హాస్యనటి రమాప్రభ గారితో ముఖాముఖి 

భావరాజు పద్మిని 


తెలుగులో తొలితరం నటీమణుల్లో రమాప్రభ ఒకరు. మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ‘రమాప్రభ’. హీరోయిన్‌గా, కేరెక్టర్‌ ఆర్టిస్టుగా, హాస్యనటిగా 1400కు పైగా సినిమాల్లో నటించారు. ఆధ్యాత్మికత, జీవితానుభవం కలబోసిన మన రమాప్రభ గారితో నేటి ముఖాముఖి మీ కోసం.
రమాప్రభ గారు ఇన్ని సినిమాల్లో నటించారు .. బోర్ అనిపించడం లేదా ?
ఇదొక అదృష్టం అండి... అందరికి ఇది దొరకదు. అందరి ఆశీర్వాదాల వల్లనే ఇంకా నటించ గలుగుతున్నాను.
మీరిప్పుడు ఎక్కడ వుంటున్నారు ?
మా స్వంత వూరు మదనపల్లె లో వుంటున్నాను.
మీరు రాజ బాబు గారు చాలా సినిమాల్లో నటించారు కదా ?
అవునండి... మేము దాదాపు 200, 300 పైగా సినిమాల్లో నటించుంటాము. ఎందుకో తెలియదు గాని మా కెమిస్ట్రీ చాల బాగా వర్క్ అవుట్ అయింది.  ముందు రమాప్రభ, రాజబాబు అని రాసాక, కథ సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా వున్నారు.
మంచి హాస్యానికి ఏమేమి కావాలని అంటారు ?
మంచి హాస్యానికి డైలాగ్ ఒక్కటే సరిపోదు, తగిన హావభావాలు కూడా ముఖ్యమే. కథను పాత్రను అర్థం చేసుకుని ఎవరికి వారు నటిస్తూ పోయేవాళ్ళం. సినిమాలో పాత్రలు పండాలంటే నటీ నటులు ముందు ఇగోను పక్కన పెట్టాలి. హాస్యనటులతో పనిచేస్తున్నా మా రోజుల్లో ఎవరిలోనూ ఇగోలుండేవి కావు. అసలా పదమే మాకు తెలియదు. ఎవరికి వారే పాత్రలో లీనమయ్యేవాళ్ళం. ఎదుటి వారి డైలాగులు ఎలా ఉన్నాయి, నా డైలాగులు ఎలా ఉన్నాయి అనే పోలిక ఉండేది కాదు.
ముఖ్యంగా ఆ రోజుల్లో కామెడీ అనేది కుటుంబాల్లో ఒక భాగంగా ఉండేది. రేలంగి- గిరిజ, పద్మనాభం- గీతాంజలి, రాజబాబు- రమాప్రభ... ఇలా హాస్యజంటలు ఉండేవి. ఈ పాత్రల ద్వారా ప్రేక్షకులకు ఏమి ఇవ్వాలో నటులకు తెలుసు, వారికేమి కావాలో ప్రేక్షకులకు తెలుసు. ప్రస్తుతం ఈ రెండూ కరువయ్యాయి. ఆ రోజుల్లో ప్రేక్షకులకు ఏమి కావాలో అది ఇచ్చాం, ఇప్పటి ప్రేక్షకులకు ఏది కావాలో అది ఇస్తున్నారు. ఈ పరిస్థితికి నేను ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు.
 మీరు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా చేసారు కదా .. మరి హీరోయిన్ గా ఎందుకు చేయలేదు ?
హీరోయిన్ గా చేసుంటే అవే వేయాలి. మరి ఇప్పటిదాకా కొనసాగుతున్నానంటే ఇలాంటి క్యారెక్టర్ లు వేయడం వల్లనే...!
మీ జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన చెప్తారా ?
హ హ హ... నిజంగా నాకేం గుర్తులేవండి. అన్నీ మర్చిపోయాను.
మీరు భలే గమ్మత్తుగా మాట్లాడుతారు...
చూడమ్మా పద్మిని... మనిషి ఎదిగే కొద్ది చేదు జ్ఞాపకాలు, తీపి జ్ఞాపకాలు, మర్చిపోలేని సంఘటనలు అంటూ ఏవి వుండవు. బుద్దుడు చెప్పినట్టు ‘మనిషి ప్రయాణం అనేది నిర్వాణం వైపు సాగాలి’. బహుశా నేనా దారిలోనే వున్నానేమో !
అసలు 72 ఏళ్ళ వయసులో ఏం జ్ఞాపకలుంటాయండి? స్వీట్ మెమోరీస్ అంటారు .. అంటే ఏంటి ? మనము ఆ మెమోరీస్ అనుభవిస్తున్న వ్యక్తులతో కూర్చుని సంభాషిస్తే అవి తీపి జ్ఞాపకాలు.
 అమ్మా.. ఇంత ఫిలాసఫీ చెప్తున్నారు. ఇంతకీ మీరేం చదివారు ?
నా దృష్టిలో ఎడ్యుకేషన్ అనేది , లైఫ్ కి ఎడ్యుకేషన్.  నేను ఒకటో క్లాస్ కూడా చదవలేదు. కానీ నేను 500 ఇయర్స్ నాటి బుక్స్ కూడా చదువుతా ! పుస్తకాలు నేనెక్కువ చదువుతాను. చందమామ చూసి తెలుగు, తమిళం చదవడం నేర్చుకున్నాను.
ఇప్పుడు ‘కళా పోషకులు’ అంటారు. అసలా మాట వింటేనే నాకు ఎలర్జీ. మనం డబ్బులు తీసుకుని నటిస్తున్నాం. మనమేంటి కళను పోషించడం ? ఆ కళే మనల్ని పోషిస్తున్నది. యుగ యుగాలుగా వున్న కళల్ని మనం పోషించేంత గొప్ప వాళ్ళమా ? ఆ మాటంటేనే వొణుకొస్తుందండి నాకు, ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా !
మీకు ఆధ్యాత్మిక పరంగా గురువెవరైనా వున్నారా ?
నాకు ఆధ్యాత్మికం అనేది నేచురల్ అండి. నా గురువు గారు...” ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ “. ఆయన తప్ప నా జీవితంలో వేరెవరు లేరండి. ఆయన తరువాత ‘బాబా’. నేను మాట్లాడే ప్రతి మాటా ఆయనదేనండి.
అమ్మా... “మీరు మనసు స్వచ్చంగా వుండాలి” అని సందేశం ఇస్తున్నారు.
నేను ‘స్వచ్చంగా వుండాలి’ అనడం లేదు. ‘నిజంగా ఉండండి అదే స్వచ్చం’ అంటున్నా.  మీరు ఏం చేస్తారో అది  వొప్పుకోండి. మీరు ఏది మాట్లాడుతారో అదే చేయండి. ఇదే స్వచ్చం.
మీరు ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తుంటారా ?
నేను ఎక్కువగా గురువు గారు వున్న ఒంగోలు వెళ్తుంటాను. అక్కడ అమ్మ దగ్గర ఒక రెండు మూడు రోజులుంటాను. ఇంకా గురువు గారు పుస్తకాలలో రాసిన చీరాల స్వామి, చివటం అమ్మ మొదలైన అవధూతలందరి దగ్గరకి వెళ్ళాను.
నిజంగా మీరు ఇంత మాయా ప్రపంచంలో వుండి, ఆధ్యాత్మికత వైపు రావడం... గురువు గారు చెప్పిన ప్రదేశాలు తిరగడం... ఇవన్నీ కూడా దైవానుగ్రహమేనమ్మా...!  
మీరు ఆధ్యాత్మిక సాధనలో మరింత ముందుకెల్లాలని... మీ లక్ష్య సాధనను చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...
మా కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు కృతజ్ఞతలమ్మా...!!!
  ***  

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top