Thursday, September 22, 2016

thumbnail

అల్లుడు ఆశాతీరింది - అత్త అప్పూ తీరింది

అల్లుడు ఆశాతీరింది - అత్త అప్పూ తీరింది

కె.వి.బి.శాస్త్రి


సుమారు 70 సంవత్సరాలక్రితం చిన్నవయస్సులోనే పెళ్ళిళ్ళు చేసేవారు. అలా జరిగిన పెళ్ళి వెంకప్పకి వెంకమ్మకి. పెళ్ళినాటికి వెంకప్పకి తొమ్మెదేళ్ళు, వెంకమ్మకి ఆరేళ్ళు. మేనరికం. వెంకప్ప మేనమామకూతురు వెంకమ్మ. సరె! పెళ్ళి అయింది. ఒక పండుగుకు వెంకప్ప వక్కడే అత్తవారింటిమి వచ్చాడు (బహుశా అదేవూరైవుంటుంది) ఆసమయానికి మేనమామ ఇంట్లో లేడు. అత్తగారు అల్లుడిని చూసి ఏరా వెంకప్పా! అంతా బాగున్నారా ఇత్యాది కుశలప్రశ్నలు వేసి ఒరే! మీ మామయ్య ఇంట్లోలేరు. నేను మడిగట్టుకొని వంట చేస్తాను. ఈలోగా కాసిని చక్కిలాలు పెడతాను తిను అని ఒక ఆకులో కొన్ని చక్కిలాలు వేసి వెంకమ్మా బావకు ఇచ్చిరావే అని పంపించింది. ఇదిగోరా బావా! ఇవి తిను. మంచినీళ్ళు అక్కడ చెంబులో వునాయి తాగు. చాలకపోతే బిందెలో వున్నాయి తీసుకో. నేను ఆడుకోడానికి పోతున్నా అని కొంతదూరం వెళ్ళి ఆగి, ఒరే నువ్వు అంట చేత్తో బిందె ముట్టుకునేవు. అమ్మ వీపు చిట్లకొడుతుంది. అని హెచ్చరించి తుర్రు మని పారిపోయింది. కస్సేపయ్యాక అత్త అటు వచ్చి ఏరా చక్కిలాలు తినలేదె? బాగులేవా? అని అడిగింది అత్తయ్యా  కాసిని పాలు కప్పులో పోసి యియ్యవే నల్చుకు తింటా అని అడిగాడు. అయితే పాలు వున్నవి కాసినీ తోడ్పెట్టేసింది. తోడుపెట్టేసింది. పాపం కుర్రకుంక మనసుపడి అడిగాడు అనుకొని, వుండు తెచ్చి యిస్తా అని దొడ్డి ప్రహరీ గోడదగ్గరకు వెళ్ళి సోమిదేవమ్మ పిన్నీ ఓ గ్లాసుడు పాలు ఇద్దూ సాయంత్రం పాలు పిండాక ఇచ్చేస్తా అని అడిగింది పక్కింటి పిన్నిగారిని. దానికేమమ్మా ఇస్తా వుండు అని సదరు సోమిదేవమ్మ పిన్ని లోపలకి వెళ్ళి ఒక గ్లాసుతో పాలు తెచ్చి ఇచ్చింది. ఇవి కాచినవేనమ్మా! పచ్చిపాలు లేవు అంది. ఫరవాలేదు పిన్నీ అని పాలు తీసుకొని ఒరే వెంకప్పా ఇదిగో పాలు అని వాడిముందు గ్లాసు పెట్టి లోపలకి వెల్లి కందదుంప తెచ్చుకొని కత్తిపీటముందువేసుకొని కంద చెక్కు తీయసాగింది. వెంకప్ప చక్కిలాలు ఒక్కొక్కటే పాలల్లో అద్దుకొని తన్మయత్వంతో తినసాగాడు. వాడు అలా తింటూవుంటే ముచ్చటేసింది అత్తకు. కాస్సేపటకి వెంకప్ప తినడం పూర్తి చేసి బాగున్నయి అత్తా చక్కిలాలు అని లేచి వెళ్ళి చెయ్యి కడుక్కొని మంచినీళ్ళు తాగి తనూ వీధిలోకి వెళ్ళాడు వెంకమ్మతో ఆడుకోడానికి. వాడు తిన్న చోట అత్త ఆకు తీసి అవతలపారేసి, శుద్ధి చేసి, పాలగ్లాసు తీసింది. ఒకసారి పాలగ్లాసుకేసి ఏమనుకుందో తిన్నగా దొడ్డ్లోకి వెళ్ళి ప్రహరీ గోడదగ్గరనుంచి సోమిదేవమ్మపిన్నీ అని పిలిచింది. ఆవిడ రాగానే ఇదిగో పిన్నీ పాలు అవసరం లేకపోయిందిలే అని గ్లాసు తిరిగి ఇచ్చేసింది. మధ్యాహ్నం వెంకప్ప మేనమామ వస్తూ వెంకప్పను చూసి ఏరా ఎప్పుడు వచ్చావు అని సమాధానం కోసం ఆగకుండా లోపలకి వెళ్ళాడు. వచ్చారా! త్వరగా స్నానం చేసి మడి గట్టుకోండి. వెంకాప్ప వచ్చాడు. ఆలీశం అయితే కుర్రకుంక ఆగలేడు అంది. అదేమిటే వాడికి తిండానికి ఏమన్నా పెట్టలేకపోయావా అని అడిగాడు ఆహా! వడికి చక్కిలాలు పెట్టా. నల్చుకు పాలు కావాలంటే సోమిదేవమ్మ పిన్నిని అడిగి తెచ్చి ఇచ్చాకూడాను అంది. సరే సాయత్రం పాలు తియ్యగానే గుర్తుకు పెట్టుకొని తిరిగి ఇచ్చెయ్ అన్నాడు అక్కర్లేదు. వాడి ఆశా తీరింది. నా అప్పూ తీరింది అంది నర్మ గర్భంగా! అదిగో! అప్పట్నించీ అల్లుడి ఆశా తీరింది, అత్త అప్పూ తీరింది అనే సామెత పుట్టిందిట. (ఈ కధా సంఘటనకు గోదావరి జిల్లా స్థలం అప్పుగా ఇచ్చిందిట)
*****

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information