నాకు నచ్చిన కధ(లు) దాంపత్యోపనిషత్ --శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కధ(లు) దాంపత్యోపనిషత్ --శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు

Share This

నాకు నచ్చిన కధ(లు) దాంపత్యోపనిషత్ --శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు  

టీవీయస్.శాస్త్రి  


మునిమాణిక్యం నరసింహారావు గారు ఇరవైయ్యవ శతాబ్దం మొదటి పాదంలో ఒక కథకుడిగా రూపుదిద్దుకున్నారు. కుటుంబ జీవితంలోని కష్టసుఖాలు, దాంపత్య జీవితంలోని సౌందర్యం ఈయన కథలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి. ఈయన సృష్టించిన కాంతం తెలుగు సాహిత్యంలోనే పెద్ద పీట వేసుకుని కూర్చుంది.
మునిమాణిక్యం నరసింహారావు గారు తెనాలి తాలూకా,సంగం జాగర్లమూడిలో మార్చి 15, 1898 న జన్మించారు.ఈయన తల్లిదండ్రులు వెంకాయమ్మ, సూర్యనారాయణ. ఈయన తెనాలిలో ఇంటర్మీడియెట్ చదివారు.డిగ్రీ చదవడానికి తాహతు లేకపోతే కొండా వెంకటప్పయ్య గారి ఆయన సహాయం వల్ల బిఎ చదివారు. ఆయన భార్య పేరు కాంతం కాదు ,శేషగిరి. ఆయనకు బందరు హిందూ హైస్కూలులో ఉద్యోగం వచ్చింది. ఆయనకు ఇద్దరు మగపిల్లలు. ముగ్గురు ఆడపిల్లలు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో ఉపాధ్యాయుడిగా మరియు ఆకాశవాణిలో పనిచేశారు. ఆయన రాసిన మొదటి నవల ‘టీకప్పులో తుఫాను’. ఇందులోనే మొట్టమొదటిగా కాంతం పాత్ర కనపడుతుంది. కాంతం కుటుంబం పేద కుటుంబం. కాంతం కథలలో ఒకటి ఆయన రేడియో నాటకంగా రాస్తే ఆయన కుమార్తె కాంతంగా వేసి అందరినీ మెప్పించింది.ఆయన "కాంతం కథల" కి ఆయన భార్యే ప్రేరణ, స్ఫూర్తి. నిజ జీవితంలోనే దాంపత్య సన్నివేశాలను, చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రాసినవి కాబట్టే ఇప్పటికీ కాంతం కథలు నిత్య నూతనమనిపిస్తాయి. ఇటువంటి ‘కాంతం’ చనిపోగానే ఆయన చాలా దిగులు చెందారు. వెంటనే ఎక్కువగానే ప్రేమించే పెద్దమ్మాయి రుక్కుతల్లి మరణించింది. దాన్ని తట్టుకోవడానికి రచనలు చేసేవారనిపిస్తుంది. కొంతకాలానికి రాజ్యలక్ష్మిని రెండవ భార్యగా
చేసుకున్నారు.తన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్ట స్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులు,హాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగు పాఠకులకు అందజేసేవారు.హాస్య రచయితలలో అగ్రస్థానం మునిమాణిక్యం గారిదే!అయితే ఆయన మాత్రం సవినయంగా భమిడిపాటి వారిదే ఆ స్థానం అని అంటారు!అది ఆయన సహృదయత!ఆయన వ్రాసిన 'దాంపత్యోపనిషత్' కధలను మనసు పెట్టి చదువుకుంటే నేటి యువతీయువకులు విడాకుల మాటే ఎత్తరు .సంసారాన్ని ఎలా రసభరితంగా చేసుకోవాలో చెప్పిన ఋషి ఆయన!గార్హస్త్య జీవితాన్ని గురించి ఆయన చెప్పినట్లు మరెవరూ చెప్పలేదేమో!
దాంపత్యోపనిషత్తు పుస్తకానికి  ముందు మాటగా ఆయన ఇలా చెప్పారు-- "హరిణీ ప్రేక్షణా యత్ర గృహిణీ న విలోక్యతే, సేవితం సర్వసంపద్భి రపి తద్భవనం వనమ్."---ఏ భవనములో కురంగీనయన అయిన గృహిణి కనబడదో, ఆ భవనము సకల సంపత్తులతో కూడుకొన్నప్పటికీ వనమే అవుతున్నది కానీ భవనము
కావడము లేదు. గృహానికి గృహలక్ష్మి ఉండాలె అన్నాడు పండితరాజు.దాంపత్య జీవితాన్ని గురించి రసమయంగా ఆయన అన్ని కధల్లోనూ చిత్రీకరించారు.ఆయనే ఇంకా ఇలా అన్నారు--"నా రచనలో ధ్వని ఉంది,ఔచిత్యముంది,ఉదాత్తత ఉంది,శ్రవణ సుభగత్వం ఉంది చూసుకోండి!ఉపమానాలు, ఉత్ప్రేక్షలు  లేకపోతేనేమీ, ఊపులున్నవి.వక్రోక్తులు లేకపోయినా వంపులున్నవి!నేను హాస్య విష్ణువును ,(బ్రహ్మ వేరే ఉన్నారు!*నా భావన-భమిడిపాటి వారు హాస్య బ్రహ్మ అని ఎంత చక్కగా చెప్పారో కదా!) ఇవన్నీ సరదాగా చెప్పుకుంటున్నాను!ఈ పుస్తకానికి ముందు మాటలో ఆయన,"జీవిత రమణీయము మహారాజుల ఉన్నత సౌధాలలోనూ, ఉద్యానవనాలలోనూ మాత్రమే కాక రసవిహీన మనుకొన్న సామాన్య గృహస్త జీవితంలో కూడా ఉన్నదని చూపడానికి నేను నా జీవితం అంతా ప్రయత్నించాను.ఈ పుస్తకం కూడా అట్టి ప్రయత్నానికి ఫలితమే! సంసారపు పాలకడలిని చిలకడములో చిందిన తుంపురులను పోగుచేయగా ఈ గ్రంథము తయారు అయింది.” అని అన్నారు .ఈ పుస్తకాన్ని ఎల్లాగ చదవాలె అన్న విషయాన్ని గురించి ఆయనవే రెండు మాటలు,"ఇది హాస్యగ్రంథము. ఆ విషయము గుర్తించి చదవండి. అంటే కాసేపు నవ్వుకొనడానికి సిధ్ధపడి మరీ పుస్తకం తెరవండి. విసుగుగా ఉన్నపుడు ఈ పుస్తకం చదవకండి. అసలు మంచి పధ్ధతి ఇది-వెన్నెల రాత్రి,ఆరుబయట రెండు పక్కలు వేసుకోవాలి.తెల్లని దుప్పటి మీద కాసిని మల్లెపూలు పోసుకోవాలి.తాంబూల చర్వణం కూడా పూర్తిచేసి,ఆవిడను వినమని ఈ పుస్తకాన్ని చదవాలి. అప్పుడే ఇద్దరు కలసి నవ్వుకుంటారు." అని చెప్పారు!  అసలు భార్యాభర్తల మధ్య విబేధాలు ఎందుకు వస్తాయి?వస్తే అనుభవజ్ఞులు ఎలా పరిష్కరించుకుంటారో ఆయన ఆ పుస్తకంలో హాస్యంగా  చెప్పారు."మీకూ, మీ భార్యకూ అభిప్రాయ బేధాలు రావా? వస్తే పొట్లాటలు లేకుండా ఏవిధంగా జరుపుకొని వస్తున్నారు?” అని నా స్నేహితులైన ఇంద్రగంటివారిని అడిగాను. (ఈ ప్రశ్న వేసింది మునిమాణిక్యం గారని వేరే చెప్పాలా!) ఇక ఆయన భాషలో ఆయన మాటలనే వ్రాస్తాను! ఇంద్రగంటి వారు మంచి పండితుడు, సాహితీపరుడు, మనస్తత్వ శాస్త్రము బాగా తెలిసినవాడు. సమాధానంగా ఆయన చెప్పింది ఇది:"నాకూ, నా భార్యకూ అభిప్రాయభేదాలు రాకుండా ఉండవు. వస్తూనే ఉంటవి. ఆవిడ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం కలిగి ఉన్నప్పుడే మేము భిన్నాభిప్రాయులము అవుతాము. భిన్న తత్వాలు గల అభిమతాలకు సంఘర్షణ ఏర్పడి తగవుగా పరిణమిస్తుంది. కాబట్టి అభిప్రాయభేదం వచ్చినపుడు నా అభిప్రాయం నేను ఆవిడతో చస్తే చెప్పను. ఇంక ఆవిడ ఏం జేస్తుంది? నోరు మూసుకుని ఊరుకొంటుంది. ఇదే నేను అవలంబిస్తూ ఉన్న మార్గం పోట్లాటలు లేకుండా ఉండడానికి.” అన్నారు."అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు నేనే నోరుమూసుకొని ఊరుకుంటాను” అని చాలా చమత్కారంగా చెప్పినారు గదా అని సంతోషించాను.ఆ తర్వాత కాటూరి వారిని ఇదే ప్రశ్న ఇలా అడిగాను, "ఏమండీ అన్నగారూ!మీ ఇంట్లో పోట్లాటలు లేవా?" అని.అందుకు ఆయన "లేవు.మేము ఎప్పుడూ పోట్లాడుకోలేదు"అని అన్నారు. నాకు వళ్ళు మండింది."అది ఎట్లా సంభవం అయిందండీ?మీ ఆవిడ అంత సుగుణవంతురాలా?వినయ సంపత్తి గలదా?మీరు చెప్పినట్లు వింటుందా?" అని అడిగాను!ఆయన ముఖం చిట్లించి విసుగుతో ,"నేను చెప్పినట్లు ఆవిడ వింటుందని ఎవరన్నారయ్యా!ఆవిడ చెప్పినట్లు నేనే వింటాను.ఏదైనా మాటామాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే, నేను వెంటనే, "దోషం గల్గె,నా వలన దోసిలి యొగ్గితి నేలుకొమ్ము నీ దాసుడ" అని 'ముట్టెద తత్పదద్వయిన్' " అని చెప్పి గబాగబా నడచి వెళ్ళిపోయారు!నేను నిర్ఘాంతపోయాను. ఇంకా నయం ,మా ఇంట్లో వ్యవహారం ఇంకా అందాకా రాలేదు కదా !అనుకున్నాను .దేవులపల్లి వారిని అడిగాను."ఏమండీ మీ ఇంట్లో సంగతి ఏమిటని,మీ ఆలుమగల మధ్య పోరు గానీ పోట్లాటలు గానీ లేవా?"అని."అమ్మో! నా ప్రియురాలితో పోట్లాట నేను భరించలేను!ఒక వేళ  వచ్చిందో నాకు దు:ఖం వస్తుంది.ఆ దుస్సహ గాఢ దు:ఖం నేను ఆపుకోలేను. ఏడుపు వస్తుంది. నా సంగతి నీకు ఈ మాత్రం తెలియదేం!మృదుల కరుణామధురము నా హృదయం. ఈ సంగతి ఎవ్వరికీ తెలియకపోయే!ఎవ్వరెరుగ జాలరు ఏమని ఏడ్తునెపుడు"అని చీత్కారం చేసి వెళ్ళిపోయాడు.బుచ్చిబాబు గారు ఇలా అన్నారు ,"తెలిసిన వాళ్ళ మాట తెలియని వాళ్ళు వినడం ధర్మం.మా ఆవిడ ఎప్పుడూ 'మీకేమీ తెలియదండీ!మీకీ మాత్రం తెలియదేమండీ!అంటూ ఉంటుంది. ఇలా ప్రతి రోజు చెవిలో నూరిపోయటం వలన నాకు ఏమీ తెలియదు అన్న నమ్మకం బాగా కుదిరింది.అన్నీ తెలిసిన విజ్ఞాన సర్వస్వం మా ఆవిడ.ఆవిడ మాట మెదలకుండా వినటమే నా పని.ఇక పోట్లాటలు ఎందుకు వస్తాయి?"  జమ్మలమడక వారు--"భార్యా భర్తల మధ్య పోట్లాటలు లేకుండా ఉండాలంటే,భర్త సంస్కృతం నేర్చుకోవాలి! నీవు సంస్కృతంలో మాట్లాడితే, ఆవిడకు అర్ధం కాదు. దాంతో గప్ చిప్ గా ఊరుకుంటుంది ఆవిడ! నేను అలాగే చేస్తున్నాను!" శ్రీరంగం నారాయణ బాబు--"భార్య అంటే ఏమిటో నాకు తెలియదు.నా అభిప్రాయం మీకు కావాలని గట్టి కోరిక ఉంటే,నాకొక పెళ్లి కూతురును చూడండి!కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత నా అభిప్రాయం చెబుతాను!"(శ్రీ రంగం నారాయణ బాబు గారు అవివాహితుడు)
*****
ఇలా మరికొందరిని కూడా అభిప్రాయాలను కూడా ఆయన అడిగారు!అందరూ చెప్పిన వాటిల్లో సారం ఒకటే!--భార్యా విధేయత్వం ఉంటే సంసారం సాఫీగా నడుస్తుందని అనుభవజ్ఞులు అయిన మీకు అర్ధమయే ఉంటుంది.ఒకవేళ  తప్పని పరిస్థితులలో పోట్లాడుకుంటే సిగ్గు(లేకుండా)విడచి లొంగిపోండి!అంతకన్నా ఏం చేస్తాం?నిజానికి అందరూ చేస్తుంది అదే కదా!మునిమాణిక్యం వారు నిజానికి పై కవులను ఈ ప్రశ్నలు అడిగారా?వారు అలానే సమాధానాలు చెప్పారా? అలా కాకపోతే ఇది ఒక అద్భుతమైన పేరడీ రచన! ఈయనను గురించి నేను చాలా విషయాలు గతంలో అనేక పత్రికల్లో వ్రాసాను.అవి కేంద్ర సాహిత్య అకాడెమీ వారి దృష్టికి కూడా వెళ్లాయి. ఈ కధక చక్రవర్తిని గురించి కేంద్ర సాహిత్య అకాడెమీ వారు నన్ను ఒక మోనోగ్రాఫ్ వ్రాయమని కోరారు.ఆయన రచనలను,జీవితంలోని అనేక విషయాలను చాలావరకు పరిశోధించాను.అకస్మాత్తుగా ఒక సంవత్సరం పైగా Spine టీబీ కారణంగా కేవలం మంచానికే పరిమితం కావటం వల్ల అది కార్య రూపం దాల్చలేదు. హాస్య రచయితల జీవితాల్లో ఎంత విషాదముంటుందో ఆయన జీవితమే ఒక ఉదాహరణ. ఆ మహనీయుని గురించిమోనోగ్రాఫ్ వ్రాయమని ఒక సామాన్యుడనైనా నాకు అవకాశం రావటమే గొప్ప విశేషం!నాకు గుర్తింపు తెచ్చిన ఈ కీర్తి శేషుడికి  హృదయపూర్వకంగా ఒక స్మృత్యంజలి ఘటించటం తప్ప ఇంకా నేనేమివ్వగలను? పైగా సాహిత్య అకాడెమీ వారి లేఖలో నన్ను 'డాక్టర్' అని కూడా సంబోధించారు!ఇంతకన్నా నాకు వేరే పురస్కారం ఏమి కావాలి?(ఆ లేఖను కూడా జత చేస్తున్నాను)
కధక చక్రవర్తి ముని'మాణిక్యం' వారికి నా స్మృత్యంజలి! 

No comments:

Post a Comment

Pages