సినిమా పాటకు ఓ గౌరవాన్ని కలిగించిన  సంగీత పెన్నిధి...    శ్రీ కె.వి.మహాదేవన్

మధురిమ 


సినిమా పాటను  స్వరపరచడానికి కేవలం సంగీతానికేకాక సాహిత్యానికి కూడా ప్రాధాన్యతనిచ్చి,శాస్త్రీయ సంగీత పునాదులపైనే సినిమాసంగీతాన్ని  నిర్మించి...గాయనీ గాయకులకు పాటలు పాడటంలో ఎంతో స్వాతంత్రయాన్ని ఇచ్చి,తన దగ్గర పనిచేసే సహాయ దర్శకులకు కూడా విన్నూతన ప్రయోగాలకు అవకాశాన్ని ఇచ్చిన మహోన్నత వ్యక్తీ..సంగీత  శక్తీ …మరెవరో కాదు సుమారు 600 ల తెలుగు,తమిళ,మళయాళ  సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన  శ్రీ కె.వి మహాదేవన్.
వీరి పూర్తి పేరు " కృష్ణకోయిల్ వెంకటాచలం మహాదేవన్"అయినప్పటికీ "మామ"అని సినీ పరిశ్రమలో అందరిచేత అభిమానంగా పిలిపించుకున్న వారు.మహాదేవన్ గారు 1918వ సంవత్సరం లో తమిళనాడులో కన్యాకుమారి జిల్లాలో నాగర్కాయిల్ కి దగ్గరగా ఉన్న  కృష్ణకోయిల్ అనే కుగ్రామంలో జన్మించారు.
చిన్నపటినుంచీ శాస్త్రీయ సంగీతం పై విశేషమైన అభిమానం కలవారు కాబట్టే సినీ సంగీతంలో దాన్ని అంత అద్భుతంగా  ఉపయోగించగలిగారు.వారికి చలనచిత్ర పరిశ్రమలో మొట్టమొదటి అవకాసం "మనోమణి" అనే తమిళసినిమా ద్వారా లభించింది. ఇక అప్పటినుంచీ వెనక్కి తిరిగి చూడ వలిసిన అవసరమే లేకుండా సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ  సంగీత ప్రయానంలో 600 కి పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు.
ఈ ప్రయాణంలో వారి మాతృభాష అయిన తమిళంలోనే కాకుండా తెలుగు,కన్నడ,మళయాళం ఇలా అన్ని దక్షిణాదిభాషలలో తనసంగీత సుమగంధాలను వ్యాపింపచేసి ,పాటలనే పరిమళపుష్పాలను విరబూయించిన సంగీతశిఖర మహాదేవుడు మన మహాదేవన్ గారు . అటు జానపద సంగీతమైనా,ఇటు లలిత సంగీతమైనా లేక సుస్వరాలతో నిండిన శాస్త్రీయ సంగీతమైనా,ఏరకమైన సంగీతాన్నయినా... సామాన్యుడి హృదయాంతారలలోకి దానిని తీసుకువెళ్ళ గలిగిన సామర్ధ్యం మన మహాదేవన్ గారిది. ఇలా పండితులనే కాదు సంగీతం అంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆయన పాటలను అంత ఆస్వాదించడానికి గల కారణం ఏమిటంటే... వారు మొట్టమొదటగా సాహిత్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు..తన దగ్గరికి వచ్చిన పాట యొక్క సాహిత్యానికి అణుగుణంగా నే బాణీలను సమకూర్చేవారు... సంగీతపు మోతలో సాహిత్యం కనుమరుగైపోకూడదని విశ్వసించిన మహనీయుడు శ్రీ మహాదేవన్.
వారు శాస్త్రీయసంగీతాన్ని జనరంజకంగా...సామాన్య ప్రజానీకానికి అందించిన మహాదేవుడే...అందుకే కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ వంటి దర్శకులతో అన్ని సంవత్సరాలు పనిచెయ్యగలిగారు..విశ్వనాథ్  గారి సినిమాలంటే..."కళ గురించి...కళకోసం..కళాతృష్ణతో...కళాదృష్టితో తీసినవని" అని ప్రతీ తెలుగువాడు మనసా,వాచా ,కర్మణా నమ్మితీరుతాడు. మరి అలాంటి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన చాల సినిమాలకు మహాదేవన్ గారే సంగీత దర్శకులు...కొన్నిటికి  మహాదేవన్ గారు  సంగీతం  అందించలేకపోవడానికి కారణం  ఆ సమయంలో వారి ఆరోగ్యం సహకరించకపోవడమే..
1942లో తనకు లభించిన మొట్టమొదటి అవకాశం మనొమణి దగ్గరనుంచీ ప్రతీ సినిమా ఒక మొదటి ప్రయత్నం లానే ఒక దీక్షలాగా సంగీతం సమకూర్చేవారు కాబట్టే.. ఎం.ఎస్.విశ్వనాథన్,టి.కె. రామ్మూర్తి వంటి సమకాలీకుల మధ్య తనకంటూ ఓ ప్రత్యేకమైన  స్థానాన్ని ప్రేక్షకుల యదలో పదిలపరుచుకుంటూ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాధించడం అంటే ఎంత గొప్ప!
తెలుగులో వీరు సంగీతం సమకూర్చిన మొట్టమొదటి సినిమా 1962లో విడుదలైన "మంచి మనసులు." ఆదుర్తి సుబ్బారావు గారు,సావిత్రిగారు,నాగేశ్వరరావుగారు,మహాదేవన్ గారు వంటి మంచి మనసులున్న మనుషులందరూ కలిసి పనిచేసిన సినిమా కాబట్టే ఆ చిత్రం అంత విజయం సాధించింది మరి...ఈ చిత్రం యొక్క విజయంలో మహాదేవన్ గారి సంగీతం యొక్క పాత్ర గురించి కూడా విశేషంగా చెప్పుకోవాలి..అటు జానపద బాణీలనుండీ(మామ మామ మామా,ఎంతటక్కరి వాడు),యుగళగీతం(నన్ను వదలి నీవు పోలేవులే)మొదలుగుని..శిలలపై శిల్పాలు చెక్కినారు అంటూ సాగే చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని తెలిపే పాట వరకూ...ప్రతీ పాట ఓ విశేషమైన పాటే...
1962లో మంచి మనసులు తరువాత 60వ దశకంలో మూగమనసులు(1964),అంతస్థులు(1965),మనుషులు మారాలి (1969),ఆ తరువాత 70వ దశకంలో బడిపంతులు(1972),బంగారు బాబు,అందాల రాముడు(1973)ఇలా ఇన్ని మంచి సినిమాలు చేసారు..అయితే 1976లో విడుదలైన కళాతపస్వి విశ్వనాథ్ గారి "సిరి సిరి మువ్వ" మహాదేవన్ గారి సంగీత ప్రతిభకు, పాండిత్యానికీ ఓ మచ్చు తునక...ఘుమ్మంది నాదం అనడమూ ,ఎవరికెవరు ఈలోకం లో అంటూ వేదాంతసారాన్ని స్వపరచడమూ వారికే చెల్లింది మరి. ఇక సిరిసిరి మువ్వ తరువాత అడవిరాముడు,మనఊరి పాండవులు వంటి వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేసి తాను అన్నిటిలోనీ దిట్ట అని నిరూపించుకున్నారు... మన మహాదేవన్ గారు..
మహాదేవన్,మరియు విశ్వనాథ్ గారి జీవితాలకి పర్యాయపదం గా నిలిచే సినిమా "శంకరాభరణం".ఈ సినిమా సంగీతం ఎందరో మమూలు మనుషులిని కూడా సంగీతం నేర్చుకుని విద్వాంసులవ్వాలనుకునేలా ఉత్తేజ పరిచింది అనడంలో ఏటువంటి అతిసయోక్తి లేదు. శంకరుడు నాదప్రియుడు...కాని నాదమే నీ శరీరమని రచించిన మన వేటూరి వారి మాటకు..దానికి స్వరం సమకూర్చిన మన మహాదేవన్ గారి పాటకు ఆ "మహాదేవుడి" శిరస్సు  పరవశంతో ఊగగానే..ధరకు జారక ఆ శివగంగ ఇంకెక్కడికి వెళుతుంది మరి??
"దొరకునా ఇటువంటి సేవా" అని మహాదేవన్ గారు తన బాణీలను శంకరుడికి ఆభరణాలుగా సమర్పించిన కళాఖండం ,దృశ్య కావ్యం శంకరాభరణం. ఇక ఆతరువాత వంశవృక్షం (1980) వంటి బాపు గారి అపూర్వమైన ,అనితరసాధ్యమైన చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు మహాదేవన్ గారు. శంకరాభరణం తరువాత విశ్వనాథ్ గారి మైత్రిలో వచ్చిన మరో సంగీత ప్రధానమైన చిత్రం సప్తపది(1981).ఈ చిత్రం లో అఖిలాండేస్వరి,చాముండేస్వరి  పాట అలా కళ్ళుమూసుకుని ఓ ధ్యానం చేస్తున్నట్లు గా వింటే ...ఎటువంటి వారికైనా ఆ జగన్మాత  సాక్షాత్కారం లభిస్తుంది అన్నది నిజం.అంత అద్భుతమైన సంగీత సాహిత్యాలు ఉన్నాయి ఆ పాటలో..
విశ్వనాథ్ గారితో మహాదేవన్ గారు తరువాత పనిచేసిన చిత్రాలు సిరివెన్నెల(1986),శృతిలయలు(1987)....సిరివెన్నెల చిత్రంలోని పాటలు శరత్కాలంలో వెన్నెలా ప్రేక్షకులను ఓలలాడిస్తే..శృతిలయలు చిత్రం లో అన్నిపాటలు కూడా ప్రేక్షకులపై సుస్వరాల జడివానలే కురిపించాయి.మహాదేవన్ గారు సినిమా సంగీతాన్ని సమకూర్చేవారైనా..ఆయన శాస్త్రీయ సంగీత విద్వాంసులతో..సాటి,మేటి అని ఆ పాటలు నిరూపించాయి.
ఆ తరువాత మహాదేవన్ గారు జానకిరాముడు,అల్లుడుగారు వంటి సినిమాలు చేసి సంగీతం తో వారు  ఏదైనా  చెయ్యగలరని మరోసారి నిరూపించారు.. ఇక ఆ తరువాత బాపు గారి దర్శకత్వంలోనే  వచ్చిన  పెళ్ళిపుస్తకంలో పాటలు కూడా ప్రేక్షకులకీ ఎప్పుడూ మధురగీతాలే.. 1992లో విశ్వనాథ్ గారితో చివరిసారిగా పనిచేసిన సినిమా "స్వాతి కిరణం".ఈ చిత్రం లో ప్రతీ పాట ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా స్వరపరిచారు ఆయన.
సానపెడుతున్న కొద్దీ వజ్రం మెరుపు ప్రపంచానికి తెలుస్తుంది..అలానే విశ్వనాథ్ గారి సినిమాలు చేసినకొద్దీ ఒక్కో సినిమాకీ మహాదేవన్ గారి సంగీత ప్రతిభ ఆయన పాటలలో మనకి అలానే కనిపించాయి.. వినిపించాయి..ఇంకా మనచెవులలో  ఆ మధుర కృతులు అలా మారుమ్రోగుతూనే ఉన్నాయి కూడా.. శృతి నీవు,కృతి నీవు అన్నా,శివాని భవాని అని ఆ అమ్మని నోరారా పిలిచినా, ఆనతినీయ్యరా హరా అని ఆ హరుడిని ప్రార్ధించినా...అన్ని పాటలు గొప్పవే..
1993లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన శ్రీనాథ కవిసార్వభౌముడు మహాదేవన్ గారు సంగీత దర్శకులుగా పనిచేసిన చివరి చిత్రం.. 1993 లో వారి ఆరోగ్యం తీవ్రం గా దెబ్బతినడంతో వారు ఇక సంగీత దర్శకత్వం చెయ్యడం విరమించారు..వారి ఆరోగ్యం సహకరించి వారు ఇంకొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తే ఇంకెన్ని మధురమైన పాటలు వినే అదృష్టానికి మనం నోచుకుని ఉండేవారమో... 1942లో మొదలైన వారి సినీ సంగీత మహాప్రస్థానం 1992 వరకు అలా  600 చిత్రాలకు సంగీతదర్శకత్వం చేసే వరకూ 40 సంవత్సరాలు  నిర్విరామంగా  కొనసాగింది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో 1967లో తాను సంగీత  దర్శకత్వం వహించిన తమిళ చిత్రం కందన్ కరుణై కి గాను ఉత్తమ సంగీత దర్శకులుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. 1967లో భారత ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రవేశ పెడితే దాన్ని మొట్టమొదటగా అందుకున్న  ఘనత కూడా వీరిదే. 1969లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చే ఉత్తమ సంగీత దర్శకులిగా పురస్కారం 1980లో శంకరాభరణం చిత్రానికి రెండవసారి జాతీయ పురస్కారం. 1980లో శంకరాభరణానికే ఆం.ప్ర  ప్రభుత్వం చే నందీ పురస్కారం 1987లో శృతిలయలు చిత్రానికి సంగీతదర్శకునిగా  నందీ పురస్కారం 1991లో మంజీర నాదం  చిత్రానికి గాను ఉత్తమ సంగీత  దర్శకులుగా  ముచ్చటగా మూడవసారి నందీ పురస్కారం. 1992వ సంవత్సరంలో "స్వాతి కిరణం" చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లభించింది. పరిపూర్ణమైన నిండు జీవితాన్ని గడిపిన మహాదేవన్ గారు 2001వ సంవత్సరం జూన్ 21వ తేదీన  83ఏళ్ళ వయసులో ఆ మహాదేవుడిని తన సంగీతంతో సేవించికోవడానికి ఆ నాదశరీరుణిలో లీనమైనారు. సుస్వరమైన సంగీతాన్ని విని ఆనందించి,ఆశ్వాదించే మంచి మనసులు ఉన్న మనుషులు  ఈ భూమి పై ఉన్నంత వరకూ ఆయన పాట ఆలయం లో ఘంటానాదంలా  మన హృదయాలలో మోగుతూనే ఉంటుంది.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top