సామ్రాజ్ఞి – 3 - అచ్చంగా తెలుగు

సామ్రాజ్ఞి – 3

భావరాజు పద్మిని


(జరిగిన కధ : ప్రస్తుత కేరళ ప్రాంతంలోని సువిశాల సీమంతినీ నగరాన్ని పరిపాలిస్తూ ఉంటుంది స్త్రీ సామ్రాజ్ఞి ప్రమీల. ఆమె రాజ్యంలో అంతా స్త్రీలే ! అందంలో,కళల్లో, యుద్ధ విద్యల్లో ఆమె ముందు నిలువగల ధీరుడు లేడని ప్రతీతి. ఆమె  ఉత్సాహభరితమైన మాటలతో తన సైన్యాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. గిరిజనులకు బందిపోట్ల బాధను తొలగించేందుకు వెళ్ళిన ఆమె చేతికి గాయమవుతుంది. ఈ సంగతిని ఆమె తన గుర్విణి శక్తిసేనకు చెబుతూ, కుంతల రాజు విజయవర్మ పంపిన లేఖను గురించి వివరిస్తుంది ప్రమీల. తమ రాజ్యంలో ఉన్న పరిణామ సరోవరంలో తెలియక దిగిన తన తమ్ముడు శూరవర్మ స్త్రీ రూపాన్ని పొందినందుకు ఆగ్రహించిన విజయవర్మ, సీమంతిని సామ్రాజ్యంపై యుద్ధానికి సిద్ధమవుతాడు. అనవసర రక్తపాతం తనకు ఇష్టం లేదని, దీనికి తరుణోపాయం చెప్పమని కోరిన ప్రమీలతో మల్లయుద్ధమే సరైన ఉపాయమని చెబుతుంది గుర్విణి.)
కుంతల రాజ్యానికి, సీమంతిని సామ్రాజ్యానికి మధ్యన ఉన్న విశాలమైన పర్వత సానువుల నడుమ ఉన్న ఒక చదునైన లోయలో కుంతల రాజు విజయవర్మకు, సీమంతినీ సామ్రాజ్ఞి ప్రమీలకు మధ్య మల్లయుద్ధ పోటీకి వేదిక ఏర్పరచబడింది. పోటీలో ఓడినా, చనిపోయినా, ఆ రాజ్యం గెలిచిన వారి వశమవుతుంది. చరిత్రలో కనీవినీ ఎరుగని ఈ వింతను చూసేందుకు అంత దూరమూ ప్రయాణించి వచ్చారు ఇరు రాజ్యాల సైనిక సిబ్బంది, పౌరులు. ఆ లోయకు అటూ ఇటూ ఏర్పాటు చేసిన తాత్కాలిక విడిదిలో తాము ఉండేందుకు వసతి ఏర్పాట్లు చేసి, డేరాలు వేసి, ప్రజలకు కావలసిన ఆహారపానీయాది సదుపాయాలు ఏర్పాటు చేసాయి ఇరు ప్రభుత్వాలు.
మల్ల యుద్ధానికి సమయం ఆసన్నమయ్యింది. మళయాళ దేశంలోని స్త్రీలు మిగతా భారతంలోని స్త్రీలకంటే బలిష్టంగా ఉంటారు. వారి ఎత్తు, సౌష్టవం వేరు. వారి యుద్ధ విద్యా నైపుణ్యం వేరు. నిజానికి ప్రపంచానికి తెలియని అనేక యుద్ధ విద్యలకు, మర్మ కళలకు పుట్టినిల్లిది. సకల కళలలో సిద్ధహస్తురాలైన సామ్రాజ్ఞి, ఒళ్ళంతా కొబ్బరినూనె పట్టించి, ఒక తెల్లటి చీరను గోచి పోసి కట్టుకుని, వీర తిలకం దిద్దుకుని, పరివార జనం జయజయ ధ్వానాలు చేస్తూ ఉండగా, సముద్ర గాంభీర్యంతో యుద్ధరంగానికి బయలుదేరింది. విజయవర్మ ఒక పచ్చని అంగీ  ధరించి, రొమ్ము విరుచుకు నడుస్తూ, పొంగిన కండల్ని ఒంటికి పట్టించిన తైలం మరింత స్పష్టంగా చూపుతూ ఉండగా, తన భార్యలతో వీరతిలకం దిద్దించుకుని, వంధిమాగధులు వెంట అనుసరించగా యుద్ధస్థలికి వచ్చాడు.
ముందుగా ఇరు రాజ్యాల దూతలు ఇరువురికీ పరిచయాలు గావించారు. విజయవర్మ పుట్టిపెరిగి అంతటి అందాల రాశిని ఎన్నడూ చూడలేదు. స్త్రీలోలుడైన అతను సభ్యత కూడా మరచి సామ్రాజ్ఞినే రెప్ప వెయ్యకుండా చూడసాగాడు. మండుతున్న సూర్యుడి తాపానికి సామ్రాజ్ఞి బుగ్గలు, ఒళ్ళు ఎర్రగా కందిపోతున్నాయి. అది చూసి, ముగ్దుడవుతూ ఇలా అన్నాడు విజయవర్మ.
‘దేవీ ! సృష్టిలోని సౌందర్యమంతా పోతపోసుకు నడచివస్తే ఎలా ఉంటుందో, నీ రూపం అంత సమ్మోహనకరంగా ఉంది. నీ లావణ్యం నా మతి పోగొడుతోంది. చూడు, సూర్య తాపానికి సుకుమారమైన నీ మేను ఎలా కందిపోతోందో ! నీవంటి ప్రణయినితో దిగాల్సింది సరసానికి, సమరానికి కాదు. నీతో తలపడేందుకు నాకు మనసు రావట్లేదు. కోమలీ, నా మాట విని, యుద్ధాన్ని విరమించుకుని, నన్ను వివాహం చేసుకో, ఇరు రాజ్యాలు కలిసి ఏలుదాము, ఏమంటావ్? ఏమంటావులే, ఈ కండలు చూడగానే నీ గుండెలు అవిసిపోయి ఉంటాయి.’ అంటూ ఆమె వంక విలాసంగా చూడసాగాడు.
‘ఓరీ రాజాధమా ! కంటికి నదురుగా ఉన్న స్త్రీ కనిపించగానే, ఆమెను సొంతం చేసుకునేదాకా, నిద్రపోని తమ రాసలీలల గురించి విని ఉన్నాను. తమకున్న పది మంది పత్నుల గురించి, అనేక భోగపత్నుల గురించి కూడా తెలిసింది. కాని, స్త్రీకి కూడా ఒక మనసుంటుంది, ఇష్టాఇష్టాలు ఉంటాయి అని మరచి, పదుగురి ముందు సభ్యత మరచి, చూడగానే చొంగ కారుస్తూ, నోటికోచ్చినది వాగే నీ కుసంస్కారానికి, తెగింపుకి ఆశ్చర్యపోతున్నాను. కోమలమైన చర్మాన్ని, సౌష్టవాన్ని మాత్రమే చూస్తారు నీలాంటివారు. కాని, వాటి వెనక ఉన్న ఉక్కు గుండె కామాంధులకు కనిపించదు. ఇక కండల సంగతి అంటావా, పది గండుచీమలు తెచ్చి వేస్తే, పశువుకీ పెరుగుతాయి కొయ్యకండలు! అవి చూసి, బెదిరిపోడానికి నేనేమీ కుందేలు పిల్లను కాను. నీ మాటల దెబ్బ తిన్న శివంగిని, ఇక మాటలతో కాలయాపన చెయ్యక సమరానికి సిద్ధంకా !’ క్రోధం జ్వలించే నేత్రాలతో అతన్ని చూస్తూ కదనరంగానికి కదిలింది సామ్రాజ్ఞి.
‘కయ్యానికి, వియ్యానికి సమ ఉజ్జీలు ఉండాలని అంటారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లు, నిన్ను ఓడించడం ఎంత, చిటికెలో పని, పద, నీ ముచ్చటా తీరుస్తాను, అప్పుడు దారికోస్తావ్ ’ వెకిలిగా నవ్వుతూ కదిలాడు విజయవర్మ.
‘ఎదుటివారి బలాన్ని ఎప్పుడైతే మనం తక్కువ అంచనా వేస్తామో, ఆ క్షణాన మనం సగం ఓడిపోయినట్లే !’ గుర్విణి మాటలు చెవుల్లో మార్మ్రోగుతూ ఉండగా, చిరునవ్వుతో, చెదరని సంకల్పబలంతో ముందుకు కదిలింది సామ్రాజ్ఞి.
ఇరువైపులా నిల్చున్నారు విజయవర్మ, ప్రమీల. వారి చుట్టూ వలయాకారంలో అటూ, ఇటూ నిలబడ్డారు ప్రజలు, దండ నాయకులు. అందరూ ఊపిరి బిగబట్టి జరిగే పోరును చూసేందుకు సిద్ధమయ్యారు. గుప్పెడు మట్టిని చేత్తో తీసుకుని, తన నుదుటికి రాసుకుంది ప్రమీల. కాలితో బలంగా మట్టిని తన్ని భుజాలు తట్టుకు వికటాట్టహాసం చేసాడు విజయవర్మ.
ముందుగా రాజు, రాణి, కుడి చేత్తో కరచాలనం చేసుకున్నారు. అభివాదానికి సూచనగా మల్ల యుద్ధంలో ఏర్పరచిన పధ్ధతి అది.
‘పాణీగ్రహణం పూర్తయ్యింది, ఇక కళ్యాణమూ, కలయికే మిగిలింది, రా’ అంటూ హేళనగా నవ్వుతూ  ముందుకు వంగి ఉరికాడు విజయవర్మ.
ఆమె కూడా అతని మాటలకు రగిలిన జుగుప్సతో ముందుగు వంగి ఉరికింది. తలతో తల తలపడి ఇరువురూ అటూ, ఇటూ తోసుకుంటూ ఉంటే,  రెండు మదగజాలు కొట్లాడుకుంటున్నట్లు అనిపించసాగింది అందరికీ. అతని పిడికిళ్ళు, ఆమె పిడికిళ్లతో తలపడ్డాయి. ఒకరి జుట్టును ఒకరు అందిపుచ్చుకుని, ఎదుటివారి మీద పట్టును సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ముందు పెద్దగా ప్రతిఘటించలేదు ప్రమీల.
“ప్రమీలా ! ఈ మల్ల యుద్ధంలో మొట్టమొదట మనం నిశితంగా గమనించాల్సింది ఎదుటివారు యుద్ధం చేసే పద్ధతిని. పట్టు, విడుపు, బిగువు, మీదకు దూకే పధ్ధతి, కాళ్ళు, చేతులతో దాడి చేసే పధ్ధతి అన్నీ అంచనా వెయ్యాలి. అప్పుడు వారి ఎత్తులకు పైఎత్తులు వేసి, శత్రువును చిత్తు చెయ్యడం పెద్ద విషయం కాదు,” మల్ల యోధ మాలిని శిక్షణలో భాగంగా తనకు నేర్పిన మొదటి సూత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంది ప్రమీల.
ఆమె ఆలోచనల్లో ఉండగానే, ఆమె కాలిని బలంగా లాగి, ఆమెను నేలకరిపించాడు విజయవర్మ. ‘అరఘడియ పట్టలేదు, మరికొద్ది క్షణాల్లో నీకు ఎముకల్లోకి సున్నం లేకుండా చేస్తాను,’ తొడలు తట్టుకుంటూ వెర్రిగా అరుస్తూ అన్నాడతను. అటువైపు ప్రజలు తమ రాజుకు జయజయధ్వానాలు చేసారు. కానీ, అతని యుద్ధ తంత్రాన్ని ఇంకా తెలుసుకోవాలి, అనుకుంది ప్రమీల. లేచి, తిరిగి అతనితో తలపడసాగింది. అందీఅందనట్లు తప్పుకుంటూ, అతని పద్ధతిని అవగాహన చేసుకోసాగింది. ఈలోగా ప్రమీల చేతిని అందిపుచ్చుకుని, చేతి ఆధారంగా ఆమెను గిరగిరా తిప్పి పడేసాడు అతను. కుంతల రాజ్య ప్రజల ఆనందం మిన్నంటింది. ప్రజల కోలాహలంతో రెట్టింపైన ఉత్సాహంతో వెనకకు మరలి, సామ్రాజ్ఞి మీదకు ఒక్క ఉదుటన దూకాడతను. ఆ సరికే, ఆమెనిక వెంట్రుకవాసిలో జయించవచ్చు అని అతను తీర్మానించుకున్నాడు. అప్పటికి మల్ల యుద్ధంలో రెండు ఆవృతాలు ముగిసాయి.
మూడో ఆవృతం ముందు, ఆమె కూడా రెండడుగులు వెనక్కు వెయ్యడం అతను ఈ సందడిలో గమనించలేదు. శివంగి వేటకు ముందుకు దూకేముందు, వేసిన వెనకడుగు అది. తనమీదకు దూకుతున్న విజయవర్మ వేగాన్ని నిలువరించి, అతడిని భుజాలపైకెత్తి బలంగా, దూరంగా వెనక్కు విసిరేసింది ఆమె. ఆ దెబ్బకు అతని నవనాడులూ చలించిపోయాయి.
“సీమంతినీ సామ్రాజ్ఞికి జై !’  అన్న నినాదాలు మిన్నంటాయి. ఇరువురూ పరివార జనం అందించిన ఉపచారాలు అందుకుని వచ్చారు.
నాలుగో ఆవృతం సమయానికి నెమ్మదిగా బలం కూడదీసుకుని లేచిన విజయవర్మ, ఆమె కాలిని, చేతిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసాడు. ఈ లోపలే ఆమె అతని మెడ చుట్టూ పట్టు బిగించి, అతని చేతిని వెనక్కు విరిచి, వీపు వంచేసి, తన బలాన్నంతా ఉపయోగించి, అతన్ని నేలకు నొక్కేసింది. ‘టక్ ‘ మని అతని చేతి ఎముక విరిగిన చప్పుడు, ఆ వెనుక అతని ఆర్తనాదం అంతటా ప్రతిధ్వనించింది. ఊపిరి అందని అతన్ని విడిచింది సామ్రాజ్ఞి. అతని ముక్కులోంచి రక్తం కారసాగింది.
చిట్టచివరిదైన ఐదో ఆవృతం మొదలయ్యేసరికి కసితో రగిలే అతను, ఓటమిని అంగీకరించేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేడు. ఆమె పట్టును విడిపించుకుంటూ ఆమెను తోసి, వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ఆమెను ఎత్తి పడేసే ప్రయత్నం చేసాడు. కాని, ఇందాక విరిగిన చెయ్యి మీదే గురి చూసి, మోచేత్తో గట్టి దెబ్బ వేసింది ఆమె. అతను బాధతో కాస్తంత పట్టు సడలించగానే, అతన్ని వీపు మీదకు ఎత్తి, గిరగిరా తిప్పేసి, ఒక్క ఉదుటన చేతుల్లోకి తన బలాన్నంతా కూడగట్టుకుని, అతన్ని గాల్లోకి లేపి, దూరంగా విసిరేసింది ఆమె. బల్లిలా నేలను కరుచుకుపోయి స్పృహ తప్పిన అతను మరిక లేవలేదు.
“స్త్రీ సామ్రాజ్ఞికి జై, ప్రమీలా రాణికి జై,” అంటూ జయజయధ్వానాలు చేసారు స్త్రీలంతా. అటువైపు కుంతల దేశ ప్రజలంతా తమ రాజు పరాజయంపాలు కావడంతో తమగతి ఏమౌతుందో అంటూ బిక్కుబిక్కుమంటూ చూడసాగారు. వారి మనోభావాలను కనిపెట్టిన సామ్రాజ్ఞి, దూరంగా నిలబడి చూస్తున్న అతని రాణులను, యువరాజును తన వద్దకు పిలిచింది.
‘మరేం భయం లేదు. నాకు మీ రాజ్యం అక్కర్లేదు. అయితే, సీమంతినీ సామ్రాజ్ఞి విజయానికి సంకేతంగా ప్రతి ఏడూ మీ రాజ్యం మాకు కప్పం కట్టాలి. యువరాజును పట్టాభిషిక్తుడిని చెయ్యండి. రాజ్యంలో శాంతిసామరస్యాలకు భంగం కలిగితే, నన్ను సంప్రదించండి. కానీ, స్త్రీల పట్ల చులకన భావం ఉన్న మీ భర్తకు మాత్రం కాస్తంత చికిత్స అవసరం, అతడిని స్వాధీనపరచుకుని, మా గుర్విణి కోరిన గురుదక్షిణ అందించేందుకు తీసుకుని వెళ్తున్నాను. ఇక అతడిని మర్చిపోండి, ఇది ఈ సామ్రాజ్ఞి ఆజ్ఞ !’ నెమ్మదిగా సూటిగా చెప్పింది.
కనీసం తమ రాజ్య ప్రజలను, రాజ్యాన్ని వదిలినందుకు ఒక కంట సంతోషిస్తూ, భర్త వారి చెరలో పడ్డందుకు మరో కంట దుఃఖిస్తూ వెనుదిరిగారు వారు. వెంట వారిని అనుసరించారు ప్రజలు, దండనాయకులు. ఇటు సీమంతినీ సామ్రాజ్ఞి కూడా విజయకేతనం ఎగురేస్తూ తన రాజ్యానికి బయలుదేరింది.
***
పరిణామ సరోవర తీరంలో తీవ్ర ధ్యానంలో ఉన్నాడు అర్జునుడు. కురుక్షేత్ర సంగ్రామంలో తనవారిని చేజేతులా చంపిన పాపాన్ని కడిగేందుకు, ధర్మరాజు తలపెట్టిన అశ్వమేధయాగం తాలూకు యాగాశ్వాన్ని సంరక్షించే బాధ్యతను అతనికి అప్పగించారు. ఉత్తర భారతమంతా తనతోపాటు దిగ్విజయంగా పర్యటించిన అశ్వం, ఈ పరిణామ సరోవరంలోని నీరు త్రాగగానే స్త్రీ గుఱ్ఱంగా మారిపోయింది. ఆ కంగారులో పరిగెత్తుకు వ్యాఘ్ర సరోవరాన్ని చేరిన గుఱ్ఱం వ్యాఘ్రంగా మారిపోయింది. ఆ పులిని వలలో నిర్బంధించి ఉంచింది అతని పరివారం. ఇప్పుడు తాను ఏ ముఖం పెట్టుకుని హస్తినకు వెళ్ళాలి ? వెళ్లి, తన అన్నకు ఏమి సమాధానం చెప్పాలి ? అసలు ఈ మాయ అంతా ఏమిటి ? ఈ రూపాలు మారిపోవడం ఏమిటి ? దిక్కుతోచని కిరీటి కృష్ణ ధ్యానం చేస్తున్నాడు.
(సశేషం)

No comments:

Post a Comment

Pages