ప్రేమతో నీ ఋషి – 20 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 20

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటాడు. ముంబైలో ఉగ్రవాద దాడులు జరిగిన గార్డెన్ హోటల్ లో జరగనున్న ఆర్ట్ వేలానికి వారిద్దరూ వెళ్తున్నారు.  దారిలో స్నిగ్ధకు ఆర్ట్ మ్యూజియం కోసం వారు కొన్న విశ్వామిత్ర పెయింటింగ్ నకిలీదని చెప్తాడు ఋషి. ఆ విషయం విన్న స్నిగ్ధ షాక్ కు గురౌతుంది. ఇక చదవండి...)
మర్నాడు ఉదయం వారు తయారవగానే, లాంజ్ లో కలుసుకుని, కళాఖండాల సమీక్ష కోసం వారు కలవాల్సిన ‘హెడ్ ఆఫ్ ఆపరేషన్స్’ ను కలిసేందుకు గ్రాండ్ సెంట్రల్ హాల్ కు వెళ్ళారు.
వారు హాల్ లోకి రాగానే, ఇద్దరిలో ఒకేసారి ఒకరకమైన అధైర్యస్థితి కలిగింది. వారు ఎంతోకాలం నుంచి ఈ హోటల్ గురించి వింటున్నా, ఎప్పుడు చూసే అవకాశం రాలేదు. నిజానికి, గార్డెన్ హోటల్ అనేది ముంబై కు స్మృతి చిహ్నంగా ఉండేది, వారి మిత్రులు వారిని అనేకమార్లు దానిపై జరిగిన ఉగ్రవాద దాడుల గురించి అడిగారు. న్యూస్ కవేరేజ్ ద్వారా ఏం జరిగిందో వారు అర్ధం చేసుకోగాలిగినా, చల్లటి సముద్రపు గాలి వారి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉండగా, వారిద్దరూ గ్రాండ్ హాల్ లోకి అడుగుపెట్టారు.
హాల్ లోకి స్నిగ్ధ మౌనంగా అడుగుపెట్టింది. కొద్ది వారాల క్రితం బుల్లెట్ల చప్పుళ్ళతో, రక్తంతో తడిసిన ప్రదేశం ఇదేనని ఆమెకు నమ్మబుద్ధి కావటంలేదు.
ఆ హాల్ హోటల్ లోపలున్నఒక తోటకు దారి తీసింది. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి గౌరవసూచకంగా అక్కడొక స్మారక చిహ్నం నిర్మించబడింది. అక్కడి పరిసరాలు చూసి, ఋషి కూడా అవాక్కయ్యాడు. అక్కడి పరిసరాలు అన్నీ పునరుద్ధరించినా, అక్కడి స్థితి, వాతావరణంలో హోటల్ ఆత్మపై ఉగ్రవాదులు వదిలి వెళ్ళిన గాయాలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
హోటల్ ఆపరేషన్స్ ఇన్చార్జ్ వారిని పలకరిస్తూ, షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండగా, వారు ఇంకా షాక్ లోనే ఉన్నారు. వారికి అల్పాహారం తీసుకోమని చెప్పి, కళాఖండాల సమీక్ష కోసం సమావేశం జరిగే ముందు హోటల్ లోపల తిరిగేందుకు ఒక సహాయకుడిని వారితో పాటుగా వెళ్ళమని అభ్యర్ధించాడు.
వారు హోటల్ అంతా తిరుగుతూ ఉండగా, ఇంకా వారికి గన్ షాట్ శబ్దాలు, దాడి సమయంలో వేసిన కేకలు,   పరుగులు పెడుతున్న ప్రజల అరుపులు వంటివాటిని ఇంకా అనుభూతి చెందగలుగుతున్నారు. కాని, హోటల్ లో దెబ్బతిన్న ప్రతి భాగాన్ని పునర్నిర్మించి, దాని అసలైన సౌందర్యం మళ్ళీ తిరిగి వచ్చేలా చేసేందుకు యాజమాన్యం వారు అద్భుతమైన కృషి చేసారు. హోటల్ కు ఉన్న చారిత్రాత్మకమైన ప్రతిష్టను సంరక్షించేందుకు యాజమాన్యం వారు పడ్డ శ్రమను అభినందించడం తప్ప, వారు ఇరువురూ ఏమీ మాట్లాడలేకపోయారు. కాని స్నిగ్ధ హోటల్ పై దాడులు మిగిల్చిన గాయాన్ని ఇంకా అనుభూతి చెందగలుగుతోంది. ఆ భయానక జ్ఞాపకాలు పూర్తిగా తుడిచివెయ్యడానికి ఎన్నేళ్ళు పడుతుందోనని ఆమె అనుకోసాగింది. హఠాత్తుగా ఆమెకు తను కూడా వ్యక్తిగతంగా అటువంటి స్థితిలోనే ఉన్నానని గుర్తొచ్చింది, అప్సరతో ఋషిని సన్నిహితంగా చూసిన సంఘటనను ఆమె గుర్తుచేసుకుంది.
కేవలం విశ్వామిత్ర పెయింటింగ్ కోసమే ఋషి అప్సర ఇంటికి వెళ్ళాడని తను నమ్మాలా? ఈ ప్రశ్నకు ఆమెవద్ద సమాధానం లేదు.
***
‘అవును, తనకు మోడల్ గా పనిచేసిన రాకుమారితో వెళ్లి కనిపించకుండా పోయే ముందు దక్షిణ భారతంలో గొప్ప చిత్రకారుడైన ప్రద్యుమ్న వేసిన చిట్టచివరి ఒరిజినల్ పెయింటింగ్ ఇదేనని మీరు నమ్ముతారా ?’ హోటల్ అంతా చూడడం ముగిసాకా, కళాఖండాలను ప్రదర్శనకు ఉంచిన ‘బాల్ రూమ్’ లోకి వచ్చిన స్నిగ్ధ, ఋషి తో అన్నాడు ఆపరేషన్స్ ఇన్చార్జ్. ప్రద్యుమ్న వేశాడని చెప్తున్న ఆ ఘనమైన పెయింటింగ్ ను ఆశ్చర్యంగా చూడసాగింది స్నిగ్ధ. తాను చూస్తున్నది నిజమేనా అన్న గందరగోళంలో ఆమె ఉంది. ముఖ్యంగా తాము మాంచెస్టర్ లో కొన్న పెయింటింగ్ మూలాలకు సంబంధించిన పత్రాలను తన కళ్ళతో తను చూసాకా, తర్వాత ఋషి తాము కొన్న పెయింటింగ్ నకిలీదని చెప్పాకా, ఆమె సందిగ్ధంలో పడిపోయింది.
‘ఈ హోటల్ ఆరంభించిన నాటినుంచి మూసి ఉన్న ఒక గదిలో దీన్ని కనుగొన్నాము. ఆ కధ ప్రకారం, హోటల్ ప్రారంభించిన మొదటి రోజున ఆ గదిలో ఉన్న ఒక బ్రిటిష్ వర్తకుడు, అనుకోకుండా హార్ట్ అటాక్ తో చనిపోయాడు. సెంటిమెంట్ ప్రకారం, ఆ తర్వాత యాజమాన్యం వారు ఆ గదిని వాడేందుకు ఇష్టపడలేదు. వారు ఆ గదిలోని ఒక్క వస్తువును కూడా ముట్టుకోలేదు, అతని శవాన్ని బైటికి తీసి, అలాగే తాళం  వేసేసారు. అప్పటినుంచి, ఎవరూ ఆ గదిని తెరవలేదు. ఈమధ్యన జరిగిన దాడుల్లో, వాటి నుంచి తమను తాము సంరక్షించుకునేందుకు బెదిరిపోయిన ఇద్దరు అతిధులు ఈ తాళాన్ని పగలగొట్టారు. ఆ విధంగా పునర్నిర్మాణ పనుల్లో ఈ కళాఖండం వెలుగులోకి వచ్చింది, అది ఆ గదిలోనే కొన్ని దశాబ్దాలుగా పడి ఉంది,’ అంటూ ఇన్ ఛార్జ్ తవ్వకపు పనుల గురించి చెప్పటం ముగించాడు.
అతని మాటలు వింటున్న స్నిగ్ధ అప్పుడే ఈ లోకంలోకి వచ్చింది, ఆమె తీవ్రమైన షాక్ కు గురయ్యే లాగా, విశ్వామిత్ర, మేనక పెయింటింగ్ ఆమె కళ్ళ ముందు వైభవంగా తీర్చబడి ఉంది, ఆమె దాదాపుగా స్పృహ కోల్పోయింది.
***
హోటల్ రూమ్ కు తిరిగివచ్చిన స్నిగ్ధ ఏడవసాగింది. తాను అప్పుడే కళ్ళారా చూసిన దాన్ని ఇంకా మీ జీర్ణించుకోలేకపోతోంది. ఆమె తన కళ్ళతో అసలైన విశ్వామిత్ర పెయింటింగ్ ను చూసింది. ఆ రోజున ఋషికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న బాధ, ఈ గందరగోళానికి తోదవుతోంది.
నకిలీ పెయింటింగ్ ను తాను ఎలా కొనగలదు ? అప్సర కూడా దీన్ని ఎలా కనిపెట్టలేక పోయింది? అంటే, ఋషి అప్సర ఇంటికి ఒక సరైన కారణంతోనే వెళ్ళాడా? అదే నిజమైతే, ఋషికి ఆ పెయింటింగ్ ను గురించిన అనుమానం ఎలా వచ్చింది ? బదులే లేని ప్రశ్నల పరంపరతో ఆమె మనసు నిండిపోయింది.
గదిలోకి కాస్త వెలుగు వచ్చేందుకు ఆమె కిటికీకి ఉన్న పరదా తొలగించి, గదిలో అలముకున్న నైరాశ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. దిగులుగా ఉన్న మనసును అదుపు చెయ్యటం అంత త్వరగా ఆమెకు సాధ్యపడలేదు.
ఒకవైపు ఆమె ఋషిని కలిసి, తన చికాకైన ప్రవర్తనకుగానూ అతనికి క్షమాపణలు చెప్పే ధైర్యాన్ని కూడగాట్టుకోలేకపోయింది. మరో వైపు, మహేంద్రను ఎలా ఎదుర్కోవాలో, అతనికి తాను జీవితంలో చేసిన అత్యంత ఖరీదైన పొరపాటును ఎలా వివరించాలో ఆమెకు అర్ధం కాలేదు. డోర్ బెల్ మ్రోగింది. బయట ఒక సేవిక  కాఫీ కప్పుతో నిల్చుంది. తాత్కాలికంగానైనా తిరిగి తనను తాను ఉత్సాహపరచుకోడానికి ఇప్పుడు స్నిగ్ధకు కాఫీ ఎంతో అవసరం.  సేవిక కాఫీ కలపడం పూర్తీ చేసి, అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా, ఆమె స్నిగ్ధకు సాయంత్రం హోటల్ కాన్ఫరెన్స్ రూమ్ లో సాయంత్రం జరగనున్న కార్యక్రమాన్ని గుర్తు చేసింది. అక్కడే మహేంద్రకు ‘స్టార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ఇవ్వనున్నారు.
అతనివంటి స్థాయి ఉన్న గౌరవనీయమైన CEO కి ఆ అవార్డు వృత్తిపరంగా అత్యంత ప్రశంశనీయమైనది, అనుకుంది స్నిగ్ధ ఓ క్షణం పాటు. కాని, ఈ నకిలీ పెయింటింగ్ సంగతి కనుక మీడియా కు తెలిస్తే, దాన్ని పారిశ్రామికవేత్తల సంఘం ఎలా తీసుకుంటుందో ఆమెకు తెలీలేదు.
వృత్తిపరంగా జీవితంలో స్థిరంగా విశ్వసనీయతను పొందాలంటే, ప్రమాణాలను పాటించడం అనేది ఎంత ముఖ్యమో ఆమెకు మహేంద్ర ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు. ఇప్పుడు, ఆయన సంస్థలోనే ఆమె విశ్వసనీయత సందిగ్ధంలో పడింది. ఈ విషయంపై ఆమె అనంతంగా ఆలోచించగలిగినా, కాఫీ కలవరపడ్డ ఆమె మనసుపై తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టింది. కాఫీ డోసు ఆమె బుద్ధికి కొత్త శక్తిని ఇవ్వటం మొదలు పెట్టగానే, ఏం చెయ్యాలో ఆమెకు స్పష్టం అవసాగింది. ఆమె కాఫీ త్రాగడం ముగించగానే, మున్ముందు ఏమి చెయ్యాలో ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
ముందుగా, ఆమె ఋషితో మొదలుపెట్టాలి. అతనికి క్షమాపణలు చెప్పి, అతని సహాయం పొందాలి. ఒకరి జీవితంలో వ్యక్తిగతమైన అంశాలను పరిష్కరించుకున్నప్పుడు, అది వృత్తిపరంగా కూడా చక్కగా పనిచేస్తుంది. ఋషి సమక్షంలో, నకిలీ పెయింటింగ్ విషయంలో మహేంద్రను ఎదుర్కునే విషయాన్ని కూడా ఆమె జంటగా చెయ్యగలదు. ఒకవేళ, ఇదే క్రమంలో అనుకున్నవి జరగకపోతే, ఒకేసారి ఆమెకు ఋషితోనూ, మహేంద్రతోనూ కూడా వ్యవహారం చెడే అవకాశం ఉంది.
ఆమె ఆలోచనలకు ఒక ఆకృతి వచ్చి, ఏం చెయ్యాలో ప్రణాళిక వేసుకోగానే, ఆమె మనసు తేలిక పడింది. హోటల్ కిటికీ నుంచి సముద్రం ఇప్పుడు ఆమెకు మరింత ప్రశాంతంగా కనిపించసాగింది. ఆమె వేన్నీళ్ళ స్నానం చేసి, సాయంత్రం ఫంక్షన్ కు తయారయ్యేందుకు వెళ్ళబోతూ, దానికంటే ముందుగానే ఋషిని కలవాలనుకుంది.
ఆమె ఫోన్ తీసి, ఋషి రూమ్ నెంబర్ కు కాల్ చేసింది. ఋషి ఫోన్ తీసాడు.
‘ఋషి, కాసేపు మాట్లాడేందుకు నేను నిన్ను కలవాలని అనుకుంటున్నాను. ప్లీజ్... కాదనకు.’ అని మాత్రమే అనగలిగింది. కొద్ది క్షణాల పాటు అటువైపు నిశ్శబ్దం అలముకుంది. కాని, ఋషి కాదనడని స్నిగ్ధకు నమ్మకం. ‘సరే... మరికొన్ని చర్చల కోసం నేను ఆపరేషన్స్ మేనేజర్ ను మరోసారి కలవనున్నాను. మనం సాయంత్రం వెళ్ళిన హాల్ లోనే మళ్ళీ నువ్వు నన్ను కలవచ్చు.’ అన్నాడు ఋషి.
‘థాంక్స్ ఋషి’ అన్న స్నిగ్ధకు ఇప్పుడు కాస్త మెరుగ్గా అనిపించసాగింది.
(సశేషం)

No comments:

Post a Comment

Pages