Tuesday, August 23, 2016

thumbnail

బ్రహ్మచర్యము – సన్యాసము

బ్రహ్మచర్యము – సన్యాసము

డా. వారణాసి రామబ్రహ్మం 


బ్రహ్మచర్యము అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. ప్రస్తుతము ప్రచారములో ఉన్న, రతిసుఖము లేకుండా జీవితము గడపడము అనే అర్థము వక్ర భాష్యము.
బ్రహ్మచర్యము అంటే బ్రహ్మమునందు చరించుట. బ్రహ్మచారి, సంసారి, సన్యాసి అందరూ బ్రహ్మచర్యమును పాటించాలి.
"కౌపీన పంచకము" లొ, శంకరాచార్యులు "వేదాంత వాక్యేషు సదా రమన్తొ " అని బ్రహ్మజ్ఞానపరుల లక్షణము చెప్పారు.
సతతము వేదాన్తవాక్యముల అర్థమును భావిస్తూ, ఆ భావన, అనుభవము కలిగించే ఆనందములో రమించేవారు అని ఆ శ్లోక పాదము యొక్క తాత్పర్యము.
"మానస! సంచరరే బ్రహ్మణి" అని సదాశివబ్రహ్మెంద్రులు కీర్తించినా ఈ అర్థములోనే. బ్రహ్మమునందు సంచరించమని మనసుకి సలహా ఇస్తున్నారు.
మనసు పుట్టుక చోటు బ్రహ్మమే. మనసు బ్రహ్మ పదార్థమైన చిత్ శక్తితో నిర్మించబడింది. ఈ చిత్ శక్తి మేధలో ప్రతిఫలనముచే చిదాభాసా లేక మాయగా రూపొందుతుంది. మాయ అంటే మానసిక శక్తి అని అర్థము.
"యయా అసన్తమ్ పశ్యన్తి సా మాయా" అని మాయకు నిర్వచనము. దేని ద్వారా మనము ఈ సకల చరాచర ప్రపంచాన్ని గ్రహించగలుగుతున్నమో, దానిని మాయ అంటారు. మళ్ళీ మానసిక దృష్టి లోకి తెచ్చుకోగలుగుతున్నమో, ఏది మన వాసనలను-అనుభవములను, జ్ఞాపకాలను, మన వ్యక్తిత్వాన్ని, అహంకార, మమకారములను ఏర్పరచి, మరల దృష్టి లోకి తెస్తుందో దానిని మాయ అంటారు. దీనినే ప్రణవము అని కూడా అంటారు. మన అంతః కరణములు, వాటి
మానసిక కార్యకలాపములు మాయా విభూతులే.
"మాయామయమ్ ఇదం ఇదమ్ జగత్" - అంటే ఈ అర్థమే. ఈ జగత్తు అంటా మాయచే నిర్మింపబడింది అని దీని అర్థము.
"యా మా సా మాయా". ఏది లేదో అది మాయ అని దీని అర్థము.
అందుకే మాయ లేనిదానిని ఉన్నట్టు చూపిస్తుంది అంటారు. మన వ్యక్తిత్వము బ్రహ్మము అనే తెరపై కనిపించే బొమ్మ. ఇతర చరాచర జగత్తు ఇంతే. బ్రహ్మము అనే తెరపైకి వచ్చి పోయే బొమ్మలు/దృశ్యములు, ధ్వనులు,వాసనలు (smells) రుచులు, స్పర్శలు, భావములు, అనుభవములు; అస్తమాను (జాగ్రత్-స్వప్న- సుషుప్తి, జాగ్రత్ సుషుప్తిలయందు) - ఉండేది బ్రహ్మము మాత్రమే. (యా విద్యతే సా విద్యా - అన్నా ఇదే ).
జగత్, ప్రపంచము, విశ్వము - వీటన్నిటిని ఇదం అంటారు - ఇవి సకల మానసిక కార్యకలాపములు, జీవుడిని అనే దృష్టి - ఆత్మ దృష్టి పై ఆనింపులు - బ్రహ్మము అనే తెరపై ఆడబడే నాటకములు.
ఈ విషయాన్ని తెలిసి సుఖ దు:ఖములకు లొంగక, మానావమానములకు పొంగక - క్రుంగక, అహంకార మమకారములను అధిగమించి, సదా భగవన్నామ స్మరణ చేస్తూ, విధివిహిత కార్యములను పరమేశ్వరార్పణముగా నిర్వహిస్తూ, సకల స్థావర జంగమముల మీదా కరుణ కలిగి, అహింసను మాటలద్వారా, చేతలద్వారా పాటిస్తూ, ఉన్నదానితో సంతృప్తి పడి, ధర్మ మార్గములో కోరికలు తీర్చుకుంటూ, న్యాయబద్ధముగా ఉన్నతిని కోరుకుంటూ సంయమనముతో జీవించటమే బ్రహ్మచర్యమును పాటిన్చడము.
ఇది సనాతన ధర్మము యొక్క పెద్దల మాట. పెద్దల మాట చద్దికూటి మూట.
మరేది బ్రహ్మచర్యము కాదు.

సన్యాసము

సన్యాసము సనాతన సాంప్రదాయ ఆశ్రమము కాదు. సంన్యాసము అవును. సంన్యాసము అంటే కలిసి జీవించుట. బ్రహ్మముతో కలిసి బ్రహ్మముగా జీవించుట. సనాతన ధర్మములో మూడే ఆశ్రమములు. అవి: బ్రహ్మచర్యము- చదువుకునే సమయము (బ్రహ్మచర్యానికి స్త్రీ (పురుష) సుఖ పరాఞ్ముఖతగా వికృత వాదము ప్రాచుర్యంలో ఉంది. అది వేరే విషయము.
రెండవది గృహస్థాశ్రమము. మూడవది వానప్రస్థము. భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండడమే సనాతన ధర్మము. ఉపనిషత్సారమన్నప్పటికీ స్రష్టలందరూ గృహస్థులే. కొందరికి ఇద్దరు భార్యలు కూడా ( యాఙ్యవల్క్య మహర్షి).
సన్యాసము బౌధ్ధ, జైనముల ప్రభావము వల్ల సనాతన ధర్మములో ప్రవేశించిన ఆశ్రమము.
గృహస్థులు కాకుండా స్త్రీ పురుషులు అందరూ సన్యాసులయితే తర్వాత తరాలు ఎక్కడ నుంచి వస్తాయి?
బాధ్యతలు ఏమీ తీసికోకుండా రికామీ గా జీవించడం సనాతన సంప్రదాయ విరుధ్ధము.
సహజమైన రతి సుఖాన్ని పెళ్లి చేసికొని బాధ్యతా యుతంగా అనుభవించకుండా మెట్ట వేదాంతాలు చెబుతూ , ఏమీ ఆపుకోలేక, స్త్రీ శిష్యురాండ్రను అనుభవించే పధ్ధతి
గర్హనీయం. అది ఆధ్యాత్మికత కాదు. ఒక విధమైన వ్యభిచారం.
బ్రహ్మ ఙ్ఞానాన్ని వల్లె వేస్తూ వెధవ పనులు చేయడం సన్యాసి ధర్మం కాదు. ఇటువంటి వారు వారికి వారే ఆధ్యాత్మికం గా ఉపయోగపడరు. ఇంక మనకేమి ఉపయోగపడతారు?
బ్రహ్మ జ్ఞానము చెప్పినది సంన్యాసము. అంటే కూడా వసించడం. బ్రహ్మముతో కూడా
వసించి బ్రహ్మముగా వికసించి బ్రహ్మమై జీవించడం సంన్యాసము.
శంకరాచార్యులు, రామానుజార్యులు, మధ్వాచార్యులు, రమణ మహర్షి, చంద్రశేఖర సరస్వతి మొదలైన వారు నిజమైన సన్యాసులు. సంన్యాసము చేసినవారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకోవడం వంటి సన్నాసి బ్రతుకు సన్యాసమైంది.
జ్ఞానాన్ని గౌరవిస్తూ, ఈ నవీన సన్యాసుల జీవన విధానాన్ని గమనించాలి. గుడ్డిగా,
మాటల ప్రలోభంలో పడిపోకూడదు. మాట వేరు ప్రవర్తన వేరు. రోజూ పేపర్లో, టివిలలో ఈ గురువుల రాసలీలల గురించి వివరంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినా ఎవరి ఆశలు వారివి. ఎవరి సంస్కారం వారిది.
గృహస్థులమైన మనం తల ఎత్తుకుని తిరుగుదాం. మనకన్నా ఈ commercial spiritual workers గొప్పవారు కారు. అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమము మాత్రమే మేలైనది. అందరకీ ఉపయోగకరమైనది .
భార్యాభర్తలు ఇద్దరూ కష్టసుఖాలు పంచుకుంటూ సామరస్యంతో జీవించి, ఒకరు వెళ్లి పోయేదాకా కలిసుండి బాధ్యతాయుతమైన జీవితం గడిపి ఒకరి తరవాత ఒకరు ప్రకృతిలో/పరమాత్మలో లీనమైపోవడమే సనాతన భారతీయ సంప్రదాయం. సనాతన ధర్మమూ కూడ.
అందరమూ సుఖశాంతులతో జీవించెదము గాక!

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

Comment with Facebook

No Comments


Worlds Best Telugu Online Magazine

మా గురించి

నమస్కారం ! అచ్చతెలుగు లోగిలికి స్వాగతం.

నా పేరు భావరాజు పద్మిని.

5 ఏళ్ల క్రితం 'అచ్చంగా తెలుగు' అనే పేరుతో ముఖ పుస్తక తెలుగు బృందం స్థాపించాను. అంచెలంచలుగా ఎదిగిన ఈ బృంద సభ్యుల సంఖ్య ఇప్పుడు వేలల్లో ఉంది. ఎందరో తెలుగువారి మనసులు చూరగొంది 'అచ్చంగా తెలుగు'. ఒక్క చేత్తో మొదలైన ఈ తెలుగు సాహితీ యజ్ఞానికి ఇప్పుడు అనేక చేతులు ఊతం అందిస్తున్నాయి. 'నేను' నుంచి 'మేము' కు ఎదిగాము. అభిమానుల అక్షర హారతులు, ప్రోత్సాహమే పెట్టుబడిగా, ఇప్పుడు మేము మరింత ముందుకు వెళ్లి 'అచ్చంగా తెలుగు' అనే అంతర్జాల మాస పత్రికను స్థాపించాము.
వీరిలో ముఖ్యమైన వారి పరిచయం....

aboutus.acchamgatelugu Click here to Read More. Feel free to reach us for more information