“శతపత్ర సుందరుడు” – బాలాంత్రపు రజనీకాంతరావు

(వివిధ పత్రికల నుండి, పుస్తకాల నుండి సేకరణ ... ఈ ప్రత్యేక సంచికలో వారిని తప్పక స్మరించుకోవాలని మాత్రమే సేకరించడం జరిగిందని సవినయ నివేదన.)


భారతదేశంలోకి ప్రసార వ్యవస్థ 1927 లో అడుగుపెట్టినా, దక్షిణ భారతదేశంలో మాత్రం 1938 లో మద్రాసులో తొలి కేంద్రాన్ని స్థాపించడం జరిగింది.  1942 లో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన యువకుడు, మద్రాసు ఆల్ ఇండియా రేడియో కేంద్రంలో ప్రోగ్రాం అసిస్టెంట్ గా ప్రవేశించి, ‘రజని’ గా పరిణమించారు. 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి స్వాతంత్ర్య సమయంలో మద్రాసు ఆకాశవాణి ప్రసారం చేసిన  మొట్టమొదటి దేశభక్తిగేయం శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసినదే !

వంద వసంతాలు చూసిన ఈ “శతపత్ర సుందరుడు” గాయక గాయకీ మణులకు మార్గదర్శకులు , సంగీత దర్శకులు , ఎందరికో గురుదేవులు , ఎన్నో పాటలు వ్రాసి , స్వరపరచి అలనాటి తెలుగు నేలను అబ్బురపరచిన గాయకులు ! ఆయన పేరు చెబితే... ఆకాశవాణి గుర్తుకొస్తుంది. ఆకాశవాణి పేరు చెబితే... రజనీకాంతరావు గుర్తొస్తారు. ప్రారంభదశలో ఆకాశవాణి కి జవం, జీవం ఇచ్చిన రూపశిల్పి ఆయన. తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడాయన. గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక, భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించిన సృజనశీలి ఆయన.
సుమారుగా 1940 ప్రాంతం నుండి 1990 దాకా ఒక అర్ధశతాబ్ది కాలంలో ఆయన రచించి, స్వరపరచిన గీతాలన్నీ అజరామరాలే. అవన్నీ తర్వాతి తరాల లలిత సంగీత స్రష్టలను అంతో ఇంతో ప్రభావితం చేసినవే ! తెలుగు సినిమా రంగం ప్రారంభ దశలో వున్న కొందరి ప్రముఖులలో శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు గారు ఒకరు. ఎన్నో సినిమా లకు పాటలు వ్రాసారు , స్వరకల్పన చేసారు . పాటలు పాడారు. ఆయన సృజన అద్భుతమైనది. జటిలంగా పాట రాసి అంత జటిలంగానూ సంగీతం సమకూర్చడం ఎలా సాధ్యమయిందీ అని ప్రశ్న ఉదయిస్తుంది. వింటున్న కొద్దీ మన వివేచన పెరుగుతుంది.
వీరు నిడదవోలులో 1920 జనవరి 29న జన్మించారు. రజనీ తండ్రి వేంకట పార్వతీశం కవులలో ఒకరైన వేంకటరావు. తల్లి వెంకట రమణమ్మ ఆయన రెండో ఏటానే కన్నుమూశారు. సాహిత్య, సంగీత వాసనలు గుబాళించే ఇంట్లో పెరిగిన ఆయనకు చిన్నతనంలోనే సాహిత్య, సంగీతాభిలాష అలవడింది. చక్కని గాత్రం అందుకు ఉపయోగపడింది. తండ్రి 'ఆంధ్ర ప్రచారణీ గ్రంథమాల' నిర్వహించేవారు. అక్కడికి ఎందరో కవి పండితులు వస్తుండేవారు. బాల్యం పిఠాపురంలో ఎక్కువగా గడిపారు. ఆ రోజుల్లో పిఠాపురంలో ఏ వీధిలో చూసినా పండిత ప్రకాండులే దర్శన మిచ్చేవారు. పానుగంటి, వేదుల రామకృష్ణకవి, వోలేటి వెంకట రామశాస్త్రి, దేవుపల్లి, వారణిసి సుబ్రహ్మణ్య శాస్త్రి, తమరాడ 'వీణ' సంగమేశ్వర శాస్త్రి, పెండ్యాల సత్యభామ తదితరులెందరో ఉండేవారు. సాహిత్య, సంగీత వాతావరణం ఆయనలోని కవిని, కళాకారుడిని తట్టిలేపింది. ఆయనలోని భావాలకు గట్టి పునాది వేసింది.
విద్యార్థిగా గురువులతో శభాష్‌ అనిపించు కున్నారు. ఆంధ్ర యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ సీఆర్‌రెడ్డి నుంచి ప్రత్యేక అభినందనలు అందుకున్నారు. ఉద్యోగం పనిమీద మద్రాసు వెళ్లడం, అక్కడ అన్న బాలాంత్రపు నళినీకాంత రావుతో (ఇంటర్నేషనల్‌ కమ్యూనిస్టు గేయాన్ని అనువదించారు) కలిసి ఒక పార్టీకి వెళ్లడం రజనీ జీవితాన్ని మలుపు తిప్పింది. తెలుగు రేడియో త్రిమూర్తులుగా పేరొందిన ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు, సూరి నారాయణ మూర్తిగారులు రజనీ పాట విని మెచ్చుకున్నారు. రేడియో కార్యక్రమంలో పాల్గొనే కాంట్రాక్టు ఇచ్చారు. శ్రీశ్రీ రచించిన మోహినీ రుక్మాంగద గేయ నాటికలో రజనీ బ్రహ్మపాత్ర వేశారు. కొద్ది రోజులకే రేడియోలో ఉద్యోగిగా మారారు.
ఆయన తొలి సంగీత రచన చండీదాస్‌. దానిమీద బెంగాలీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి నాటిక గ్రీష్మ బ­తువు ప్రసారమైంది. ఆనాటి నుంచి ఆయన ఆకాశవాణి కోసం చేసిన కృషి మాటలతో వర్ణించలేనిది. లలిత సంగీతానికి అపురూప సేవలందించారు. సంగీత సరస్కుల్లో పులిలా ప్రవేశించి దానంతా ఒక బృందావనంలా మార్చేశారు. యక్షగానాలకు తిరిగి ప్రాణం పోశారు. ప్రతి రూపకాన్ని పాత్రోచితం, పాటోచితంగా రాగతాళ సమన్వయంతో నడిపించారు. సంగీతంలో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. సంభాషణల కుదురే ఆయన రూపకాలకు ప్రాణం పోసేవి. మాటల పేటలను అల్లి పాటను దీప్తిమంతం చేశారు. సాధారణంగా సంగీత రూపకాలలోని పాటలకు స్మరణ ఉండదు. రజనీ రాయడం వల్లే వాటికి ఆ యోగం పట్టిందనే సద్విమర్శ అందుకున్నారు.
ఆయన దాదాపు 30దాకా సంగీత రూపకాలు రచించారు. పాడడానికి, ఆడటానికి అనుకూలమైన రాగ పద్ధతి అవలంబిస్తారాయన. కృష్ణశాస్త్రిగారితో కలిసి 'క్షీరసాగరమథనం' 'విప్ర నారాయణ' యక్షగానాలు వెలువరించారు. కళ్యాణ శ్రీనివాసం, శ్రీకృష్ణ శరణంమయ, విజయోస్తుతేనారీ, హలశాతవాహన - యక్షగానాలను ఆయన సొంతంగా వెలువరించారు. రజనీకి ముందు సాహిత్యం, సంగీతం - రెండూ బాగా తెలిసిన వారు చాలా అరుదు. రజనీ రాకతో సాహిత్య సంగీతాలు సమపాళ్లలో కలగలపిన రచనలు వెలువడ్డాయి. స్వర రచనలో అబ్‌స్ట్రాక్‌ ప్రజంటేషన్‌కు కొత్త ఒరవడి దిద్దారాయన.
సుమారు 65 ఏళ్ల క్రితం మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రం నుంచి ప్రతిరోజూ ‘భక్తిరంజని’ కార్యక్రమం తెలుగులో వినవచ్చేది. రేడియోలో ఈ  కార్యక్రమం ప్రవేశపెట్టి, దానికి 'భక్తి రజనీ' అనే ముద్ర పడేలా చేసారు. తెలుగు వాగ్గేయకారులకు దానిలో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన బాల్యంలో నేర్చుకున్న భక్తి సంగీతం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దోహదపడింది.
కాస్త లలితమైన సంగీత సాహిత్యాలంటే అభిరుచి ఉన్నవారందరూ ప్రతిరోజూ తప్పక విన్న కార్యక్రమం అది. అందులో శాస్త్రీయ సంగీతం కాక పామరులకూ అందుబాటులో ఉండే లలిత సంగీత శైలిలో పొదగబడిన భక్తిగీతాలు  వినవచ్చేవి. ఆకాశవాణిని గీర్వాణివాణిగా, సంగీత సాహిత్యాభినయాల త్రివేణీ సంగమంగా తీర్చాయి ఎన్నో సంగీత రూపకాలు. ‘దేవదాస్’, ‘బేహుల’, ‘లైలా మజ్ను’, ‘ధర్మచక్ర’, ‘ఉమర్ ఖైయామ్’ -- యివన్నీ రజనీ కృతులే. కేవలం శ్రావ్యమే అయినట్టి రేడియో ప్రసారాలలో అభినయం ఉండే అవకాశమేదీ అంటారా?‘పూలతీవ పొదరిళ్ల మాటుగా పొంచి చూచు శిఖిపింఛమదే’ అంటేనూ, ‘రాధా మాధవ ప్రేమారామము బృందావనము, రాసక్రీడా మనోజ్ఞధామము బృందావనము’ వింటేనూ, ‘ఊరకే మాధురులూరిపోతున్నాయి’ చదివితేనూ అందులో అభినయం అర్థం కాదా, వినబడదా, బుర్రకెక్కదా!
రజనీ సాహిత్యపు సొంపులు, పాడించిన తీరులో యింపులు, స్వర సమ్మేళనలలో రకరకాల మేళవింపులూ తమ ప్రభావాన్ని తదుపరి వారిపై చూపాయి. రజని స్వర సాహిత్యాల సౌందర్యాన్ని తమకే చేతనైన ఒదుగుల పౌడరద్ది, తమరమర్చిన వాద్యగోష్ఠి అత్తరు పూసి పేరుగొన్న వారెందరో! వారిలో సీతా, అనసూయలు ప్రథములు (వలపులో, జాబిల్లి వస్తున్నాడు, ఊరకే మాధురులు). ఆ తరువాత ఎస్.రాజేశ్వరరావు, ఆయన దాపున ఆర్.బాలసరస్వతీదేవి (ఆలయమున, చల్లగాలిలో, కోపమేల రాధా), ఘంటసాల (మజ్నూ విలాపం, లైలా విశ్వరూపం).
ఇక సూర్యకుమారి ప్రాణప్రతిష్ఠ చేసిన రజని శిల్పాలు ఎన్నని! ‘శతపత్ర సుందరి’, ‘ఇదె జోత’, ‘మాదీ స్వతంత్ర దేశం’, ‘స్వప్నజగతిలో’, ‘చిన్నదోయి నా హృదయనావ’. భానుమతి, రజని కలసి ‘పసిడి మెఱుంగుల తళతళలూ’ రికార్డిచ్చారు (రెండవ ప్రక్క బంకించంద్రుని ‘వందే మాతరం’). రజని అరుదుగా యితరుల రచనలకూ స్వరకల్పన చేశారు. బసవరాజు అప్పారావు గారి ‘యశోధరా విలాపం’ (లేపనైనా లేపలేదే-టి. సూర్యకుమారి) వాటిలో కౌస్తుభం. ఈ పాటకే మద్రాసు విద్వత్సభలో శ్రీమతి బ్రగా బెస్సెల్ భరతనాట్యాభినయం చూపగా ప్రభావితులై ప్రసిద్ధ తమిళ కవి వైరముత్తు అప్పటికప్పుడా వస్తువుపై ఒక పాట వ్రాశారు.
నూట యాభై క్షేత్రయ్య పదాలను ఆంగ్లీకరించి ‘మువ్వగోపాల పదావళి’ అన్న పేరుతో, ‘ఆమోర్స్ ఆఫ్ ది డివైన్ కౌహర్డ్ విత్ జింగ్లింగ్ బెల్స్’ అన్న ఉపనామంతో రజని (బి.వి.ఎస్.ఎస్ మణి వదాన్యంతో) 1994లో ప్రచురించారు.
తొలినాళ్లలో సినిమా సంగీతానికి రంగు, రుచి, వాసన కల్పించడంలో రజనీకాంతారావు చేసిన కృషిని సినీ సంగీత విశ్లేషకులు నాడూ నేడూ ప్రశంసిస్తున్నారు. సినిమా సంగీతానికి దిశానిర్దేశం చేసిన బాలాంత్రపు రజనీకాంతారావు అందులోనే కొనసాగి ఉంటే మరెన్ని తేనెసోనలు కురిసి ఉండేవోగానీ రేడియో ఉద్యోగ నిబంధనలు ఆయనను అజ్ఞాతానికి పరిమితం చేయడంతోపాటు క్రమంగా పరిశ్రమకు దూరం చేశాయి. 'నాగరాజు', 'నళినీకాంత్‌', 'రజని' లాంటి పేర్లతో కొన్ని... తనకంటూ లేకుండా మరొకరికి పేరు తెచ్చేలా ఇంకొన్ని- ఇలా ఎన్నో చిత్రాలకు పని చేశారాయన. వివిధ చిత్రాలకు ఆయన రాసి స్వరపరిచిన పాటలు లలిత సంగీత శైలికి తెరతీశాయి. సరికొత్త పోకడలకు నారు వేసి, నీరు పోశాయి.తన పద్దెనిమిదో ఏటనే ఓ రేడియో నాటకంలో కొన్ని పాటలకు స్వరకల్పన చేసిన రజనీకాంతారావు- తర్వాతి కాలంలో రేడియో కన్నా ముందుగా సినిమాలోనే పని చేయడం విశేషం. 'టాకీ పులి' హెచ్‌.ఎం.రెడ్డి సొంత సంస్థ 'రోహిణి'లోని సంగీత శాఖలో రజనీకాంతారావు కొంతకాలం పని చేసినా, అక్కడి పద్ధతులు సరిపడక బయటకు వచ్చారు. రేడియోలో చేరారు. అదే సమయంలో సినిమా రంగం నుంచి మరో పిలుపు వచ్చింది. ఎన్‌.జగన్నాథ్‌ 1942లో నిర్మించిన 'భలే పెళ్ళి - తారుమారు' జంట చిత్రాల్లో తారుమారు చిత్రానికి రజనీకాంతారావు పాటలు రాసి, సంగీతం సమకూర్చారు. అందులో రజనీకాంతారావు నేపథ్యగానమూ చేశారు. ఆయన అర్ధాంగి సుభద్రాదేవి ఆ చిత్రంలో కొన్ని పాటలు పాడటం విశేషం. ఆ తర్వాత మరో మూడేళ్లకు విడుదలైన 'స్వర్గసీమ' ద్వారా రజనీ స్వరగంధం గుబాళించింది. అప్పటి మద్రాసు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన 'గీతావళి' కార్యక్రమంలో రజనీకాంతారావు రాసి, స్వరపరచిన 'స్వామీ నీ ఆలయమున...' గీతం దర్శకుడు బి.ఎన్‌.రెడ్డికి ఎంతగానో నచ్చింది. ఆయన రేడియో స్టేషేన్‌కు వచ్చి మరీ రజనీని అభినందించారట. అప్పట్లో బి.ఎన్‌.రెడ్డి వాహినీ పతాకం మీద 'స్వర్గసీమ' నిర్మిస్తున్నారు. అందులో భానుమతి పాడిన 'ఓహో పావురమా...' గీతాన్ని రాసిందీ స్వరపరచిందీ రజనీకాంతారావే. ఇంకా అందులో 'రుష్యశృంగ' రూపకం, 'హాయి సఖీ', 'గృహమే కదా స్వర్గసీమ', 'ఎవని రాకకై'గీతాల్ని రాసి, వరుసలు అందించారు.వీటిలో 'ఎవని రాకకై ఎదురు చూచెదో...' పాటను రజనీకాంతారావు స్వయంగా ఆలపించారు. కానీ ఉద్యోగ నిబంధనల వల్ల తెరపై తమ సోదరుడు నళినీకాంతారావు పేరును, స్వరకర్తగా నాగయ్య పేరునూ వేసుకోవాల్సి వచ్చింది. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ తనకు అత్యంత అభిమాన గీతమని పేర్కొన్న 'ఓహో పావురమా...' అప్పట్లో ప్రాచుర్యం పొందింది.'స్వర్గసీమ' ద్వారా పరిచయమైన మహా గాయకుడు ఘంటసాల సైతం రజనీ కాంతారావు ప్రోత్సాహంతో రేడియోలో పాటలు పాడుతూ పేరు తెచ్చుకున్నారు. తర్వాత రోజుల్లో రజనీతో కలసి పని చేశారు. శోభనాచల అండ్‌ ఎం.ఆర్‌.ఎ. వారి 'లక్ష్మమ్మ'కి రజనీకాంతారావు 'తారానాథ్‌' పేరుతో పాటలు రాసి, బాణీలు సమకూర్చారు. రికార్డింగ్‌ సమయానికి ఆయన ఉద్యోగపరమైన కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో ఆ అవకాశం ఘంటసాలకు లభించింది. ఆ సందర్భంగా రజనీ కూర్చిన స్వరాల్ని ఆయన నుంచి నేర్చుకుని ఘంటసాల ధ్వని ముద్రణ చేశారట. అందులో 'చిన్ననాటి స్వర్గసీమ', 'అటో ఇటో ఎటు పోవుట', 'దిగు దిగు నాగా...' పాటల ప్రేక్షకుల అభిమానాన్ని పొందాయి. సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరు తెర మీద కనిపించింది. ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఆయన రజనీకి మంచి మిత్రుడు కావడంతో 'లక్ష్మమ్మ'కి కలసి పని చేశారు. ఆ ఇద్దరి కలయిక 'గృహప్రవేశం'తోనే ఆరంభమైంది. ఎల్వీ ప్రసాద్‌ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రానికి గోపీచంద్‌ మాటలు రాశారు. దర్శకత్వం చేయాలనుకున్నారు. కానీ ఆయన సూచన మేరకు అందులో హీరో వేషం వేసిన ఎల్వీ ప్రసాద్‌ దర్శకుడిగా మారడం అది వేరే కథ. ఈ చిత్రానికి నళీనీకాంతారావు పేరుతో రజనీ పాటలు రాసి, సంగీతం సమకూర్చారు. ప్రసిద్ధ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు ఇందులో రజనీకి సహాయకుడిగా పని చేశారు. ఈ చిత్రంలో 'హాలాహల మెగయునో', 'అమ్మా... అమ్మా', 'మై డియర్‌ తులసమ్మక్కా', 'అనగనగా ఒక రాణి', 'మేలుకోవే భారతనారీ' లాంటి రజనీ రచనలు, స్వరాలు చిత్ర విజయానికి దోహదం చేశాయి. ముఖ్యంగా'మేలుకోవే భారతనారీ' పాట స్త్రీవాదాన్ని ఆనాడే ఎలుగెత్తి చాటిన గీతంగా ప్రశంసలనందుకుంది. అలాగే గోపీచంద్‌ దర్శకత్వంలో వచ్చిన 'పేరంటాలు'కు, వై.వి.రావు నిర్మించిన 'మానవతి'కి రజనీ కాంతారావు పాటలు, స్వరాలు సమకూర్చారు.రజనీ ప్రతిభకు మరో మచ్చుతునక బి.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'బంగారుపాప'. ఇందులో 'తాధిమి తకధిమి తోలుబొమ్మ' పాట రజనీ స్వరాలతో జనాదరణ పొందింది. కె.ఎస్‌.ప్రకాశరావు సొంత చిత్రం'ద్రోహి'లో 'జీవితము దుఃఖపూరితము' పాటను రజనీ రాసి, స్వరపరచి ఎం.ఎస్‌.రామారావు చేత పాడించారు. సంగీత దర్శకులుగా మరొకరి పేరు తెర మీద కనిపించినా తెర వెనుక పనిచేసిన రజనీకాంతారావు ముద్ర అభిమానులకు స్పష్టంగా కనిపించేది. బి.ఎన్‌.రెడ్డి నిర్మించిన 'రాజమకుటం'లో'వూరేది పేరేది ఓ చందమామా' పాటను నాగరాజు పేరుతో రాసి, స్వరపరిచింది. రజనీకాంతారావే! కానీ సంగీత దర్శకుడిగా మాస్టర్‌ వేణు పేరు తెర మీద కనిపిస్తుంది. అలాగే భరణీవారి తొలిచిత్రం 'రత్నమాల'లో ఆయన సాహిత్యం, స్వరాలు ఉన్నాయి. 'విప్రనారాయణ' కోసం రాజేశ్వరరావు సమకూర్చిన కొన్ని పాటల్లో రజనీ పోకడ కనిపిస్తుందంటారు.రజనీ, రాజేశ్వరరావుల కలయికలో అద్భుతాలు వెలువడ్డాయి.'చల్లగాలిలో యమునా తటిపై...', 'ఓ విభావరీ...' ఈ రెండు పాటలు చాలు రజనీ ప్రతిభకు గీటురాళ్లు.
ఘంటసాలకు ప్రత్యేకించి తెలుగువారికి అందించిన ఘనత ఆయనదే. అందుకే ఘంటసాల ఆయనను 'నాన్నగారు' అని పిలుచుకునేవారు. ఉషశ్రీ టాలెంట్‌ను గుర్తించింది వీరే. వాగ్గేయకార చరిత్ర, విశ్వవీణ, శతపత్రసుందరి, క్షేత్రయ్య, రామదాసు, మువ్వగోపాల పదావళి, జేజి మామయ్య పాట, ఇంగ్లీషులోని 'ఎలోన్‌ విత్‌ ది స్పౌస్‌ ది లైన్‌' పేరు ఏకాంత సేన కావ్యామకారం, రజనీ ఆత్మకథ విభావరి - ఆయన వెలువరించిన రచనలు.
సంగీత, సాహిత్య శిఖరాలను అధిరోహించిన వాగ్గేయకారుడు రజనీకాంతరావుతో కొంతకాలం కిందట విశాఖలో కె.రామచంద్రమూర్తి జరిపిన ప్రత్యేక సంభాషణ ఇది...
మీ ఆధ్వర్యంలో ఆకాశవాణికి అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆ సందర్భంలో మీ అనుభూతి... ?
అంతర్జాతీయ రేడియో కార్యక్రమాల పోటీలో మనం కూడా పాల్గొనాలి అని మా డెరైక్టర్ జనరల్ చెప్పారు. అది నీ ద్వారానే జరగాలి, పోటీకి పంపాల్సిన కార్యక్రమాన్ని నువ్వే తయారు చేయాలి అని నాతో అన్నారాయన. అది పిల్లలకు భౌగోళిక శాస్త్రం బోధించే విధంగా ఉండాలని చెప్పారు. అలా ఉండాలి అంటే... పిల్లలకు ఏ నదుల గురించో పర్వతాల గురించో వివరిస్తూ ఉన్నట్టుగా ఓ యాత్రాకథనాన్ని తయారు చేయాలనిపించింది నాకు. దాంతో ‘కొండ నుంచి కడలి దాకా’ అన్న కార్యక్రమానికి రూపకల్పన చేశాను. నది కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తుంది. ఆ క్రమంలో అది ఎన్నో ప్రాంతాలను స్పృశిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి నా కార్యక్రమం ద్వారా ప్రజలకీ నదులకూ ఉన్న సంబంధం పిల్లలకు చెప్పినట్టు అవుతుంది అనిపించింది. ‘ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి, కొండల్లొ దుమికింది కోనల్లొ ఉరికింది, శంకరాభరణ రాగాలాపకంఠియై ఉప్పొంగిపోయింది గోదావరి’ అన్న పాట... ‘హా యని కిన్నెర ఏడ్చెను, తన మనోహరుడు శిలయైనాడని, తానేమో ఒక వాగైనానని’ అన్న విశ్వనాథ వారి రచనతో పాటు మరికొన్ని కీర్తనలు, శ్రీనాథుడి సీస పద్యాలతో ఆ కార్యక్రమాన్ని తయారు చేశాను. అంతర్జాతీయ ఖ్యాతిని గడించడానికి తగిన అన్ని అంశాలూ అందులో ఉండటంతో ఊహించనంత పేరు, అవార్డూ వచ్చాయి ఆకాశవాణికి.
స్వాతంత్య్రం వచ్చేనాటికి మీకు ఇరవయ్యేళ్లు. నాటి జ్ఞాపకాలేవైనా మాతో పంచుకుంటారా?
అప్పట్లో బ్రిటిష్‌వాళ్ల ప్రాభవాన్ని చూశాన్నేను. స్వాతంత్య్ర ఉద్యమాన్నీ కళ్లారా చూశాను. రేడియోలో కూడా అందరూ ప్రసంగాలు ఇస్తుండేవారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ప్రసంగం పూర్తయ్యాక జైహింద్ అనేవారు. అయితే అది ప్రసారం చేసేవాణ్ని కాదు నేను. ప్రసంగం అయ్యీ అవ్వగానే జైహింద్ అనే సమయానికి స్విచ్ కట్టేసేవాణ్ని. అది దేశద్రోహం కాదు. ఆవిడ స్వాతంత్య్ర సమరయోధురాలు కాబట్టి అలా అనేది. కానీ నేను స్టేషన్ ఇన్‌చార్జిగా అన్నిటినీ సమానంగా చూడాలి. కాబట్టి అలా చేసేవాడిని.
టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతి, ఘంటసాల, రాజేశ్వరరావు వంటివాళ్లందరితో మీరు పాటలు పాడించారు. వాళ్లంతా తర్వాత చాలా ఖ్యాతి గడించడం మీకు గర్వంగా అనిపించిందా?
కచ్చితంగా గర్వించదగ్గ విషయమే. వాళ్లందరూ మొదట్లో నాతో కలిసి పని చేశారు. ఆగస్ట్ పదిహేను, అర్ధరాత్రి నెహ్రూగారి ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసారం పూర్తి కాగానే మద్రాస్ స్టేషన్‌లో డి.కె.పట్టమ్మాళ్ పాటను, తర్వాత నా పాటను ప్రసారం చేయాలి అనుకున్నారు. దాంతో ఆ సందర్భం కోసం మంచి దేశభక్తి గీతాన్ని రాశాను. దాన్ని సూర్యకుమారితో పాడించాను. శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటను కూడా తను నా ఆధ్వర్యంలోనే పాడింది. ఠాగూర్ పుట్టినరోజు కోసం ‘ఓ నవ యువకా’ అనే పాట రాశాను. దానిని సరళ అనే ఆవిడతో పాడించాను. ‘మేఘసందేశం’ నాటికలో ఘణాఘణా ఘణాగణా గర్జింపవా ఘనాశనీ అనే పాటని ఘంటసాలతో పాడించాను. వాళ్లందరూ ఎంతో ప్రతిభావంతులు. అందరితోనూ నాకు మంచి అనుబంధం ఉండేది.
మీరు ఎంతోమందిని పరిచయం చేశారు. పైకి తీసుకొచ్చారు. వారిలో మీరు గర్వంగా ఫీలయ్యే మీ శిష్యులెవరు?
పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీపాద పినాకపాణి... వీళ్లు ముగ్గురూ నాకు మంచి శిష్యులు.
మల్లీశ్వరి సినిమాకి రాజేశ్వరరావూ మీరూ కలిసి సంగీతం చేశారని చాలామంది అంటుంటారు. నిజమేనా?
అదంతా అబద్ధం. మేం కలిసి చేయలేదు. ఇద్దరం కలిసి పని చేస్తే బాగుంటుంది అనుకునేవాళ్లం. అంతే తప్ప చేయలేదు. అవన్నీ వట్టి పుకార్లు.
సినిమాల్లో అవకాశాలొచ్చినా రేడియోలోనే ఎందుకు కొనసాగారు?
నిజమే. అవకాశాలు బాగానే వచ్చాయి. కానీ నేను సినిమా వైపు వెళ్లలేకపోయాను. ఎందుకంటే నేను అప్పటికే రేడియోకి అలవాటు పడిపోయాను. పైగా అందులోనే ఉద్యోగం కాబట్టి వేరే దాని గురించి ఆలోచించడం అంతగా కుదరలేదు. పైగా ఒక రేడియో ఆఫీసర్‌గా నేను చాలా సంతోషాన్ని, గౌరవాన్ని అనుభవించాను. అందుకే నాకు రేడియోని వదిలిపెట్టబుద్ధి కాలేదు.
ఓసారి భానుమతిగారికి సన్మానం జరుగుతోంది. ఆ సభకు గోపాలరెడ్డిగారు అధ్యక్షుడు. నేను ఆయన దగ్గరకు వెళ్లి ఓ పాట పాడటానికి అనుమతినివ్వమని అడిగాను. ఆయన సరే అన్నారు. అప్పుడు నేను ‘ఓహోహో పావురమా’ అనే పాటను ఇమిటేట్ చేసి ‘ఓహోహో భానుమతీ’ అంటూ పాడాను. ముప్ఫయ్యేళ్ల క్రితం భానుమతిని స్టార్‌డమ్‌కి తీసుకెళ్లిన పాట అది. నేను సంగీతం అందించిన ‘స్వర్గసీమ’ చిత్రంలోనిది. పాట విని భానుమతి చాలా సంతోషపడింది. దాన్ని అప్పటికప్పుడు రాశానని తెలిసి ఆశ్చర్యపోయింది.
అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆకాశవాణిలో వచ్చిన మార్పులేంటి?
అప్పట్లో మేము ఏదైనా రాస్తే... అది కచ్చితంగా అందరికీ ఉపయోగపడాలి అని ప్రతిజ్ఞ చేసి రాసేవాళ్లం. ఒకరి కంటే ఒకరు బాగా రాయాలని పోటీ పడేవాళ్లం. కానీ ఇప్పుడలా లేదు. కాకపోతే మంగళగిరి ఆదిత్యప్రసాద్ లాంటి వాళ్లు కొందరు చక్కని ప్రయోగాలు చేశారు. అది సంతోషం కలిగించింది నాకు.
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, సంగీత నాటక అకాడెమీ అవార్డు... ఈ రెండు అవార్డుల్నీ అందుకున్నవారు దేశం మొత్తంలో మీరొక్కరే. ఆ అనుభూతి గురించి చెప్తారా?
సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. రాధాకృష్టన్‌గారు సాహితీ ప్రియులు. ఆయన వరండాలో ఉన్న ర్యాక్స్ నిండా పుస్తకాలే. అవన్నీ దాటుకుని, పైన ఉన్న ఆయన గదిలోకి వెళ్తే... ఆ గది నిండా కూడా పుస్తకాలే. ఆయన దగ్గర అన్ని ఉన్నా కూడా, నా చేతిలో ఉన్న పుస్తకం ఏంటా అని ఆయన ఆసక్తిగా చూసిన చూపుని నేను మర్చిపోలేను. అప్పుడు నా చేతిలో ఉన్నది ‘ఆంధ్ర వాగ్గేయకారుల చరితము’. దాన్ని తీసుకుని, అందులో ఉన్న ఓ పాటను పాడటం మొదలుపెట్టారాయన. నాకు చాలా ఆనందమే సింది. అదో మర్చిపోలేని అనుభవం. ఆ తర్వాత సంగీత నాటక అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అది కూడా చాలా సంతోషాన్ని కలిగించిన విషయం.
చేయాలనుకుని చేయలేకపోయింది ఏదైనా ఉందా?
జీవితంలో చేయాలనుకున్నవన్నీ చేశాను. ఏ వెలితీ లేదు. ఏ అసంతృప్తీ లేదు. కాకపోతే నా పేరుతో సంగీత సాహిత్య పరిషత్తు ఏదైనా పెట్టాలని ఉంది. నాకు రెగ్యు లర్‌గా పెన్షన్ వస్తుంది. అదంతా దాచిపెడితే కొన్ని లక్షలు అయ్యింది. దానికి తోడు ఠాగూర్ అవార్డు ద్వారా మరో మూడు లక్షలు జతయ్యాయి. వీటన్నిటితో ఓ నిధిని ఏర్పాటు చేయాలి. ఆ నిధి భవిష్యత్తులో సంగీత సాహిత్యాల అభివృద్ధికి ఉపయోగపడాలనేది నా కోరిక.
 కళాత్మక చిత్ర దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి రజనీ స్వరాలకు వీరాభిమాని! ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి, బాలమురళీకృష్ణ, నాగయ్య, భానుమతి, ఎస్‌.రామారావు, ఎస్‌.రాజేశ్వరరావు, రావు బాలసరస్వతీదేవి, ఘంటసాల లాంటి మధుర గళాలు రజనీ సాహిత్యంతోనో, స్వర వైవిధ్యంతోనో శోభిల్లినవే. రజనీకాంతారావు ఆలపించిన 'సూర్యస్తుతి'ని ఆకాశవాణి భక్తిరంజనిలో వింటూ తూర్పు సముద్రంలోని లేత కిరణాలు లేచి వచ్చిన ఉదయాలెన్నో! బహుముఖ ప్రతిభతో తెలుగు సాహిత్య రంగాలపై తనదైన ముద్రవేసిన బాలాంత్రపు రజనీకాంతారావు.. అందులో తన గొప్పలేదంటారు. 'ఒక వ్యక్తి తనేదో నిర్వహించిన వాడిలాగా, నిర్వాకాలు చేసిన వాడిలాగా పేరుపొందవచ్చుగాని నా దృష్టిలో ఈ కీర్తి సమష్టి కృషి వల్ల సాధించినది. నేను కేవలం నిమిత్తమాత్రుడిని. ఆకాశవాణి కేంద్రం కర్త. అవసరాలు కర్మ ఇవి క్రియను సాధించాయి' అని చెప్పిన వినయ సంపన్నుడాయన.

ఆయన అందుకున్న పురస్కారాలు/బిరుదులు

ఠాగూర్ అకాడమీ రత్న - రవీంద్రనాథ్ ఠాగూర్ 150 జయంతి సందర్భంగా సంగీత నాటక అకాడమీ ప్రదానం చేసింది.
కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం 1981 లో బహుకరించిన గౌరవ డాక్టరేట్.
కళారత్న అవార్డు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 లో ఇచ్చిన పురస్కారం.
కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - 1961. ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఉత్తమ పరిశోధనా గ్రంథానికి.[4]
ప్రతిభా మూర్తి జీవితకాల సాఫల్య బహుమతి - అమెరికాలోని అప్పజోస్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ వారి పురస్కారం.
నాద సుధార్ణవ - మదరాసు మురళీరవళి ఆర్ట్ అకాడమీ
పుంభావ సరస్వతి అవార్డు.
నవీన వాగ్గేయకార అవార్డు.
క్షణక్షణం ఒక పాటగా, అనుక్షణం అనురాగాన్ని పంచుతూ, తెలుగు సంగీతానికి నిండు నూరేళ్ళ ఆయుష్షును పోసిన ఈ ప్రతిభాశాలి, మన తెలుగువారందరికీ గర్వకారణం !
*****

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top