స్వసానుభూతి (SELF PITY) - అచ్చంగా తెలుగు

స్వసానుభూతి (SELF PITY)

బి.వి.సత్య నగేష్ 

(ప్రముఖ మానసిక నిపుణులు )


శరీరానికి డయాబెటిస్ వ్యాధి ఎంత ప్రమాదకమైనదో మనసుకు స్వసానుభూతి కూడా అంత ప్రమాదమైనది. డయాబెటిస్ అదుపులో వుంటే ప్రమాదం లేదు, అదుపు తప్పి, చాలా కాలం ఆ వ్యాధితో బాధపడుతూ వుంటే , ఆ వ్యక్తిలో వేరే అవయవాలు కూడా దెబ్బతిని ప్రాణానికి హాని కలిగే పరిస్థితి కలుగుతుంది.  అలాగే స్వసానుభూతి తో బాధపడుతూ వుండే వారు అదేపనిగా వారి మీద వారు జాలి పడుతూ వుంటే మనసు వ్యాకులత చెంది డిప్రెషన్ కు గురవుతారు. అంతే కాకుండా శరీరం, మనస్సు నిస్సత్తువై మానసికంగా బలహీనులవుతారు.
          తనమీద తను జాలిపడటం, వేరేవారి సానుభూతి కోసం ఎదురు చూడటం మనిషిని ఎంతో కృంగదీస్తుంది. ఈ మధ్య కాలంలో కౌన్సిలింగ్ కొరకు 55 సంవత్సరాల వయసున్న వ్యక్తి వచ్చేరు. ఆయన చెప్పిన వివరాలు ఇలా వున్నాయి. “నాకు డయాబెటిస్ వచ్చిందని తెలిసింది. మా అమ్మా నాన్నలకు లేదు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళకు లేదు. నాకే ఎందుకు వచ్చిందో తెలియదు. నిద్రపట్టటం లేదు. గవర్నమెంట్ ఆఫీసర్ ను, నాకు ఒత్తిడి ఎక్కువగా వుంటుంది. మాకు ఇద్దరు కొడుకులు, పెద్దవాడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాడిని వెనక్కు పిలిపించుకుందామనుకుంటున్నాను. నా భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగి. తను ఆరోగ్యంగానే వుంది. నాకు 24 గంటలూ ఈ డయాబెటిస్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటో ఈ జీవితం... నా మీద నాకే జాలి వేస్తుంది. నన్ను అందరూ హేళన చేస్తున్నారు” అంటూ తన బాధను ఇంకా వివరంగా చెప్పేడు.
          55 సంవత్సరాల వయస్సులో డయాబెటిస్ కు గురి కావడంతో అంత కృంగిపోనవసరం లేదు. వేరే వాళ్ళతో పోల్చుకుని జాలిపడటంలో అర్ధం లేదు. మన “లైఫ్ స్టైల్ “ ను బట్టి మన ఆరోగ్యం వుంటుంది. డయాబెటిస్ ను ఏ విధంగా నియంత్రించుకోవాలో చెప్పే డాక్టర్ ని సంప్రదించాలి. అమెరికాలో వున్న పెద్ద కొడుకును వెనక్కు పిలిస్తే డయాబెటిస్ తగ్గదు. వనక్కు వచ్చిన కొడుకు క్రొత్త సమస్యలు సృష్టిస్తే డయాబెటిస్ పెరిగే అవకాశం వుంది.
          తన వంతు కర్తవ్యాన్ని మరిచిపోయి, సానుభూతి పొందటంలో తృప్తి పొందటం అనేది ఈ సమస్య, వాస్తవానికి ఈ సదరు వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన భార్య కూడా గవర్నమెంట్ ఉద్యోగి. అన్నీ వున్నా, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఆలోచిస్తూ ఉండటమే ఈ రుగ్మత. ఇటువంటి వారి చిన్నతనం గురించి విశ్లేషిస్తే, ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. వీరికి చిన్నప్పట్నించి వేరేవారి దృష్టిని ఆకర్షించి, వారి సానుభూతి పొందాలనే కోరిక వుంటుందనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. దీనినే “ATTENTION SEEKING DISORDER” అంటారు.
          ఈ మధ్యకాలంలో డిప్రెషన్ లో వున్న ఒక యువకుడు కౌన్సిలింగ్ గురించి వచ్చాడు అతను వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో వుండి చదువుకుంటూ వుంటాడు. వివరాల్లోకి వెళ్దాం. ఈ వ్యక్తి డిప్రెషన్ కు ఒకటే కారణం – అతని అమ్మమ్మ ‘స్వసానుభూతి’ అనే రుగ్మతతో బాధపడుతూ వుండటం. రెండు సంవత్సరాల క్రితం ఆమె 56 సంవత్సరాల కొడుకు (యువకుడి మేనమామ) మరణించినప్పటి నుండి అదే విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ వుండటం, బంధువులు రోజూ వచ్చి “ అయ్యో నీకెంత  కష్టం వచ్చిందో” నని సానుభూతి చూపటం ఒక దినచర్యగా  అయిపొయింది. ఎవరైనా ఒకరోజు రాకపోతే వారిని ప్రత్యేకంగా పిలిపించటం, తృప్తి పొందటం ఒక అలవాటై పోయింది. సమయం దొరికినపుడు కొడుకు గురించి ఆలోచించటం, ఏడవటం, బంధువులను పిలవటం, వారు అదేపనిమీద వచ్చినట్లు సానుభూతి చూపటం ఒక అలవాటైపోయింది. ఈ వాతావరణంలో యువకుడు కూడా ఈ మాటలు వినటం, బ్రతుకు మీద నమ్మకం పోవటం లాంటివి జరగటం వలన డిప్రెషన్ కు గురయ్యేడు.
          స్వసానుభూతికి పరిష్కారం ఏంటో చూద్దాం. సానుకూల, ప్రతికూల ఆలోచనా సరళి లాగే ‘ప్రశ్నించుకునే ఆలోచనా సరళి’ని ప్రవేశపెట్టాలి. దీనిని QUESTION THINKING అంటారు. ఈ రకమైన ఆలోచనా ప్రక్రియలో రెండు రకాలుంటాయి.
  1. సమర్ధించుకునే ఆలోచనా ప్రక్రియ (JUDGER THINKING)
  2. నేర్చుకునే దిశలో ఆలోచనా ప్రక్రియ (LEARNER THINKING)
మొదటిరకం ఆలోచనా ప్రక్రియలో తన్ను తాను సమర్ధించుకుంటూ, చివరికి డిప్రెషన్ కు గురి అయ్యే స్థితికి వెళ్లడం జరుగుతుంది. రెండవ రకం ఆలోచనా ప్రక్రియలో “నేనేం తెలుసుకున్నాను” అని ప్రశ్నించుకుని ఆలోచనా తీరును మార్చుకోవడం జరుగుతుంది. దానివల్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ఒకసారి ఓ మహిళ ఒక గురువు దగ్గర తన బాధను ఈ విధంగా చెప్పుకుందట. “నా కొడుకు చనిపోయాడు. అతన్ని మీ శక్తితో బ్రతికించండి” అని వేడుకుందట. అంతట ఆ గురువుగారు ఈ విధంగా చెప్పేరుట.
“తప్పకుండా నీ కొడుకు ను బ్రతికిస్తాను” నువ్వు నాకు గుప్పెడు నువ్వులు తీసుకురావాలి. ఇందులో ఒక షరతు వుంది. ఏ ఇంట్లో అయితే ఈ రోజు వరకు ఎవ్వరూ చనిపోయి వుండరో, ఆ ఇంటి నుంచి గుప్పెడు నువ్వులు తీసుకురావాలి” అని గురువుగారు చెప్పేరు.
ఆ మహిళ ఇంటింటికీ తిరిగి సాయంత్రం సమయం కు గురువుగారి వద్దకు చేరుతుంది. నువ్వులు తీసుకు రాలేకపోయేనని చెప్తుంది. ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు గతంలో చనిపోవడం వల్ల నాకు నువ్వులు దొరకలేదని చెప్తుంది. చివరికి గురువుగారి హితోపదేశం చేసి, చావు తప్పదనే విషయం తెలియజేసి ఆ మహిళను పంపిస్తారు.
ఒక యువకుడు తాను కోరుకున్న కంపనీ బూట్లను తల్లిదండ్రులు కొనిపెట్టలేదని, తన పరిస్థితిపై తానే జాలిపడుతూ వున్న సమయంలో అసలు కాళ్ళు లేని యువకుడు మూడు చక్రాల సైకిల్ పై కాలేజ్ కు వెళ్తూ కనిపించేడట. అది చూసిన ఆ యువకుడు తనపై తాను జాలిపడటం ఎంతో అన్యాయం అనుకున్నాడు. అందువల్ల వాస్తవాలను అర్ధం చేసుకుని LEARNER THINKING ను అలవాటు చేసుకుంటే ‘స్వసానుభూతి’ సమస్య నుంచి బయటపడి ఆత్మగౌరవం తో సంతోషంగా ఉండగలం.
*****

No comments:

Post a Comment

Pages