స్వరజ్ఞాని శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు - అచ్చంగా తెలుగు

స్వరజ్ఞాని శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు

Share This

స్వరజ్ఞాని శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు

టీవీయస్.శాస్త్రి(శారదాప్రసాద్)


(ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు (86) చెన్నైలోని తన నివాసంలో ఈరోజు అనగా 22-11-2016 న కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్ల పాటు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం విషమించింది. చెన్నై సంగీత అకాడమీ సమీపంలో ఉన్న ఆయన ఇంట్లోనే కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తుండగానే, మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆయన కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగృహంలోనే అభిమానుల సందర్శనార్థం ఉంచారు.ఆయనకు ఘనమైన నివాళి సమర్పిస్తూ, గతంలో ఆయనను గురించి ఒక పత్రిక కోసం వ్రాసిన వ్యాసాన్ని మీకోసం ఈ దిగువన పొందు పరుస్తున్నాను.)  
**********
నాలుగు సంవత్సరాలక్రితం సంగతి ఇప్పటికీ నా మనసులో నిలిచిపోయింది! మండుటెండల్లో మండిపోయే గుంటూరు నగరం స్వరజ్ఞాని శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గానామృత వర్షంతో తడిసి ముద్దయింది. సామవేదాన్ని ఔపోసనపట్టిన సరస్వతీ పుత్రుడు,గాన గంధర్వుడు,బ్రహ్మశ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు 82 ఏండ్ల వయసులో కూడా గాత్రంలో ఏ మాత్రం మాధుర్యం తగ్గకుండా అనర్గళంగా,అతి సునాయాసంగా ఒక గంటన్నర సేపు సంగీత ప్రియులను తన గంధర్వగానంతో  ఓలలాడించారు.నాకు ఆ పాతరోజులు ఒకసారి జ్ఞప్తికి వచ్చాయి.' ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.సమయం ఉదయం ఆరు గంటలు.ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమం ప్రసారమౌతుంది.' రేడియోలో శ్రావ్యమైన ఈ గొంతు ప్రకటన చేయగానే, ఆంద్ర దేశంలోని లక్షలాదిమంది ప్రజలు ఆసక్తిగా భక్తిరంజని కార్యక్రమానికి స్వాగతం పలికేవారు.భక్తిరంజని కార్యక్రమానికి ఆ రోజుల్లో అంత ఆదరణ ఉండేది.ఆకాశవాణిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవారు మరెవరో కాదు,డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారే!
ఆ తరువాత ఇటువంటి కార్యక్రమాలు మద్రాస్ ,ట్రివేండ్రం కేంద్రాలు కూడా ప్రవేశపెట్టాయి.శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆకాశవాణి విజయవాడ,మద్రాస్ కేంద్రాలలో ప్రయోక్తగా పనిచేసారు.ఆయన మద్రాస్ వెళ్ళే రోజుల్లో ఒక తెల్లని కుందేలు పిల్లలాంటి వాడు.ఆ రోజుల్లో తమిళ దేశంలో కర్ణాటక సంగీత దిగ్గజాలైన చెంబై వైద్యనాథ భాగవతార్, జీ.ఎన్.బాలసుబ్రహ్మణ్యం,ముసిరి సుబ్రహ్మణ్యఅయ్యర్, యమ్.యస్.సుబ్బులక్ష్మి, యమ్.యల్.వసంతకుమారి, డీ.కే పట్టమ్మాళ్ మున్నగువారి మధ్య విశేష ప్రజ్ఞ కనపరచి అనతికాలంలోనే ఒక సింహం అయ్యాడు .తమిళ ప్రజల మన్ననలను పొందాడు.అచిర కాలంలోనే భారత దేశపు మేటి సంగీత కళాకారుడిగా విశేషమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు.భారత ప్రభుత్వం వీరిని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులతో సత్కరించింది.దేశ విదేశాల్లో తన గానమాధుర్యాన్ని వినిపించి,సంగీతానికి ఎల్లలు,భాష లేవని నిరూపించాడు.ఈయన ఈ తరానికి త్యాగరాజు అంత గొప్పవాడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఆయనకు సమకాలికులమైనందుకు మనం ఎంతో గర్వించవచ్చు!
శ్రీ బాలమురళీకృష్ణ 06 -07 -1930 న తూర్పు గోదావరి జిల్లాలోని,శంకరగుప్తంలో పుట్టారు.ఆయన తల్లి తండ్రులు సూర్యకాంతమ్మ,పట్టాభిరామయ్య గార్లు.తల్లి వీణా విద్వాంసురాలు. మాతామహుడు అయిన శ్రీ ప్రయాగ రంగదాసు గారు సంగీత కోవిదుడు.వారు స్వయంగా కొన్ని కృతులను వ్రాసి స్వరపరిచారు.అవి 'శ్రీ ప్రయాగ రంగదాసు కీర్తనలు' గా ప్రసిద్ధి చెందాయి.శ్రీ బాలమురళీకృష్ణ గారు వాటిని గానం చేసారు .ఈయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు.మంగళంపల్లి ఏడవ ఏటనుండే కచేరీలు చేయటం ప్రారంభించాడు.తొమ్మిదియేళ్ళ వయసులో వయోలిన్,మృదంగం,కంజీర లాంటి వాయిద్యాలలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు.కుమారునికి ఉన్న సంగీతజ్ఞానాన్ని గుర్తించి తండ్రి గారైన పట్టాభిరామయ్య గారు ఆయనను గాయకబ్రహ్మ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య గారి వద్ద శిష్యరికానికి పంపారు.దీనితో శ్రీ మంగళంపల్లి  జీవితానికి ఒక మార్గం లభించింది.విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న బాలమురళీకృష్ణ విజయవాడ ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్ గా కొంతకాలం పనిచేసారు. ఆ రోజుల్లో విజయవాడలో శ్రీ విశ్వనాధ వారి మన్నలను,ఆశిస్సులను పొందారు.
కాలక్రమంలో మద్రాస్ లో స్థిరపడి తమిళ,కర్ణాటక,మళయాళ భాషలపై కూడా పట్టు సాధించారు.సుమారు 30,000 కచేరీలకు పైగా ఇచ్చి ఉంటారు.అన్నమయ్య కీర్తనలు,రామదాసు కీర్తనలు,ఎంకిపాటలు,తత్వాలు,లలితగీతాలు,ఎన్నో భక్తి గీతాలు...ఇలా చెప్పుకుంటూపోతే వారు పాడిన పాటలకు అంతే ఉండదు.ఆయన పాడింది పాట,ఆలపించింది రాగం అన్నట్లుగా ఉంటుంది.వేలాది కాసెట్లు, రికార్డ్లు  రిలీజ్ అయ్యాయి!బాలమురళీ కేవలం గాయకుడే కాదు,వాగ్గేయకారుడు కూడా.72 మేళకర్తల రాగాల్లో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు ఈయన. లవంగి,త్రిశక్తి, మహతి లాంటి పెక్కు రాగాలు సృష్టించిన సంగీత సరస్వతి శ్రీ బాలమురళీ.సినిమా పాటలు కూడా అద్భుతంగా చాలా భాషల్లో పాడారు.
భక్త ప్రహ్లాద సినిమాలో నారదుడి వేషం వేసి మెప్పించారు.హంసగీతే కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించటమే కాకుండా ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. మధ్వాచార్య చిత్రానికి కూడా జాతీయ స్థాయిలో సత్కారం పొందారు.గానసుధాకర,సంగీత సామ్రాట్,సంగీత కళాసరస్వతి,కళాప్రపూర్ణ,గాన గంధర్వలాంటి కొన్ని వందల బిరుదులు వీరి సొంతం అయ్యాయి.అంతే కాకుండా ఫ్రెంచి ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన శేవేలియర్ అవార్డ్ అందుకున్న ఏకైక కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ బాలమురళీ. వీరు మాకు బంధువులు.కచేరీ అనంతరం ,వారిని నేను ఒక ప్రశ్న వేసాను.' రోజుకు మీరు ఎన్ని గంటలు సాధన చేస్తారు? ' అని.అందుకు ఆయన--సాధన ఏమీ చేయను,కనీసం humming కూడా చెయ్యను.గొంతు బాగుంటానికి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకుంటాను.వేదిక మీదకు రాగానే 'అమ్మా!సరస్వతీ దేవీ ఆలపించు,ఆలకించు అని ప్రార్ధించి కూర్చుంటాను.ఆ తరువాత పాడేది నేను కాదు ! ' అని వారు వివరించిన తరువాత ఈయన కేవలం సరస్వతీదేవి మానస పుత్రుడేమోననిపించింది. ఇట్టి మహా గాయకుడు మన తెలుగువాడు కావటం మనం ఎంతో గర్వించతగ్గ విషయం.
ఈతరం త్యాగరాజుకు ఘనమైన నివాళి!
ఈ గానగంధర్వుడు ఈ సంవత్సరం ప్రారంభంలో అనారోగ్యంతోనే ఆలపించిన బహుళ ప్రాచుర్యం  పొందిన ఈ తిల్లానాను ఇక్కడవినండి!
('శిరాకదంబం  సౌజన్యంతో')
****

No comments:

Post a Comment

Pages