ప్రేమతో నీ ఋషి – 16 - అచ్చంగా తెలుగు

ప్రేమతో నీ ఋషి – 16

Share This

ప్రేమతో నీ ఋషి – 16

యనమండ్ర శ్రీనివాస్


( జరిగిన కధ : కొన్ని శతాబ్దాల క్రితం... ఇంద్రుడి ఆజ్ఞమేరకు ,మేనక తన రూపలావణ్యాలతో విశ్వామిత్రుడిని సమ్మోహనపరచి, అతని తపస్సును భగ్నం చేస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం... మైసూరు మహారాజు సంస్థానంలో గొప్ప భారతీయ చిత్రకారుడిగా పేరుపొందిన ప్రద్యుమ్న ‘ప్రపంచ కొలంబియన్ ప్రదర్శన’ కోసం, రాకుమారి సుచిత్రాదేవినే తన చిత్రానికి నమూనాగా వాడుతూ, మేనక విశ్వామిత్రుడికి తపోభంగం చేసే సన్నివేశాన్ని అత్యద్భుతంగా చిత్రిస్తూ, ఈ క్రమంలో రాకుమారితో ప్రేమలో పడి గుప్తంగా రాజ్యం వదిలి పారిపోతాడు. రాజు పారెయ్యమన్న ఆ చిత్రం అనేకమంది చేతులు మారి, చివరగా  దాన్ని బ్రిటన్ తీసుకువెళ్ళాలన్న కోరికతో కొన్న ఒక విదేశీయుడి  వద్దకు చేరుతుంది. ఆ తర్వాత అది ఏమైందో ఎవరికీ తెలీదు. 
ప్రస్తుతం... ముంబై స్టాక్ ఎక్స్చేంజి లో పనిచేస్తున్న త్రివేది గారు, ఉదయాన్నే ఫాక్ష్ లో వచ్చిన సందేశం చూసి, అవాక్కవుతారు... కారణం తెలియాలంటే, కొంత గతం తెల్సుకోవాలి....  కొన్ని నెలల ముందు మాంచెస్టర్ లో  గొప్ప వ్యాపార దిగ్గజమైన మహేంద్ర, చేపట్టిన ‘ప్రద్యుమ్న ఆర్ట్ గేలరీ’ ప్రాజెక్ట్ కోసం చిత్రాలు సేకరించేందుకు అతని మాంచెస్టర్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు స్నిగ్ధ, అప్సర. ఈ క్రమంలో స్నిగ్ధకు స్విస్ బ్యాంకు మాంచెస్టర్ ఆఫీస్ లో సీనియర్ క్లైంట్ బ్యాంకర్ గా పనిచేస్తున్న ఋషి తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. ఋషిని  అప్సర సామీప్యంలో చూసిన స్నిగ్ధ మనసు క్షోభిస్తుంది. స్నిగ్ధ తో కలిసి ముంబై వెళ్తుండగా, జరిగినదానికి సంజాయిషీ ఇవ్వబోయిన ఋషిని పట్టించుకోదు  స్నిగ్ధ.  అతను మౌనం వహించి, కళ్ళుమూసుకుని, గత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ ఉంటాడు...  ఆర్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్’ కోసం పనిచేసేందుకు మాంచెస్టర్ వచ్చి, ముందుగా ఆర్ట్ గురించిన అవగాహన కోసం ప్రయత్నిస్తున్న ఋషి, ఫేస్బుక్ లో స్నిగ్ధ ప్రొఫైల్ చూసి, అచ్చెరువొందుతాడు. స్నిగ్ధకు మహేంద్ర కంపెనీ లో ఉద్యోగం వస్తుంది. ఈలోగా ఋషి మాంచెస్టర్ ఆర్ట్ గేలరీ దర్శించేందుకు వచ్చి, స్నిగ్ధను కలిసి, ఆమెనుంచి ఆర్ట్ కు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. ఫేస్ బుక్ లో ఋషి, స్నిగ్ధ చాటింగ్ ద్వారా వారిద్దరూ మరింత చేరువ అవుతారు. కొత్తగా చేరిన ఉద్యోగంలో మృణాళ్, అప్సరల ప్రవర్తన స్నిగ్ధకు ఆశ్చర్యం కలిగిస్తుంది, అదే ఋషితో చెప్తుంది. మహేంద్రను కలిసిన ఋషి, అతని వ్యాపార ప్రతిపాదనకు అంగీకరించి, స్నిగ్దను, అప్సరను ఆఫీస్ లో కలుస్తాడు. అప్సర, ఋషి మధ్య చనువు స్నిగ్ధకు ఆందోళన కలిగిస్తుంది.విశ్వామిత్ర పెయింటింగ్ ను ఇటలీలో కొన్నట్లు, అది అప్సర ఇంట్లో ఉన్నట్లు స్నిగ్ధకు చెప్తాడు మృణాల్.  ఇక చదవండి...)
“ఆ హోటల్ లో ఇప్పుడు కొన్ని పోర్ట్రైట్ ల ఎక్సిబిషన్ జరగనుంది. వచ్చే వారం మధ్యలో నువ్వు ముంబై వెళ్లి, కొన్ని పోర్ట్రైట్ లను చూసి, అవి బాగుంటే కనుక ప్రద్యుమ్న ఆర్ట్ మ్యుజియం కోసం తీసుకోవాలని, నా కోరిక. నా సెక్రటరీ కి నీకు పూర్తి వివరాలను పంపమని చెబుతాను. నువ్వు ఆమెతో మాట్లాడవచ్చు,” వివరించాడు మహేంద్ర.
ఇది విని స్నిగ్ధ చాలా సంతోషించింది. ఒకవైపు, ఆమె తన మొట్టమొదటి అంతర్జాతీయ జాబ్ టూర్ కు వెళ్తున్నందుకు, మరొకవైపు తన స్వదేశానికి వెళ్తున్నందుకు ఆమె ఆనందించింది. వీలుంటే కాస్త సమయం చూసుకుని, ఆమె తన తల్లిదండ్రులను కలవాలని అనుకుంది. కాని, ఈ టూర్ ను గురించి మహేంద్ర చెప్పిన మూడవ అంశం ఆమెకు మరింత ఆనందాన్ని కలిగించింది.
“ఋషిని నీతో రమ్మని నువ్వు అడగవచ్చు. నాకు ఈ ఏడాది “బిజినెస్ స్టార్ అఫ్ ది ఇయర్ “ అవార్డు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, మీరిద్దరూ ఈ సందర్భంగా అక్కడుంటే బాగుంటుంది. నేనూ మీతో కాస్త సమయం గడుపుతాను, బ్యాంకు ప్రైమ్ సూయిస్ తో మన వేలం గురించిన ఫైనల్ రిపోర్ట్ ను సమీక్షిస్తాను. “ ఇలా చెప్పి, మహేంద్ర ఫోన్ పెట్టేసాడు.
స్నిగ్ధ ఆయన సెక్రటరీ కి ఫోన్ చేసి, గార్డెన్ హోటల్ ఆర్ట్ ఎక్సిబిషన్ గురించిన మరిన్ని వివరాలను . తర్వాత ఆమె మృణాల్ కు కాల్ చేసింది.
“మృణాల్, పెయింటింగ్ గురించి నువ్వు నాకూ చెప్పి ఉన్నట్లయితే, నేనెంతో సంతోషించేదాన్ని. నేనే స్వయంగా కలెక్టర్ ను కలిసేదాన్ని, “ అంది. ఆమెకు ఇంకా నిరాశగానే ఉంది.
“స్నిగ్ధ, నీ ఉద్వేగం నాకు అర్ధమవుతుంది. కాని, నేనే వెళ్లి అతనితో మాట్లాడేదాకా నాకూ ఆ పెయింటింగ్ ను గురించి ఖచ్చితమైన సమాచారం తెలీదు. పెయింటింగ్ తో వచ్చి నేను నిన్ను ఆశ్చర్యపరచాలని అనుకున్నాను. కాని, నేనిక్కడ ల్యాండ్ అవగానే అప్సర ఏదో పని మీద ఫోన్ చేసి, నన్ను పిలవగానే, నేను నోరు జారాను. ఆమె ఎయిర్పోర్ట్ నుంచి నన్ను నేరుగా తనింటికి రమ్మని, పెయింటింగ్ ను తనవద్ద వదిలి వెళ్ళమని చెప్పింది. నిజానికి, ఈ పెయింటింగ్ ను గురించి బాస్ కు చెప్పింది కూడా తనే, ఐ యాం సారీ”, వివరించాడు మృణాల్.
“ఏమైనా నా దురదృష్టం. కాని, బాస్ నన్ను ఆ పెయింటింగ్ తాలూకూ ధృవీకరణ పత్రాలు అన్నీ సరిచూడమన్నారు. వాటిని దయుంచి నాకివ్వు,” నిట్టూరుస్తూనే మృణాల్ ను అభ్యర్ధించింది స్నిగ్ధ. అతను తన సూట్ కేసు తెరిచి, ఓ కాగితాల కట్టను తీసి, ఆమెకు ఇచ్చాడు.
మరొక అరగంటలో, ఆమె ఆ పత్రాలు అన్నింటినీ సమీక్షించి, అన్నీ సరిగానే ఉన్నాయని తెలుసుకుంది. పత్రాల విషయంలో తాను తృప్తి పడ్డట్లు ఆమె మహేంద్రకు ఒక మెయిల్ పంపింది.
ఆమె అయిష్టంగానే ఈ మెయిల్ పంపింది, ఎందుకంటే, ఆమె ఇంతవరకు పెయింటింగ్ ను చూడలేదు, అందుకే ఆమె నిరాశతో ఉంది.
***
“హాయ్ స్నిగ్ధ, ఎలా ఉన్నావు? పని ఎక్కువగా ఉందా?” మామూలుగా వారిద్దరూ కలుసుకునే ట్రాఫ్ఫోర్డ్ సెంటర్ వద్ద ఆమెను కలవగానే, పలకరిస్తూ అడిగాడు ఋషి.
“యా, నిజమే. చాలా పని, చాలా పని ఒత్తిడి ఉంది. ముందు ఒక మంచి వేడి కాఫీ తెప్పించావా ప్రియా?” స్నిగ్ధ తన బాగ్ ను టేబుల్ మీద ఉంచి, ఋషికి ఎదురుగా కూర్చునేందుకు కుర్చీ లాక్కుంటూ అడిగింది స్నిగ్ధ.
ఋషి వేడి ఎక్ష్ప్రెసొ ఆర్డర్ ఇచ్చి, వెనక్కి టేబుల్ వద్దకు వచ్చాడు. మామూలు కంటే ఆమె ఎక్కువ ఆనందంగా ఉండడాన్ని అతను గమనించాడు. లేదా ఇది తుఫాను ముందర ప్రశాంతతా? త్వరలోనే తెలుస్తుందని అతను అనుకున్నాడు.
“మంచి పెర్ఫ్యూమ్, ఈ మధ్యే కొన్నావా?” ఋషి స్నిగ్దను అడిగాడు.
అంత త్వరగా ఋషి పసిగట్టినందుకు స్నిగ్ధ ఆశ్చర్యపోయింది. స్త్రీలకు సహజంగానే పురుషులు మెచ్చే తియ్యటి పరిమళం ఉన్నా, వారు వాడే పెర్ఫ్యూమ్ మరింత మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది.
బార్టెండర్ కప్పులతో కాఫీ ఇవ్వగానే, ఇరువురూ త్రాగడం మొదలుపెట్టారు. తర్వాత ఋషి మాట్లాడిన మాట, స్నిగ్దను డీలాపడేలా చేసింది.
“కాని అప్సర ఏదో మైమరపించే పెర్ఫ్యూమ్ వాడుతుంది. అది నిజంగా ఆకర్షిస్తుంది,” ఇది అంటూ ఉండగా అతని మొహంలో ఒక కొంటె చిరునవ్వు తొంగి చూసింది.
అతని మాటల పరిణామాన్ని అతను ఆలోచించలేదు. అతను ఏదో మామూలుగా అనేసాడు. కాని అప్సర వల్ల ముందే కలవరపడి, ఈ విషయంగా ఋషిని నిలదీసి అడగాలనుకున్న స్నిగ్ధ వంటి వారికి, ఇది వినడం మరింత చికాకును కలిగించింది.
“ఋషి, నాతో మాట్లాడేటప్పుడు, ఆమె ప్రస్తావన తీసుకురావడం మానేస్తావా?” స్నిగ్ధ కళ్ళు మూసుకుంటూ, ఋషి పై అరిచింది. ఆమె స్వరం చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళ దృష్టిని అటువైపు తిప్పింది.
ఋషి సమాధానం ఇవ్వబోతుండగా అతని మొబైల్ రింగ్ అయింది. అతను ఫోన్ తీసాడు. అది అప్సర ఫోన్.
“హాయ్ ఋషి, నాతో కాసేపు మాట్లాడగలవా?” అప్సర అడిగింది. ఆమె స్వరంలోని తియ్యటి మత్తు, ఋషిని ఫోన్ పెట్టనివ్వకుండా చేసింది.
“యా, చెప్పు అప్సర,” ఆమె పేరు పలకగానే స్నిగ్ధ అక్కడి నుంచి లేచి, బయటకు వెళ్ళిపోసాగింది.
“రాత్రి నీతో డిన్నర్ చేసే అదృష్టాన్ని ప్రసాదిస్తావా?” ఋషికీ, స్నిగ్ధకు మధ్య ఏమి జరుగుతోందో తెలియని అప్సర సంభాషణ కొనసాగించింది.
ఋషి ఇరుకున పడ్డాడు, అతనికి ఇంకా సమస్యలు కొని తెచ్చుకోవడం ఇష్టం లేదు, “మరోసారి చూద్దాం అప్సర, ఈ సారికి క్షమించు,” అన్నాడు. స్నిగ్ధ అప్పటికే క్రిందికి వెళ్లేందుకు మెట్లు దిగసాగింది. అతను ఫోన్లో మాట్లాడుతూనే, స్నిగ్ధ వైపు పరుగెత్తి, ఆమెను అనుసరించసాగాడు.
“ఋషి, నన్ను నిరాశ పరచకు. నీ కోసం నా దగ్గర ఒక సర్ప్రైస్ ఉంది. నువ్వెప్పుడూ విశ్వామిత్ర పెయింటింగ్ కోసం అడుగుతూ ఉంటావు కదూ? ఇప్పుడది నా ఇంట్లో, నా ముందే ఉంది. ఇది దాదాపు ఓ శతాబ్దం తర్వాత బయల్పడింది. దీన్ని ప్రైవేట్ గా చూసేందుకు నేను నా క్లైంట్ లను కూడా పిలుస్తున్నాను. నువ్వు కూడా వస్తే బాగుంటుంది,” ఆఖరి బాణాన్ని వేస్తూ అంది అప్సర.
విశ్వామిత్ర పెయింటింగ్ గురించి వినగానే ఋషి ఉలిక్కిపడ్డాడు. కొన్నేళ్ళుగా అతను చూడాలని నిరీక్షిస్తున్న పెయింటింగ్ అది.
అతను నడవడం ఆపి, గట్టిగా ఊపిరి పీల్చి, “అప్సరా, అరగంటలో అక్కడ ఉంటాను,” అన్నాడు.
“ అందుకే నువ్వంటే నాకిష్టం ప్రియా. థాంక్ యు. తప్పకుండా రా. నేను నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. పసిపాప డైరీ మిల్క్ చాక్లెట్ కోసం వేచి ఉన్నట్లు,” అంటూ గట్టిగా నవ్వి, ఆమె ఫోన్ పెట్టేసింది.
ఋషి స్నిగ్ధ వద్దకు వెళ్ళాడు. ఆమె మూడ్ బాలేదని అతనికి తెలుసు. అందుకే ఆమెను మరింత డిస్టర్బ్ చెయ్యాలని అనుకోలేదు. అతను కేవలం, “స్నిగ్ధ, మనం దీని గురించి వచ్చే వారం మాట్లాడుకుందామా?” అన్నాడు.
“ఋషి, ఐ ఆం సారీ, ఇప్పుడు నేను నీతో ఏమీ మాట్లాడదలచుకోలేదు. వచ్చే వారం మహేంద్ర మనిద్దరినీ ముంబై రమ్మన్నాడు,” అంటూ తనకూ, మహేంద్రకు మధ్య జరిగిన సంభాషణను గురించి, తర్వాత మృణాల్ తో తన చర్చను గురించి చెప్పింది.
స్నిగ్ధ భయాలను విన్న అతనికి కాస్త ఊరటగా అనిపించింది. కాని వీలైనంత త్వరగా విశ్వామిత్ర పెయింటింగ్ ను చూసే అవకాశాన్ని అతను కోల్పోదల్చుకోలేదు.
“స్నిగ్ధ, నీ భావాలను నేను అర్ధం చేసుకోగలను. దీని గురించి నేను తర్వాత మరోసారి మాట్లాడతాను. కాని ఇప్పుడు మాత్రం, నేను డిన్నర్ కోసం అప్సర ఇంటికి డిన్నర్ కు వెళ్ళాలి. ఆమె కొంతమంది ప్రైవేట్ కల్లెక్టర్స్ కోసం విశ్వామిత్ర పెయింటింగ్ ను తనింటి వద్ద ప్రదర్శనకు ఉంచింది. నన్నూ పిలిచింది, కాబట్టి నన్ను వెళ్లనివ్వు,” అంటూ, బయటకు పరుగెత్తాడు.
స్నిగ్ధ ఈ విషయంలో తీవ్రంగా కలత చెందింది. అప్పటికే ఆమె తన అభిమాన పెయింటింగ్ ను చూసే అవకాశం దక్కలేదని, కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఇప్పుడు తన భాగస్వామి తననిలా వదిలేసి వెళ్ళటాన్ని ఆమె భరించలేకపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె దగ్గరలోని పార్క్ కు వెళ్లి, ఆమె కళ్ళను, మనసును, బుద్ధిని ఖాళీ చేసుకుంది. ఋషికి ఇక మునుపు తనవద్ద ఉన్న స్థానం లేదు, అనుకుంది ఆమె బాధగా.
దాదాపు ఒక గంట పాటు ఈ చెదురుమదురు ఆలోచనల తర్వాత, ఆమె లేచి, అప్సర ఇంటికి వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఆమె చేస్తున్నది సరైన పనా కాదా, ఆమెకు తెలీదు, కాని ఋషిని అప్సరను ఎదుర్కోవాలని ఆమె మొండిగా ఉంది. ఆమె ప్రవర్తన చిన్నపిల్లలా ఉన్నా, ఆ క్షణంలో ఆమె మనసు అలాగే చెయ్యమని ఆమెకు చెబుతోంది.
అప్సర ఇంటికి వెళ్ళే కొన్ని క్షణాల ముందు, దారిలో ఉండగానే “డైరీ మిల్క్” అన్న పదానికి వేరే అర్ధం ఉందేమోనని ఋషి గూగుల్ లో సెర్చ్ . కొన్ని క్షణాల క్రితం అప్సర ఋషి తో మాట్లాడినప్పుడు, ఆ పదాన్ని గమ్మత్తుగా ఒత్తి పలికింది.
కాని, ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల, అతను సెర్చ్ రిజల్ట్స్ చూడలేక పోయాడు. అతను ఆమె ఇంటికి చేరుకున్న క్షణంలోనే, తొందరలో  మొబైల్ ను కార్లోనే వదిలేసి, డోర్ బెల్ కొట్టేందుకు వెళ్ళాడు.
అతను వెళ్ళేటప్పుడు మొబైల్ మీద సెర్చ్ రిజల్ట్స్ కనిపించసాగాయి. అందులో ఒక పేజిలో డైరీ మిల్క్ కు ఒక కొంటె అర్ధం కనిపిస్తోంది, “డార్లింగ్ డైలీ ఐ రిమెంబర్ యు – మీట్ ఇమ్మీడియట్లీ ఫర్ లాంగ్ కిస్ !!!”
(ఇంకా ఉంది...)

No comments:

Post a Comment

Pages