శ్రీధరమాధురి – 28

(నిజమైన విద్యావ్యవస్థ  ఎలా ఉండాలో పూజ్య శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కుల్లో చదవండి.)


జ్ఞానసముపార్జన యొక్క ప్రధాన ఉద్దేశం మంచి ఉద్యోగమో, లేక డబ్బో, లేక పరపతిని, సంఘంలో ఒక స్థాయిని సంపాదించడమో , లేక అవార్డుల కోసమో, రివార్డుల కోసమో కాదు. మానవత్వం కోసం ఒక విజేతలా నిలిచి, ఒక మంచి పౌరుడిగా ఉంటూ, తన జీవితకాలంలో ప్రపంచానికి వీలైనంత మంచిని చెయ్యడం. విద్యార్ధులు ఈ కోణం నుంచి విషయాలను చూస్తూ, ఏ విధంగానైనా దీన్ని సాధించేందుకు కృషి చెయ్యాలి.
విద్యావ్యవస్థ
విద్యార్ధి పరంగా చూస్తే, విద్యకు నలుగురు సంరక్షకులు ఉన్నారు.
  1. తల్లిదండ్రులు
  2. అధ్యాపకులు మరియు విద్యావేత్తలు
  3. సంస్థల నిర్వాహకులు
  4. విద్య పరంగా పాలసీలను తయారు చేసేవారు/ విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, మంత్రులు.
ఈ నలుగురూ విద్యార్ధి ఎదుగుదలకు కీలకమైనవారు. క్రమశిక్షణ పైనుంచి మొదలై, విద్యార్ధుల దాకా ప్రవహిస్తుంది. పాలసి తయారు చేసేవారు, విద్యాసంస్థల నిర్వాహకులు, టీచర్లు లేక తల్లిదండ్రులు క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించకూడదు. వీరిలో ఏ ఒక్కరికి క్రమశిక్షణ లేకపోయినా, విద్యార్ధి కూడా అలాగే తయారయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్ధుల బాగు కోసం ఈ నలుగురు సంరక్షకుల నైతిక బాధ్యత సమానంగా ఉంటుంది.
విద్యా సంరక్షకుల దృక్పధం తాత్కాలికంగా ఉండకూడదు. విద్యా క్షేత్రంలో భవితను వారు ముందుచూపుతో దర్శించి, విద్యార్ధుల్లోని శ్రేష్టతను వెలికి తీసుకువచ్చే లాగా, కొత్త ఆలోచనలను అమలుపరచాలి.
విద్యా సంరక్షకులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, కలిసికట్టుగా పనిచెయ్యాలి. తరచుగా సంప్రదింపులు జరుపుతూ, కొత్త ఆలోచనలను పంచుకుంటూ, ఒక విద్యార్ధి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి వారు గమనించిన సమాచారాన్నిబదిలీ చేసుకుంటూ ఉండాలి. విద్యకు సంబంధించి, విద్యార్ధి జీవితంలో ఏమి జరుగుతోందన్న విషయాన్ని ప్రతి సంరక్షకుడు తెలుసుకోవాలి.
విద్యా సంరక్షకులు ఉన్నతస్థాయి ప్రమాణాలను, నైతిక విలువలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పనక్కర్లేదు. ఇవి కేవలం మాటలకే పరిమితం కాకుండా, చేతల్లోనూ, చేసే పనుల్లోనూ ప్రతిఫలించాలి.
కొన్నిసార్లు, ఒక పెద్ద కారణం కోసం మేధావులు కూడినప్పుడు, అహం, అసూయ, ఆ కారణాన్ని పాడుచేస్తాయి. విద్యా సంరక్షకులు కూడా దీనికి అతీతమేమీ కాదు. మానవత్వానికి భవిష్యత్తు విద్యార్ధులే కనుక, మనం ఈ రంగంలో రాజకీయం ఆడేందుకు వీలు లేదు.
విద్యా మెరుగుదల కోసం నలుగురు విద్యాసంరక్షకులకు సామూహిక బాధ్యత ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ, వ్యక్తిగత భావాలు లేక ఇష్టాలపై ఆధారపడ్డ ఏ సంరక్షకుడి ఐడియాలనైనా అమలు జరిగేలా చూడకూడదు, ఇది విద్యార్ధుల ఆసక్తిని దెబ్బతీస్తుంది.
నేటి చట్టనిర్మాతలు, ఏ ప్రభుత్వం మారినా కూడా, విద్యా క్షేత్రంలో వివిధ రంగాల్లోని మేధావులతో కూడిన ఒక స్వతంత్రంగా వ్యవహరించగల ‘అంతర్గత శాఖ’ ఏర్పడేలా ఒక రాజ్యాంగ చట్టాన్ని తీసుకుని రావాలి. వీరంతా కలిసి, అవసరాన్ని బట్టి, విద్యకు సంబంధించిన పాలసీ అంశాల్లో ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోగలగాలి. మారుతున్న ప్రభుత్వాలు విద్యార్ధుల ప్రగతిని, కెరీర్ ను ప్రతికూలంగా ప్రభావితం చెయ్యకూడదని, ఇలా సూచించబడింది.
దయ అనేది ఏ విద్యా వ్యవస్థకైనా మూలం కావాలి. ఒకవేళ విద్య అనేది ఇతరుల పట్ల, సమాజం పట్ల దయ గా రూపాంతరం చెందలేకపొతే, అది శుద్ధ దండగ, అటువంటి విద్యను తృణీకరించాలి.
మానవజాతికి ఏ విధంగానూ ఉపయోగపడనప్పుడు మీ విద్యార్హత యొక్క ప్రయోజనం ఏమిటి ?
ఒకవేళ విద్య అనేది మీ సంపాదనకో, విలాసవంతమైన జీవనానికో ఉపయోగపడితే దాని ప్రయోజనం వ్యర్ధమవుతుంది.
విద్య అనేది సమాజాభివృద్ధికి తోడ్పడడాన్ని మీకు నేర్పాలి. అలా పాల్గొనేలా చెయ్యలేని విద్య అహానికి, స్వార్ధానికి ఆజ్యం పోసే హానికరమైన పరాన్నజీవి వంటిది.
ప్రతి విద్యావ్యవస్థలోనూ సమాజసేవకు సంబంధించిన విభాగం ఉండాలి. దాన్ని స్వచ్చందంగా అంగీకరించకపోతే, బలవంతంగానైనా అలవాటు చెయ్యాలి.
ఏ విద్యా వ్యవస్థలోనైనా నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. ఎంత మంచి విద్యా వ్యవస్థ అయినా, మానవ విలువల విషయంలో మాత్రం రాజీ పడకూడదు.
ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు, దానితోపాటే, మిమ్మల్ని మీరు సరిదిద్దుకుని, ఎదిగే అవకాశం కూడా వస్తుంది.
ఒకవేళ మీరు నిజంగా విద్యావంతులైతే, మీరు ఏ సద్విమర్శ కు వ్యతిరేకంగా గొంతు పెంచి మాట్లాడరు. మీరు అర్ధం చేసుకుని, విశ్లేషించి, బాధ్యతాయుతంగా స్పందిస్తారు.
కొన్నిసార్లు కొందరు పిల్లల్లాగా ప్రవర్తిస్తూ, మీ దృష్టిని ఆకట్టుకోవాలని చూస్తారు. అప్పుడు దయతో మెలగండి. వారిపైనే దృష్టి పెట్టండి. నెమ్మదిగా వారిలో మార్పును తీసుకురండి. వారికి బోధించండి. ఈ ప్రక్రియలో సంస్కరణవేత్తగా, విద్యావేత్తగా మారండి.
నిజమైన విద్య అనేది ప్రపంచానికి, మానవతకు స్వార్ధరహితంగా సేవ చేసేలా మిమ్మల్ని నడిపించాలి.
విద్యావ్యవస్థలు, ఉపకరణాలు ఒత్తిడి లేని విద్యను అందించే విధంగా రూపొందించాలి. విద్య అనేది ఒత్తిడికి దారి తియ్యకూడదు. నేడు పోటీ పేరుతో, పిల్లల్లో ఉద్యోగులకు ఉండేంత ఒత్తిడిని వివిధ సంస్థలు పెంచుతున్నాయి. ఈ విధానాన్ని ఒకమారు సరిచూసుకోవాలి. ఒత్తిడి లేకుండానే ఒక విద్యార్ధి తన ప్రతిభను చాటుకునేలా చెయ్యాలి.
ఒక మంచి విద్యావ్యవస్థ కల సంఘం నాగరికంగా ఉంటుంది, ఆటవికంగా కాదు. ఈ రోజుల్లో చదువుకున్నవారు అనేకమంది అనాగరికంగా, ఆటవికంగా ప్రవర్తించడం చూస్తున్నాము. స్కూల్, కాలేజీ స్థాయిలలో విలువలను సరిగా నేర్పకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
పోటీ పేరుతో నేటి విద్య అనేక అనారోగ్యకరమైన పరిణామాలకు దారి తీస్తోంది. విద్యలో విజయం ఒకరి తలకెక్కకూడదు. అలాగే వైఫల్యం హృదయానికి చేరకూడదు. విజయం తలకెక్కితే, మేము దురహంకారాన్ని, పరాజయం హృదయానికి చేరితే మేము నిరాశను గమనించాము. నేడు మంచి సమతుల్యత కలిగిన వ్యక్తిని అరుదుగా చూస్తాము. వారు దురహంకారంతోనైనా ఉంటారు, లేక నైరాశ్యంలో ఉంటారు. దీని మూలాలను కూడా పరిశీలించి, ముందు తరాలు ఈ దుష్పరిణామాలకు గురికాకుండా చూడాలి.
ఒకవేళ విద్య అనేది దురహంకారాన్ని, దురాక్రమణను కలిగిస్తే, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రతి విద్యావేత్త ఆశయం ఒక నాగరిక సమాజాన్ని రూపొందించడం కావాలి. విద్యార్ధుల మనస్సుల్లో విలువల్ని నెలకొల్పడానికి విద్యావేత్త తన వంతుగా మెరుగైన కృషి చెయ్యాలి.
***

0 comments:

Post a Comment

 
అచ్చంగా తెలుగు © 2018. All Rights Reserved.
Top