కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ - అచ్చంగా తెలుగు

కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

Share This

కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

పోడూరి శ్రీనివాసరావు 

         
ఈ నెల ప్రసిద్ధ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డ్ పొందిన తొలి తెలుగు సాహితీ వటవృక్షం – కవిసామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలుసుకుందాము. ఈ మహానుభావుని చేతినుంచి జాలువారిన సాహితీకుసుమాలు పుంఖాను పుంఖాలు.
          10.10.1895 వ తేదీనాడు కృష్ణాజిల్లాలోని ఉంగుటూరు మండలంలోగల నందమూరు అనే గ్రామంలో శ్రీ విశ్వనాథ శోభనాద్రి, పార్వతీ దంపతులకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు  జన్మించారు.
సాహితీ ప్రపంచంలో ఆ మహానుభావుడు చేయి వేయని ప్రక్రియ లేదు. కవిత్వం,కథలు,నవలలు,నవలికలు,వ్యాసాలు,నాటకాలు,ప్రసంగాలు... ఇలా ఒకటేమిటి! అన్ని రకాల ప్రక్రియలలోనూ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రచనలు చేశారు. చరిత్రలోనూ, ఆధ్యాత్మిక విషయాలపైన, వేదాంత సంబంధిత విషయాలపైన, సాంఘిక సంబంధిత సంగతులపైన, రాజకీయ సంబంధిత విషయాలపైన, భాషా సంబంధిత వ్యవహారాలపైన, మనస్తత్వ శాస్త్ర సంబంధిత విషయాలపైన, ప్రాచీన గ్రంథ సంబంధిత విషయాలపైన,.... ఇలా అనేక విషయాల గురించి, అంశాల గురించి శ్రీ సత్యనారాయణగారు తన రచనలను కొనసాగించారు.
          తిరుపతి వేంకట కవులుగా ప్రసిద్ధి గాంచిన శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి – శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగార్ల వద్ద శిష్యరికం కొనసాగించి వారినుంచి, వారి అపార మేథాసంపత్తికి సిసలైన వారసుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వీరు తమ విద్యాభ్యాసం మద్రాసు విశ్వవిద్యాలయంలో కొనసాగించారు.
          శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వివాహం శ్రీమతి వరలక్ష్మిగారితో జరిగింది. విశ్వనాథ దేవరాయలు, పావని శాస్త్రి వీరి సంతానం. విశ్వనాథ సత్యనారాయణ, విశ్వనాథ శక్తిధర శ్రీ పావకి, విశ్వనాథ మనోహర శ్రీ పాణిణి వీరి మనుమలు.
          కవిసామ్రాట్, కళాప్రపూర్ణ, పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డ్. డాక్టరేటు – వీరు సాధించిన, వీరికి బహుకరించిన కొన్ని గొప్ప అవార్డులు. తెలుగు సాహితీవనంలో జ్ఞానపీఠ అవార్డ్ పొందిన తొలి తెలుగు సాహితీవేత్త శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారే!
          విశ్వనాథ సాహితీ పీఠం వారి సమాచారం బట్టి శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి రచనలు  - ౩౦పద్యకావ్యాలు, 20 నాటకాలు, 60 నవలలు, 10 తులనాత్మక సమీక్ష వ్యాసాలు, 200 ఖండకావ్యాలు, 35 చిన్నకథలు, 3 నాటికలు, 70 వ్యాసాలు, 50 రేడియో నాటికలు, 10 వ్యాసాలు (ఇంగ్లీషులో) 10 సాహితీ ప్రక్రియలు (సంస్కృతంలో), 3 అనువాదాలు, 100 ముందుమాటలు – ఇంకా ఎన్నో రేడియో ప్రసంగాలు. వివిధ ప్రక్రియలతో, పుంఖానుపుంఖాలుగా ఇన్ని సాహితీ ప్రయోగాలు చేసినవారు – ఒక్క తెలుగు భాషలోనే కాదు... మరే ఇతర ప్రపంచభాషలలో నైనా బహుశా శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు ఒక్కరే అయి ఉండవచ్చు.
          శ్రీ విశ్వనాథ సత్యనారాయణవారి అవార్డుల విషయానికి వస్తే –కవిసామ్రాట్ బిరుదు; 1964 లో ఆంద్ర విశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ; 1942 లో గుడివాడలో గజారోహణ ; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే D.Litt పట్టాప్రధానం, విశ్వనాథ మధ్యాక్కరలకుగాను 1962 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్; 1970 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే పురస్కారం; 1970 లో భారతప్రభుత్వంచే పద్మభూషణ్; రామాయణ కల్పవృక్షం కు 1971 లో జ్ఞానపీఠ అవార్డ్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారికి దక్కిన అవార్డులు.
          శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు వారి రచనలలో యతి, ప్రాస, ఛందస్సు – తప్పనిసరిగా అనుసరించేవారు. వారి సమకాలీన కవులలో మరే ఇతర కవీ కూడా శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి అంత విషయ పరిజ్ఞానము, విషయ సంగ్రహణ, ఆఆవిషయాలపై అవగాహన, లోతుగా పరిశీలన కలిగిన వారెవ్వరూ లేరు. ఆయనంత ప్రతిభాశాలి.
          వారు వ్రాసిన పురాణ వైర గ్రంథమాలలో భాగాలుగా వారి రచనలు: భగవంతునిమీద పగ;నాస్తికధూపము;ధూమరేఖ;నందోరాజా భవిష్యతి; చంద్రగుప్తుని స్వప్నం; అశ్వమేథం; నాగసేనుడు; హెలీనా; పులిమ్రుగ్గు; అమృతవల్లి; నివేదిత; వేదవతి; దిండు క్రింద పోకచెక్క; చిట్లీచిట్లనిగాజులు;సౌదామిని;లలితా పట్టపు రాణి; దంతపుదువ్వెన; దూతమేఘం;కవలలు; యశోవతి; పాతిపెట్టిన నాణెములు;సంజీవకరణి; మిహిరకులుడు;భ్రమరవాసిని;ఏకవీర;ధర్మచక్రం; కడిమిచెట్టు; వీరపూజ; స్నేహఫలం; బద్దనసేనాని; పైన తెలిపిన ౩౦ గ్రంథాలు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి విరచిత పద్యకావ్యాలు.
          వీరు రచించిన పద్యాలు/గీతాలు: శ్రీ మద్ రామాయణ కల్పవృక్షం (జ్ఞాన పీఠ అవార్డ్ పొందిన గ్రంథం); ఆంద్ర పౌరుషం; ఆంధ్రప్రశస్తి; ఋతుసంహారం; శ్రీ కుమారాభ్యుదయము; గిరికుమారుని ప్రేమగీతాలు; గోపాలోదహరణం;గోపికాగీతాలు; ఝాన్సీరాణి; ప్రద్యుమ్నోదయం; భ్రమగీతాలు; మాస్వామిరురుచరిత్రము; వరలక్ష్మిత్రిశతి; దేవీత్రిశతి; విశ్వాత పంచశతి; విశ్వనాథ మధ్యాక్కరలు (కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన గ్రంథం); వేణీభంగం; శశిదూతము; శృంగారవీధి; శ్రీ కృష్ణ సంగీతం; నా రాముడు; శివార్పణము; ధర్మపత్ని; భ్రష్టయోగి; కేదారగౌళ;గోలోకవాసి.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన నాటకములు/నాటికలు: గుప్తపాశుపతం(సంస్కృతం నుంచి తెలుగు); అమృత శర్మిష్టం (సంస్కృతం); అంతా నాటకమే; అనార్కలి; కావ్యవేద హరిశ్చంద్ర; తల్లి లేని పిల్ల; త్రిశూలము; నర్తనశాల; ప్రవాహము; లోపలా-బయటా,వెనరాజు; అశోకవనము; శివాజీ-రోషనార; ధన్యకైలాసం; 16 నాటికల సంకలనం.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణవారి విరచిత తులనాత్మక వ్యాసాలు/పరిశీలనలు: కావ్యపరిమళము; కావ్యానందము; శాకుంతలము యొక్క అభిజ్ఞానత; అల్లసానివారి అల్లిక జిగిబిగి; ఒకడు – నాచనసోమన్న; నన్నయగారి ప్రసన్నకథాకవితాయుక్తి ; సీతాయాశ్చరితం మహత్; కల్పవృక్ష రహస్యములు;విశ్వనాథ సాహిత్యోపన్యాసములు;నీతిగీత;సాహిత్యసురభి.
తదితర రచనలు: కిన్నెరసాని పాటలు; యతిగీతం;కోకిలమ్మ పెళ్ళి; పాముపాట; చిన్నకథలు; what isa ramayan to me;  ఆత్మకథ; విశ్వనాథ అసంకలిత సాహిత్యం; విశ్వనాథ సంపూర్ణ నాటక సాహిత్యానిది; విశ్వనాథ సంపూర్ణ విమర్శ గ్రంధనిధి; కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి ఆత్మకథ; లఘుకావ్యాలు.
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన సాంఘిక నవలలు: వేయిపడగలు; స్వర్గానికి నిచ్చెనలు; తెరచిరాజు; మ్రోయు తుమ్మెద; సముద్రపు దిబ్బ; ఆరునదులు; చెలియలికట్ట; మాబాబు; జేబు దొంగలు; వీరవల్లుడు; దేవతలా యుద్ధం;వల్లభమంత్రి; విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు; పులుల సత్యాగ్రహం; పునర్జన్మ; పరీక్ష; నందిగ్రామ రాజ్యం; బాణామతి; అంతరాత్మ; గంగూలీ ప్రేమకథ; చందవోలు రాణి; ప్రళయ నాయుడు; హాహాహుహు; దమయంతీస్వయంవరం; నీలపెండ్లి; కుణాలుని శాపం; శార్వరి నుంచి శార్వరి దాకా....
ప్రసిద్ధిగాంచిన వీరి ‘వేయిపడగలు’నవల బహుభాషా కోవిదుడు మన మాజీప్రధాని శ్రీ పి.వి.నరసింహారావుగారు ‘సహస్రఫణి’ పేరుతొ హిందీలోకి అనువదించారు.
కొన్ని వీరి రచనలు ఇంగ్లీషులోకి, హిందీలోకి, తమిళంలోకి, మలయాళం లోకి, ఉర్దులోకి, సంస్కృతభాష లోకి అనువదింపబడ్డాయి.
వీరి అఖండ జ్ఞాపకశక్తికి, ధారణశక్తికి, వీరి గొప్పతనాన్ని తెలియజేస్తూ అనేక సంఘటనలు ఉన్నప్పటికీ మచ్చుకొక సంఘటన తెలియజేస్తాను.
అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వీరి సహాయకులు కొందరు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని భయంతో వణికిపోతూ ఆ విషయం విశ్వనాథ గారికి చెప్పారు.
అందుకు విశ్వనాథ గారు ” అందులో బాధపడాల్సింది ఏం లేదు” అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు.తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన కాగితాలు దొరికాయి. అత్యంత ఆశ్చర్యకరంగా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు.ఇంత అసాధారణ జ్ఞాపకశక్తి మనకు ఆశ్చర్యం కల్గించకమానదు.  అలాంటి గొప్ప.... మహనీయుడు శ్రీవిశ్వనాథసత్యనారాయణగారు. అలాంటి మహానుభావుడు తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాషా సరస్వతికి ఇంతటి అమోఘమైన, అఖండమైన సేవ చేయడం ఇన్ని వివిధ రకాల ప్రక్రియలతో, రకరకాల రచనలు చేయడం, తెలుగుభాష చేసుకున్న అదృష్టం. ఆయన జీవించియున్న కాలంలో మనమంతా కూడా వారిభాషాసంపదను చదువుకొని, అర్ధం చేసుకొని, ఆ మాధుర్యాన్ని ఆస్వాదించడం.... మన ఆంధ్రులందరి అదృష్టం.
అటువంటి సాహిత్యస్రష్ఠ; సరస్వతీపుత్రుడు; కవిసామ్రాట్, తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత; పద్మభూషణుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు తన అమూల్య జ్ఞానసంపదను మన తెలుగువారికి పంచిపెట్టి, తన 82 వ ఏట 18.10.1976 లో గుంటూరులో తుదిశ్వాస వదిలారు.
వారు మనకందించిన సాహితీ సంపదను, సద్వినియోగపరచుకొని, ఆ గ్రంథాలలోని విషయాలను ఆకళింపుచేసుకొని, ఇతోధికంగా తెలుగుభాషకు సముచితస్థానం కోసం మనం ప్రయత్నించడం, తెలుగుభాషకు అధికార ప్రాచీన హోదా కల్పించేటట్లు, దాన్ని నిలబెట్టేటట్లు చేస్తూ, తెలుగుభాష పరిరక్షణకు మనవంతు సహాయ సహకారాలందజేయడమే – మనం శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారికి అందించే నిజమైన నివాళి.
తెలుగుభాషకు జై....శ్రీ విశ్వనాథకు జై.
 ***

No comments:

Post a Comment

Pages