గోడలు - అచ్చంగా తెలుగు

గోడలు

Share This

గోడలు

-పోడూరి శ్రీనివాసరావు

  9849422239


కొనగోటితో మీటి చూడు హృదయాన్ని
కోటి వీణలు మ్రోగుతాయి.
సుతిమెత్తని చేతులతో
తడిమిచూడు హృదయాన్ని
వర్ణభరిత రంజిత
అందాల చిత్తరువు కనిపిస్తుంది
అనురాగ పూరిత వాక్కులను
వినిపించు హృదయానికి
ప్రేమకావ్యం ఆవిష్కరింపబడుతుంది.
నా హృదయమంత సుమసదృశం...
ఇదంతా గతం...
మరినేడో
బండబారిన నా గుండె
కఠినశిలగా మారిపోయింది.
ఎన్ని సమ్మెటపోట్లను తిన్నా
పగలనంత కఠినంగా మారిపోయింది.
మన్మథుని పూలబాణాలు సైతం
నా గుండె గోడను తాకి
నేలరాలిపోయాయి....నిష్ప్రయోజనంగా
కొనగోటమీటితే – భీకరశబ్దాలు వస్తున్నాయి.
అనురాగాపూరిత వాక్కులు
హాలాహాల సదృశాలవుతున్నాయి.
తడిమి చూసిన చేతులకు
రంగులు అలుముకుపోయి
భీభత్స దృశ్యాలు గోచరిస్తున్నాయి.
గతంలోని సౌశీల్యం-సౌహార్ద్రత
ఏమైనాయి?
ఎందుకీ వింత మార్పు??
ఒకటి కాదు..రెండు కాదు...
తెరలు తెరలుగా పెనవేసుకున్న
అనుమానపు పొరలు
నా గుండెను రక్షణ కవచంలా
అల్లిబిల్లిగా చుట్టుముట్టాయి
కానీ ఈ పొరలు నా గుండెకు
రక్షణ ఇవ్వడానికి కాదు.
పెన్నాగులై కాటువేయడానికి
అస్థిరతతో గుండెవేగం పెరుగుతోంది
రక్షకభటుల్లా పహారాకాస్తున్న
అసూయ,అనుమానం,అసహనం
నా గుండెను అమృతవాక్కు,
ఆహ్లాద వాతావరణ బారుల నుండి
దూరం చేస్తున్నాయి!!!
నేను అంతర్లీనంగా చూస్తూండగానే
నా గుండె చుట్టూ కట్టబడిన ప్రహారగోడ
చైనాగోడంత పెద్దదయిపోతోంది.
బ్రహ్మాండంగా పెరిగిపోతోంది.
రాక్షసరాజ్యానికి స్థాపన జరిగింది.
కామ,క్రోధ,మద,మాత్సర్యాలు
గుండెకు నాలుగువైపులా
ఆక్రమించుకున్నాయి.
బంధుత్వాలు లేవు
ప్రేమానురాగాలు లేవు
గౌరవాభిమానాలు లేవు
పెద్దలఎడ భక్తి భావనలు లేవు.
దేవుని ఎడ ఆత్యాత్మిక చింతన లేదు.
వీటన్నిటినీ పారద్రోలి ఆస్థానాల్లో
కామక్రోధమదమాత్సర్యాలు
తమ రాజ్యాలను స్వతంత్ర్య
రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి....
తిరిగి ఎపుడైనా గుండెలోకి
ప్రవేశించడానికి ప్రయత్నాలు
చేస్తాయేమో అని
ఎక్కడికక్కడ వీలయినన్ని
గోడలు నిర్మించుకున్నాయి...
అస్తవ్యస్తంగా!
ఇకముందు బందుత్వాలనూ,
ప్రేమానురాగాలనూ,గౌరవాభిమానాలనూ..
కలలోనే చూడాలేమో!
అయినా దుష్టశిక్షణ-శిష్టరక్షణ కోసం
ఏ రాముడైనా అవతరించడా!
ఏడు తాటి చెట్లను ఒక్క బాణంతో
తెగనరికినట్లు
నాలో పెరుగుతున్న ఈ కామక్రోధ
మదమాత్సర్యాలను కూకటి
వేళ్లతో పెకలించడా!
బంగారు భవిష్యత్తును నాకందించడా!
***

No comments:

Post a Comment

Pages