున్న మనోహర్ని చూసి మెల్లగా నవ్వింది మధురిమ,
"ఏమిటి మధూ! నవ్వుతున్నావ్?"
"ఏం లేదు! మీరు నన్నే చూస్తుంటే!"
"నిన్ను చూసినంత ఇష్టంగా ఇకముందు ఎవర్నీ చూడలేనేమో ననిపిస్తోంది మధూ!" అంటూ ప్రసాదంతోపాటు పూజారి యిచ్చిన పువ్వుని తీసి మధురిమకి యిచ్చాడు మనోహర్. మనోహర్ యిచ్చిన పువ్వుని జడలో పెట్టుకొంది
మధురిమ.
“మధూ! నీ పెళ్ళి చెయ్యాలని మీ అమ్మగారు ఎందుకింత తొందర పడుతున్నారు? అప్పడే ఏం వయసు మించిపోయిందని నీకు?" అడిగాడు మనోహర్.
"నాకు వయసు మించిపోయిందని కాదు. అమ్మకి వయసైపోతోందని, పైగా ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే వుంది. తనకేమైనా జరిగితే నాకు ఎవరూ లేరనిఅమ్మ ఆలోచన" అంది మధురిమ.
వసంతమ్మ గుర్తు రాగానే మనోహర్ మనసు కరిగిపోయింది.
"నీకు నేను లేనా మధూ! ఎవరూ లేరని ఎందుకనుకుంటావ్?" అన్నాడు వెంటనే మనోహర్,
"నాకు మీరున్నారని నాకు మాత్రమే తెలుసు. అమ్మకు తెలియదుగా" అంది మధురిమ.
మనోహర్ మాట్లాడలేదు. మనోహర్ మనసులో మధురిమఉందన్నవిషయం వసంతమ్మకి తెలియదు.
"నిన్న నాకు జరగాల్సిన పెళ్లిచూపుల్ని మీరే ఆపేశారట. అమ్మ చెప్పింది.ఎందుకాపేశారు? అమ్మ నన్ను ఓ అయ్యచేతిలో పెట్టటం మీకు ఇష్టం లేదా?" అంది మధురిమ.
”ఇష్టం లేదు. ఎందుకంటే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇష్టం ఒక్కటే కాదు. ప్రేమిస్తున్నాను. పెళ్ళి కూడా చేసుకుంటాను. ఇప్పుడు కాదు. నాకు జాబ్ వచ్చాక. అందుకే మీ అమ్మగారితో నిన్న మాట్లాడి నీ పెళ్లిచూపుల తతంగాన్ని వాయిదా వేయించాను. నేను చేసింది నాకోసమే" అన్నాడు మనోహర్.
"మరి అమ్మకు ఇదంతా తెలియదు. అమ్మతో చెప్పండి!" అంది మధురిమ.
"ప్రస్తుతం నేను స్టూడెంట్  ని. ఇప్పడు చెబితే బావుండదు. పెళ్ళంటే చిన్నపిల్లల ఆట కాదు. పెద్దవాళ్లతో కూడిన వ్యవహారం. అందుకే నాకు జాబ్ రాగానే మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను. తర్వాత మా ఇంట్లో చెప్పి ఒప్పిస్తాను. తర్వాత వచ్చి మావాళ్లు మీ అమ్మగారితో మాట్లాడతారు”
"ప్రాసెస్ బాగనే వుంది. కానీ మీ ఇంట్లోవాళ్ల ఒప్పకోకపోతే?”
"మా అమ్మకి నేనంటే ప్రాణం మధూ! ముందు అమ్మతో చెబుతాను అమ్మ నేను అడిగింది ఎప్పడూ కాదనదు. ఆ నమ్మకం నాకుంది. అందుకే ఈ బాధ్యతను అమ్మ మీద పెట్టబోతున్నాను."
"ఓకె, ఆల్ ద బెస్ట్" అంది సంతోషంగా మధురిమ.
“థాంక్స్ !” అంటూసంతోషంగా వెలుగుతున్న మధురిమ కళ్ళలోకి చూశాడు మనోహర్.
ఆ ఇద్దరు అక్కడ నుండి కదిలి ఇంటి ముఖం పట్టారు.
సూర్యుడు పడమటి కొండల్లోకి దిగిపోయాడు.
*****
కాలేజి చదువు ముగిసింది. విద్యారులంతా ఎవరి ఊళ్లకి వాళ్లువెళ్లిపోతున్నారు.
మనోహర్ పరీక్షలన్నీ బాగా  రాశాడు.మంచి మార్కులువస్తాయన్న నమ్మకంతో వున్నాడు. ఇల్లువెకేట్ చేసి ఇంటి తాళాలు వసంతమ్మచేతికి యిచ్చాడు.
"నీ వల్లనే నా బిడ్డ చదువు పూర్తయింది బాబు! నువ్వు లేకుంటే దాని చదువు నిజంగానే ఆగిపోయి వుండేది. నీ ఋణం ఈ జన్మలో తీరేది కాదు" అంటూ తాళాలు తీసుకొని, కృతజ్ఞతలు తెలుపుకొంది వసంతమ్మ.
 మీ అమ్మాయికి చదువంటే ఇంట్రెస్ట్ వుంది. బాగాచదివింది. అంతే" అంటూ వసంతమ్మ దగ్గర సెలవు తీసుకున్నాడు మనోహర్.
లోపల నుండి తననే చూస్తున్న మధురిమను గమనించాడు మనోహర్, వెళ్ళొస్తానని వసంతమ్మకు తెలియకుండా మధురిమకు సైగ చేశాడు మనోహర్.
ఊరెళ్లాలని స్టేసన్ దగ్గరకి వెళ్లారు కృష్ణ, మనోహర్.
ట్రైన్ లేటని అనౌన్స్ చేశారు. అక్కడే ఓ చోట కూర్చున్నారు కృష్ణా, మనోహర్
"కృష్ణా! హరి ఎగ్హామ్స్ బాగా రాయలేదని అందరూ అనుకుంటునాడ్రా!
ఎందుకని రాయలేదు. రామకృష్ణ రూంలో వుండి బాగానే చదివాడుకదా!" అన్నాడు మనోహర్
"వాడి ముఖం! వాడెప్పడన్నాగట్టిగా ఓ గంటన్నా చదివాడటరా ఎప్పుడు చూసినా ఏ అమ్మాయి ఎలాంటిదో, ఏ అమ్మాయి ఎవరివైపు చూస్తుందో, ఏ అమ్మాయి ఏ బాయ్ ఫ్రెండ్ మెయిన్టెయిన్ చేస్తుందో ఇదే కదరా వాడి రీసెర్చ్. వాడి సంగతి మనకితెలియనిదేముంది? అన్నాడు కృష్ణ.
మాట్లాడలేదు మనోహర్.
"అయినా వాడికి వుండే తెలివితేటలలకి వాడు ఏదో ఒక దారి కొట్టుకొని బ్రతుకుతాడు లేరా!కానీ పరిస్థితే ఘోరం" అన్నాడు కృష్ణ.
“ఘోరం దేనికిరా”అర్ధంకాక అడిగాడు మనోహర్.
"మనకి జాబ్స్ రాకుంటే మన యింట్లో వాళ్లు మనల్ని ఇంట్లో వుంచారు.అప్పడు మన పరిస్థితిఘోరం కాక ఇంకేముంది?" అంటున్న కృష్ణకి నిరుద్యోగ పర్వం ఇప్పటి నుండే గుర్తొస్తోంది.
"నా భయం కూడా అదేరా! మధురిమ నన్ను ప్రేమిస్తోంది. ఈ పరిస్థితుల్లో నేను ఏంచెయ్యాలో నాకు అర్థం కావటం లేదు" అన్నాడు మనోహర్. ఉలిక్కిపడ్డాడు  కృష్ణ. ఆ తర్వాత కొత్త విషయం విన్నవాడిలా మనోహర్ వైపు చూశాడు.
"ఇది నిజమా మనోహర్ ఆc... అయినా నువ్వు ప్రేమించనప్పుడు  నీకు బాధేముంది? ఆ అమ్మాయి ప్రేమించి, ప్రేమించి తర్వాత చల్లబడుతుంది. ఇక ముందు మనం ఎలాగూ ఇక్కడికి రాము. జాట్స్ వచ్చాక ఎవరు ఎక్కడుంటామో కూడా తెలియదు" అన్నాడు కృష్ణ తేలిగ్గా తీసిపారేస్తూ.
"మధురిమను నేనుకూడా ప్రేమిస్తున్నాను కృష్ణా" అన్నాడు మనోహర్!అదిరిపడ్డాడు కృష్ణ.
"నీది ప్రేమ కాదు మనోహర్ జాలి. నీ వల్ల ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న బాధ".
"అన్యాయం జరిగితే ఏదో ఒక హెల్స్ చేసి చేతులు దులుపుకుంటాం కాని ప్రేమిస్తామా?ఒక్కమాటలో చెప్పాలంటే, మధురిమ నాకు తపస్సులేని వరంరా! దేవుడు ఆ అమ్మాయిని నాకోసమే పుట్టించాడు. దీన్ని నువ్వు జోక్ గా తీసుకోకు" అన్నాడు మనోహర్, మధురిమకు తన మనసులో ఎలాంటి స్థానం వుందో కూడా చెప్పాడు.
"అయినా మీ అక్కయ్య కూతురు పద్మ వుండగా నీకు మధురిమపై ప్రేమెలా పుడుతుంది ?నీది రాంగ్ రా  మనోహర్" అన్నాడు కృష్ణ.
“రాంగ్ నాదికాదురా! మా పెద్దవాళ్లది. నాకూ, పద్మకి ఊహ తెలియక ముందునుండే పెళ్లిచేస్తామని ప్రకటించటం న్యాయం కాదు. పెళ్లంటే పెదవులో ఉచ్చరించే పదం కాదు, పీటలు మీద కూర్చుని తాళికట్టి అయిందనిపించు కోడానికి.ఒక మనిషికి తోడుగా వుండటం. మనం ఇష్టపడని మనిషికి జీవితాంతం తోడుగావుండటాన్ని పెళ్లిబంధం అనరు. బాడీగార్డులా ఉండటం అంటారు. అలాంటి మెకానికల్ లైఫంటే నాకు భయం. కృష్ణా! నన్నేం చెయ్యమంటావు చెప్పు?”
"ఏం చెప్పమంటావురా?అయినా పద్మకేం తక్కువ. అనవసరంగా నువ్వ భయపడు తున్నావు"
"తక్కువని కాదురా! మా యిద్దరికి వయసులో చాలా తేడావుంది. అంత చిన్నపిల్లతో నా ఆలోచనలు, అభిరుచులు కలవవు. అభిప్రాయాలు కూడా వేరుగా వుంటాయి. ఇలా కలవని తోడుతో ఎలా ప్రయాణం చెయ్యాలిరా సుదీర్ఘంగా, నువ్వే చెప్పు?"
"పద్మను ఎప్పటినుండో నీ భార్య అనుకుంటున్నారు మీ పెద్దవాళ్లు, వాళ్లిప్పడు నీ ప్రేమను అంగీకరిస్తారా?కలలో మాట అనిపిస్తుందిరా నాకు"
"మా అమ్మకి నేనంటే ప్రాణంరా! నామాట కాదనదు నా మనసేమిటో అమ్మతో చెబుతాను"
"అది బెటర్ మనోహర్ మీ అమ్మ వుండేది పల్లెటూరయినా బుక్స్ బాగా చదువుతారన్నావుగా, అర్థం చేసుకుంటారు. ముందు నువ్వాపని చెయ్యి" అంటూ సలహా యిచ్చాడు కృష్ణ. కృష్ణ ఎప్పడూ మనోహర్ పక్షమే.
ట్రైన్ రావటంతో ఇద్దరు ట్రైన్ ఎక్కి కూర్చున్నారు.
ట్రైన్ కదిలింది.
*****
మనోహర్కి కర్నూల్లో అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్లో ‘డెమోన్స్టేటర్గా’ ఉద్యోగం వచ్చింది. కర్నూల్ వెళ్లి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు మనోహర్.
మనోహర్కి అక్కడ అన్ని సౌకర్యాలు వున్నాయి. కానీ హోటల్ తిండి తినాలంటేనే ఇబ్బందిగా వుంది. మధురిమ గుర్తిస్తోంది. పెళ్ళి చేసుకోవాలని పిస్తోంది. ఇంట్లో చెబితే పద్మతో పెళ్లిచేస్తారని భయంగా వుంది.
మనోహర్కి ఫీల్డ్ వర్క్ ఎక్కువగా వుంటుంది."వర్క్ లోడ్తో బాగా బిజీ అయ్యాడు.
ఊరెళ్లి, ఒకరోజు తల్లి దగ్గర కూర్చుని మధురిమ గురించి తల్లితో చెప్పాడు మనోహర్, పెద్దగా చెబితే అందరూ వింటారని, తల్లికి మాత్రమే తెలిసే  విధంగా జరిగింది మొత్తం చెప్పాడు.
"ఇంట్లో కళ్లముందున్న పిల్లను కాదనుకొని, పరాయివాళ్ళ పిల్ల మనకెందుకురా మనోహర్. నేను వెళ్లి వసంతమ్మ గారితో మాట్లాడితే నలుగురు ఏమంటారు? నా మనవరాలికి నేనే ద్రోహం చేస్తున్నానని అనరటరా? అంది తులశమ్మ.
"పద్మకి ఇప్పడే వయసేమీ మించిపోలేదమ్మా! నిదానంగానైనా మనం సంబంధం చూసి చేద్దాం. ఇందులో నువ్వు పద్మకు చేసే ద్రోహం ఏమీ లేదు అన్నాడు మనోహర్.
తులశమ్మ మాట్లాడలేదు. ఆలోచిస్తోంది.
"నేను వెళ్లి వసంతమ్మ గారితో మాట్లాడగలనమ్మా! కానీ నేను వెళ్ళి మాట్లాడితే అంత పద్ధతిగా, మర్యాదగా వుండదు. ఇలాంటివి పెద్దవాళ్లు మాట్లాడితే బావుంటుంది. అందుకే నిన్ను వెళ్లి మాట్లాడమంటున్నాను" అంటూ తల్లిపై నమ్మకంతో ఆ బాధ్యతను తల్లిపై పెట్టాడు మనోహర్.
"సరే! మనోహర్! నేను హైదరాబాదు వెళ్లి వసంతమ్మగారితో మాట్లాడి వస్తాను. ఈలోపల ఏదో ఒకటి చెప్పి మీ నాన్నగారిని కూడా ఒప్పిస్తాను" అంది తులశమ్మ తన పెద్దరికాన్ని నిలుపుకోవాలన్న ఉద్దేశ్యంతో కొడుక్కిమాట ఇచ్చింది.
తల్లి మాట ఇచ్చిందన్నధైర్యంతో నిశ్చింతగా వున్నాడు మనోహర్.
తులశమ్మ వెంటనే తన స్నేహితురాలు వసుంధరను కలిసింది.
మనోహర్ చెప్పిన విషయం వసుంధరతో చెప్పింది. తను తీసుకున్న నిర్ణయం కూడా చెప్పింది తులశమ్మ.
ఆలోచిస్తూ కూర్చుంది వసుంధర.
వసుంధర, తులశమ్మ ఆ ఊరి ఆడపడుచులు. అదే ఊరికి కోడళ్లయ్యారు. తీరిక సమయాల్లో ఆ ఇద్దరు కలిసి సిటీ నుండి బుక్స్ తెప్పించుకొని చదవుతుంటారు. యద్దనపూడి, మాదిరెడ్డి, మాలతీ చెందూర్ నవలలంటే ఇంట్రెస్ట్ గా  చదువుతుంటారు. ఆ ఊరిలో అదేవాళ్లకి కాలక్షేపం. నవలల గురించే కాకుండా కుటుంబ విషయాలు కూడా ఆ ఇద్దరు కూర్చొని చర్చించుకున్నాకే నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నప్పటి నుండి వారిద్దరిది విడదీయరాని స్నేహం.
"చెప్ప వసూ! నా నిర్ణయం తప్పంటావా?" అడిగింది తులశమ్మ.
"ఇలాంటి నిర్ణయాలు నువ్వొక్కదానివే తీసుకుంటే సరిపోదు తులసి! ఈ పెళ్లి వల్ల మీ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి వుండదు. ముఖ్యంగా పార్వతి, పద్మ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు" అంది వసుంధర.
"నేనలా ఆలోచిస్తే నా కొడుకు జీవితాంతం బాధపడతాడు వసూ! పార్వతి, పద్మ కొద్దిరోజులు బాధపడి మరచిపోతారు. కానీ వాడు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా యిష్టపడు తున్నాడు! వాడి ఇష్టాన్నికాదని బలవంతంగా పద్మను యిచ్చి పెళ్లి చేస్తే వాడు సంతోషంగా వుండలేడు” అంది తులశమ్మ.
నవ్వింది వసుంధర. వసుంధర ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు.
"ఎందుకు నవ్వుతున్నావు వసూ! నా బాధ నీకు నవ్వగా వుందా?" అంది తులశమ్మ బాధగా.
"నీ బాధ, భయం నాకు అర్థమవుతోంది తులసీ! అందుకే నవ్వొస్తోంది. నువ్వింతగా భయపడాల్సిందేమీ లేదు. మనం చదివే నవలల్లో వుండే ప్రేమ, విరహం నిజజీవితంలో వుండదు. అది కేవలం కవుల కల్పన. నిజానికి ఇలాంటి విషయాలను మగవాళ్లు చొక్కా దులిపేసుకున్నట్లు దులిపేసుకుని  వెళ్తుంటారు" అంటూ తులశమ్మ నిర్ణయాన్ని మార్చుకోమని నచ్చచెప్పింది వసుంధర.
వసుంధర మాట వినలేదు తులశమ్మ.
“మనిద్దరం హైదరాబాదు వెళ్దాం వసూ! అమ్మాయిని చూసి వసుంధరమ్మగారితో మాట్లాడి వద్దాం. ఆ తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పిస్తాను” అంది తులశమ్మ.
“కోరి కష్టాలు తెచ్చుకోవడం అంటే ఇదేమరి. చూడు తులసి ఇప్పుడున్న నీ కోడళ్ళు ఇద్దరు నీకు పరాయివాళ్ళు, వాళ్ళు ఎలాగు నీముసలితనం లో ఎలాగూ చూడరు. కనీసం ఈ కొడుక్కు అయినా నీ మనవరాలిని చేసుకుంటే నీవు సుఖపడతావు! లేదంటే కష్టపడతావు! లేని పోని ఆలోచనలు పెట్టుకోకు” అని కాస్త గట్టిగానే మందలించింది వసుంధర.
“అది కాదు వసూ!”
"నువ్వింకేం మాట్లాడకు తులసీ"
"మరి మనోహర్కి ఏం చెప్పాలి?"
"ఏదో ఒక అబద్ధం చెబితే సరిపోతుంది"
"ఏమని అబద్ధం చెప్పాలి వసూ?నాకేం తోచటం లేదు" అంది తులశమ్మ.
"ఆ అమ్మాయికి పెళ్ళి అపోయిందని అబద్ధం చెబితే సరిపోతుంది. మనోహర్ ఆ అమ్మాయిని మరచిపోయి పద్మను పెళ్లి చేసుకుంటాడు. ఈ ఒక్క అబద్దం చాలు మనోహర్ మారిపోవటానికి" అంది వసుంధర.
వసుంధర చెప్పిన అబద్దం తులశమ్మకు బాగా నచ్చింది.
*****
మధురిమకు పెళ్లి అయిందని తల్లి చెప్పగానే షాకయ్యాడు మనోహర్. తప్పకుండా మధురిమతో తన పెళ్లి అవుతుందని మనోహర్ కన్న కలలన్నీ కల్లలయ్యాయి. వూహించుకున్న వూహలన్నీ తలక్రిందులయ్యాయి.
పద్మతో మనోహర్ పెళ్లి నిశ్చయమైంది.
పెళ్లి పందిళ్లు వేశారు. పచ్చని తోరణాలు కట్టారు.
మనోహర్ అన్నయ్యలు, వదినలు ముందుగా వచ్చారు.
ఆ తర్వాత పెద్ద సంఖ్యలోబంధువులొచ్చారు. చిన్ననాటి స్నేహితులంతావచ్చారు. పద్మ అన్నయ్య, చెల్లి సందడిగా తిరుగుతున్నారు. కరుణాకర్, పార్వతీల సంతోషానికి అవధుల్లేవు.
కరుణాకర్ స్నేహితులంతా వచ్చి చైర్స్ నిండారు. మాధవయ్యకు తెలిసిన వాళ్లంతా వచ్చి మంచములపై కూర్చున్నారు. వాళ్ల మాధవయ్యవైభోగము గురించిలో మాట్లాడుకుంటున్నారు. అక్కడ తిరుగుతున్న అమ్మలక్కలంతా పట్టుచీరల్లో మెరిసిపోతున్నారు. ఇక అక్కడ లేని వాల్లెవరూ లేరు. ఒక్క హరి తప్ప,హరికి కూడా పెళ్లి పిలుపు అందింది. పద్మతో మనోహర్ పెళ్లి అనగానే సంతోషించాడు, కానీ ఏవో కారణాలు చెప్పి పెళ్లికి రాకుండా తప్పించుకున్నాడని కృష్ణ చెప్పాడు మనోహర్ తో.
పెళ్లికూతురు అలంకరణలో వున్న పద్మలో పెళ్లికళ ఉట్టి పడుతుంది.పెళ్ళి దుస్తుల్లో వున్న మనోహర్ ముఖంలో నెత్తురు నెత్తురు చుక్క లేదు.
సాంప్రదాయ సిద్ధంగా పెద్దల ఆశీస్సులతో పద్మా, మనోహర్ భార్యా భర్తలు అయ్యారు.
పద్మనెందుకో ఆడవాళ్లు పక్కకి తీసికెళ్లారు. ఫ్రెండ్స్ అంతా  మనోహర్ చుట్టూ చేరారు.
“ఇంత సంతోష సమయంలో, ముఖమేంది మనోహర్ అలా పెట్టుకున్నావ్!కెమెరా వాళ్ళు తెగ అవస్థ పడుతున్నారు. కాస్త నవ్వు బాబు! చూడలేకపోతున్నాం” అన్నాడు మనోహర్ ఫ్రెండ్.
“వాడి ముఖం నవ్వకపోయినా కళగానే వుంది. నువ్వెందుకు చూడలేకపోతున్నావో మేమంతా బాగనే చూస్తున్నాం" అంటూ ఇంకో ఫ్రెండ్ మనోహర్ వైపు మాట్లాడాడు.
అంతలో కూల్డ్రింక్స్ త్రాగుతూ ఫ్రెండ్స్ అంతా అటువైపు వెళ్లారు. మనోహర్ దగ్గర కృష్ణ ఒక్కడే వున్నాడు. వాళ్లతో కలసి వెళ్లకుండా తన దగ్గరే నిలబడి వున్న కృష్ణ వైపు చూశాడు మనోహర్. ఎప్పడైనా ఎంతో హుషారుగా ఉత్సాహంగా వుండే మనోహర్ యిప్పడెంతో నిరాశగా, నిర్లిప్తంగా కన్పించాడు కృష్ణకి, మనోహర్ ఎందుకలా వున్నాడో ఒక్క కృష్ణకి తప్ప ఇంకెవరికి తెలియదు.
"మనోహర్ ఇంత వైభోగంగా జరుగుతున్న నీ పెళ్లిని చూసి, ప్రతి ఒక్కరు నీ అదృష్ణాన్ని పొగుడుతున్నార్రా! నువ్వేమో ఇలా ఏదో పోగొట్టుకున్నవాడిలా తిరుగుతున్నావు. వీళ్లల్లో ఒక్కరికి కూడా నువ్వెందుకిలా వున్నావో తెలియదు. తెలుసుకోవలసిన అవసరం కూడా ఎవరికి లేదు. అయినా మనోహర్ నాకు తెలియక అడుగుతా! ఇప్పడు నువ్వు ఇంతగా బాధపడటం అవసరమంటావా?" అన్నాడు కృష్ణ.
మనోహర్ మాట్లాడలేదు. మనోహర్ని చూస్తుంటే కృష్ణకి ఏదోగా వుంది.
"నిన్ను చూస్తుంటే అందరికి ఎలావుందో కాని నాకు మాత్రం బాధగా వుందిరా! అందుకే చెబుతున్నా ఊహలెప్పడు నిజాలు కావు. నువ్వింక ఆ ఊహల్లోబ్రతకటం తగ్గించుకో.ఆరోజు రైల్వేస్టేషన్లో నువ్వు నాతో ఏమన్నావో గుర్తుందా? "మధురిమ నాకు తపస్పు లేని వరంరా!” అన్నావు. చూడు ఏమైందో, ఆ వరం ఇంకెవరికో వరమై వెళ్లింది. అందుకేరా ఇలాంటి వన్నీ గతంలోకి  నెట్టేసుకుంటూ మరచిపోతుండాలి. మనసులో పెట్టుకోకూడదు” అన్నాడు కృష్ణ మనోహర్ బాధగా వుంటే చూడలేకపోతున్నాడు కృష్ణ.
మౌనంగా విన్నాడు మనోహర్.
“ఒక్కసారి మీవాళ్లను చూడరా మనోహర్! ఈ పెళ్లి వల్ల వాల్లెంత సంతోషంగా వున్నారోచూడు.. ఇదేరా మనిషికి కావలసింది” అన్నాడు మనోహర్ వైపు చూస్తూ కృష్ణ. వెంటనే కృష్ణ వైపు చూశాడు మనోహర్.
“మనిషికి ఏది కావాలో తెలుసుకోలేనంత చిన్నపిల్లాడినా కృష్ణా నేను. ఎందుకురా నేనంటే యింత ప్రేమ నీకు!” కృష్ణవైపు చూశాడు మనోమార్. తనని చూసి కృష్ణ పడున్న బాధను గమనించాడు మనోహర్.
ఇంకేం మాట్లాడలేక మనోహర్ని గట్టిగా కౌగిలించుకున్నాడు కృష్ణ. ఆ ఇద్దరి కళ్ళు క్షణకాలం తడితో తడిశాయి.
దేవుడు ఎందుకోవద్దనుకున్నవాటిని దగ్గరగా చేర్చితమాషా చూస్తాడు కావాలనుకున్న వాటిని దూరంగా విసిరేసి అటాడుకుంటాడు.
అప్పడప్పడు కొడుకు ముఖంలోకి చూస్తూ, ఆ ముఖంలోని బాధను గమనిస్తున్న తులశమ్మకి, తను చెప్పిన అబద్దం బాణంలా గుచ్చుకుంటోంది.
వసుంధర మాత్రం తులశమ్మపక్కనే తిరుగుతూ, పెళ్లికొచ్చిన ఆడవాళ్లకి మర్యాదలు చేస్తూ, వాళ్లు కట్టుకున్న చీరలరేట్లు, పెట్టుకున్న నగల రేట్లుతెలుసుకుంటూ, అందరి దృష్టి తనమీద పడేలా సందడిగా తిరుగుతోంది.
*****
రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.
పద్మా మనోహర్ కర్నూల్లో కాపురం పెట్టారు.
ఆఫీసుకెళ్లాలని రెడీ అవుతున్నాడు మనోహర్.
పనంతా పూర్తి చేసుకొని భర్తవుండే గదిలోకి వచ్చింది పద్మ.
మనోహర్ అద్దం ముందు నిలబడి తల దువ్వకుంటూ, పద్మరాకను అద్దంలోంచే గమనించాడు.
డ్రెస్ తీసివ్వాలని బీరువా దగ్గరకెళ్తున్న పద్మను వారిస్తున్నట్లుగా
“పద్మా! అక్కయ్య దగ్గర నుండి వుత్తరం వచ్చింది. టేబుల్ పై పెట్టాను చదువుకో" అన్నాడు డ్రెస్ కోసం బీరువా దగ్గరకెళుతూ.
”ఏమని రాసిందండీ! మన పొలంలో పైరు బాగుందటనా? అక్కడంతా బాగున్నారా అడిగింది పద్మ "అంతా బాగానే వున్నారట. నాకు టైమవుతోంది. నేను డ్రెస్తీసివేసుకుంటాను. నీవెళ్లి కాఫీ తెచ్చి అక్కడ పెట్టు త్రాగివెళ్లిపోతాను" అంటున్న మనోహర్ మాటలు పద్మకెంతో బాధను కల్గించాయి.
మనోహర్ నే అంటిపెట్టుకొని, ప్రతిదీ తనే స్వయంగా అందివ్వాలని పద్మ కోరిక. ఆ అవకాశాన్ని ఆమెకెప్పడూ ఇవ్వడు మనోహర్, ఆమెవైపు ప్రేమగా చూడడు. సరదాగా మాట్లాడడు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక తినటం, పడుకోవటం అతని దినచర్య.
ఎప్పడు చూసినా గంభీరంగా వుండే మనోహరంటే పద్మకి భయం. ఎప్పడో తప్ప మిగతా టైమంతా మనోహర్కి దూరంగానే వుంటుంది. దూరంగానే కాదు పెండ్లైనా తర్వాత ఎందుకో తెలియదు కాని మనోహరంటే ఒక విధమైన భయం ఏర్పడింది. ఆ భయం వల్లనే కాబోలు అణిగిమణిగి వుంటుంది. రోజూ అతని అవసరాలను డ్యూటీలాగ తీరుస్తుంది. అవసరాలంటే ప్రొద్దుటే లేచి కాఫీ కలిపి యివ్వటం. స్నానానికి వేడినీళ్లు పెట్టటం. వేడివేడిగా టిఫిన్ చేసి పెట్టటం. ఆఫీసుకు పంపటం. ఇదీ పద్మ దినచర్య.
ఒకరోజు అలవాటు ప్రకారం "మామయ్యా అని పద్మ పిలిస్తే వెంటనే కసిరాడు."ముసలి మేనమామను పిలిచినట్లు ఏమిటా పిలుపు?వినాలంటేనే కంపరంగా వుంది. ఇంకెప్పడూ అలా పిలవకు" అన్నాడు మనోహర్, అప్పటి నుండి పద్మ అలా పిలవటం మానేసింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages