తెలుగు వెలుగుల కుంచె "శ్రీ వ.పా "

పెమ్మరాజు అశ్విని


ఈ సృష్టి లో 64 కళలు ఉంటాయి అంటారు పెద్దలు ,ఈ సంఖ్య సంగతేమో కానీ అన్ని కళలోకి జీవ కళ "చిత్రలేఖనం" అనడం లో ఎటువంటి సందేహం లేదు.మనిషి నాగరికత నేర్చుకునే దిశగా అడుగులు వేసే కాలం లో నే ఏ  బాషా కనిపెట్టక మునుపే చిత్రలేఖనం ఉందనడం అతిశయోక్తి కాదేమో,అంతే కాదు ప్రకృతి లో దొరికే రంగులతో అప్పటి సమాజాన్ని చుట్టూ వున్న పరిస్థితులను వర్ణించేవారు  . కొన్ని సార్లు బాషా కి అందని అపూర్వమైన భావం బొమ్మలతో తెలియపరచవచ్చు . అంతే కాక మన భారతావని లో బౌద్ధం ,జైన మతాలు ప్రాచుర్యం పొందడానికి చిత్రలేఖనం కూడా ఒక కారణమే.
     
ఎందరో గొప్ప చిత్రకారులు భారతావని లో జన్మించి వారి కుంచె తో కళా సేవ చేశారు,అందునా వీరి సంఖ్య 1900 శకం లో ద్విగుణం అయ్యిందనే చెప్పాలి ,ఈ సమయం లో  ను స్వాతంత్య ఉద్యమ  స్ఫూర్తిని వారి చిత్రరచనలతో ప్రజలలోకి నింపే వారు అబీన్ద్రనాథ్ టాగోర్,జమిని రాయ్,రాజా రవి వర్మ వంటి ఎందరో సుప్రసిద్ధ కళాకారులు.
         అయితే అలాంటి ఎందరో కళాకారులలో మన ఆంధ్ర జాతి గర్వించదగ్గ చిత్రకారుడు శ్రీ.వడ్డాది పాపయ్య గారు. ఈయన 1921 సంవత్సరం లో శ్రీకాకుళం లో జన్మించారు. పాపయ్య గారి తండ్రి శ్రీ రామమూర్తి గారు చిత్రకళ ప్రవీణుడు మరియు ఉపాధ్యాయుడు.కనుక పాపయ్య గారికి చిత్రకళా నైపుణ్యం ఉగ్గుపాల తో అలవడిందంటే అతిశయోక్తి కాదేమో. పాపయ్య గారు అతి పిన్న వయసులో అంటే 4-5 సంవత్సరాల వయసులో నే చిత్రలేఖనం లో ఓనమాలు దిద్దారు.,చిత్రలేఖనం పట్ల తీవ్రమైన మక్కువ తో తండ్రి గారి దగ్గర శిష్యరికం చేస్తూ చిత్రలేఖనం లో ని మెళకువలు నేర్చుకొన్నారు.
       తమ ఇంట్లో వున్న రాజా రవి వర్మ గారి "కోదండ రాముని " చిత్రపటా న్ని చూసి ప్రేరణ పొంది ఆ చిన్న వయసులో నే హనుమంతుని చిత్రాన్ని గీశారు మన పాపయ్య గారు. ఇంతే గాక వారి చిన్నతనం లో తండ్రి నుండి విన్న భారత ,భాగవత కథలు వారి చిత్రలేఖనం పై యెనలేని ఆసక్తి ని రీకేతింది,వాటి ప్రభావం వారి బొమ్మలూ ఎంతో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ ప్రభావం వాళ్ళ ఆయనకి చిన్నతనం నుండే ప్రాచీనత మీద మక్కువ ఏర్పడింది,మరి ముఖ్యంగా భారతీయ శిల్ప,చిత్రకళ మీద యెనలేని మక్కువ ఏర్పడింది.
       వయస్సు పెరుగుతున్న కొద్దీ రాజా రవి వర్మ,డామెరాల్ రామారావు గారు,ప్రముఖ మరాఠీ చిత్రకారుడు ధురంధర్ వంటి పెద్దల స్ఫూర్తి తో చిత్రలేఖనం లో తనదైన ప్రత్యేక శైలిని సృష్టించుకోవడమే గాక ఆయన కుంచె కి అడవి బాపిరాజు గారి భావుకత ను అద్ది అద్భుతమైన కళాకండాలని ఆవిష్కరించారు.
        చిత్రకళను అభ్యసించే తొలి నాళ్ళలోనే కాశీనాధుని నాగేశ్వర రావు గారి పత్రిక లో పాపయ్య గారి చిత్రాలు ప్రచురింపబడ్డాయి. అటు పిమ్మట "వ.పా " అనే సంతకం తో తన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు రేరాణి,మంజూష,అభిసారిక,ఆంధ్రపత్రిక,భారతి,ఆంధ్ర జ్యోతి,స్వాతి వంటి వారపత్రిక ల లో ప్రచురితం అయి జనాదరణ పొందాయి .
         నాలుగు భిన్నమైన రంగులను తెల్లని కాన్వాసు పైన నచ్చినట్టు జల్లి దానికి "అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ " అని పేరు పెడుతున్న తరుణం లో పాపయ్య గారు చక్రపాణి గారి "చందమామ " పత్రిక కి అర్ధ శతాబ్దం పాటు చిత్రాలు గీశారు అంటే ఆ చిత్రాలలో యెంత సజీవ కళ ఉట్టి పడేవి కదా.
          వ.పా వారి కుంచె లోంచి జాలువారిన అర్ధనారీశ్వరం,రాధాకృష్ణులు ,విగ్నేశ్వరుడు,అందాల అతివ వంటి
చిత్రరాజాల లో ఎన్ని విభిన్నమైన రంగుల కలయికల తో కనువిందు చేసేవో,ఇవే గాక చందమామ పత్రిక ముఖచిత్రం,అందులోనూ దీపావళి వంటి ప్రత్యేక సంచిక లు ప్రతి తెలుగింట పిల్లలు పీచు పెట్టి కొనిపించుకునేవారంటే అతిశయోక్తి కాదేమో,ఇంతేగాక చందమామ తెలుగు తో పాటుగా ఆంగ్లము మరియు 13 భారతీయ బాషలలో ప్రచురించడం తో,వ.పా గారి చిత్రాలకి దేశం నలువైపులా అభిమానులు ఏర్పడ్డారు.
వ.పా గారు చిత్రకారులే కాక రచయిత కూడా !చందమామ  లో "శ్రీ కొడవటిగంటి కుటుంబ రావు" గారు మొదలు పెట్టిన దేవి భాగవతం కధలను పూర్తిచేయడమే గాక ఆయన స్వయం గా "విష్ణుకథ" అనే పౌరాణిక సీరియల్ కూడా రచించారు.
       మన తెలుగు వారికి ఎన్నో అజరామరమైన చిత్రాలను అందించిన వ.పా 1992 డిసెంబర్ 30 న కాలం చేశారు.ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన చిత్రాల ద్వారా ఆయన అమరుడే .
*********

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top