బామ్మ పుష్కర స్నానం

శారద పోలంరాజు


"ఏం బామ్మా! అంత దిగాలుగా కూర్చున్నావు? తాతయ్య గుర్తుకొచ్చారా?" బామ్మగారి పక్కనే ఉయ్యాలబల్ల మీద కూర్చొని గారాబంగా బామ్మ భుజం మీద తల వాల్చి చిలిపిగా అడిగింది రాగిణి.
"చాల్లేవే భడవాకానా. మళ్ళీ మొదలెట్టావా అల్లరి. అయినా అమ్మడూ మీ తాతయ్యను నేను మరిచిపోయింది ఎప్పుడని? ప్రత్యేకంగా ఙ్ఞాపకం రావటానికి." వృద్ధురాలి కళ్ళల్లో అనిర్వచనీయమైన మెరుపు తళుక్కుమంది.
అంతకు క్రితమే భర్త నీరజ్‌‍కు బామ్మకు జరిగిన సంభాషణ నెమరు వేసుకుంది రాగిణి.
"బామ్మా ఈ వయసులో నీకు ప్రయాణం అంత మంచిది కాదంటే అర్ధం చేసుకోవేం? అయినా నాన్నకు కూడా ఈ మధ్య బిపి షుగర్ మొదలయ్యాయి. అమ్మకేమో కాళ్ళూ కీళ్ళు నొప్పులు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు విజయవాడకు వెళ్ళడం అయ్యే పనేనా?" అంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోవటం అప్పటి నుండే బామ్మ ఉదాసీనంగా కనిపించడమూనూ.
పరిస్థితి అర్ధం చేసుకున్న రాగిణి ఏదో ఒక పరిష్కారం చూడాలని తీవ్రంగా ఆలోచించ సాగింది.
"అదిగో టివిలో ప్రవచనాలు వస్తున్నాయి. కాస్త అల్లరి మానేసి కుదురుగా కూర్చో. ఆయన చూడు పుష్కరాల మీద ఎంత బాగా వివరిస్తున్నారో?" ఇంక ఆవిడ దృష్టి బ్రహ్మ రుద్రాదులు వచ్చినా మార్చ లేరని తెలిసి పక్కనే పేపరు చేతిలోకి తీసుకుంది రాగిణి.
కార్యక్రమం పూర్తయింది బామ్మ టివి ఆపేసింది. "అబ్బ ఎంత చక్కగా వివరిస్తున్నారే అమ్మడూ పుష్కరాల ప్రాముఖ్యం?"
"బామ్మా మీరెప్పుడైనా పుష్కర స్నానం చేసారా?" ఏమీ ఎరగనట్టే అడిగింది.
"ఓసి పిచ్చి తల్లీ ఎప్పుడైనా చేయలేదా అని అడుగు.  నేను పుట్టి బుద్దెరిగినప్పటి నుండి పోయిన పుష్కరం దాకా మీ తాతయ్యతో కొంగు కొంగు కట్టుకొని సరిగంగ స్నానం చేసానే అమ్మడూ. ఆ మహరాజు పదేళ్ళ క్రితమే నన్నొదిలేసి పాయె." కళ్ళల్లో క్రీనీడలు కనిపించాయి.
రాగిణి భర్త బామ్మగారితో మాట్లాడుతూ చిన్ననాటి విషయాలు చెప్తూ ఉంటే ఆనందంగా వింటుంది.
***********
ఇంక ఆవిడ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళి పోయినట్టు ఙ్ఞాపకాల చిట్టా విప్పింది.
ఎనభై ఏళ్ళ వయసు ఉన్న బామ్మ అనబడే సుందరమ్మ రాగిణి మామగారికి తల్లి. చెప్తే కాని ఆవిడ వయసు ఎవరికి తెలియదు. అంత చురుగ్గా ఉంటుంది. అన్ని చేతికళలే కాకుండా ఇప్పటికి కూడా వంటలు  చేసి మనుమలకు పెడుతూనే ఉంటుంది. పెరట్లో మొక్కల పోషణ చేయడం, రోజూ తెల్లారుఝామునే లేచి పూలు కోసుకొచ్చి పూజ చేయడం మొత్తమంతా పనులన్ని చులాగ్గా చేస్తూ ఉంటుంది. పాపం ఒక్కటే లోటు. అంత చురుగ్గానూ ఉండే తాతగారు ఆరేళ్ళ క్రితం ఆరోగ్యంగా తిరుగుతూ హటాత్తుగా గుండె పోటుతో మరణించాడు.
**********
"అమ్మడూ నాకు పెళ్ళయేటప్పటికి ఏడో ఏడురా. మీ తాతయ్యకు ఎస్.ఎల్.సి పరీక్షలు. పరీక్షలయ్యాక  మళ్ళీ ఏడు పెళ్ళి చేద్దామనుకున్నారా, ఇంతలోకే ఎవరో పుష్కరాలు వచ్చేస్తాయి. శుభకార్యాలు చేయకూడదు అనేటప్పటికి ఇంక హడావుడిగా చేసేసారు.
పాపం మీ తాతయ్యను భలే కట్టడి చేసారులే." ముసిముసి నవ్వులు నవ్వుతూ బామ్మ చెప్తూన్న విషయాలు అంత కన్నా మురిపెంగా వింటోంది. ఆవిడకు ఏదైనా చెప్పే మూడ్ వచ్చినప్పుడు మధ్యలో ప్రశ్నలేస్తే మహా కోపం.
"చెప్పేది వినవే భడవకానా” అని ఒక్క కసురు కసురుతుంది. ఆవిడ ధోరణిని ఆపడం ఎవరి వల్లా కాదు.
"చదువు కాస్త కొండెక్కుతుందని పాపం కొత్త పెళ్ళి కొడుకని కూడా చూడకుండా పండగలకు కూడా రానివ్వకుండా కూలేసారు."
"సరే అదలా ఉంచి. పెళ్ళయిన మరేడే పుష్కరాలని చెప్పా కదా! మా అత్తారింట్లో ఇంకా ముసలాళ్ళు ఉండేవారు. కొత్త పెళ్ళికొడుకు పెళ్ళి కూతురూ కొంగులు ముడేసుకొని సరిగంగ స్నానాలు చేయాలన్నారు. ఇంక చూసుకో అటు పుట్టింటి వాళ్ళు ఇటు అత్తింటి వాళ్ళూ బండ్లకు బండ్లు కట్టుకొని పుష్కర స్నానానికి బయలు దేరారు. పెద్ద వాళ్ళేమో వాళ్ల పెద్దలకు తర్పణాలూ, కుర్రకారేమో ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటూ సరసాలాడుకుంటూ స్నానాలు. మరి నాకేమీ తెలియదయిపాయె. అత్తగారు ఏమి చెప్తుందో అని అట్లాగే  ఒడ్డున ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంత లోకే హటాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడో మీ తాతయ్య వచ్చేసాడు. ఇంక చేయి పుచ్చుకొని మనిద్దరమూ చేయీచేయీ పట్టుకొని స్నానం చేయాలట పదవే అంటూ గబుక్కున నీళ్ళలోకి లాగేసాడు. ఇంకేముంది నాకేమో మొదటిసారి అందరిలోకీ వెళ్తున్నానని మా అమ్మ పెద్ద జరీ అంచు పట్టు పరికిణీ జడకుప్పెలు అన్ని వేసి సింగారించింది. ఆ అదుటున నీళ్ళల్లో పడేటప్పటికి తడిసి కట్టుకున్న పరికిణా బరువుగా అయి ఒక బుట్టలాగా అయిపోయింది. అది సవిరించుకోటానికి మీ తాతయ్య చేయి విదిలించుకోవటమేమిటి? బుడింగున నీళ్ళల్లో మునిగి పోవటమేమిటి అన్ని క్షణాల మీద జరిగిపోయింది.
అసలే పిరికివాడు. ఇంక ఏడుపు లంకించుకొని మీ తాతయ్య కూడా నీళ్ళల్లో మునిగి నన్ను ఘాట్టిగా వాటేసుకొని ఎట్లాగో పైకి తేలాడు.
ఇంక చూసుకో నేనేమో భయానికి ఆయన్ని మరింత గట్టిగా పట్టుకొని ఒకటే ఏడుపు. ఈ లోగా పెద్దవాళ్ళంతా వచ్చి ఇద్దరినీ బయటకు లాగి ఒడ్డున పడేశారు. అయినా ఇద్దరమూ ఒకరిని ఒకరము వదలమే. అట్లాగే వాటేసుకొనే ఎంతో సేపు ఉండి పోయాము. చుట్టూ చేరిన వాళ్ళంతా ఒకటే నవ్వులు.
"వారినీ నీ పెళ్ళానికి ఏమీ కాలేదు వదల్రా అని గోల గోల. ఆ పాటికి అమ్మనాన్న అత్తయ్య మామయ్య వచ్చి ముక్క చివాట్లు.
"ఏం తొందరొచ్చిందిరా? అక్కడ క్రతువు ముగించి మీ చేత శాస్త్రోక్తంగా స్నానం చేయిద్దామంటే ఇంత హడావుడి చేస్తారా?" అని తిడుతూనే, "పోనీలే గండం తప్పింది." అంటూ ఇద్దరినీ కూర్చోబెట్టి దిష్టి తీసారు.
అట్లా ఆరంభమయిందే అమ్మడూ. మీ తాతయ్య బతికి ఉన్నన్నాళ్ళూ అన్ని సార్లూ కృష్ణమ్మకు పుష్కరాలలో పూజ చేయటం ఆపలేదు.
అమ్మాయీ ఆయనలో గొప్పదనం ఏమిటంటే, ఒకసారి వెళ్ళిన స్నాన ఘట్టానికి మళ్ళీ సారి వెళ్ళే వాళ్ళము కాదే. అదేమంటే, తడవకొకసారి మరో ఊరు ఆ చుట్టుపక్కల గుళ్ళూ గోపురాలూ చూడొచ్చు అనే వాడు. అట్లా ఈ పాటికి ఏడు ప్రాంతాలలో పుణ్య క్షేత్రాలు చూపించాడే ఆ మహానుభావుడు. లేక పోతే మా బోటివాళ్ళకు ఆ ప్రాంతాలన్ని ఎట్లా చూసేది? ముందర పూజ చేసేవాళ్ళము. ఆ తర్వాత పెద్దలకు విధిగా తర్పణం వదిలేవాడు మీ తాతయ్య.
ఆయనకు ఎంత సరదా అనుకున్నావు? చివరి పుష్కరం అంటే 2004 వచ్చిన పుష్కరానికి కూడా  వచ్చి ఎంచక్కా కొంగులు ముడేసుకొని స్నానం చేయడం వాళ్ళ అమ్మనాన్నకు తర్పణం వదలడం అన్ని చేసాడే అమ్మడూ. ఆ విధంగా ఏడుసార్లు పుష్కర స్నానం చేసానమ్మా.  ఆ తరువాతే ఇదిగో ఇప్పుడు ఆ ఙ్ఞాపకాలలోనే బతుకుతున్నాను. కృష్ణమ్మకు పూజ చేసే ప్రాప్తం నాకు ఈ ఏడు దక్కేట్టు లేదు."
బామ్మ గారి కళ్ళల్లో నీళ్ళు తిరగడం చూసిన రాగిణికి ఏమి మాట్లాడాలో తోచలేదు.
"ఏమర్రా బామ్మా మనవరాలికి కాఫీల వేళయిందన్న ధ్యాస కూడా లేకుండా కబుర్లలో పడ్డారా? ఏమ్మా రాగిణీ. ఈ రోజు ఏ ఘట్టం మీద చర్చ?" అత్తగారి మాటలకు ఉలిక్కిపడి లేచింది కోడలు.
లేచి అత్తగారి భుజాల చుట్టూ చేతులు వేసి చెంపకు చెంప చేర్చి, "ఏముంటాయి అత్తయ్యా, మీ పెళ్ళయిన కొత్తల్లో మీరిద్దరూ ఎట్లా పోట్లాడుకొనే వారో వివరిస్తున్నారు బామ్మగారు." చిలిపిగా చూస్తూ, "ఏం బామ్మా ఔనా" అంది
"చాల్లేవే భడవాకానా నువ్వుంటే ఇంక నారదుడికి పనే లేదు. పద పద ఆ కాఫీ నీళ్ళు గొంతులో పోసుకొని వద్దాము."
************
ఆ రాత్రి రాగిణికి ఎంత సేపటి దాకానో కన్ను మూత పడలేదు. బామ్మ చెప్పిన విషయాలు గురించి ఆలోచిస్తూనే ఉంది. ఎట్టకేలకు ఒక ఆలోచన రూపు దిద్దుకుంది.
మర్రోజు భోజనాలయ్యాక అత్తమామగారు హాల్లో టివి చూస్తూంటే పక్కనే చేరి మౌనంగా గోళ్ళు కొరుక్కుంటూ కూర్చున్నది. అత్తగారు ఓరకంట గమనించి, "ఏమే వాగుడు కాయా, ఏమిటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పైకప్పు దేనితో వేయాలనా?" ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడే కోడలు మౌనంగా ఉండేటప్పటికి అత్తగారు హాస్యంగా అడిగింది.
"అబ్బ ఏం లేదత్తయ్యా.....బోరు కొడుతోంది. వారం రోజులు కాలేజీకి సెలవులంటే విసుగ్గా ఉంది అట్లా ఎటైనా తిరిగి వద్దామనిపిస్తోంది." అత్తగారి భుజం మీద తలవాల్చి దిగాలు మొహం పెట్టి అన్న కోడలు చెంపలు నిమురుతూ, "ఓసి పిచ్చి మొహమా దానికి అంత ఆలోచించాల్సింది ఏమిట్ట? వాడికి కూడా వరసాగ్గా నాలుగు రోజులు లాంగ్ వీకెండ్ అంటున్నాడుగా! ఎటైనా తిరిగి రండి." సులువుగా అనేసిన అత్తగారి వైపు రుసరుసలాడుతూ,
"మేమిద్దరమూ వారం వారం తిరిగి వస్తూనే ఉన్నాము కదా! అందరమూ సరదాగా ఎటైనా వెళ్ళొద్దామనిపిస్తోంది."
"సరేలేమ్మా మీఅత్తయ్యను తీసుకొని వెళ్ళావంటే అక్కడే చతికిలబడిపోతుంది. అసలే కాళ్ళు నొప్పులు అంటూ ఏ పనీ చేయలేక మూలపడి నీకు మా అమ్మకు వంటిల్లు అప్పగించేసిందాయె." మామగారు నవ్వుతూ అందుకున్నాడు.
"అదే మామయ్యా. నేనంటున్నది కూడా అదే. అత్తయ్య ఎక్కడికీ కదలక కీళ్ళూ కాళ్ళూ మొండికేస్తున్నాయి. మీకెందుకు అత్తయ్యకు మీకు ఏ ఇబ్బంది కలక్కుండా నేనన్ని ఏర్పాట్లు చేస్తాగా. మామయ్యా మామయ్యా ప్లీజ్ ఎటైనా రెండు రోజులు వెళ్ళొద్దాం మామయ్యా." గారాబంగా అంటున్న కోడలి మాటలను కాదనలేక,
"సరేనమ్మాయీ ఎక్కడికి వెళ్దామో నువ్వే చెప్పు."
ఆ మాటలకే తన ప్లాన్ సగం విజయవంతమయిందన్న ఆనందంతో, "మామయ్యా, ఈ మధ్య బాగా వానలు పడ్డాయి కదా నాగార్జునసాగర్ లో బాగా నీళ్ళు వచ్చి గేట్లు ఎత్తారట. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. మళ్ళీ చూద్దామనిపిస్తోంది. మనం నాగార్జునసాగర్ వెళ్దాము."
"సరేనమ్మా అట్లాగే వెళ్దామనుకో. మరి బామ్మను చూసుకొనే వారెవరు?" మిలియన్ డాలర్ ప్రశ్న వేసింది అత్తగారు.
"భలేవారే అత్తయ్యా! మీకు భలే సందేహాలు వస్తాయే! బామ్మ కూడా మనతోపాటే వస్తారు. మీకు ఏ దిగులూ వద్దు అక్కడ మా కాలేజీ వాళ్ళకు తెలిసిన చక్కటి గెస్ట్ హౌజ్ ఉంది. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ముగ్గురిని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను."
"రోడ్లు కూడా బాలా బాగున్నాయి. అసలు ప్రయాణం చేసినట్టే ఉండదు. పాపం బామ్మకు మాత్రమూ అన్ని చూద్దామని ఉండదా ఏమిటి?"
కోడలు అంతలా ఊదరకొట్టేటప్పటికి అత్తమామ ఒప్పేసుకున్నారు.
**********
పెద్దవాళ్ళనయితే ఒప్పించింది. ఇంక పతిదేవుడిని మెప్పించి ఒప్పించాలి. "ఏకాంత రామయ్య నీ చెంతగా చేర" అన్న పంధాలో రాత్రి అతను లాప్‌టాప్ మీద పనిపూర్తయి మొబైల్ లో వాట్స్ ఏప్ మెసేజీలు చూసుకుంటూ ఉంటే పక్కన చేరి, "పాపం అత్తయ్య మామయ్య ఇంట్లో కూర్చొని కూర్చొని విసుగు పుట్టిపోతోందని ఒకటే బాధ పడుతున్నారు తెలుసా?"
"అవునా! అయినా ఈ వయసులో ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా?" మొబైల్ నుండి తల ఎత్తకుండానే  నవ్వుతూ అన్నాడు.
చర్రుమంది రాగిణికి. ఒక్కసారి మొబైల్ చేతిలో నుండి లాక్కుని, "ఇదిగో టూమచ్ చేయవద్దు. నేనొకపక్క సీరియస్‌గా మాట్లాడుతూంటే మీకు జోకులాగా ఉందా?"
"సరే సరే. సంగతేమిటో చెప్పు" సర్దుకు కూర్చునాడు. "నా మొబైల్ ఇచ్చేయి." ట్రింగ్ ట్రింగ్ అంటూ మొత్తుకుంటూనే ఉంది ఆవాట్స్ ఆప్
"నేనివ్వను." మొబైల్ పక్కకు దాచిపెడ్తూ, "పాపం అత్తయ్య మామయ్య బామ్మ ఇల్లు కదలక ఎంత కాలమయిందో గమనించారా? మధ్యాహ్నం వాళ్ళనుకుంటూంటే విన్నాను. నాగార్జున సాగర్ వెళ్ళొస్తే బాగుంటుందంటున్నారు. ఈ వారం మీకు మూడు రోజులు సెలవులు వచ్చాయిగా! అందరమూ వెళ్ళొద్దాము ప్లాన్ చేయండి. అంతే ఇంక తిరుగు లేదు. మా ఫ్రెండ్ గెస్ట్ హౌజ్ ఏర్పాటు చేయమని ముందే చెప్పేసాను. శుక్రవారం పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ చేసి బయల్దేరుతున్నాము. అంతే"
"ఓసినీ అఘాయిత్యం కూలా......అన్ని ఏర్పాట్లు చేసుకొని ఏదో పత్తిత్తులాగా నా పర్మిషన్ అడగుతున్నట్టు నాటకాలా?
***********
అనుకున్న నాటికి అందరూ కార్లో బయల్దేరారు. ఇనోవా కారు కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేకుండా విశాలంగా కూర్చో కలిగారు.
"నిజమేనమ్మా......ఇంత కాలం ఇంట్లో కూర్చొని కూర్చొని విసుగ్గా ఉంది. పంజరం లో నుండి బయట పడ్డట్టు హాయిగా ఉందమ్మా." మామగారు మెచ్చుకోలుగా అన్నారు.
బయలదేరదీయటమైతే జరిగింది. ఇంక తాను అనుకున్న కార్యక్రమం కూడా నిరాటంకంగా జరిగిపోవాలి దేవుడా! అంటూ పదేపదే వేడుకుంటున్నది.
ఆ సాయంత్రం గెస్ట్ హౌజ్ ముందు గార్డెన్‌లో కూర్చొని కాలక్షేపం చేసారు.
"అమ్మాయీ ఈ రోజు ఎటెళ్దామమ్మా? అట్లా బోటులో నాగార్జున కొండ వైపు వెళ్ళొద్దామా?" అత్తగారి కాళ్ళూ కీళ్ళూ ఎటెళ్ళిపోయాయో ఆ వాతావరణానికి ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చేసింది.
"నాగార్జున కొండ వైపు ఈ రోజు చాలా రష్ గా ఉందట అత్తయ్య. రేపైతే కాస్త తగ్గుతుందన్నారు. ఈ రోజు అందరమూ వాటర్‌ఫాల్స్ వైపు వెళ్దామా?"
"అట్లాగేనమ్మా. నీవెట్లా ప్లాన్ చేస్తే అట్లాగే వెళ్దాము."
ఆ పాటికే బామ్మగారు గార్డెన్‌లో వాకింగ్ చేస్తోంది. "చూసారా మామయ్యా. మనందరికన్నా బామ్మనే చురుగ్గా ఉన్నారు. నిన్నటి ప్రయాణపు బడలిక మచ్చుకైనా లేదు." క్రీగంట భర్త వైపు చూస్తూ అన్నది.
అందరూ మళ్ళీ కార్లో ఎక్కి కూర్చున్నారు. రాగిణి చేతిలో పెద్ద బాగ్ పట్టుకొని వచ్చింది.
కొంత దూరం వెళ్ళేటప్పటికి కారు ఆపుతూ ఒక పురోహితుడు కనిపించాడు. "అమ్మా నన్ను కాస్త ఆ ఎదర దింపుతారా?" బ్రతిమిలాడుతూన్నట్టు అడిగాడు.
"దాందేముందండీ రండి కూర్చోండి." అంటూ ఆహ్వానించింది.
ముందర ఏర్పాటు చేసి పెట్టుకున్న స్థలంలో కారు ఆగింది. ఎట్లాంటి రాళ్ళూ గుట్టలూ లేకుండా నేల చదరంగా ఉంది.
వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. నీళ్ళు చిందిపడుతూన్నాయి. చెదురుమదురుగా జనం ఉన్నారు. స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. తర్పణాలు వదిలేవారు ఆ పనిలో ఉన్నారు.
మెల్లిగా అత్తగారి పక్కకు చేరింది. "అత్తయ్యా, ఏమిటి అక్కడ వాళ్ళంతా ఏవో పూజలు చేస్తున్నారు?"
"అదా! పుష్కరాలు కదా అమ్మాయీ పెద్దలకు తర్పణాలు వదులుతున్నారు?"
"మరి మామయ్యా, మీరు తాతగారికి తర్పణం వదల వచ్చు కదా! తాతగారు పోయాక మొదటి పుష్కరం తర్పణం వదిలితే మంచిది అని బామ్మగారు ఎన్నోసార్లు దిగులుగా అన్నారు." అనుకోని ఆ ప్రశ్నకు అత్త మామ ఒక్కసారి ఏమీ చెప్పలేకపోయారు.
వెంటనే తిప్పుకొని, "వదలవచ్చమ్మా. అయినా ముందుగా అనుకోలేదు కదా! చాలా ఏర్పాట్లు చేయాలి. తడి బట్టలు మార్చుకోటానికి పొడి బట్టలు కావాలి. నువ్వుల వంటి సామాగ్రి కావాలి." మామగారు సర్ది చెప్పసాగాడు.
"మామయ్యా ఆ ఏర్పాట్లన్ని నేను చేస్తాను. మీరు అత్తయ్య తాతగారికి తర్పణం వదలండి. అదిగో బామ్మగారు చూడండి. ఎంత ఆశగా ఉన్నారో!"
అంతే....ఆ మాట తుపాకి గుండులా తగిలింది. ఆయనకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిజమే ఎంత మూర్ఖుడిని నాన్న బతికి ఉన్నన్నాళ్ళూ అమ్మ తప్పనిసరిగా పుష్కర స్నానం చేసేది. ఈ సారే............
మామగారిలో స్పందన చూసింది రాగిణి. ఆనందంతో గంతులు వేద్దామన్నంత ఉత్సాహం వచ్చేసింది.
"మామయ్యా. అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉన్నాయి. మీరు అత్తయ్య స్నానాలు చేసేయండి. నేను ఇప్పుడే వస్తాను." అంటూ రివ్వున పరిగెడుతున్న రాగిణిని విస్తు పోతూ చూస్తున్నారు బామ్మ అత్తమామగారితో పాటు భర్త కూడా.
 కార్లో డిక్కీలో పెట్టిన సంచీ లోంచి ఒక్కొక్కటే పంచపాత్ర ఉద్దరిణ వంటి సామాగ్రి తీసింది. దూరంగా నిలబడ్డ తమతో కూడా వచ్చిన పురోహితుడిని చేయి ఊపి పిలిచింది.
"రండి శాస్త్రిగారు. కావలసిన సామాను అంతా తెచ్చారు కదా! మేము కూడా స్నానాలు చేసి వస్తాము."
"అత్తయ్యా మామయ్యా మీరు ఇద్దరూ స్నానం చేసి రండి. మీరు రాగానే బామ్మను తీసుకొని మేమిద్దరమూ చేసి వస్తాము." అందరూ విస్తుపోయి చూస్తున్నారు. ఎవరికీ మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా హడావుడి చేసింది. పురోహితుడు ఆ పాటికే స్నానం చేసి ఉన్నాడు. తర్పణం వదలటానికి అన్ని ఏర్పాట్లూ చేసి స్నానం చేసేటప్పుడు మంత్రం చెప్పటానికి వాళ్ళ కూడా వెళ్ళాడు.
మంత్రముగ్ధులులాగా అత్తమామగారు వెళ్ళి శాస్త్రోక్తంగా స్నానం చేసి వచ్చారు.
రాగిణి బామ్మగారిని జాగ్రత్తగా చేయి పట్టుకొని ముమ్మారు పవిత్ర జలాలలో ముణక వేయించి పొడిబట్టలు కట్టించింది.
"ఏం మహానుభావా అక్కడే చూస్తూ నిలబడ్డారు. పదండి స్నానానికి”, అంటూ రాను మొర్రో అంటున్న భర్తకు పంచె కట్టించి చేయి చేయి పట్టుకొని నీళ్ళల్లో దిగింది. పక్కనే ఒక పురోహితుడు వచ్చి మంత్రం చదవడం మొదలెట్టాడు. అప్పటిదాకా నీళ్ళలో దిగనని మొరాయించిన అతను అట్లా ఆ చల్లటి నీళ్ళల్లోంచి బయటకు రావడానికి మనసొప్పక ఉండి పోదామా అన్నంత ఆనందం అనుభవించాడు.
***********
"సారీ అత్తయ్యా మామయ్యా. బామ్మగారు పుష్కర స్నానం చేయలేకపోతున్నాను అని బాధ పడుతుంటే ఇన్ని రకాలగా అబద్దాలు చెప్పవలసి వచ్చింది. నన్ను మన్నించండి."
"మంచి పనులకు మన్నింపులెందుకమ్మా? నీ పుణ్యమా అని మా నాన్నకు పుష్కర సమయాన తర్పణం వదిలే భాగ్యం కలిగింది." మామగారి మెప్పుకోలు,
"అమ్మాయీ. మాకెవ్వరికీ రాని ఆలోచన నీకొచ్చి ఎంత చక్కగా ఏర్పాట్లు చేసావే. ఆ శాస్త్రి కూడా నీ నాటకంలో భాగమే కదూ. ఏమీ ఎరగనట్టు దారే పోయే దానయ్యలా లిఫ్ట్ అడిగి మరీ కార్లో ఎక్కాడు." ఇంటికొచ్చాక అత్తగారు మురిపెం,
"ఇంకేం? అన్ని నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని తోలుబొమ్మల్లాగా ఆడిస్తున్నావు. మరి నా ప్రాజెక్టు కూడా చేసేయి సరిపోతుంది." భర్త ప్రేమతో కూడిన వెటకారము,
"ఆసినీ అసాధ్యం కూలా! ఎంత నాటకం ఆడావే మనవరాలా.......ఏది ఏమైనా ఈ ఏడు పుష్కర స్నానం చేయలేనేమో అన్న దిగులు తీర్చావే. ఇంక ఈ జన్మకు ఇది చాలు. అమ్మడూ. చచ్చి నీ కడుపున పుడతా." మనవరాలి చెంపలు  నిమురుతూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూండగా బామ్మగారి ఆప్యాయం.
"అయ్యొ బామ్మా! మీరు నా కడుపున పుట్టడం ఏమిటి? తాతయ్య ముందు పుట్టాలి. ఆ మునిమనవడు మీ చేయి పట్టుకు మళ్ళీ పుష్కరానికి స్నానం చేయించాలి."
"చాల్లేవే భడవాకానా. మరీ నేర్చిపోయావు."
***************

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top