శ్రీ మద్భగవద్గీత - అచ్చంగా తెలుగు

శ్రీ మద్భగవద్గీత

Share This

 శ్రీ మద్భగవద్గీత

రెడ్లం రాజగోపాలరావు.  

 Ph: 09482013801


అవతార పురుషుడైన శ్రీ కృష్ణ పరమాత్మ దివ్యగానము ద్వారా మానవాళికి తెలియజేసిన ఆధ్యాత్మిక భాండాగారము భగవద్గీతభారతీయ సనాతన సంపదే భగవద్గీతయనుట అతిసయోక్తిగాదు. ప్రతి సంవత్సరము జయంత్యుత్సవములు జరిపించుకునే ఒకే ఒక గ్రంధరాజము భగవద్గీత.
గీతది మాతృహృదయము ప్రపంచ మానవాళి తన బిడ్డలు.తన పిల్లలకు శాశ్వతమైన ఆధ్యాత్మిక సంపదనిచ్చుటే తన లక్ష్యము. వర్తమానంలో మనకు లభించే శ్లోకముల సంఖ్య 700. గీతలో ఎక్కడా ఏ సందర్భంలోనూ మత ప్రస్తావన కనబడదు. సర్వజనులపై సమతాభావాన్ని ప్రసరించిన కరుణామూర్తిఇట్టి  గ్రంధాన్ని పూజా మందిరంలో పూజించే గ్రంధంగా భావిస్తుంటారు అది తప్పు భగవద్గీత జన్మించిన ఈ పుణ్య భూమిలో పుట్టుట మన భాగ్యము. క్షీరసాగరాన్ని మధించినట్లే, భగవద్గీతలో శ్లోకములు తరచిన కొద్దీ నూతనంగా జ్ఞానసంపద బయటపడుతుంది. ప్రస్థాన త్రయంలో భగవద్గీతదే ముఖ్యపాత్ర వేదాలు ఉపనిషత్తుల సారాన్ని యోగాచార్యుడైన శ్రీ కృష్ణ పరమాత్మ అర్జనుని నిమిత్తమాత్రునిగా జేసి గీతగా మనకందించాడు.
మానవుని దైనందిన జీవనానికి ఆధ్యాత్మిక ప్రగతికి ధర్మసమ్మతమైన పరష్కారమార్గాన్ని నిర్దేశిస్తుంది భగవద్గీత. లెక్కకు మిక్కిలి స్వదేశీ విదేశీయులు ఈ తల్లి ఒడిలో సేదదీరి ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకున్నారు. వివిధ భాషలలో వేలాదిగా అనువాదాలు వచ్చాయిమహనీయులెందరో గీతను అనువదించారుకానీ గీతకు భాష్యం చెప్పగల మొనగాడు ఒక్క శ్రీ కృష్ణ పరమాత్మ మాత్రమే.
ప్రస్తుత సమాజాన్ని పీడిస్తున్న ఉద్రిక్త పరిస్థితులకు, ఊపిరిసలుపని జీవన విధానానికి చక్కని పరిష్కారాన్ని నిర్దేశించేది భగవద్గీతకృష్ణ పరమాత్మ . ప్రసాదించిన ఈ బిక్ష పాఠకదేవుళ్ళతో పంచుకోవాలనే చిన్న ప్రయత్నాన్ని ఆమోదించి ఆస్వాదించాలని మనవి. 18 అధ్యాయాల ఈ రాశిలో వాసికెక్కిన ముఖ్య శ్లోకాలు, వాటి నిగూఢమైన అర్ధాలు నేను నమ్మిన నా దైవానికి నివేదిస్తూ మీకు వివరిస్తున్నాను.
మొదటి అధ్యాయము
అర్జున విషాదయోగము
                                                 
                                               నకాంక్షే విజయం కృష్ణ
                                                నచ రాజ్యం సుఖానిచ
                                                కిం నో రాజ్యేన గోవిందా
                                                కిం భోగై ర్జీవితే నవాః                32 వ శ్లోకం
 విషాదాన్ని కూడా యోగంగా మార్చడం భగవంతునికే చెల్లుతుంది. నిజానికి దైవార్పిత భావంతో కర్మలనాచరించినప్పుడు వాటి ఫలితము మనపై ప్రసరించదు. "ధర్మ" శబ్ధంతో ప్రారంభమైన ఈ అధ్యాయము 31 వ శ్లోకం వరకు యుధ్ధానికి సిధ్దమైన ఇరు సైన్యముల బలాబలములు, ముఖ్య యోధుల వివరములు వారి వారల యుధ్ధములను వివరించినది. 32 వ శ్లోకమున అర్జనుని వైరాగ్యము తీవ్ర స్థాయికి చేరి నాకు విజయము వద్దు రాజ్య సుఖము వద్దు. యధ్ధములో సంహరించిన యోధుల నెత్తురుతో కూడిన రాజ్యము గాని, భోగము గాని వద్దు అన్నాడు. నిజానికి పూర్ణ వైరాగ్యము గల మనుజుడే బ్రహ్మోపదేశమునకర్హుడు. అర్జునునకు బాహ్య  శుఖములశాస్వతములని నిత్య సంతోషాన్ని పొందగలిగే మార్గాన్ని తెలుసుకోవాలని  మనసున జనించినది ఘటనా ఘటన సమర్ధుడగు శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుని బ్రహ్మోపదేశమునకర్హుడని దలచి ఉపదేశమును ప్రారంభించు చున్నాడు. మానవుని సాధనా వృక్షానికి వైరాగ్యమే బీజము  వైరాగ్యమనగా సంసారమును విడిచి కాషాయవస్త్రాలు ధరించి కొండల్లో అరణ్యాలలో చేరడం కాదు “బ్రహ్మ సత్యం జగన్మిధ్య” అనే విషయాన్ని ద్రుఢంగా విస్వసించి తైలధార వంటి భక్తి కలిగి యుండటం.
   రెండవ అధ్యాయము
  సాంఖ్యయోగము
సర్వజీవులలో సాక్షీభూతుడైన ప్రత్యగాత్మను జ్ఞాన విచారణతో తెలియటమే సాంఖ్యము. ఈ ఆత్మ తత్వమును వివరించునది గావున ఈ అధ్యాయమునకు సాంఖ్యయోగమను పేరు. నిజానికి భగవద్గీత యందు ప్రతి శ్లోకము ముఖ్యమైనదే. వ్రాయుటకు నాకు, చదువుటకు పాఠకులకు ఇంచుక సౌలభ్యము కూర్చుటకై ప్రతియధ్యాయము నుండీ అతి ముఖ్యమైన శ్లోకములనే విపులీకరించడమైనది.
శ్రీ భగవానువాచ :
                                     అశోచ్యా నన్వ శోచస్త్వం
                                       ప్రజ్ఞా వాదాంశ్చ భాషసే
                                       గతాసూ నగతా సూంశ్చ
                                       నాను శోచన్తి పణ్డితాః                     11 వ శ్లోకం
గీతా బోధ ఈ శ్లోకము నుండీ  ప్రారంభమగుచున్నది. భగవంతుడు చెప్పెను. అర్జునా జ్ఞానులగు వారు మరణించిన వారి గూర్చి గాని దుఃఖింపరు. అశాస్వత విషయమై పండితులు దుఃఖింపరు. దృశ్యమాన జగత్తంతా అశాస్వతమైనది. కావున నీ దుఃఖమనుచితమైనది.
                             దేహి నోస్మిన్ యధా దేహే
                             కౌమారం యౌవనం జరా
                             తధా దేహాంతర ప్రాప్తి
                             ర్ధీరస్త త్రన ముహ్మతి                              13 వ శ్లోకం
 ఉపాధి పొందిన జీవుని ఉపాధికి బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఎట్లు సంభవించు చున్నవో అట్లే సుష్కించునుపాధికి మరణము సంభవించు చున్నది. వివేకవంతుడైన మనుజుడు దేహమనుభవించు పరిణామ దశలకెన్నడును దుఃఖించుట లేదు. మరణమునకు మాత్రము ఏల దుఃఖించాలి. పరిణామ క్రమములో మరణము కూడను ఒక దశ. కీలకము నెరిగిన మహనీయులెన్నడును దుఃఖింపక ధీరులైయుందురు. ఇందుకు కొన్ని ఉదాహరణలు.
శ్రీ రమణ మహర్షులవారు అంత్యకాలమున వీపుపై వ్రణము సంభవించి, కృష్ణ పక్షపు చంద్రునివలె దినదినమునకు శరీరము తరిగిపోవుచున్నను కించిత్తు బాధను వ్యక్తము చేయక ధీరులై మృత్యువును ఆహ్వానించిరి.
మహాత్మాగాంధీ గార్కి హెర్నియా శస్త్ర చికిత్స చేయునపుడు డాక్టర్లు మత్తు (Anesthesia) ఇంజక్షను ఇస్తామంటే ఆ కర్మయోగి సున్నితంగా తిరస్కరించి బాధను భరించిన జితేంద్రియుడు.                       
(సశేషం)                       

No comments:

Post a Comment

Pages