యతి తపోతలం - అచ్చంగా తెలుగు

యతి తపోతలం

రావి కిరణ్ కుమార్


యతులు మహర్షులు తపమాచరించిన ప్రశాంత సుందర ప్రదేశం ఇది. చుట్టూ చిన్న చిన్న కొండలు, ఓ వైపు కొండల మీదుగా సుమారు 22 అడుగుల ఎత్తులో పైనుండి క్రిందకు దుముకుతూ ఆ కొండల నడుమ వడివడిగా సాగిపోయే చిరు జలపాతం, ఎవరో ఏరి కూర్చి పేర్చారా అన్నట్లు కనిపించే అందమైన కొండ చొరియలు ఇక్కడి సహజ ప్రకృతి అందాలు.
పవిత్రమైన మర్రి, మేడి, వేప వృక్షాలు, అక్కడక్కడ కనిపించే మొగలి పొదలు, అంతకు మించి అంతర్లీనంగా ఆ వాతావరణం లో ఇమిడిపోయిన దివ్యత్వం తాలూకు అనుభూతులు వర్ణించనలవి కావు.
ఆ దివ్యత్వానికి కారణమేమిటో ?
బహుశా కృతయుగం నాడే ఋషులకు జ్ఞాన భోధ చేయటానికి అక్కడ తిరుగాడిన శ్రీ దత్తాత్రేయుల వారి పాద పద్మాల చేత పునీతమైన భూమాత పులకరింతా?
లేక మునుల కోరిక పై ఆనాటి నుండి అక్కడే స్థిరంగా నిలచిన దత్తుని దివ్య మంగళ స్వరూపం నుండి వెలువడే కాంతి పుంజమా ?
లేక కృతయుగం నుండి ద్వాపరం వరకు దత్తుని ప్రత్యక్ష పర్యవేక్షణలో తపమాచరించి కలియుగంలో గుప్త దేహాలతో తపమాచరిస్తున్న మహర్షుల తపో మహిమా?

కారణమేదైనా చూచి తీరవలసిన మహిమాన్విత ప్రదేశం ఇది. మహితాత్ములు మహోన్నత ప్రాంతాలలో జన
సంచారానికి దూరంగా తమను తాము గుప్తంగా ఉంచుకుంటారు.
అలాంటి ఒక దివ్య స్థలి ఈ "యతి తపోతలం" .అది కాలాంతరంలో యతి పోతలగా మారి చివరకు ఎత్తి పోతలగా స్థిర పడింది.
గుంటూరు జిల్లా లోని మాచర్లకు 15 కి. మి. ఇటు నాగార్జున సాగర్ కు కూడా అంటే దూరంలో వున్న దివ్య దత్త క్షేత్రమ్ ఇది.
శ్రీ దత్తాత్రేయుడు స్వయంభువు గా నిలచిన అతి కొద్ది క్షేత్రాలలో 2 ఆంధ్రప్రదేశ్ లో వున్నాయి.
ఒకటి కాకినాడ సమీపం లోని పిఠాపురం కాగా ఇంకొకటి ఎత్తి పోతల. ఇక్కడ శ్రీ దత్తుడు మధుమతి దేవి (అనఘా దేవి) సమేతుడై ఆరు భుజాలతో చిన్న కొండ గుహలో నిలిచి వున్నారు. ఆ ప్రక్కనే వున్నా బిల మార్గం ద్వారా మహర్షులు శ్రీశైలం వెళ్లి మల్లిఖార్జున దర్శించి వస్తుంటారు. మానవ కల్పిత అపరిశుభ్రత ఎంతగా వున్నా ఆ ప్రాంతంలో దాగిన దివ్యత్వం మనసును కట్టిపడేస్తుంది. చూచి తీరాల్సిన చక్కని ప్రదేశం ఎత్తి పోతల.
సూచన :ఆర్ధిక స్థోమత కలిగిన వారు అచ్చట మరుగు దొడ్ల నిర్మాణం చేపడితే బాగుంటుంది.

No comments:

Post a Comment

Pages