Sunday, October 23, 2016

thumbnail

సుబ్బుమామయ్య కబుర్లు! - 2

సుబ్బుమామయ్య కబుర్లు! - 2

 తోడబుట్టినవాళ్లు


పిల్లలూ, తోడబుట్టినవాళ్లంటే మీకు తెలుసుగా..రక్తసంబంధం, అదేనర్రా మన అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముళ్లు, చెల్లెళ్లూను. మనకి బయట ఎంతోమంది మిత్రులుండవచ్చు. స్నేహం కోసం ప్రాణం ఇచ్చే వాళ్లూ ఉండొచ్చు. కానీ ఎంతైనా మనవాళ్లు మనవాళ్లే! పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనతోపాటు ఉండేది వాళ్లే! మన ఆనందానికి సంతోషిస్తారు. బాధపడితే కుంగిపోతారు. తోడబుట్టిన వాళ్ల గురించి చెప్పాల్సివస్తే మనకు గుర్తొచ్చేది రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు. ఇంట్లోనైనా, ఆశ్రమంలో విద్యనభ్యసించేటప్పుడైనా, ఎంత చక్కగా కలిసి మెలిసి ఉండేవాళ్లో. లక్ష్మణుడేమో ఎప్పుడూ రామచంద్రుణ్ని అంటిపెట్టుకునే ఉంటాడు. అన్నయ్య మీద ఈగ వాలనియ్యడు. ఇహ భరతుడి గురించి తెలిసిందే, వాళ్లమ్మ కైకేయి రామయ్యను అరణ్యాలకు పంపించి తన కొడుకైన భరతుడికి రాజ్యం కట్టబెట్టాలనుకున్నప్పుడు, భరతుడు కన్నీళ్లతో అన్నయ్య పరిపాలించవలసిన రాజ్యం తనకు వద్దంటే వద్దని రామ పాదుకలకు పట్టాభిషేకం చేసి, వాటిని సింహాసనం మీద పెట్టి శ్రీరామచంద్రుడి తరపున రాజ్యపాలన సాగించాడు. అలాగే పాండవులు. అయిదుగురూ పిడికిట్లోని వేళ్లలా ఎంత ఐకమత్యంగా ఉండేవారనీ! అన్నయ్య ధర్మరాజుమాట కలలో కూడా జవదాటేవారు కాదు. ఆయనమాట వేదం వాళ్లకు.
కొట్టుకునే అన్నదమ్ములు కూడా ఉంటారర్రోయ్! వాలీ సుగ్రీవులు దానికి ఉదాహరణ. అన్నదమ్ములు పోట్లాడుకుంటుంటే ‘వాలీ సుగ్రీవుల్లా ఏంటోయ్ మీ గొడవ?’ అని పెద్దలనడం మీరు వినే ఉంటారుకదూ! అందుకే ఎప్పుడూ గొడవపడకూడదు.
అవడానికి రావణాసురుడి తమ్ముడైనా ధర్మం వైపు నిలిచి, అన్న చేస్తున్నది తప్పని మరీ చెప్పి, శ్రీరామచంద్రుడికి యుద్ధ సమయంలో సహాయం చేశాడు విభీషణుడు. అందుకే ఆయణ్ని రాక్షసుల్లో ఉత్తముడుగా చెప్పుకుంటారు.
సోదరి తన సహోదరుడు సుఖ సంతోషాలతో చిరకాలం సంతోషంగా ఉండాలని రాఖీ కడుతుంది. అన్నయ్యలు సదా తమ తోడబుట్టిన ఆడపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఆ బంధం జీవితాంతం అలాగే కొనసాగుతుంది. అందుకని పిల్లలూ ఇహ నుంచీ మీ తోడబుట్టిన వాళ్లను బాధపెట్టకండి. అనవసర పంతాలూ పట్టింపులూ పెట్టుకోవద్దు. కలిసి మెలిసి ఉండే మిమ్మల్ని చూస్తే అమ్మనాన్నలు గర్వపడతారు. చుట్టుపక్కల వాళ్లు మీ ఐకమత్యనికి మురిసిపోతారు. మరి మీరు అలా ఉంటారు కదూ! వచ్చే మాసం  గురువుగారి గొప్పతనం గురించి మాట్లాడుకుందాం సరేనా? ఉంటాను మరి!
మీ మామయ్య
ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information