ప్రపంచం - జగత్            

డా వారణాసి రామబ్రహ్మం


ప్రపంచం - ప్రపంచం అనగానే మనకు భూమిపై కల దేశాలు ముందు దృష్టిలోకి వస్తాయి. ఆ తరవాత మన సంస్కారము, చదువులను బట్టి చరాచర ప్రపంచము అనే ఆధ్యాత్మిక పదము గుర్తుకు వస్తుంది. తత్త్వశాస్త్ర రీత్యా ప్రపంచము అంటే ఏమిటో గమనిద్దాము.
"  అస్తి భాతి ప్రియమ్ నామమ్రూపంచేతి అంశ పంచకమ్ఆద్యత్రయం బ్రహ్మరూపమ్తతోద్వయమ్ జగద్రూపమ్ "అని వేదాంత పంచదశి ప్రపంచాన్ని నిర్వచించింది. ప్రపంచం అనగానే చివరి పంచ, ఐదు అని స్ఫురింపజేస్తుంది. ప్రపంచం ఐదింటిచేత నిర్మింపబడింది అనీ అనిపిస్తుంది. ఆ ఐదు అస్తి (సత్), భాతి (చిత్), ప్రియమ్ (ఆనందం), నామము, రూపము. తత్త్వశాస్త్ర రీత్యా ప్రపంచం అంటే మానసిక ప్రపంచం అని మనం అర్థం చేసికోవాలి. మానసిక ప్రపంచం ఆత్మ శక్తి, లేక చిత్ శక్తి చేత నిర్మించబడింది అని ఉపనిషత్తులు చెప్పాయి. మేధలో చిచ్ఛక్తి యొక్క ప్రతిఫలనము చిదాభాస. దీనినే మాయ అనీ అంటారు. మాయామయమ్ ఇదమ్ జగత్ - అంటే ఇదే. మాయచే జగత్ నిర్మింపబడింది అని అర్థము. మాయ అంతఃకరణములుగా ముందుగా పరిణమిస్తుంది. చేసే పనిని బట్టి వాటికి పేర్లు. అవి మనోబుద్ధ్యహంకారచిత్తములు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అని అవి నాలుగు. మనసు జ్ఞానేంద్రియముల ద్వారా బయటి భౌతిక ప్రపంచముతో అనుసంధానింపబడి ఆ భౌతిక జగత్తును గ్రహిస్తుంది. అలా అనుసంధానింపబడడాన్ని బహిర్ముఖ దృష్టి అంటారు. మెళకువ మానసిక దశ అన్నా ఇదే. అలా అన్ని విషయ గ్రహణలు మనసుచేత చేయబడతాయి. కన్నుకి రూపము, దృశ్యములు విషయములు. చెవికి ధ్వనులు, మాటలు, శబ్దములు విషయములు. నాలుకకి రుచులు విషయములు. ముక్కుకి వాసనలు విషయములు. చర్మమునకు స్పర్శలు, వేడిమి, చల్లదనములు విషయములు. అలా మనసుద్వారా అంతర ప్రపంచంగా మారిన విషయసముచ్చయమే జగత్తు. ఇది భావముగ మనసుచేతనే బయటికి తేబడి జగత్ అవుతుంది. ప్రపంచం స్థాణువు. స్థావరము. అచరము. జగత్ జంగమము. కదిలేది. పుట్టి, కనుమరుగు అయ్యేది జగత్. జాయతే గచ్ఛతే ఇతి జగత్. పుట్టి అదృశ్యమయ్యేవి తలపులే. తలపులు క్షణక్షణానికీ మారతాయి. అలా జగత్ ఒకసారి ఉండి మరుక్షణం ఉండదు. అందుకే జగత్ మిథ్యా. అంటే ఒక సారి ఉండి మరుక్షణం మాయమయ్యేది. మాయ అయ్యేది. అద్వైతులు అనేది ఈ ఆంతర మానసిక జగత్తు మిథ్య అనీ. బయటి భౌతిక ప్రపంచము మిథ్య అని ఉపనిషత్తుల దగ్గర్నుంచి, బ్రహ్మజ్ఞానము, వేదాంత సూత్రములు, ఇతర అద్వైత వేదాంత గ్రంథములప అనలేదు. ఇదంతా విశిష్టాద్వైతుల, ద్వైతుల అపార్థము. భ్రమ. భ్రాంతి. అద్వైత వేదాంతానికి మణిపూస వంటి వాక్యము: బ్రహ్మా సత్ జగత్ మిథ్యా జీవో బ్రహ్మా ఏవ న అపరః దీని అర్థము ఏమిటంటే అస్తమానూ (సర్వకాల సర్వావస్థలయందూ) ఉండేది బ్రహ్మము. వచ్చిపోయేది (దృష్టిలోకి) భావరూప జగత్. జీవుడు బ్రహ్మమే వేరు కాదు. అంటే గమనికగా బ్రహ్మము, జీవుడు (వ్యక్తి) ఒకటే అని దీని తాత్పర్యము. మిథ్యా శబ్దానికి మరొక అర్థము నిజము కానిది, అబద్ధమైనది అని. నిజమైనది ఆత్మ. జగత్ దానిపై ఆనింపు. కలిగి పోయేది. అస్తమానూ (అన్ని మానసిక దశలలోను, స్థితులలోను) ఉండనిది. జగత్ అంటే కదులుతూండేది అనీ అర్థము. భావములు చిన్మయములు. చిత్ శక్తిచే నిర్మింపబడినవి. ప్రపంచము స్థిరముగా ఉండేది. జగత్ కదులుతూ, మారిపోతూ ఉండేది. భావములు క్షణ భంగురములు. క్షణక్షణానికీ మారిపోతూంటాయి. శాశ్వతత్వము లేనివి. ఈ గ్రహణలని ఆంతర మానసిక జగత్తుగా మనసే మస్తిష్కములో ముద్రిస్తుంది. ముద్రింపబడిన బయటి ప్రపంచ విషయ సముచ్చయము జడశక్తిగా ఆంతర ప్రపంచంలో ఉంటుంది. ఆ జడశక్తి మనోరూప చిత్ శక్తిచే ఆవేశింపబడితే, గ్రహింపబడి, భావముగ అంతర్ముఖ దృష్టి లోనికి వస్తుంది. దీని ఉనికి క్షణికము. మరొక భావనకు చోటిచ్చి తాను అదృశ్యమవుతుంది‌. కనుమరుగు అవుతుంది. మనోదృష్టికి అగుపడదు. ఇలా ముద్రింపబడిన బయటి భౌతిక విషయ, వస్తు సమూహమునే వేదాంత పంచదశి ఈ పై శ్లోకములో ప్రపంచంగా అభివర్ణించింది. నిర్వచించింది. ఇలా తనే ముద్రించిన విషయ ప్రపంచాన్ని తానే జగద్రూపంలో (తలపుల రూపంలో) దృష్టికి తెస్తుంది. ఆ దృష్టిని అంతర్ముఖ దృష్టి అంటారు. దీనినే కల మానసిక దశ అని కూడా అంటారు. మనసు విరమింపబడితే దృష్టి విశ్రాంతమవుతుంది. దృశ్యరహిత శాంతానందస్థితి అనుభవమవుతుంది. మౌనము వెల్లివిరుస్తుంది. మెళకువతో ఈ శాంతానంద స్థితిని అనుభవిస్తే అది జాగ్రత్ సుషుప్తి - మానసాతీత ఆత్మ దశ అవుతుంది. ప్రపంచం ప్రతి వ్యక్తికీ వేరు. మవిషి లింగాన్ని, సాంఘిక స్థితి, చేసే ఉద్యోగము, వృత్తి, వ్యాపారాలని బట్టి వేరు వేరుగా ఏర్పడుతుంది. ఈ ప్రపంచం ఏర్పడడానికి ముడి సరుకు/శక్తి చిదాభాస అయిన మాయ. మాయ మానసిక శక్తి. ఇది ప్రపంచ మీమాంస. విశ్వమీమాంస పేరుతో వాశిష్ట గణపతి ముని ఒక గొప్ప అద్వైత గ్రంథాన్ని రచించారు. అలా ప్రపంచం సత్-చిత్-ఆనందాత్మకమైన చిత్ శక్తితో నిర్మింపబడి ఆంతర జగత్తుగా, విషయసముచ్చయముగా, మస్తిష్కములో ముద్రింపబడి జడశక్తి రూపంలో నిలిచి ఉంటుంది. మనం నేర్చుకున్న భాష ఈ రూప/దృశ్య విషయ సముచ్చయానికి (ఈ విషయసముచ్చయములో మనం చూచిన దృశ్యములు/రూపములు/ఆకారములే కాక విన్న మాటలు, ధ్వనులు, శబ్దములు; రుచి చూసిన రుచులు, ఆఘ్రాణించిన వాసనలు, పొందిన, తగిలిన స్పర్శలు, వేడిమి, చల్లదనములు కూడ భాగములు) పేర్లు పెడుతుంది. అలా జగత్ నామ-రూప-భావ-వాసనాత్మకము. వ్యక్తిత్వ స్పృహ, అహంకార, మమకారములు కూడ దీనిలో భాగమే. చిత్తము, విషయములను గ్రహిస్తున్నప్పుడు అవి తత్సమయంలో కలిగించే అనుభవములను/అర్థములను భద్రపరచి వాసనలుగా మారుస్తుంది. మెళకువ వచ్చినపుడు, మెళకువలో ఉన్నపుడు ఈ వాసనలు చిత్తముచేతనే ప్రేరేపింపబడి తదనుగుణ మానసిక స్థితులను కలిగిస్తుంది. సుఖ, దుఃఖ అనుభవరూపములైన ఈ స్థితులు వ్యక్తిత్వ స్పృహను అప్పుడే కలిగించడం వలన అహంకార, మమకారములు జాగృతమై మనసు రూపంలో తలపులుగా పరిణమించి వ్యథలను, వేదనలను తీపులుగా మారుస్తాయి. ఈ‌ వేదనల సుడిగుండంలో మనిషి చిక్కుకొని అలమటిస్తాడు. వ్యక్తిత్వ స్పృహా రూపమైన ఈ అబద్ధపు నేనును (మిథ్యాహంను) నిజమైన నేను లో - అహం బ్రహ్మాస్మి‌ - అన్న ఉపనిషత్ వాక్యార్థములో - లీనం చేసి ఆ‌ నిజాన్ని సదా దృష్టిలో ఉంచుకోవడమే ముక్తి. అప్పుడు విషయ, విషయానుభవాత్మకమైన ప్రపంచం, వాసనలు దృష్టిలోనుండవు. లలితా సహస్రనామములలో నిష్ప్రపంచాయైనమః నామము దీనినే చెబుతుంది. దీనినే నైష్కర్మ్య సిద్ధి అనీ అంటారు. కైవల్య నవనీతము ఇదే. జ్ఞానేంద్రియములు, మనసు ద్వారా; నేనును శరీరానికీ, తత్సంబంధ అహంకార, మమకారములకు పరిమితం‌ చేయడం వల్ల కలిగిన సుఖదుఃఖములకు ఆలవాలమైన ప్రపంచం, వాసనలలో ఇమిడి ఉన్న ఇదమ్ ను ప్రపంచం అంది వేదాంత పంచదశి. ఈ ప్రపంచాన్ని ఒక ఇష్టదైవ అర్చనలో, దాసత్వములో, నామస్మరణలో ఆ దైవమయంగా మార్చుకోవడము సగుణోపాసన. విషయ ప్రపంచం, విషయానుభవ జనిత‌ వాసనలను ఏర్పరచిన చిన్మూలములో అంతఃకరణములను, వ్యక్తిత్వాన్ని లీనం చేయడం నిర్గుణోపాసన. అహమ్, ఇదమ్ లలో, అహమ్ ను మార్చుకుంటే నిర్గుణోపాసన. అద్వైతము. విషయ ప్రపంచాన్ని, విషయానుభవమయ వాసనలను ఒక ఇష్టదైవ శరణాగతిలో, ప్రపత్తిలో మార్చుకుంటే సగుణోపాసన. విశిష్టాద్వైతము, ద్వైతము, శాక్తము, సౌర్యము, గాణాపత్యము, వైష్ణవము, శైవము, కుమారము‌ మొదలైన మతములు సగుణోపాసనలు. నేను, ప్రపంచం ల రూపమైన బ్రహ్మమునకు అవనత శిరస్కుడనై బ్రాహ్మీభూతుడను అవుచున్నాను. శ్రీరస్తు! శుభమస్తు! సమస్త సన్మంగళాని భవంతు!ఇష్ట భగవత్ ప్రీతిరస్తు!ఏతత్సర్వమ్ పరబ్రహ్మార్పణమస్తు!

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top