నాకు నచ్చిన కథ-అర్రు కడిగిన ఎద్దు-శ్రీ త్రిపురనేని గోపీచంద్
టీవీయస్.శాస్త్రి
మనిషికీ,జంతువుకీ ఒక తేడా ఉందని అనుకునేవాణ్ణి . ఈ కథ చదివిన తరువాత పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది.జంతువు దాని పిల్లలకు ఒక వయసు వచ్చిన దాకా పోషించి వదిలివేస్తుంది. అప్పటినుంచి దాని ఆహారం చనిపోయేవరకూ అదే సంపాదించుకోవాలి.ముసలిదై పనికి రాకపోతే యజమాని దాన్ని నిర్దయగా కబేళాకు తరలిస్తాడు.ప్రస్తుతపు సమాజంలో కొంతమంది మనుషుల పరిస్థితి కూడా అంత దయనీయంగా ఉందేమోననిపిస్తుంది. వృద్ధాప్యం ఒక శాపం.దానికన్నా మరణం మేలు-అని తలచుకునే తల్లితండ్రులనేకమందిని చూస్తున్నాము.వయసు మళ్ళిన తల్లితండ్రులను కొనే కబేళాలు లేవు. అటువంటివి కనుక ఉంటే, తల్లి తండ్రులను కూడా కబేళాలకు తరలించే తనయులున్నారని చాలా క్రితమే మందలించి చెప్పిన కధ ఇది .ఈ కథ చదవండి,మీకే బోధపడుతుంది తల్లి తండ్రులను ఎలా చూసుకోవాలో!
ఆ ఇంటి పెద్దాయన ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినవాడే!కూలీపని నుంచి అన్నీ తానై చూసుకొని కొడుక్కి పది ఎకరాల సుక్షేత్రమైన వ్యవసాయభూమిని, పశువులను ఇచ్చాడు.వయసు ఉడికిపోయి వృద్ధాప్యం రావటం వల్ల కొడుకూ, కోడలు అతనిని మూలన ఒక నులకమంచంలో పడేశారు.ఆయన సంగతి సరిగా పట్టించుకోరు.కనీసం మనవళ్లను కూడా అతని వద్దకు వెళ్ళనియ్యరు. ఆయన పని కూడా అయిపోయింది.అతని శక్తి అంతా కుటుంబంకోసం ధారపోశాడు.ప్రస్తుతం ఆ ముసలాయన వల్ల ఏమీ ఉపయోగం లేదు.అందుకే అతన్ని ఒక మూల పడేశారు.కొడుకు పట్టించుకోడు,కోడలు సరిగా అన్నం పెట్టదు.పిల్లలకు అసలు గౌరమే లేకుండా చేశారు తల్లితండ్రులు. ఆ ముసలాయనకు బాగా యవ్వనంలో ఉన్నప్పుడు ఒక జత ఎద్దులు ఉండేవి. ఒకటి చనిపోయింది.రెండవది ఆ ముసలాయన లాగానే ఏకాకిగా మిగిలింది .
ఆ ముసలాయనే అప్పుడప్పుడూ వచ్చి దాన్ని ప్రేమగా గోముతాడు.ఈ రోజు అది అర్రు కడిగిన ఎద్దు,అంటే వ్యవసాయానికి పనికి రానిదన్నమాట.అది కూడా ఒకప్పుడు తన యజమానిలాగా రాజాలా బతికింది.ఆ యజమాని దాన్ని,దాని జత అయిన మరో ఎద్దును చూసి తెగ సంబరపడి పోయేవాడు.వాటి కొమ్ములనూ,ముఖాలనూ పసుపు కుంకుమలతో అలంకరించి ఎంతో ముచ్చట పడిపోయే వాడు.ఆ ఎద్దులు ఎన్నిపందాలు గెలిచాయో లెక్కలేదు. ఆ పరాక్రమం ఆ ముసలి ఎద్దుకు గుర్తువచ్చింది.నేడు మురిపెంగా దాన్ని ఒళ్ళు తడిమి చూసేవారు లేరు.నా జత ఎద్దు అదృష్టవంతురాలు కనుకనే ముందే వెళ్లి పోయింది.ఎద్దుకు ఆకలిగా ఉంది, ఎవరైనా కాస్త పచ్చి గడ్డి వేస్తారేమోనని అది ఎదురు చూస్తుంది.దాని ఆకలి తీరదు,తీరే మార్గామూ లేదు.దూరాన ఒక కాకి వేచివుంది.ఎద్దుపుండు మీద వాలి తన ఆకలి తీర్చుకుందామని.కాకి ఎద్దు పుండును పొడుస్తూ దాని ఆకలి తీర్చుకుంటుంది.కనీసం తోకతో దాన్ని తోలుకోవటానికి కూడా ఓపిక లేకుండాఎద్దు ఆ బాధనంతా భరిస్తూనే ఉంది.కుర్ర యజమాని దాని సంగతి పట్టించుకోడు.అతడి ధ్యాసంతా కొత్తగా కొన్న ఎడ్లను గురించే.వాటిని చూసి పొంగిపోతున్నాడు,ఈ ముసలి ఎద్దును చూసి అసహ్యపడుతున్నాడు. అది వచ్చిన కొత్తల్లో పది ఎకరాల ఆసామి అతను.ఒకేసారి ఇరవై ఎకరాలు సంపాదించాడు.'నా రక్తమాంసాలు కరిగిస్తేనే కదా,నీవు ఇంతడి వాడివయ్యావు' అని అనుకుంటుంది ముసలి ఎద్దు.కానీ ఏమి లాభం? అప్పుడప్పుడూ ఆ ఇంటి ముసలాయన ఆఎద్దు వద్దకు వచ్చి కన్నీరు పెట్టుకుంటాడు.నీ బాధ నాకు తెలుసులే!అన్నట్లు దాన్ని ఆప్యాయంగా ఒళ్ళంతా తడుముతాడు.ఇది చూసి ఆ కోడలు ముసలాయనను కాకిలా పొడవటానికి వస్తుంది.ఎద్దు పుండును కరవటానికి కాకి వస్తుంది. ఎంత బాధగా ఉంది ఇద్దరికీ!
కధ ముగిసింది.మానవీయ సంబంధాలను గురించి మనసుకు హత్తుకు పోయేటట్లు చెప్పిన శ్రీ గోపీచంద్ గారికి స్మృత్యంజలి!
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
Comment with Facebook
No Comments