గోవింద నందనందన గోపాలకృష్ణ - అచ్చంగా తెలుగు

గోవింద నందనందన గోపాలకృష్ణ

Share This

 గోవింద నందనందన గోపాలకృష్ణ

                                                                                                            -డా. తాడేపల్లి పతంజలి

        
పురాణాల కథలను అనుసరించి  శ్రీ కృష్ణుడు రావి చెట్టుగా మారి పడమటి కనుమలలోని  సహ్యాద్రిపై నివసిస్తాడు.  కృష్ణానది  ఆ వృక్షములో పుట్టి , భూమిపై ప్రవహిస్తోంది. అసీకినీ, కృష్ణ, కృష్ణవేణి, కృష్ణాతటిని, కృష్ణాతరంగిణి  ఇవన్నీ కృష్ణానది పర్యాయపదాలు. కృష్ణ స్వరూపమైన కృష్ణానది పుష్కరాలు జరుగుతున్న సందర్భములో  అన్నమయ్య కుమారుడు పెద తిరుమలా చార్యులవారి కృష్ణ సంకీర్తనలో  అక్షర పుష్కర స్నానం  చేద్దాం.
 పల్లవి:     గోవింద నందనందన గోపాలకృష్ణ నీ
                భావము మాకుఁ జిక్కె గోపాలకృష్ణ
చ.1:        కొంగువట్టే వదేమోయి గోపాలకృష్ణ మా
                పంగెన కోపుదువా గోపాలకృష్ణ
                గొంగతనాల నవ్వేవు గోపాలకృష్ణ
                బంగారుకాశతోడి గోపాలకృష్ణ
చ.2:        కొమ్మల చీర లంటిన గోపాలకృష్ణ
                పమ్మి నిన్ను దిట్టము గోపాలకృష్ణ
                కుమ్మరించే వేల సిగ్గు గోపాలకృష్ణ
                బమ్మెర పో కిందుల గోపాలకృష్ణ
చ.3:        కొసరకు మంత నీవు గోపాలకృష్ణ నీ
                పస నే నెఱుఁగనా గోపాల కృష్ణ
                పొసఁగ శ్రీవేంకటాద్రిఁ బొందితి నన్ను
                పసి మెక్కె మొగము గోపాలకృష్ణ     (రేకు:39-4సం: 17-233)

అర్థ తాత్పర్యాలు
                గోవిందా! (భూమిని, గోవును, స్వర్గమును, వేదమును పొందెడువాడు)  నందనందన!(నందుని కుమారుడా !) గోపాలకృష్ణ   (ఆవులను రక్షించువాడా ! కృష్ణా !)నీ భావమేమిటో- నీ అసలు కథ ఏమిటో మాకు చిక్కిపోయింది.
చ.1:
                అదేమిటోయీ !  గోపాలకృష్ణ!  మా అడవాళ్లని కొంగుపట్టుకొని బలవంతం చేస్తావేమిటి?
                నీ పంగెనకు (=ఎగతాళిమాటకు) ఓపుదువా(ఓర్చుకొంటావా?)  నువ్వు ఎగతాళిగా మాట్లాడితే మేము ఊరుకొంటామా? !   మేము కూడా ఏదో అనకుండా ఉండలేం. మరి మేము అనేది  నీ ఎగతాళి మాటల ఫలితం. దానిని ఓర్చుకొంటావా?
                ఆ బంగారము లాంటి కాశను (=ఱెల్లుగడ్డిని) మాకు చూపిస్తూ , బెదిరిస్తూ గొంగతనాలతో (=శత్రుత్వాలతో)  ఎందుకు                 నవ్వుతున్నావు గోపాలకృష్ణా ! నీకు , మాకు మధ్య శత్రుత్వాలు ఏమున్నాయి?
                ఆ..ఆ.. అర్థమయిందిలే..... ప్రవాహంలో పడి మునిగిపోతున్నవాడు చేతికి దొరికిన గడ్డిపోచనైనా పట్టుకొని ప్రాణరక్షణ         చేసుకోవాలని అనుకుంటారు కదా !
                మాకు కష్టాలేమన్నా వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న అవకాశాన్ని వాడుకొని బయటపడమని కదా నీ సందేశము. బాగానే ఉంది         కాని. ఆపాటి దానికి ఆ గొంగతనాల నవ్వు (శత్రుత్వాల నవ్వు )ఎందుకయ్యా ! మాములుగా నవ్వవయ్యా బాబూ ! నీ నటన        చాలులే!
చ.2:
                అయినా ఇవేమి పనులయ్యా ! ఏది కాత్యాయనీ వ్రతము చేసుకుంటున్నాము. ఆసందర్భంగా మా బట్టలు కడిమి చెట్టు కొమ్మల మీద  ఉంచాము.వాటిని అంటుకోవలసిన, అపహరించవలసిన అవసరం నీకు ఏముందయ్యా !
                 అయినా అలా చేసినప్పటికీ పమ్మి(=విజృంభించి, అతిశయించి)  నిన్ను మేము  తిట్టములే గోపాలకృష్ణ! ఎందుకంటే
          తప్పు మాదగ్గర ఉందని నువ్వు చెప్పావు కదా ! వివస్త్రలుగా స్నానము చేయకూడదని, ఆవిషయం మాకు తెలియచేయాలని
          ఇలా  వస్త్రాపహరణము చేసానని చెప్పావు కదా ! నిజమే కదా !
                బమ్మెర పోక (=భ్రమపడక, సందేహ పడక)ఇందుల  (=ఇక్కడ)మేము అలా స్నానం చేసిన శరీరాలతో బయటికి       వస్తుంటె           అంత సిగ్గు కుమ్మరిస్తావేమిటయ్యా ! సిగ్గు పడవలసింది నువ్వా?!      మేమా?!
చ.3:        గోపాలకృష్ణ  ! ముద్దు, కౌగిలి ..ఇంకొంచెం ...ఇంకొంచెం ..అని కొసరుతావు.. ఏమిటి?  నీ పస ఏమిటో నాకు తెలియదా స్వామీ
          ఇవాళ్టికి చాలులే...
                పొసఁగ (= ఇద్దరికి అనుకూలించిన)  శ్రీవేంకటాద్రి (= శ్రీ వేంకట పర్వతములో) నన్ను హాయిగా పొందావు కదా !
                గోపాల కృష్ణ ! నాతో కలిసిన తర్వాత  తమరి మొగము (= మోము) బాగా పసిమి ఎక్కింది. ( =  ఎఱుపును మించిన పసుపు           రంగుతో కళకళలాడుతోంది.)
 విశేషాలు
          ఈ కీర్తనలో మొదటి , మూడు చరణాలలొ ఒక్క గోపిక మాట్లాడుతున్నట్లు, రెండవ చరణంలో అనేక మంది  గోపికలు           మాట్లాడుతున్నట్లు  క్రియాపదాల వైవిధ్య ప్రయోగాలద్వార అనిపిస్తుంది.
           గోవిందుడు ఇంద్రునికి  కోపం వచ్చి గోగణాల విూద శిలలతో కూడిన పెను వర్షాన్ని కురిపించాడు.అప్పుడు  కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి  దాని కింద గోగణాలకు ఆశ్రయం కల్పించాడు.  ఇంద్రుడు కృష్ణుని గొప్పతనాన్ని  తెలుసుకొని, , గోగణాలకు కృష్ణుడిని అధిపతి       చేసాడు.  అప్పటి నుంచి కృష్ణుడు గోవిందుడయ్యాడు. రామునికి దాశరథి అనే పేరు చాలా ఇష్టమైనట్లు, కృష్ణునికి గోవిందుడనే  పేరు చాలా ఇష్టమట.
           గోపికాగీతలలో  గోపికలు శ్రీకృష్ణుని పరమాత్మగా గుర్తించి ఇలా పొగిడారు.
           నీవు యశోద బిడ్డడవె? నీరజనేత్ర సమస్త జంతుచే
           తోవిదితాత్మ వీశుడవు తొల్లి విరించి దలంచి లోక ర
           క్షావిధ మాచరింపుమని సన్నుతి సేయగ నత్కులంబునన్‌
           భూవలయంబు గావ నిటు బుట్టితిగాదె మనోహరా కృతిన్‌. 10.1-1041-.
           పద్మాక్షుడా ! కృష్ణుడా  !  నీవు యశోదాదేవి యొక్క కొడుకువా ! అంతేకాదు . సమస్తమైన జీవుల యొక్క మనస్సులలో                  తెలియబడెడి పరబ్రహ్మవు;సర్వనియామకుడవు;
          ఇంతకుమునుపు జగత్తును  కాపాడునట్టి మార్గమును చేయుము అని  బ్రహ్మదేవుడు నిన్ను  ధ్యానించి   స్తోత్రము చేసాడు.           అందువల్ల  మంచి వంశములో ఈ  భూమండలాన్ని  కాపాడటానికి  ఈ విధముగ  అందమైన రూపముతో అవతరించావు  కదా.!
   బాగా సన్నిహితుడిని  ఏరా ! అని ఆప్యాయంగా పిలవాలనిపిస్తుంది.సరదాగా రకరకాలుగా కొంటెగా                          మాట్లాడాలనిపిస్తుంది.  ఆ సన్నిహితుడు ఎంతో గొప్పవాడని తెలిసినా – ఏమండీ ! అని పిలవలేము.
                   .ఆ సందర్భంలో భాష వ్యాకరణాలను వెతుక్కోదు. అంతకరణాల సంభాషణ అది.
                   గోపికలు , కృష్ణుని మధ్య ఆత్మీయత అదే.
                   అన్నమయ్య కుమారుడు పెద తిరుమలయ్య ఈ గీతంలో  అందుకే గోపికలతో అలా మాట్లాడించాడు. స్వస్తి.
 
********

No comments:

Post a Comment

Pages