కార్టూన్ కింగ్ - కార్టూనిస్ట్ సుభాని - అచ్చంగా తెలుగు

కార్టూన్ కింగ్ - కార్టూనిస్ట్ సుభాని

Share This

కార్టూన్ కింగ్ - కార్టూనిస్ట్ సుభాని 

భావరాజు పద్మిని 



చిన్నప్పటి బొమ్మలతో మొదలు పెట్టి, అప్పటి కార్టూనిస్ట్ ల పద్ధతులు గమనించి, ఈ రోజున తెలుగువారిలో అగ్రశ్రేణి "పొలిటికల్ కార్టూనిస్ట్" గా చెప్పుకోదగ్గ కీర్తిని గడించినవారు ఆర్టిస్ట్/కార్టూనిస్ట్ సుభాని గారు. స్వయంకృషితో ఇంతటి స్థాయికి  చేరుకున్న  వారితో ప్రత్యేక ముఖాముఖి  ఈ  నెల  మీకోసం.
మీ స్వగ్రామం, కుటుంబ నేపధ్యం గురించిన అంశాలు తెలుపండి.
మాది కారంచేడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యవసాయ ప్రధానమైన గ్రామం. నా కాలేజీ రోజుల్లో నేను లైబ్రరీకివెళ్లి, దినపత్రికలు, ఇతర పత్రికలు చదివేవాడిని. అప్పుడే అనేక పత్రికల్లో వచ్చిన కార్టూన్లను గమనించడం జరిగింది. ఆ సమయంలో కార్టూన్ ప్రముఖులైన బాపు గారు, సత్యమూర్తి గారు, జయదేవ్ గారు వంటివారి కార్టూన్లను క్షుణ్ణంగా పరిశీలించేవాడిని.
చిన్నప్పటినుంచి బొమ్మలు వేస్తూఉండడం వల్ల, కార్టూన్లు వేసేందుకు ప్రేరణ పొందిన నేను, ప్రయత్నించి, వాటిని అనేక తెలుగు పత్రికలకు పంపేవాడిని. అదృష్టవశాత్తూ, ఆంధ్రజ్యోతి వారపత్రిక, జ్యోతి మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో నామొదటి కార్టూన్లను ప్రచురించారు. నెమ్మదిగా ఇతర పత్రికలు కూడా నా కార్టూన్లను ప్రచురించడం మొదలుపెట్టాయి.
నేను ఆశ్చర్యపోయేలా ఈ పత్రికల నుంచి నాకు కాంప్లిమెంటరీ కాపీలే కాక, పారితోషకాలు కూడా అందాయి. నేను
చాలా ఆనందించి, సీరియస్ గా కార్టూన్లు వెయ్యటం మొదలుపెట్టాను.
మీరు కార్టూనిస్ట్ గా మారేందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి ?
నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేదాకా, కార్టూనింగ్ నాకు హాబీ మాత్రమే. ప్రతి నెల దాదాపు 10 - 15 కార్టూన్లు పత్రికల్లో ప్రచురించబడేవి. ఒక్కోసారి నేను వివిధ పత్రికలు నిర్వహించే కార్టూన్ పోటీల్లో, బహుమతులు గెలుచుకునేవాడిని. వాటిలో వచ్చిన డబ్బుల్ని పుస్తకాలు కొనేందుకు వాడేవాడిని.
మరి ప్రొఫెషనల్ కార్టూనిస్ట్ గా ఎప్పుడు మారారు?
ఇది అనుకోకుండా జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాకా, ఏవో పోటీ పరీక్షలు రాసేందుకు నేను హైదరాబాద్ వచ్చాను. ఖాళీసమయంలో శంఖు గారి హాస్యప్రియ పత్రికకు కార్టూన్లు వేసేవాడిని. అప్పుడే ఆంధ్రభూమి ఎం.డి. శ్రీ టి. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎడిటర్ కనకాంబర రాజు గారు నాకు ఇల్లుస్త్రేటర్ ఉద్యోగం ఇచ్చారు. దాదాపు 5 వేల
పైచిలుకు బొమ్మలను కధలకు, సీరియల్స్ కు వేసాను.
నాలోని ప్రతిభను గుర్తించి, ప్రస్తుత ఎం.డి శ్రీ టి. వెంకట్రామ రెడ్డి గారు నన్ను డెక్కన్ క్రానికల్ కు బదిలీ చేసి, పొలిటికల్ కార్టూనిస్ట్ గా నియమించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.
కార్టూన్లపై, మతపరమైన అంశాలపై మీ అభిప్రాయం ఏమిటి?
మతం అనేది సున్నితమైన అంశం. ఇతరుల మనోభావాలను దెబ్బతియ్యడం సమంజసం కాదు. కార్టూన్లు అనేవి అందుకోసం కాదు. కార్టూన్ల ద్వారా మనం వ్యక్తపరచి, మార్పుకు కృషి చెయ్యాల్సిన సమస్యలు దేశంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిపై దృష్టి పెడితే బాగుంటుంది.
"కార్టూనిస్టు బ్లాక్" ను మీరు ఎలా నిర్వహిస్తారు?
కొన్నిసార్లు సమయం సమీపిస్తున్నా, నాకు ఎటువంటి ఐడియా రాదు. ఏం చెయ్యను? పొలిటికల్ కార్టూన్ కు నాకు
ఏ ఐడియా రాకపోతే, నేను ఆటలు, పండుగలు, సినిమాలు వంటి సామాజిక అంశాలను స్వీకరిస్తాను. కాని, ఇది చాలా అరుదుగా జరుగుతుంది.
కారికేచర్లు వేసేటప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్టు ఏమిటి ?
ఇంకెవరు? లాలూ ప్రసాద్ యాదవ్. అతని సాధన హెయిర్ కట్, చెవుల పక్కనుంచి పొడుచుకువచ్చే జుట్టు, మాటల్లో పల్లెటూరి చమత్కారం, ఆయనలో ప్రతీదీ హాస్యాస్పదంగానే ఉంటుంది. నిజానికి, ఉత్తరాదిలోని ప్రముఖ నేతలైన ములాయం సింగ్ యాదవ్. మాయావతి, మొదలైన వారంతా కార్టూనిస్ట్ లకు మంచి సబ్జెక్టులే ! స్పష్టమైన వారి ముఖకవళికలను వ్యక్తపరచడం చాలా సులువు.
మీ అభిమాన కార్టూనిస్ట్ ఎవరు?
విశేషించి ఒక్కరంటూ ఎవరూ లేరు. ఎవరు మంచి కార్టూన్ వేసినా నేను అభిమానిస్తాను.
మీరు వేసిన కార్టూన్ పాత్రల్లో మీకు బాగా నచ్చినవి ఏవి?
నాకు నా కార్టూన్ పాత్రలు అన్నీ ఇష్టమే ! ఒక ఐడియా, దాని నేపధ్యం, అందులోవ్యంగ్యం అన్నీ నాకు పూర్తిగా నచ్చినప్పుడే నేను కార్టూన్ వేస్తాను. అదే సమయంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సామాజిక అంశాలపై, కాప్షన్ లేకుండా కార్టూన్లు వెయ్యటం నాకు ఇష్టం. అటువంటి కార్టూన్లు వేసినప్పుడల్లా నాకు గొప్ప తృప్తి కలుగుతుంది.
కార్టూన్ విభాగంలో భవిత ఎలా ఉంటుంది?
చాలా చక్కగా ఉంటుంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది కార్టూనిస్ట్ లకు అనిమేషన్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి, రెండవది ప్రింట్ మీడియాకు మాత్రమే కాకుండా నేడు ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా చాలా మంది కార్టూనిస్ట్ లు పొలిటికల్ కామెంటరీలకు కావాలి. నేడు న్యూస్ చానల్స్ లో అవి ప్రాముఖ్యతను సంతరించుకోవడం వల్ల కార్టూనిస్ట్ ల అవసరం చాలా ఉంది.
మీకు ఐడియాలు ఎలా వస్తాయి?
ఐడియాలు అంతటా ఉంటాయి. కాని, మనం చుట్టుప్రక్కల జరుగుతున్న తాజా సంఘటనలు, అంశాల పట్ల
అవగాహనతో ఉండాలి. ఒక కార్టూనిస్ట్ గా నేను సునిశితమైన పరిశీలనతో ఉంటాను. అలా ఉండడంవల్ల ఒక్క ఐడియా ఏంటి, డజన్ల కొద్దీ ఐడియాలు వస్తాయి.
ఒక్కోసారి నేను వార్తాపత్రికలు చదువుతుండగా, టీవీ చూస్తుండగా, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా, లేక ఏదో ఆలోచిస్తూ ఉండగా, ఉన్నట్లుండి ఫ్లాష్ లాగా ఐడియాలు వస్తాయి. కొన్నిసార్లు ఐడియాల కోసం నేను కష్టపడాల్సి ఉంటుంది.
మీ వృత్తిలో భాగంగా మీరు ఎదుర్కొన్న ఒకటి రెండు సంఘటనలు తెల్పండి.
నేనెప్పటికీ మర్చిపోలేని ఒకటిరెండు సంఘటనలు చెబుతాను. ఒకసారి చంద్రబాబునాయుడు గారు, వైస్రాయ్ హోటల్ లో కొంతమంది ఎం.ఎల్.ఏ లతో కాంపైనింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అనుకోకుండా సూర్య గ్రహణం వచ్చింది. చంద్రబాబునాయుడు గారు ఎన్.టి.ఆర్ గారిని గ్రహణం రూపంలో కమ్మేస్తున్నట్లుగా ఒక ఆరు భాగాల కార్టూన్ ను నేను ఫ్రంట్ పేజిలో గీసాను. చివరి భాగంలో ఎన్.టి.ఆర్ గారు విజయసూచకంగా గ్రహణం నుండి బయల్పడుతున్నట్లు గీసాను. మర్నాడు కార్టూన్ ను మెచ్చుకుంటూ ఎన్.టి.ఆర్ గారి వద్దనుంచి ఫోన్ వచ్చింది, "ఇవాళ కార్టూన్ చాలా బాగుంది బ్రదర్. మీ జోస్యం నిజమవుతుందని ఆశిస్తున్నాను, థాంక్స్." అన్నారు. మరొకసారి ఒక 75 ఏళ్ళ వృద్ధుడు మదర్ థెరీసా మృతిపై నేను వేసిన కార్టూన్ చూసి, నన్ను కలిసేందుకు వచ్చాడు. అతను కన్నీళ్ళతో నేను వేసిన కార్టూన్ అసలు కాపీ
ఇమ్మని అభ్యర్ధించాడు. ఈ సంఘటనలు మరిన్ని మంచి కార్టూన్లు వేసేందుకు స్పూర్తిని ఇస్తాయి.
కార్టూన్ కు, కారికేచర్ కు ఉన్న తేడా ఏమిటి ?
కార్టూన్ అనేది ఒక రాజకీయ లేక సామాజిక సంఘటనకు సరదాగానో, వ్యంగ్యంగానో వ్యక్తపరచిన దృశ్యరూపం. కారికేచర్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఒక పోలికను/ లక్షణాన్ని అతిశయంగా చూపడం.
మీ భావస్వేచ్చను భంగాపరిచేలా మీ సంస్థ మీపై ఒత్తిడి తెచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు ?
అదృష్టవశాత్తూ, ఇప్పటిదాకా నాకు అటువంటి పరిస్థితి ఎదురవ్వలేదు. డెక్కన్ క్రానికల్ లో నాకు నచ్చిన విధంగా నేను కార్టూన్లు వేసే సంపూర్ణ స్వేచ్చను నాకిచ్చారు. మరీ చాచికొట్టే వ్యంగ్య కార్టూన్లు కాక, శ్లేషతోకూడిన, వినోదంతోకూడిన కార్టూన్లు వెయ్యడంలో నిపుణుడిని కావటం వల్ల , ఇప్పటివరకు సంపాదకుల పాలసీతో నాకు ఎటువంటి విభేదాలు రాలేదు.
ఇల్లుస్ట్రేటర్ కు, పొలిటికల్ కార్టూనిస్ట్ కు ఉన్న తేడా ఏంటి ?
ఇల్లుస్ట్రేటర్ కు సునిశితమైన పరిశీలన, మంచి బొమ్మలు వేసే శక్తి ఉండాలి. కార్టూనిస్ట్ కు వీటితో పాటు రాజకీయ దృష్టి, లోగుట్టులను తెలుసుకోగల శక్తి, ఆరోగ్యకరమైన హాస్యం, వ్యంగ్యం అందించగల శక్తి ఉండాలి. ఇల్లుస్ట్రేషన్ అనేది
వేసినవారి ఐడియాకు దృశ్యరూప వ్యక్తీకరణ అయితే, కార్టూన్ అనేది, అనేక అంశాలపై స్వేచ్ఛాయుత వ్యాఖ్యానం.
సమకాలీన అంశాలపై పొలిటికల్ కార్టూనిస్ట్ వెనువెంటనే స్పందించాలి. వాస్తవాల్ని కార్టూన్లలో బంధించి, నిజాన్నిస్పష్టంగా చూపాలి. అప్పుడే అతను చదువరులపై ప్రభావం చూపగలిగి, ఆయా అంశాలపై వారు విచారించేలా చెయ్యగలుగుతాడు.
ఆంధ్రభూమి వీక్లీలో నేను పనిచేస్తూ ఉండగా, వాష్, షేడ్, లైట్, వంటి కొత్త టెక్నిక్ లతో సహజంగా కనిపించే డ్రాయింగ్స్ వెయ్యటం మొదలుపెట్టాము. అవి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. ఇల్లుస్త్రేషన్స్ వెయ్యడంలో పొందిన ఆ శిక్షణ ఇప్పుడు నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ ను ప్రధాన పాత్రలతో కలపడం, తద్వారా మొత్తం విసువల్ ప్రభావాన్ని పెంచడంపై నేను దృష్టి సారిస్తాను.
వృత్తిపరంగా మీరు ఎదుర్కున్న ఇబ్బందులు ఏమిటి ?
టైరెంట్స్ జింగోఇజం లో డేవిడ్ లో కార్టూన్లు తనను వెక్కిరించాయని, హిట్లర్ అతన్ని చంపబోయాడు. మన నేతలకు మంచిసెన్స్ అఫ్ హ్యుమర్ ఉండడం మన అదృష్టం. మన తొలి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు, పొలిటికల్ కార్టూన్స్ లో ఆద్యులైన శంకర్ గారితో ఇలా అన్నారు, "నన్ను కూడా వదిలిపెట్టకు శంకర్ !" అని. ఆయన నిజంగానే నెహ్రూ గారిని వదలలేదు. ఆయనపై ప్రత్యేకంగా ఒక కార్టూన్ల పుస్తకం తీసుకుని వచ్చారు. కొంతమంది తప్ప, మన నేతలు కార్టూనిస్ట్ ల విమర్శలను స్వాగతిస్తారు. మరికొంతమంది తాము గేలి చేసేందుకు తగమా అని దిగులుపడతారు. వారు తరచుగా మా రిపోర్టర్లను ఇలా అడుగుతారు, "ఈ మధ్యన మా మీద కార్టూన్లు ఏమీ రావట్లేదేంటి ? మా పాపులారిటీ తగ్గిందా ?" అని.
ఈ  వృత్తిలో  మీకు  ఎటువంటి  ఆనందం  కలుగుతుంది ?
ఈ వృత్తిలో ఆనందం అంతులేనిది. ఏ మంచి కార్టూన్ కైనా చదువరులు వెంటనే స్పందిస్తారు, అది రాజకీయమైనా, సామాజికమైనా. కట్టల కొద్దీ ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిల్స్, వస్తాయంటే ప్రజలకు కార్టూన్ల పట్ల ఉన్న గౌరవాన్ని మనం అర్ధం చేసుకోవచ్చు. కార్టూన్ కేవలం వినోదం కోసమే కాదు, అనేక సామాజిక అంశాల్ని ఎత్తి చూపి, వాటిపై నేతలు స్పందించేలా చేసేందుకు. విమర్శాత్మకంగా ఉంటూనే ఏదైనా ప్రయోజనం చేకూరేలా ఉండడం. ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపి, వాటిని నివారించేందుకు వారు తగిన చర్యలు తీసుకునేలా చెయ్యడం, కార్టూన్ల ప్రధాన లక్ష్యం.
అటువంటి కార్టూన్లు వేసినప్పుడల్లా, నాకు గొప్ప తృప్తి కలుగుతుంది.

సుభాని గారు మరిన్ని గొప్ప బొమ్మలు, కార్టూన్లు వేసి, విజయ శిఖరాలను  అధిరోహించాలని, మనసారా ఆకాంక్షిస్తోంది "అచ్చంగా తెలుగు !".

No comments:

Post a Comment

Pages