శ్రీధరమాధురి -29 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -29

Share This

శ్రీధరమాధురి -29 

(నిజమైన అధ్యాపకుడు (టీచర్) ఎలా ఉండాలో పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కుల్లో చదవండి...)


విద్యావేత్త (అధ్యాపకుడు)
మంచి విద్యావేత్త డబ్బును, అధికారాన్ని నియంత్రిస్తాడు. అతను డబ్బు, అధికారం తనను నియంత్రించే అవకాశం ఇవ్వడు. విద్యకై వెచ్చించలేని వారిని చేరుకునేందుకు అతను డబ్బును, అధికారాన్ని వాడతాడు. అతను విద్య అనేది అవసరమైనవారికి, పేదవారికి చేరుకునేలా చేస్తాడు.

విద్యావేత్త పాత్ర ఏమిటంటే, అతను విద్యార్ధులకు ప్రేరణ కలిగించాలి, వారిలో సానుకూల దృక్పధాన్ని, ఆశావాదాన్ని పెంచాలి. విద్యార్ధుల స్పూర్తికి భంగం కలిగించే ఏ పనినీ అతను చెయ్యకూడదు. ఇటువంటి ఆలోచనలకు ఊతమందించే విధంగా విద్యా నమూనాలను నిర్మించాలి. సునిశితంగా గమనించడం, విశ్లేషించడం ద్వారా విద్యావేత్త, విద్యా వ్యవస్థలోని కలుపు మొక్కల వంటి ప్రతికూలతలను ఏరి పారేసి, విద్యార్ధులు జీవితాంతం సానుకూల, ఆశావహ దృక్పధాలతో జీవించేందుకు సహకరించాలి. విద్యార్ధుల ప్రాధమిక దశలోనే విద్యావేత్త సానుకూల, ఆశావహ దృక్పధాలనే బీజాలను వారి మనస్సులలో నాటాలి.

విద్య అనేది, కేవలం ఒకరి మేధస్సును పెంచే ఉపకరణం మాత్రమే కాదు. దాన్ని జ్ఞానంగా అభివృద్ధి చేసుకున్నప్పుడే దానికి సంపూర్ణ ప్రయోజనం చేకూరుతుంది.

ఈ రోజుల్లో ఎంతోమంది మేధావుల్ని చూస్తున్నాను, కాని జ్ఞానులు మాత్రం తక్కువగా ఉన్నారు. బహుశా నేటి విద్యా వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించాలి, విద్యావేత్తలు అంతా తమ లోపాల్ని గుర్తించేందుకు ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి.
అహం లేని వారు మాత్రమే ఆత్మ పరిశీలన చేసుకోగలరు. అహంకారులు కేవలం ఇతరుల్ని తనిఖీలు చెయ్యగలరు.

అతను – మేము నాణ్యమైన విద్యను అందిస్తాము.
నేను – ఓహ్, చాలా గొప్ప విషయం.
అతను – అవును, మా క్లాసు రూమ్స్ పూర్తిగా ఫర్నిష్ చెయ్యబడి ఉంటాయి. అన్నింట్లో ఎ.సి. లు ఉన్నాయి. అన్నింట్లోనూ ఎల్.సి.డి / ఎల్.ఇ.డి టీవీ స్క్రీన్ లు ఉన్నాయి. మేము మల్టీమీడియా ద్వారా విద్యాబోధన చేస్తాము. మాకు పెద్ద ఆటస్థలం, ఎయిర్ కండిషన్ చేసిన పెద్ద ఇండోర్ స్టేడియం ఉన్నాయి. మాకు స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. మా కాంటీన్ మొత్తం సెంట్రల్ ఎ.సి. ఉంది. మేము అత్యధిక నాణ్యతకల ఆహారం అందిస్తాము. పిల్లలు స్కూల్ కు లక్సరీ ఎ.సి. బస్సుల్లో వస్తారు...
నేను – ఆహా, అద్భుతం, ఒక్క క్షణంలో మీరు నాకు ఫైవ్ స్టార్ లక్సరీ హోటల్ ను చూపించారు.

దురహంకారాన్ని పెంపొందిస్తే, విద్య యొక్క నిజమైన ప్రయోజనం నాశనమవుతుంది.
విద్యలో ఉత్కృష్టమైన స్థాయికి సూచికలు వినయము, అణకువ.

మంచి విద్యార్హత ఉన్నవారు ఈ లోకంలో ఎక్కువగానే ఉన్నారు. వారిలో అతి కొద్ది మందే విద్యావంతులు.
విద్యావ్యవస్థలో కీలకమైన విద్యా బోధకుల సంఘం, విద్యను బోధించే సమయంలో అహానికి, స్వార్ధానికి అతీతంగా ఉండి, విద్యార్ధుల్లో విలువల వ్యవస్థను నెలకొల్పాలి.

టీచర్లు విద్యార్ధులకు సంభాషణా చతురతను నేర్పాల్సిన బాధ్యత ఉంది. సమాజంలో ఒక వర్గాన్ని కాని, లేక ఇతరుల మనోభావాల్ని కాని, దెబ్బతియ్యకుండా మాట్లాడడం వారికి నేర్పాలి.

వాక్ స్వాతంత్ర్యం అంటే మీకు ఇతరుల మనోభావాలను దెబ్బతీసే హక్కును ఇచ్చేసారని కాదు. కాబట్టి, సంభాషణ అనే కళను సానుకూలంగా పెంపొందించినప్పుడు, వక్త ఏ ఒక్క విషయాన్ని వివాదాస్పదం కాకుండా మాట్లాడే జాగ్రత్త తీసుకుంటాడు. ఒక నిజమైన విద్యావేత్త అధ్యాపకుడి రూపంలో విద్యార్ధుల జీవితాల్లో ఈ సానుకూల మార్పును తీసుకువస్తాడు.

బోధనా వృత్తి ఎంతో పవిత్రమైనది. ఒక అధ్యాపకుడు కేవలం తాను బోధించే అంశంలోనే పట్టును కలిగి ఉంటే చాలదు, విద్యార్ధుల్లో మానవతా విలువలను తాను చెప్పే అంశంతో పాటుగా నాటాలంటే, అతను అహం, స్వార్ధం లేకుండా ఉండాలి.

చిత్రకళ, సంగీతం, నాట్యం వంటి రంగాలు సైతం కలుషితమైనట్లు కనిపిస్తున్నది. చిత్రకళ, సంగీతం,నాట్యం అనేవి కూడా ఈ పోటీ ప్రపంచంలో స్థానం కోసం ముందుకు వెళ్తున్నాయి. ఒకానొక సమయంలో ఈ వృత్తులు ఒత్తిడిని తగ్గించేవిగా భావించేవాళ్ళు. కాని, నేడు ఇవి కూడా ఒత్తిడిని పెంచుతున్నాయి. శ్లోకాలు, సూత్రాలు నేర్చుకోవడం, భజనలు పాడడం కూడా పోటీకి గురవుతున్నాయి. చిత్రకళ, సంగీతం, నాట్యం అనేవి దివ్యమైనవి, హృదయ సంబంధమైనవి. నేడు అవి తలకెక్కి, అహాన్ని, దురహంకారాన్ని, ఈ రంగాల్లో వ్యాపించేలా చేసాయి. నిశ్చయంగా ఒకసారి వాస్తవాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఒక టీచర్ శాంతంగా, నెమ్మదిగా ఉండాలి. మనసు కల్లోలంగా ఉన్నప్పుడు ఒక అధ్యాపకుడు బోధించకూడదు. కలతగా ఉన్న మనసు దురహంకారాన్నే బోధిస్తుంది. కలతపడిన మనసుతో ఒక అధ్యాపకుడు ఏ విషయాన్నైనా బోధిస్తే, విద్యార్ధి హింసాత్మకంగా మారతాడు. నేడు దీన్నే మనం అంతటా చూస్తున్నాము. విద్యార్ధుల ప్రవర్తన దౌర్జన్యంగా ఉంది, ఎందుకంటే చాలామంది అధ్యాపకుల ఆలోచనలు, చేష్టలు, మనసు కల్లోలంగా ఉన్నాయి. విద్యార్ధుల హింసాత్మక ప్రవర్తనకు మనం కేవలం వారినే వేలెత్తి చూపలేము. విద్యార్ధి అన్ని చోట్లా హింసను చూసినప్పుడు అతను హింసాత్మకంగానే ప్రతిస్పందిస్తాడు. అందుకే విద్యావేత్తల సంఘం తన దృక్పధం విషయంలో సమతుల్యతతో ఉంటే, విద్యార్ధులూ అలాగే ప్రతిధ్వనిస్తారు.

ఒక అధ్యాపకుడు విద్యార్ధికి అహం పెరిగే దారిని చూపకూడదు. పోటీ పేరుతో దురహంకారాన్ని పెంచే పద్ధతులను ఒక టీచర్ ఎన్నడూ ప్రోత్సహించకూడదు. విద్యార్ధుల సామర్ధ్యాలను పోల్చే విధానాన్ని టీచర్ అవలంబించకూడదు. అటువంటి పోలికలు ఒకరికి దురహంకారం పెరిగేలా, మరొకరు నిరాశకు గురయ్యేలా చేస్తాయి. ఒక టీచర్ కు పక్షపాతం ఉండనే కూడదు. ఒక సంస్థలోని విద్యార్ధులందరూ టీచర్ కు సమానమే కావాలి. ఒక విద్యార్ధి బాగా చదివినా, చదవకపోయినా అందరు విద్యార్ధుల పట్ల టీచర్ తన ధోరణిలో నిష్పక్షపాతంగా ఉండాలి.

ఒక విద్యార్ధి విద్య వల్ల నాగరికంగా మారుతాడు. అతడ్ని నాగారీకుడిగా, మర్యాదస్తుడిగా మలచే అద్భుతమైన పని టీచర్ ది. అది సమాజం పట్ల అతని చర్యల్లో ప్రతిబింబిస్తుంది. దీని తాలూకు ఘనత అంతా అతడిని మలచిన ఆ టీచర్ కే దక్కుతుంది. మీరు వారి ప్రవర్తన చూసినప్పుడు, వారిని ఈ విధంగా మలచిన శిల్పి ఎవరా అని మీరు ఆశ్చర్యపోతారు. వారే, ఉత్తమమైన టీచర్, దైవం వంటి మార్గదర్శి.

అధ్యాపకుడు శిల్పి వంటివాడు. శిల్పంగా మలచబడేది విద్యార్ధి. శిల్పి నైపుణ్యం అంతా అతను సృష్టించిన శిల్పంలో ప్రతిఫలిస్తుంది. శిల్పి పూర్తి సృజనతో, ఊహాశక్తితో ఉంటాడు. వాటి ప్రతిఫలమైన విద్యార్ధిలో కూడా అతన్ని రూపొందించిన టీచర్లో ఉన్న సృజనే ఉంటుంది. అందుకే శిల్పి తన శిల్పం చెక్కడంలో చిన్న పొరపాటును చేసినా, అది శాశ్వతంగా పాడైపోతుంది. టీచర్ ఈ బాధ్యతను గుర్తించి, ‘విద్యార్ధి’ అనే అద్భుతమైన శిల్పాన్ని మలుస్తాడు.

విద్యలోని తాజా మార్పులకు అనుగుణంగా ఒక టీచర్ తనను తాను మెరుగుపరచుకుంటూ ఉండాలి. అతను ఒక నిపుణుడు అయ్యి ఉండాలి. అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ (భావప్రసార నైపుణ్యం) బాగా ఉండాలి. విద్యార్ధి తేలిగ్గా అర్ధం చేసుకుని, జీర్ణించుకునేలా, అవసరమైన సమాచారాన్ని అతనికి అందించే సామర్ధ్యం ఉండాలి. ప్రతి విద్యార్ధి మంచివాడే, మంచి సామర్ధ్యం కలవాడే. ఒక మంచి టీచర్ దీన్ని అర్ధం చేసుకుని, విద్యార్ధిలో లోపాలు వెతకడు. నా అభిప్రాయంలో, ఒకవేళ ఒకవిద్యార్ది గురించి టీచర్ ఎక్కువగా షికాయతు చేస్తుంటే, అది బోధనలో టీచర్ అసమర్ధతే తప్ప, నేర్చుకోవడంలో విద్యార్ధి అసమర్ధత కాదు. కాబట్టి టీచర్ కే కౌన్సిలింగ్ ఇవ్వాలి. వీరిద్దరి మధ్య ఉన్న అంతరాన్ని, టీచర్ కు లోపాలున్న క్షేత్రాలలో అతనికి అత్యాధునిక ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా పూరించాలి.

ఈ రోజుల్లోని పిల్లలు కొన్నిసార్లు వారి ప్రవర్తనతో సవాలు విసిరేలా ఉంటున్నారు. ఒక వివేకవంతుడైన టీచర్ ఈ సవాళ్ళను అంగీకరించి, తగిన విధంగా తిరుగు సమాధానం ఇస్తారు. టీచర్లు ధైర్యంగా ఉండాలి, పిరికిగా కాదు. ఒకవేళ వారు పిరికివారైతే, విద్యార్ధి సంఘంలో వారు హాస్యాస్పదమైన అంశంగా తయారవుతారు. వారికి ఎటువంటి గౌరవం దక్కదు.

కేవలం విద్యార్ధుల దృష్టిలో మాత్రమే కాక, మొత్తం ప్రపంచం దృష్టిలో టీచర్లకు ఒక పూజ్య స్థానం ఉంది. అందుకే టీచర్లు తమకు, తమ విద్యార్ధులకు, సంస్థకు చెడ్డ పేరు తెచ్చే ఎటువంటి పనినీ చెయ్యకూడదు.

ఆచార్యదేవోభవ ...
సద్గురువులు, టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, రీడర్లు, గైడ్లు దైవంతో సమానం. నామటుకు వారు దైవం మాత్రమే కాదు, వారి చర్యలన్నీ దైవీకంగా ఉంటాయి. టీచర్ల సోదర సమాజానికి నా సాష్టాంగ ప్రణామాలు.

ఒక మంచి టీచర్ కు “అసాధ్యం” అన్న మాటే తెలీదు. అతను పదేపదే ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఒకవిధంగా  ఇదొక “ఉపాసన”, చిట్టచివరికి అతను ‘సాధన’ దశకు చేరుకుంటాడు.

ఉత్తమమైన టీచర్ ఒక ‘నాయకుడి’ లాగా చూడబడతాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. విద్యార్ధి అతన్ని అనుకరిస్తాడు. అతని పద్ధతినే జీర్ణం చేసుకుంటాడు. టీచర్ విద్యార్ధి ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రేరణ కలిగిస్తాడు. అటువంటి ఘనమైన విద్యార్ధి కేవలం అతనికి మాత్రమే ఉపయోగపడడం కాక, అతని కుటుంబానికి, మొత్తం ప్రపంచానికే ఒక గొప్ప ఆస్తి అవుతాడు.

ఒక టీచర్ విద్యార్ధుల్లోని ప్రతిభను తేలిగ్గా గుర్తించగలుగుతాడు. ప్రతి విద్యార్ధి ప్రత్యేకమైనవాడు, కాబట్టి అతనికి ఉండే ప్రతిభ కూడా ప్రత్యేకమైనదే. ఉత్తమ టీచర్ దీన్ని అర్ధం చేసుకుని, విద్యార్ధికి ప్రతిభగల క్షేత్రంలోనే అతను ఎదిగేలా సహకరిస్తాడు.

విద్యార్ధుల్లోని ప్రతిభను గుర్తించేందుకు టీచర్లలో సామర్ధ్యం ఉండాలి.
ఒక బలహీనమైన మనస్తత్వం కల వ్యక్తి, ఉత్తమమైన టీచర్ కాలేడు.
ఉత్తమమైన టీచర్ కు సహనం, నిలకడ ఉండాలి. అతను మంచి శ్రోత కూడా కావాలి.

ఒక మంచి టీచర్ అందరి అభిప్రాయాలను గౌరవించే ఆలోచనా సరళిని కలిగిఉంటాడు. ఒక టీచర్ గా తానూ నేర్చుకుంటూనే ఉన్నానన్న నిజం అతనికి బాగా తెలుసు. అందుకే అతను తన గురించి గొప్పగా లేక తక్కువగా ఎన్నడూ భావించడు. అతను మంచి సమతుల్యతను కలిగిఉంటాడు. నిజానికి, విద్యార్ధులు అతను పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగడం ద్వారా టీచర్ మరిన్ని సూక్ష్మమైన అంశాలను నేర్చుకునేలా సహకరిస్తారు. నేటి వరకు టీచర్లకు తెలియని ఎన్నో అంశాలను నేర్చుకునేందుకు విద్యార్ధులు కూడా వారికి ప్రేరణ కలిగిస్తారు.

విద్యారంగంలో ‘నాకు అన్నీ తెలుసు’ అనేది ఏదీ లేదు. ఒకవేళ తనకున్న విద్యార్హత వల్ల గర్వించిన టీచర్ ఈ విధంగా ఆలోచిస్తే, అదొక చికిత్స లేని ప్రమాదకరమైన వ్యాధి వంటిది. అటువంటి టీచర్లు విద్యార్ధులకు, సంస్థకు హానికరమైన వారు. వారు మానసిక రోగులు.

ఒక ఉత్తమ టీచర్ విద్యార్ధి సంఘంలో ఎటువంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని, విభేదాలను ప్రోత్సహించడు. అతను కేవలం విద్యార్ధుల మధ్య సామరస్యాన్ని, కలిసికట్టుగా ఉండడాన్ని మాత్రమే ప్రోత్సహిస్తాడు. దేశపు భావి పౌరుల భవితను మలచే బాధ్యతను తనకు అప్పగించారని, అతనికి పూర్తిగా తెలుసు.

సమర్ధుడైన టీచర్ కు కేవలం జ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదు. దాన్ని సరైన పద్ధతిలో, విద్యార్ధుల అవగాహనా స్థాయికి అనుగుణంగా వ్యక్తీకరించగలగాలి.
కొంతమంది టీచర్లు ‘ఏం చెయ్యాలో‘ నేర్చుకోవాలి.
కొంతమంది టీచర్లు ‘ఏం చెయ్యకూడదో’ నేర్చుకోవాలి.
రెండు వర్గాల వారూ విలువైన అంశాలనే బోధిస్తున్నారు.
ఒక ఉత్తమ టీచర్ తనకు వచ్చే జీతం గురించి ఆలోచించడు. అతను కేవలం విద్యార్ధుల భవిత గురించి మాత్రమే ఆలోచిస్తాడు. టీచర్ కు ఇచ్చే డబ్బును బట్టి, విద్యాబోధనలో నాణ్యతను చూపడం ఉండదు. నిజానికి, సంస్థ నిర్వాహకులు టీచర్ల అవసరాలను గురించి శ్రద్ధ వహించాలి. కాని ఒక మంచి సమర్ధుడైన టీచర్ డబ్బు గురించి మాట్లాడక, జీతం ఎంతైనా పిల్లలకు ఉత్తమమైన శిక్షణను ఇస్తాడు.

ఒక ఉత్తమ టీచర్, ఆరోగ్యకరమైన చర్చలను ప్రోత్సహిస్తాడు. అతను వక్రమార్గంలో పొతే అతన్ని వెనక్కు తెచ్చే హక్కు అతనికి ఉంది. అందుకే అతను పూర్తి జాగృతి స్థితిలో ఉండే ఒక జ్ఞాని.
ఒక విద్యార్ధి తాను ఇన్ని రంగులతో ఎగిరేందుకు పూర్తిగా సహకరించిన టీచర్ వద్దకు వచ్చి, కృతఙ్ఞతలు చెప్పినప్పుడు, అతను నవ్వి, “ నేనేమీ పెద్దగా చెయ్యలేదు. నిజానికి నేను నీకు బోధించినది అంతా నీకు ముందే తెలుసు. అనుకోకండా నీకవన్నీ గుర్తు చేసేందుకు ఆ సమయానికి నేనక్కడ ఉన్నాను. అల్ ద బెస్ట్.” ఒక విద్యార్ధి ఎంత నమ్రతతో ఉండాలో గ్రహించేందుకు, అనుసరించేందుకు టీచర్ ఇలా ఆచరించి చూపుతారు.
అటువంటి దైవంవంటి టీచర్ సాక్షాత్తూ దక్షిణామూర్తే !

తన స్థాయి తెలిసిన ఉత్తమమైన టీచర్, ఒక విద్యార్ధి బాగా చదవట్లేదని, అతన్ని ఇతర విద్యార్ధుల ముందు లోకువ చేసి, మందలించడు ఈ అంశాన్ని సానుభూతితో చూడాల్సి ఉందని అతనికి బాగా తెలుసు. అతను ఆ విద్యార్ధితో ఏకాంతంగా మాట్లాడి, సమస్యకు కారణం తెలుసుకుని, భవిష్యత్తులో అతను మంచి పురోగతి సాధించేలా ఊతమందిస్తాడు.

అందరు విద్యార్ధులూ నిష్ణాతులు కాలేరని, టీచర్ కు బాగా తెలుసు. కొంతమంది తక్కువ ప్రతిభ చూపుతారని అతనికి తెలుసు. వారిపట్ల అతను ప్రత్యేక శ్రద్ధ వహించి, వారు ఆ సబ్జెక్టులో మెరుగుపడేలా వారిపై దృష్టి పెడతాడు. అటువంటి విద్యార్ధుల్లో అతను అద్భుతమైన మార్పును తీసుకువస్తాడు.

ముందే మేధావులైన విద్యార్ధులు అధిక మార్కులు తెచ్చుకుని, మంచి స్కోర్ నో, గ్రేడ్ నో సాధిస్తారు. అటువంటి విద్యార్ధికి దారి చూపక్కర్లేదు. మంచి గ్రేడ్ తెచ్చుకోలేని విద్యార్ధులకు నిజంగా సాయం కావాలి. టీచర్ కు ఇది బాగా తెలుసు, అందుకే అతను అటువంటి విద్యార్ధులపై ఎక్కువ దృష్టి పెడతాడు. అంతేకాక, అటువంటి విద్యార్ధులకు దారి చూపినప్పుడే టీచర్ లోని నిజమైన సత్తా తెలుస్తుంది. నిజానికి, అటువంటి విద్యార్ధికి మంచి మార్కులు వచ్చేలా చెయ్యగలిగినప్పుడు, టీచర్ కు తన పనిలో అత్యధిక తృప్తి లభిస్తుంది. ఒక వివేకం కల టీచర్ ఇది తెలుసుకుని, దాన్నొక సవాలుగా తీసుకుని, అటువంటి విద్యార్ధుల్లో అవసరమైన మార్పును తీసుకువస్తాడు.
ముగింపు :
విద్యా క్షేత్రం విస్త్రుతమైనది. ఒక తర్కమైన ముగింపును సూచించకుండానే, ఈ అంశం గురించి ఎడతెగకుండా మాట్లాడుకోవచ్చు. నేను ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ మా గౌరవసూచకమైన అభినందనలు.
***

No comments:

Post a Comment

Pages