నాకు నచ్చిన కథ--బుగ్గి బూడిదమ్మ--శ్రీ చాగంటి సోమయాజులు గారు - అచ్చంగా తెలుగు

నాకు నచ్చిన కథ--బుగ్గి బూడిదమ్మ--శ్రీ చాగంటి సోమయాజులు గారు

Share This

నాకు నచ్చిన కథ--బుగ్గి బూడిదమ్మ--శ్రీ చాగంటి సోమయాజులు గారు

టీవీయస్.శాస్త్రి 


పొగడ్తలకు లొంగని మనిషి ప్రపంచంలో ఉండడేమో!అందులో 'ముక్కోపికి ముఖస్థుతే మందు' అని పింగళి వారు కూడా మాయాబజార్ సినిమాలోచెప్పారు. అనవసరంగా ఎవరైనా అతిగా పొగిడితే బాజాలు ఊదే వాళ్ళను చూపించి తమదైన శైలిలో అతి పొగడ్తలను గురించి చక్కగా చూపించారు బాపూరమణలు​ ​ముత్యాలముగ్గు సినిమాలో. దానం చేయటం గొప్ప గుణమే!కానీ​ ​కుడి చేత్తో దానం చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని అంటారు.కొంతమంది 'అజ్ఞాత భక్తులు' దేవుని హుండీలలో కోట్ల రూపాయల ధనాన్ని,బంగారాన్ని సమర్పిస్తుంటారు.అదంతా నల్ల ధనమేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.పేరు బయటకు వస్తే ప్రమాదమని అలా చేస్తుంటారు.చాలా దేవాలయాల్లో​ ​భక్తులు కొన్ని దానాలు వస్తు రూపంలో సమర్పిస్తుంటారు.ఈ మధ్య ఒక గుడిలో ఒక 'భక్త స్నేహితుడు' ఒక దేవాలయానికి​ ​Ceiling Fan సమర్పిస్తూ ఆ 'సంబ(డా)రానికి 'నన్ను కూడా పిలిచాడు.Ceiling Fan యొక్క నాలుగు రెక్కల మీద అతని పేరు, తల్లితండ్రుల పేర్లు,అతని సోదరుని పేరు paint చేసి ​ఉన్నాయి.ఆ ఫ్యాన్ తిరిగితే ​ఎవరి పేర్లు కనపడవు.అందరి పేర్లు కనపడాలంటే​ ​మిగిలిన భక్తులకు అసౌకర్యం కలిగినా ఆ ఫ్యాన్ ను వేయకూడదు.అటువంటి దానాల వల్ల ఉపయోగమేమీ ​ఉండదు.​ ​నిజానికి,దేవుళ్ళు కూడా పొగడ్తలకు అతీతులు కారు.ప్రతి దేవుడికి సుప్రభాతపు మేలుకొలుపు​ల నుండి పవళింపు సేవల వరకు అన్నీ పొగడ్తలే.కీర్తీ ,కాంతా,కనకాలకు ఎవరూ అతీతులు కారు!కాంతా కనకాల సంగతి అటుంచితే​ ​'కీర్తి కండూతి' చాలామందిని తనకు బానిసగా చేసుకుంటుంది.చప్పట్ల కీర్తి కోసం ఎంతమంది కళాకారులు జీవితాలు నాశనం చేసుకున్నారో​ ​శ్రీ భమిడిపాటి రాధాకృష్ణ గారు తన​ ​'కీర్తిశేషులు' నాటకంలో కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.ఒక్కొక్కసారి కీర్తి కోసం చేసే పనులు బెడిసికొడుతాయి.అంతే కాదు అపకీర్తి పాలు కూడా చేస్తాయి.ప్రతి దానికి కాలదోషం ​ఉన్నట్లు​ ​కీర్తికి కూడా కాలదోషం ​ఉంటుంది.'నిన్ను ఇంద్రుడు,చంద్రుడు'అన్నవారే కొంతకాలానికి నీ వెనకనే'వాడు వట్టి వెధవ ' అని ప్రచారం చేస్తుంటారు.కీర్తి పెరిగినకొద్దీ కొన్ని నష్టాలు కూడా ​ఉన్నాయి.అందులో​ ​అతి ప్రమాదకరమైనది--శత్రువులు పెరగటం.ఎవరైనా మంచి రచన చేశారనుకోండీ! చాలామంది వారిని అభినందించరు. పైగా​ ​"నేనైతే అంతకన్నా బాగా వ్రాసేవాడిని" అని డంబాలు పలుకుతుంటారు.అభినందించటానికి అహం (దేనికో?) అడ్డు వస్తుంది.అదట్లా ఉంచితే​ ​ఈ 'కీర్తి కండూతిపరులకు' ఆ కీర్తికాంక్ష బెడిసికొట్టి ఎలా అపకీర్తి వస్తుందో ప్రఖ్యాత రచయిత శ్రీ 'చాసో'(చాగంటి సోమయాజులు) గారి కధ'​ ​బుగ్గి బూడిదమ్మ' లో ఆయన తనదైన విలక్షణ శైలిలో చక్కగా చెప్పారు.అభ్యుదయ వాదులందరికీ చిరపరిచయమైన పేరు చాసో.ఆయన వామపక్ష వాది.​ ​ఎన్నో వైవిధ్యభరితమైన తెలుగు కధలు వ్రాసి వినుతికెక్కారు.వారు వ్రాసిన కధల్లో​ ​బొండుమల్లెలు, ఎంపు,కుంకుడాకు---మున్నగునవి చాలా ప్రఖ్యాతిగాంచాయి.ఈ 'బుగ్గి బూడిదమ్మ' కూడా విశేష పాఠకాదరణ పొందిన కధే.కీర్తి కండూతిని గురించి ఈ కధలో ఆయన చెప్పిన 'వ్యంగ్య విధానం' నాకెంతో ఇష్టం.కీర్తి కండూతి పరులకు ఇదొక కనువిప్పని కూడా చెప్పవచ్చు. ఇక కధలోకి వెళ్లుదాం.
------
'బుగ్గి'​ ​వారి కోడలు కావటం వల్ల నేమో ఆ ​ఊళ్ళో అందరూ ఆమెను 'బుగ్గి బూడిదమ్మ' అని పిలుస్తుండవచ్చు.బుగ్గి వారు పెద్ద వ్యాపారస్తులే కాక ధనవంతులు కూడా.బూడిదమ్మ భర్త విజయరామయ్య వ్యాపార నిర్వహణలో సమర్దుడే కానీ,భార్య ఎదుట నోరెత్తలేడు.ఎప్పుడైనా​ ​చెబుదామని ప్రయత్నం చేసినా,ఆవిడ వినే రకం కాదు. బూడిదమ్మకు అంత ధైర్యం ఉండటానికి మంచి కారణమే ​ఉంది.ఆమె కాపురానికి వచ్చేటప్పుడు పుట్టింటినుండి అమితమైన ధనం కూడా తెచ్చుకుంది.పైగా తను కూడా కార్యదక్షురాలునని ఆమె అభిప్రాయం.అందుచేత తాను తెచ్చుకున్న ధనంతో ఆమే సొంతంగా వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది.తన వ్యాపారంలో భర్తను చేయి పెట్టనివ్వదు.అన్ని వ్యవహారాలూ ఆమే చూసుకుంటుంది.వడ్డీ వ్యాపారం అంటే అంత తేలికైన విషయం కాదు.నోటి దురుసుతనం బాగా ​ఉండాలి.​ ​ఆడవాళ్ళు నోరు తెరిస్తే మగవాళ్ళు దేనికీ పనికి రారు.అలా తన సామర్ధ్యంతో వడ్డీ వ్యాపారం విజయవంతంగానే​ ​చేస్తుంది.విపరీతంగా సంపాదించింది,ఇంకా సంపాదిస్తూనే ​ఉంది.ఈ వ్యాపార నిర్వహణ కోసం తన వెంట పుట్టింటి​ ​నుండి ధనంతో పాటు అప్పారావు అనే అతన్ని కూడా తెచ్చుకుంది.అప్పారావు కూడా ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండే వాడు.ఒక్క ధనం సంపాదించటం​ ​తోనే మనిషికి తృప్తి కలుగదు.ఇంకా ఏదైనా చేసి మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని ​కూడా ​​ఉంటుంది. ఇటువంటి వారిని మనం నేడు రాజకీయాలలో అనేక మందిని చూస్తున్నాం.వారిలాగే​ ​బుగ్గి బూడిదమ్మకు​ కూడా 'కీర్తి కండూతి' పట్టుకుంది.కండూతి పట్టుకున్న వాడు గోక్కోవలసిందే!ఆ సుఖాన్నే 'కండూయాన సుఖం' అని అంటారు.తనకు పట్టిన కండూతిని తీర్చుకునేందుకు​ ​బూడిదమ్మ--ఆలయాలాకు గోపురాలు కట్టించటం ,ద్వారాలు ఏర్పరచటం,ప్రయాణీకుల సౌకర్యం కోసం బస్ షెల్టర్లను నిర్మించటం లాంటి అనేక పనులను చేపట్టింది.పైన నేను చెప్పినట్లు,వీటన్నిపైనా తన పేరు పెద్ద అక్షరాలతో వేయించుకునే ​ఉంటుంది.సందేహించనవసరం లేదు!కానీ ఆమె మాత్రం ఫలానా వారి ధర్మపత్ని అనో​ ​లేక ఫలానా వారి కోడలనో వేయించుకునేది కాదు.అన్నిటిమీదా 'బుగ్గి బూడిదమ్మ ధర్మం'​ ​అనే పెద్ద అక్షరాలతో తన ఒక్కదాని పేరే వేయించుకునేది.ఈ పధ్ధతి బాగాలేదని భర్త కూడా చెప్పి చూశాడు.అంతే కాదు​ ​అప్పారావు చేత కూడా చెప్పించి చూశాడు.ఆమె ఏ మాత్రం వినలేదు."నా డబ్బులతో నేను దానధర్మాలు చేస్తుంటే,మీ అందరి పేర్లు ఎందుకని?" ఆమె బాణీలోనే చెప్పింది.భర్తగారు,ఆమె మాటలు భరించలేక నోరుమూసుకున్నారు.​ ​అంత కన్నా ఏమి చేస్తాడు పాపం?ఊరందరికీ బూడిదమ్మ పేరు దాదాపుగా తెలిసింది.అయితే​ ​ఆమెకు మాత్రం ఏదో అసంతృప్తి ​ఉంది.ఇంకా పేరు ప్రఖ్యాతులు రావాలనే ఆలోచన పట్టుకుంది.ఈ సారి ఊరంతా తన పేరుతో అట్టుడికిపోవాలి అనే ఆలోచన వచ్చింది.ఊళ్ళో ​ఉన్న రిక్షావాళ్ళందరికీ బనియన్లు దానంచేసి,ఆ బనియన్లమీద 'బుగ్గి బూడిదమ్మ ధర్మం' అనే పెద్ద అక్షరాలతో చెరిగిపోని రంగులతో తన పేరు వ్రాయించుకుంది. అలా చేస్తే​ ​రిక్షావాళ్ళు వెళ్ళిన చోటల్లా తనకు మంచి పేరు వస్తుందని ఆమె ఆలోచన.పైగా తన 'దానగుణం' అందరికీ తెలుస్తందని కూడా ఆమె అభిప్రాయం.​ ​ఆలోచన వచ్చిందే తడవు,కండూతిపరులు ఆగరు.​ ​దానిని అమలు పరుస్తారు.ఈ పనికి ఆఖరికి అప్పారావు కూడా అభ్యంతరం చెప్పాడు. అయినా ఆమె వినలేదు.అనుకున్న పని చేసింది.భోగి పండుగ నాడు అందరి రిక్షావాళ్ళకు బనియన్లు పైన చెప్పిన విధంగా తయారు చేయించి భారీగానే పంచిపెట్టింది.మర్నాడు సంక్రాంతి పండుగ.ఎవరి నోట విన్నా బూడిదమ్మ పేరే!ఆ పనితో బూడిదమ్మ పేరు ఊరందరికీ తెలిసింది.పండుగకు బంధువుల ఇళ్ళకు వచ్చిన పొరుగూరి వారికి కూడా ఆమె పేరు తెలిసింది.తెలియంగానే జనం ఊరుకుంటారా?'ఎవరీ 'బుగ్గి బూడిదమ్మ'​ ​అని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు.తెలిసిన వాళ్ళు​ ​ ఆమె దేవాలయాలకు,బస్ షెల్టర్లకు దానం చేసిన ఘనురాలని,భర్తను ఖాతరు చేయదని... అంతా పూసగుచ్చినట్లు చెప్పేవాళ్ళు.జనం అంతటితో ఆగుతారా?​ ​'ఆమె అప్పారావు అనే వాడిని ​ఉంచుకుందని(నిజం ముక్కంటి కెరుక),​ ​ఇంకా బోలెడు(కట్టు)కధలు చెప్పేవాళ్ళు.ఆమె 'దాన గుణం'​ ​కన్నా అప్పారావుతో ​ఉన్న అక్రమ సంబంధం(ఉందో లేదో మనకు తెలియదు) గురించి రకరకాల ప్రచారం జరిగింది.అంతా తెలిసిన బూడిదమ్మ​ మొగుడు జనం --"కనపడ్డవి చెప్పుకుంటారు.కనబడనివి చెప్పుకోరు,కనబడనివే కనబడితే మరీ చెప్పుకుంటారు."అని అనుకుంటూ బావురుమన్నాడు.దానధర్మాల వల్ల బూడిదమ్మ పేరు కొందరికే తెలిస్తే ,ఈ అక్రమ సంబంధం​(?)​ వల్ల అందరికీ తెలిసింది.అలా బూడిదమ్మ​కాస్తా 'బుగ్గిబూడిదమ్మ' గా సార్ధక నామధేయురాలు అయింది.అంతే కాదు,'బుగ్గి బూడిదమ్మ' పేరు ఒక సామెతగా కూడా మారిపోయివుండవచ్చు!చూశారా​ ​​కీర్తికండూతి' మనిషికి ఎంత అపఖ్యాతి తెచ్చిపెడుతుందో!
ఒక చక్కని సందేశాన్ని వ్యంగ్యంగా తనదైన శైలిలో అద్భుతంగా చెప్పిన కీర్తిశేషులు 'శ్రీ చాసో' గారికి నా స్మృత్యంజలి!
********

No comments:

Post a Comment

Pages