Tuesday, August 23, 2016

thumbnail

శ్రీరామకర్ణామృతం -10

శ్రీరామకర్ణామృతం -10

                      డా.బల్లూరి(కామవరం)ఉమాదేవి.


81:  శ్లో:వామాంకోపరి సంస్థితావనిసుతా మాముక్త భూషోజ్జ్వలాం
పశ్యంతం పరిపూర్ణచంద్రవదనం భ్రాజత్కిరీటోజ్జ్వలమ్
ఆసీనం నవరత్న రాజఖచితే సింహాసనే రాఘవం
సుగ్రీవాంగద లక్ష్మణానిల సుతై రాసేవ్యమానం భజే
తెలుగు అనువాదపద్యము: 
మ:తన వామాంకమునం దలంకరణ సీతాలౌకనాసక్తుడై
ఘనరత్నోజ్జ్వల సత్కిరీటధరు రాకాచంద్ర బింబాస్యు గాం
చన సింహాసన సంస్థితున్ రవిజ పర్జన్యాత్మ సత్పౌత్ర పా
వని సౌమిత్రి సుసేవితుండగు రఘుస్వామిన్ భజింతున్ మదిన్.
భావము:అలంకారములచే ప్రకాశించుచున్న ఎడమతొడపై నున్న సీతను చూచుచున్నట్టియు,పూర్ణచంద్రునివంటి ముఖము కలిగినట్టియు,ప్రకాశించుచున్న కిరీటముచే శోభించుచున్నట్టియు నవరత్నములచే కూర్చబడిన
సింహాసనముపైకూర్చుండునట్టియు సుగ్రీవాదులచే
సేవిఃపబడుచున్నట్టిరాముని సేవించుచున్నాను.
82.శ్లో:జానక్యాః కమలాంజలి పుటేయాః పద్మరాగాయతో
న్యస్తా  రాఘవమస్తకే తువిలసత్కుంద ప్రసూనఅయితాః
స్రస్థాఃశ్యామలకాయకాంతకలితాయా ఇంద్ర నీలాయితాః
ముక్తాస్తాశ్శుభదాభవంతు భవతాం  శ్రీరామవైవాహికాః
తెలుగు అనువాదపద్యము:
చం:పరిణయవేళ సీత కరపద్మయుగస్థి మౌక్తికాళి క
య్యరుణమణిప్రభన్వెలసె యాజి తనూజుశిరంబునందు కుం
దరుచులుగల్గెరాము తను ధామముచేత వినీల
రత్నవిస్ఫురితములయ్యె దన్మణులుసుస్థిరసంపదలిచ్చు నిచ్చలున్.
భావము:ఏముత్యములు సీత యొక్కపద్మమువలె నిర్మలమైన దోసిలి యందు పద్మరాగమణులవలె నున్నవో రామునిశిరమున నుంచబడుచు మల్లెపువ్వులవలె నున్నవో రామునినల్లని దేహకాంతితో  కూడినవై యింద్రనీలముల వలె నున్నవో
అట్టి రామవివాహమందలితలంబ్రాల  ముత్యములు  మీకు శుభమునిచ్చునవి యగుగాక..
83.శ్లో: నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమ మధికం నీతి సుజ్ఞాన మంత్రం
సత్యం శ్రీరామ మంత్రం సదమలహృదయే సర్వదారోగ్య మంత్రం
స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమనస్సౌఖ్య సౌభాగ్యమంత్రం
పఠ్యం శ్రీరామ మంత్రం పవనజ వరదం పాతుమాం  రామమంత్రం.
తెలుగు అనువాదపద్యము:
ఉ:నిత్యము నిస్సమానమును నీతి వివేకము నిర్మలంబు నా
దిత్య శుభప్రదాయకము దీనజనార్తిహరంబు యోగి సం
స్తుత్యము సజ్జన ప్రకర తోషకరంబు  నంజనా
సత్యవర ప్రదంబురఘువర్యుని మంత్రము నన్ను బ్రోవుతన్.
భావము: సామ్యము లేనట్టియు గొప్పదియైనట్టి  నీతియు జ్ఞానమునుకల్గినట్టి  సత్యమైనట్టి ఎల్లప్బుడు నారోగ్యము నిచ్చునట్టి  స్తోత్రము చేయదగినట్టి  మంచిమనస్సుగలవారికి సౌఖ్యమునైశ్వర్యము నిచ్చునట్టి  ఆంజనేయునకు వరములనిచ్చునట్టి  శ్రీరామ మంత్రమునన్నునిత్యము  రక్షించు గాక.
84.శ్లో: వ్యామోహ ప్రశమౌషధం మునిమనోవృత్తి ప్రవృత్త్యౌషధం
దైత్యోన్మూలకరౌషధం భవభయ ప్రధ్వంస నైకౌషధం
భక్తాకరనందౌషధం త్రిభువనీ సంజీవనైకౌషధం
శ్రేయఃప్రాప్తికరౌషధం  పిబమనఃశ్రీరామ నామౌషధం
తెలుగు అనువాదపద్యము:
చ:భవభయ భేషజంబు రిపుభంజన మాశ్రిత తోషణంబు దా
నవవరసర్వగర్వహరణంబు మునీశ్వర సేవితంబు మో
హ విదళనంబు లోకనివహ ప్రకటోజ్జ్వల జీవనంబు నౌ
రవికుల రామనామక మహౌషధమున్ గృపనన్నుబ్రోవుతన్.
భావము:మోహమును శాంతింప చేయునట్టియు,మనోవ్యాపారము నడ్డగించునట్టియు రాక్ష., సులను పెల్లగించునట్టియు సంసార భయమును పోగొట్టి భక్తుల కానందము చేయునట్టియు మూడులోకము లను జీవింప జేయునట్టియు శుభప్రాప్తి చేయునట్టియు శుభప్రాప్తి చేయునట్టియు రామనామమను నౌషధము నోమనసా నీవు త్రాగుమా!
85.శ్లో:ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకంరంజితానంత లోకం
బాలం బాలారుణాక్షం భవముఖ వినుతంభావగమ్యం భవఘ్నం
దీవ్యంతం స్వర్ణ క్లుప్తైర్మణి గణనికరైర్భూషణై రుజ్జ్వలాంగం
కౌసల్యా దేహజాతం  వమమ హృదయగతం రామమీషత్ స్మితాస్యమ్.
తెలుగు అనువాదపద్యము:
మ:స్మితవక్త్రున్ గలుషా పహున్  సురముని శ్రేష్ఠసుతున్ శంకరా
ర్చితపాదున్ బరు కౌసలేయు సుజనవ్రీతిప్రదున్ భూషణాం
చితు బాలారుణ నేత్రు  భాస్కరకులున్ శ్రీరాఘవున్ లోక రం
జితునిన్ హృత్సరసీరుహాంతరంగున్ సేవింతు బ్రాతంబునన్.
భావము:దేవతలకధిపతియైనట్టియు సూర్యవంశ శ్రేష్ఠుడైనట్టియు ఆనందింప చేయబడిన  యెల్లలోకము గలిగినట్టియు పిల్లవాడైనట్టియు లోతసూర్యునివలె నెర్రనైన నేత్రములు గలిగినట్టియు శివాదులచే స్తోత్రము చేయబడి
నట్టియు హృదయమందు ధ్యానింప దగినట్టియు  సంసారబాధను పోగొట్టునట్టిదియు శ్రేష్ఠుడైనట్టియు, బంగారుతో చేయబడి మణులచే వ్యాప్తమైన యలంకారములచే ప్రకాశించునట్టియు కౌసల్యకు కుమారుడైనట్టియు నా హృదయమందున్నట్టియు చిరునవ్వుతో గూడిన ముఖము గలట్టియు రాముని ప్రాతఃకాలమందు ధ్యానము చేయుచున్నాను.
86:శ్లో:మధ్యాహ్నే రామచంద్రం మణిగణ లలితం  మందహాసావలోకం
మార్తాండానేక  భాసం మరకత వికరాకార  మానందమూర్తిం
సీతా వామాంకసంస్థం  సరసిజనయనం పీతవాసో వసానం
వందేహం వాసుదేవం వరశర ధనుషం మానసే మే విభాంతం.
తెలుగు అనువాదపద్యం:
మ:దరహాసేక్షణు దప్తకాంచనలసద్రత్నోజ్జ్వలాకల్పునిన్
శరకోదండ కరాంబుజున్ మరకతచ్ఛాయాభిరామున విభా
స్వరకోటిద్యుతి జానకీసహితు రాజశ్రేష్ఠు జాంబూనదాం
బరు శ్రీరాముని మధ్యమాహ్నమున సంభావించి నేమ్రొక్కెదన్.
భావము:మాణిక్య సమూహముచే సుందరుడైనట్టియు చిరునవ్వుతోగూడిన చూపులు గలిగినట్టియు బహుసూర్యులకాంతి  గలిగినట్టియు మరకతమణుల ప్రోగు వంటి యాకారము గలిగి నట్టియు యానంద స్వరూపుడైనట్టియు  నెడమతొడపైనున్న సీత గలిగినట్టియు,పద్మముల వంటి నేత్రములు గలిగినట్టియు పచ్చని వస్త్రమును ధరించినట్టియు నన్నిలోకములకు నివాసస్థానమైనట్టియు శ్రేష్ఠములైన ధనుర్బాణములు గలిగినట్టియు నామనమున ప్రకాశించుచున్నట్టియురామునిమధ్యాహ్నమున నమస్కరించుచున్నాను.
87:శ్లో:ధ్యాయే రామంసుధాంశుం నతసకల భవారణ్య తాపప్రహరం
శ్యామం శాంతం సురేంద్రం సురముని వినతం కోటిసూర్యప్రకాశమ్
సీతా సౌమిత్రి సేవ్యం సురనరసుగమమం దివ్యసింహాసనస్థం
సాయాహ్నే రామచంద్రంస్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్.
తెలుగు అనువాదపద్యము:
మ:శ్రిత పాపాటవివహ్ని లక్ష్మణ ధరిత్రి పుత్రికా యుక్తు నం
చిత చంద్రానను శాంతు దేవముని సంసేవ్యున్ వినీలాంకృతిన్
స్మితవక్తృన్  రవికోటి సన్నిభు మణిసింహాసన స్థాన సం
స్థితు శ్రీరాము దినాంతమందు మది నేచింతింతు నిష్టాప్తికిన్
భావము:చంద్రునివలె నున్నట్టి నమస్కరించువారికి సంసారారణ్యబాధనంతయు హరించునట్డి నల్లనైనట్టి శాంతుడైనట్టి దేవతలకధిపతియైనట్టి దేవతలచే మునులచేనమస్కరింపబడునట్టి  కోటిసూర్యుల కాంతి వంటి కాంతికలిగినట్టి సీతాలక్ష్మణులచే సేవించ బడుచున్నట్టి దేవతలకు..మానవులకు సులభుడైనట్టి సింహాసనమునందున్నట్టి  నవ్వుచే సుంపరమైనమోము గలరామును సాయంకఅలమునందు ధ్యానించు చున్నాను.
88.శ్లో:కేయూరాంగద కంకణైర్మణిగణైర్వైరోచనం సదా
రాకాపార్వణ చంద్రకోటి సదృశంఛత్రేణ వైరాజితం
హేమస్తంభన సహస్ర షోడశ యుతే మధ్యే మహామండపే
దేవేశం భరతాదిభిఃపరివృతం రామం భజే శ్యామలమ్.
తెలుగు అనువాదపద్యము:
మ:పదియాఱ్వేల పసిండి కంబములచే భాసిల్లు గేహంబునం
దుదయాంచ త్పరిపూర్ణచంద్ర సదృశున్ యోగీంద్ర సంసేవ్యు నం
గద కోటీర విభూషణున్ భరతముఖ్యా భ్రాతృసంసేవితున్
సదయాత్మున్ రఘురాము నీరద ఘనశ్యామున్ దలంతున్ మదిన్.
భావము:నిత్యము కంకణకేయూర మణిసమూహములచే ప్రకాశించుచున్నట్టి కోటి పూర్ణచంద్రులతో సమానుడైనట్టి గొడుగుచే ప్రకాశించునట్టి పదియారువేల బంగారు స్తంభములతో కూడినమంటపమధ్యమందున్నట్టి దేవతలకధిపతియైనట్టి భరతాదులచే నావరింపబడినట్టి  నల్లని వాడైనట్టి రాముని సేవించుచున్నాను.
89:శ్లో: విహాయకోదండ మిమం ముహూర్తం
గృహాణ పాణౌమణి చారువేణుమ్
మాయూర బర్హం చ నిజోత్తమాంగే
సీతాపతే రాఘవ రామచంద్ర.
తెలుగు అనువాదపద్యము:
మ:శరచాపంబులు మాని బర్హమణివంశంబుల్ శిరంబందు స
త్కర యుగ్మంబున బూనగా దగు ముహూర్తంబున్ రఘూత్తంస భా
భాస్కరవంశాంబుధి పూర్ణచంద్ర నగరక్షా దక్ష కంజాక్ష భూ
వరమౌళిస్థ కరీట రత్నవిలసత్పాదాబ్జ రామప్రభూ.
భావము:సీతాపతియగు ఓరామా క్షణకాలముచేతియందలి ధనుస్సును విడిచి మణులచేసుందరమగు పిల్లనగ్రోవిని నీశిరమున నెమలిపింఛమునుధరించుము.
90: శ్లో:శుద్ధాంతే మాతృమధ్యే దసరథపురతః సంచరంతంపరం తం
కాంచీదామానువిద్ధప్రతిమణివిలసత్ కింకిణీ నిక్వణాంగం
ఫాలే ముక్తాలలామం పదయుగ నినదంనూపురంచారుహాసం
బాలంరామంభజేహం  ప్రణత జనమనఃఖేదవిచ్ఛేద  దక్షమ్.
తెలుగు అనువాదపద్యము:
ఉ:అంతిపురంబునన్ దశరథాధిపు ముంగల మాతృమధ్యమం
దెంతయు నాటలాడు తరి హేమమణీయుత నూపురంబులా
క్రాంత నితంబ ఘంటికలు రంజిల ముత్యపు రావి రేకయున్
వింతగచెన్నుమీరు రఘువీరకుమారు నుదారు నెన్నెదన్.
భావము:అంతఃపురమున తల్లులమధ్య నుండి దశరథునియెదుట సంచరించున్నట్టి యుత్కృష్టృడైనట్టి మొలత్రాటి యందు కూర్చబడిన మణులచేత నొప్పు మువ్వలచప్పుడుతో కూడినశరీరము కలిగినట్టియు నుదుట ముత్యాలచేరుచుక్క గలిగినట్టి  పాదములయందు ధ్వనిచేయుచున్న అందెలుకలిగినట్టి సుందరమైన నవ్వు గలిగినట్టి నమస్కరించు జనుల మనస్సున గలబాధను పోగొట్టుట యందు సమర్థుడైనట్టి  బాలుడైనరాముని సేవించుచున్నాను.
( సశేషం. )

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information